అంతటా ఆ దైవమే కానీ...
ఆత్మీయం
పర్వదినాలు, పండుగలలో సంగతలా వుంచి మామూలు రోజులలో ముఖ్యంగా సెలవు దినాలలో ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కారణం ఈ యాంత్రిక జీవనంలో ఒత్తిడి అంతకంతకూ పెరిగిపోతుండడమే. అలాగే ఇంట్లో ఏ శుభకార్యం తలపెట్టినా ముందుగా ఆలయ సందర్శనం చేయడం వల్ల మంచి జరుగుతుందన్న నమ్మకం, పాపభీతి, దేవుని పట్ల గల నమ్మకం అంతకంతకూ పెరిగి పోతోంది. అందుకే ఇప్పుడు వయసు మళ్లిన వారిలో కంటే యువతలో ముఖ్యంగా విద్యార్థినీ విద్యార్థులలో ఎక్కువగా కనపడుతోంది. కొందరు సరదా కోసం గుడికెళితే, మరి కొందరు మనశ్శాంతికి, ఇంకొందరు కోరికలు కోరడానికి, మరికొందరు మొక్కులు తీర్చుకోవడానికి– ఇలా ఏదో ఒక కారణాలతో గుడికెళ్లి, దైవదర్శనం చేసుకునేవారు ఎక్కువ. కారణం... ఇంట్లో పూజగదిలో లభించని ప్రశాంతత ఆలయంలో లభిస్తుంది.
ఇంట్లో పూజించేది ఆ మూర్తినే అయినా, మనం దేవాలయానికి వెళ్లినప్పుడు ఒక పవిత్రమైన భావన, మాటలకందని అనుభూతి, మనశ్శాంతి కలుగుతాయి. కారణం ఏమిటి? దేవాలయాలలో దేవుని విగ్రహాన్ని ప్రతిష్ఠించేటప్పుడే యంత్రాన్ని కూడా ప్రతిష్ఠాపన చేస్తారు. అది యోగులు, యోగుల వంటి స్వామీజీల చేతుల మీదుగా జరుగుతుంది. ఆ యంత్రాలలోని బీజాక్షరాలు స్వరబద్ధమైన మంత్రాల ద్వారా మన చెవులను చేరి మన కోరికలను తీరుస్తాయి. ఆ సమ్మోహన శక్తే మనల్ని వందలు, వేల మైళ్ల దూరం ప్రయాణించి ఆయా ఆలయాలలోని దేవతల దర్శనం చేసుకునేలా చేస్తుంది. మనం చేసే పూజల వల్ల, ఆలయంలో నిత్యధూపదీప నైవేద్యాల వల్ల ఆ Ô¶ క్తి చెక్కుచెదరకుండా ఉంటుంది. కారణం ఏమైతేనేం, విగ్రహం నిగ్రహం కోసమే అన్నారు సామాన్య పరిభాషలో చెప్పాలంటే... ఇంట్లో సిస్టమ్‌లో సీడీలోనో, టీవీలోనో చూసేదీ సినిమానే. అదే పెద్ద పెద్ద థియేటర్లలో పెద్ద తెరమీద చూసేదీ అదే సినిమా. అనుభూతిలోనే తేడా. అందుకే ఆలయం ఆలయమే... పూజగది పూజగదే; మందిరం మందిరమే!