మీ కలలు నెరవేరతాయి...
జనవరి 23 నుంచి 29 వరకు
టారో బాణి
ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20)
కొంతకాలంగా మానసిక ఒత్తిడితో, అశాంతితో బాధపడుతున్నవారికి ప్రశాంతత లభిస్తుంది. కొత్త ఆలోచనలను ఇతరులతో పంచుకుంటారు. వారి ఆలోచనలను మీరు అవలంబిస్తారు. కుటుంబం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కొత్త అవకాశం మీ తలుపు తట్టబోతోంది. బహుశ ఈ అవకాశం మీ జీవితాన్ని మలుపు తిప్పేది కావచ్చు. మీ లక్కీ నంబర్ 21. కలిసొచ్చే రంగు: యాపిల్ గ్రీన్
టారస్ (ఏప్రిల్ 21-మే 20)
విజయవంతంగా, అదృష్టకరంగా నడుస్తుందీవారం. మీ బంధాలు, బంధుత్వాలు, భావోద్వేగాలే మిమ్మల్ని శాసించడం లేదా మీ మనస్సును ప్రభావితం చేయడం జరగవచ్చు. కొన్ని విషయాలలో సంప్రదాయాన్ని పాటిస్తూ, పెద్దలు చెప్పిన శాస్త్రీయవిధానాలను అనుసరించడం మంచిది. ఇతరులకిచ్చిన వాగ్దానాల విషయంలో పునరాలోచన అవసరం. మీ వాగ్ధాటి, మాటలలోని చమత్కారం మీకు బాగా ఉపయోగపడతాయి. కలిసొచ్చే రంగు: పగడపు రంగు
జెమిని (మే 21-జూన్ 21)
మీరు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న స్వేచ్ఛ లభిస్తుంది. చేస్తున్న ఉద్యోగం మాని, కొత్త ప్రదేశంలో కొత్త ఉద్యోగం కోసం వెతకాలనుకుంటారు. ట్రావెల్ బిజినెస్ కోసం ఎదురు చూస్తారు. ఉన్నట్టుండి మీలో ఏదో మార్పు వచ్చి, ఆధ్యాత్మిక విషయాలవైపు మొగ్గు చూపుతారు. జీవితాన్ని సంపూర్ణంగా, స్వేచ్ఛగా జీవించాలని తెలుసుకుంటారు. మీ లక్ష్యం నెరవేరుతుంది. పని మీద దృష్టి పెట్టండి. కలిసొచ్చే రంగు: ముదురు ఊదా
క్యాన్సర్(జూన్22-జూలై 23)
ఈ వారమంతా మీకెంతో సామరస్యపూర్వకంగా గడుస్తుంది. మీరు చేసే ప్రతి పనిలోనూ సంతృప్తి లభిస్తుంది. సత్వర నిర్ణయాలు తీసుకోవలసిన అవసరం వస్తుంది. ఎప్పటినుంచో ఉన్న ఒక ఆలోచనను అమలులో పెట్టేందుకు ప్రయత్నిస్తారు. మీలాగే ఆలోచించే మరికొందరిని కలుపుకుని కొత్త వ్యాపారాన్ని లేదా ప్రాజెక్టును చేపడతారు. అయితే కుటుంబం కోసం కొంత సమయాన్ని కేటాయించాలని గుర్తుంచుకోండి. కలిసొచ్చే రంగు: లేత పసుప్పచ్చ
లియో (జూలై 24-ఆగస్టు 23)
జీవితంలో ముందుకు దూసుకెళతారు. ఒక కొత్త వ్యాపారాన్ని చేపట్టే ఆలోచన రావడమే కాదు, దానిని వెంటనే అమలు పరిచి, దాని విజయాన్ని, దానినుంచి మంచి లాభాలను అందుకుంటారు కూడా! దూరప్రాంతానికి ప్రయాణమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. భారాన్ని పెంచుకోకండి. ఒక బంధం విషయంలో అభద్రతాభావాన్ని ఎదుర్కొంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. కలిసొచ్చే రంగు: సిల్వర్ గ్రే
వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23)
ధైర్యం అంటే మీ మనసులో ఉన్నదాన్ని నిర్భయంగా చెప్పడం, అవతలివాళ్లు చెప్పేదానిని నిర్భయంగా వినడం కూడా అని విన్‌స్టన్ చర్చిల్ అన్నట్లుగా ప్రశాంతంగా, నిమ్మళమైన మనస్సుతో ఉండటం, మీ ఆలోచనలను ధైర్యంగా అమలు చేయడం మంచి ఫలితాలనిస్తుంది. అయితే నిదానమే ప్రధానం అన్న సూక్తిని అన్ని విషయాల్లోనూ అమలు చేయాలనుకోవడం సబబు కాదు. ప్రేమ విషయంలో నిబ్బరంగా ఉండండి. కలిసొచ్చే రంగు: నారింజ
లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23)
పని చేసీ చేసీ అలసిపోయిన శరీరం, మనస్సు సేదతీరవలసిన సమయమిది. తగినంత విశ్రాంతి లేకపోతే రీఛార్జ్ కాలేరు కదా! డబ్బు గడించడంలో మీ తెలివితేటలను, జ్ఞానాన్ని ఉపయోగించండి. నిష్ఠుర సత్యాల విషయంలో సంయమనాన్ని పాటించండి. మీరూ, మీ ప్రియతములు కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.అవివాహితులకు వివాహసూచన ఉంది. సవాళ్లు ఎదురైనప్పుడు కుంగిపోకుండా ధ్యానం ద్వారా సత్పలితాలను పొందవచ్చు. కలిసొచ్చే రంగు: పింక్
స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22)
మన ఆలోచనలే మనం. మనం దేని గురించయితే తీవ్రంగా ఆలోచిస్తామో, చివరికి దానిని పొంది తీరుతాం అంటాడు బుద్ధభగవానుడు. అంటే ఎప్పుడూ ఏదో జరుగుతుందన్న నెగటివ్ ఆలోచనలు బుర్రలోకి రానివ్వకుండా సానుకూల ఆలోచనలతో ఉంటే అంతా మంచే జరుగుతుందని గ్రహించాలన్నమాట. ఒక కొత్త వ్యాపారంలో పెట్టిన పెట్టుబడి ద్వారా లాభాన్ని పొందుతారు లేదా గతంలో పెట్టిన మదుపు నుంచి వడ్డీ లభిస్తుంది. కలిసొచ్చే రంగు: గోధుమ రంగు
శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21)
ఉల్లాసకరమైన సమయం.అనూహ్యమైన అభివృద్ది... అదీ అతివేగంగా జరుగుతుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలసి ఏదైనా వినోద, విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు. మీరు ఏమి చేసినా, దానిని ఇతరులు కూడా అనుసరించేలా ఉంటుందీవారం. ఒక స్నేహితుని విషయంలో ఉదారంగా వ్యవహరించి, పెద్దమొత్తంలో డబ్బు సాయం చేస్తారు. ప్రేమ వ్యవహారం అకస్మాత్తుగా మొదలవుతుంది. అంతే వేగంగా ముగిసిపోతంంది కూడా! కలిసొచ్చే రంగు: అల్లం రంగు
క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20)
ఈ వారం మీకు వినోదాత్మకంగా గడుస్తుంది. విందులు, వేడుకలు జరుగుతాయి. ఒక పార్టీకి ఆహ్వానం అందుతుంది. ఆఫీసులో ఒక పనివిషయంలో విభిన్నంగా వ్యవహరించడం వల్ల కొన్ని తీవ్రపరిణామాలను చవి చూడవలసి రావచ్చు. లాభాలు, ఆదాయాల గురించి కంగారు పడవద్దు. మెల్లగా అందుతాయి. రొమాన్స్ విషయంలో కొత్త పంథాను అనుసరిస్తారు. ఉల్లాసం, ఉత్సుకత పరవళ్లు తొక్కుతుంటాయి. కలిసొచ్చే రంగు: మెరిసే పసుపు
అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19)
వ్యాపారం నుంచి మంచి లాభాలు అందుకుంటారు. కెరియర్ గురించి మీరు బంగారు కలలెన్నో కంటుండవచ్చు అయితే వాటిని కనీసం కుటుంబ సభ్యులతో కూడా పంచుకోకపోతే ఎలా? మీ ఆలోచనలను వారితో చెబితే వారు కూడా మీకు సాయం చేస్తారు కదా! మీ చిరకాల కోరిక ఒకటి ఈవారం తీరుతుంది. ఇద్దరు పరిణత వయస్కుల మధ్య కొంత కాలంగా సాగుతున్న బంధం ఒకటి దృఢపడుతుంది. కలిసొచ్చే రంగు: మెరుస్తున్న గోధుమ రంగు
పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20)
పనికి సంబంధించిన సమాచారం లేదా సందేశం అందుతుంది. తేలికగా అయిపోతాయనుకున్న పనులకు కూడా ఎక్కువ శ్రమపడాల్సి రావడం, చిన్న పనికి కూడా పెద్ద ఎత్తున ఆలోచనలు చేయాల్సి రావడం వంటివి ఉండవచ్చు. అయినా కూడా మీ ఆత్మవిశ్వాసాన్ని ఏమాత్రం సడలనివ్వవద్దు. మనసును దృఢం చేసుకోండి. అప్పుడప్పుడు ప్రకృతిలో గడుపుతూ ఉండండి. విద్యార్థులకు ఇది చాలా మంచి సమయం. కలలు నెరవేరతాయి. కలిసొచ్చే రంగు: బేబీ పింక్
టారో ఇన్సియా
టారో అనలిస్ట్
రేకీ గ్రాండ్ మాస్టర్
సౌర వాణి
ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20)
చేస్తున్న ప్రతిపనిలోనూ ఉదాశీనతా భావం కలగవచ్చు. యంత్రనిర్మాణం, యంత్రపరికరాలతో చేసే వ్యాపారం వంటిది మీ వృత్తి అయినా, వాహనాలకి సంబంధించిన వ్యాపారమే అయినా కొద్దిగా శ్రద్ధని పాటించవలసిన వారం ఇది. శారీరకమైన ప్రమాదాలు జరక్కుండా భద్రతని గురించిన కొద్ది శ్రద్ధని వహించాలి. వాహనాలు నడపడంలో కూడా జాగ్రత్త అవసరం. ఇది ముందుజాగ్రత్త మంచినదే ఆప్తవాక్యమే.
టారస్(ఏప్రిల్ 21-మే 20)
శారీరకంగా మీరెంత పనిని చేయడానికైనా వెనుకాడరు. పైగా ఆ పనిలో విజయాన్ని సాధించాననే ఆనందంతో ఉండే మనస్తత్వం కూడా మీది. అయితే శారీరక శ్రమకి తట్టుకోగలిగినంత శక్తి మీకు మీ మనసులో లేని కారణంగా మానసికమైన ఒత్తిడికి గురై శ్రమపడతారు. ముఖ్యంగా మీ గొప్పదనాన్ని గుర్తించలేని, పైగా తప్పుబట్టాలనే ఈర్ష్యాదృష్టితో ఉన్న అధికారుల కారణంగా అలసటకి గురవుతారు. నిరుత్సాహ పడచ్చు.
జెమిని (మే 21-జూన్ 21)
ఎంతో ధనవంతులమనే అభిప్రాయంతో ఉన్న మీరు ఈ వారంలో మీ ఆదాయం వ్యయం నిల్వ గురించిన పరిశీలనని మీకు మీరే కావాలని చేసుకోవచ్చు. దాంతో కొంత అసంతృప్తికి గురవుతారు. మరింత సంపాదించాలనే అభిప్రాయానికి వస్తారు. విందువిలాసాలనీ, వ్యర్థవ్యయాలనీ ఆడంబరాలనీ దూరం చేసుకోవాలని నిర్ణయిస్తారు. ఒక మంచి అనుభవజ్ఞుణ్ణి మార్గదర్శకుడిగా ఎంచుకుంటారు.
క్యాన్సర్ (జూన్22-జూలై 23)
కొత్తవైన ఆస్తులని కొనాలనే బలమైన ఉద్దేశ్యంతో మీ కుటుంబ సభ్యులని రుణం అడుగుతారు. చేసేది మంచిపనే అయినప్పటికీ, సామూహికంగా మీరు కొన్న భూముల్నీ ఇళ్లనీ... అన్ని ఆస్తులనీ అప్పు, వడ్డీ మొత్తం .. ఇలా వివరాలని అద్దంలో చూసుకుంటున్న తీరుగా కుటుంబ సభ్యులందరినీ సమావేశపరచి మరీ చెప్పండి. దాంతో ఇప్పటివరకూ దాగి ఉన్న అపోహలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. మీకు మంచిది కూడా.
లియో (జూలై 24-ఆగస్టు 23)
స్పష్టమైన అవగాహనతో చెప్పదలచిన అంశాన్ని సూటిగా చెప్పగల మీరు లౌక్యంగానూ డొంక తిరుగుడుగానూ వ్యవహారాన్ని చేసే అవకాశం కనిపిస్తోంది. ఇది మీ స్వభావానికే విరుద్ధం కాబట్టి నిర్భయంగా, నిర్మొహమాటంగా ప్రవర్తించండి. ఆది నిష్ఠురం ఎప్పుడూ మంచిది తప్ప చివరికొచ్చాక మీ వ్యవహార భాగస్వాములతో అంత్యనిష్ఠురం ఏమాత్రమూ సరైన పద్ధతీ కాదు ఉపద్రవమయం కూడా.
వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23)
మీ వ్యవహార ప్రణాళిక ముందునుండీ సరైన తీరులో ఉన్న కారణంగానూ దైవానుకూల్యం కారణంగానూ మీ పనులన్నీ అనుకున్నవి అనుకున్నట్లే పూర్తవుతాయి. స్వదేశీయులు విశేశానికి వెళ్లాలనే బలమైన ఆలోచనతో ఉన్నా కూడా విదేశాలకి వెళ్లలేరు. ఇదొక విధంగా మీకు అనుకూలమే తాత్కాలికంగా. ఉన్నంతోనే సర్దుకుని మనస్సంతోషంగా ఉండాలనే ధోరణి ప్రవేశించబోతోంది తొందరలోనే.
లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23)
ఆలోచన ఒక తీరుగా, ఆచరణ మరొక తీరుగా- భయం ఒక దిశగా, ధైర్యం మరొక దిశగా- ఆశ ఒక పక్కగా, నిరాశ మరొక పక్కగా సాగుతూ ఔను- కాదు, జరుగుతుంది- జరగదు అనే ఈవిధమైన రెండుతీరుల భిన్న భిన్న దృక్పథాలతో జరుగుతుంది ఈవారం. నష్టం అవమానం గర్వభంగం... వంటివేమీ ఉండనే ఉండవు కానీ ఈ అన్నీ జరిగినంత ఆందోళన మాత్రం మనసుకి కలగవచ్చు జ్యోతిషం ప్రకారం. ఇప్పటికైనా ప్రతీకార బుద్ధిని మానాలి.
స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22)
ప్రభుత్వం నుండి రావలసిన అనుమతులుగానీ, ఆజ్ఞలుగానీ సకాలంలో అందుతాయి. వారి సహకారం తప్పక లభిస్తుంది. మీ కుటుంబానికి- ముఖ్యంగా దాంపత్యానికి సంబంధించిన వ్యవహారం ఎటూ తేలకుండా అలాగే ఉంటుంది. న్యాయస్థానం మధ్యవర్తి రాయబారం పూజాపురస్కారాలూ... ఇవన్నీ ఆకాశానికి గురిపెట్టి కొట్టిన బాణాల్లా నిష్ర్పయోజనాలే కావచ్చు ఈ వారంలో మాత్రం.
శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21)
అనుకోకుండా ఓ శుభకార్యం కలిసి రావచ్చు. ఆ కారణంగా ఇంటినిండుగా బంధువులూ మిత్రులూ పోగుపడొచ్చు. మీ వ్యవహారశైలీ ధర్మబద్ధ విధంగా మాట్లాడే మీ తీరూ కారణంగా మీ నిజాయితీతనం గుర్తింపబడి సక్రమంగా ముగుస్తాయి పనులన్నీ. కొత్త వ్యాపారపు ఆలోచన వద్దు. ఉద్యోగిగా ఉ ండడానికే ప్రాధాన్యమీయండి. విజయం నా సొంతమనుకుంటూ అహకరించకండి.
క్యాప్రికార్న్(డిసెంబర్ 22-జనవరి 20)
ఖర్చులో ఖర్చు అనుకుంటూ పుణ్యక్షేత్రాలకి ప్రయాణం కడతారు. ఉన్నంతలో ధ ర్మకార్యాలనుకుంటూ దానాలనీ ధర్మాలనీ చేస్తారు. పనిలో పని అన్నట్లుగా ఆ చుట్టుపక్కల ఉన్న బంధువుల ఇళ్ల తలుపు తడతారు. మాటలో మాట కలుపుదామనుకుంటూ నూతన వ్యాపార ఆలోచనని తెలియజేస్తారు పదిమంది మధ్యలో. దాంతో మీ నూతన వ్యాపారపు గుట్టు బయట పడే అవకాశం వస్తుంది. కొద్ది జాగ్రత్తగా వ్యవహరించండి.
అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19)
కష్టపడీ పడీ ఉద్యోగం కోసం ఎదురు చూసిన మీకు తొందర్లోనే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. నిచ్చెన ఎక్కేటప్పుడు మొదటి మెట్టు మీదనే కాలు పెట్టి ఎక్కాలన్నట్టు జీతం తక్కువ అనే ఆలోచన మాని చేరడం ఎంతైనా మంచిది మీకు. సంతాన లాభం ఉంది. చదువుతున్న సంతానానికి తగినంత ప్రోత్సాహాన్ని ఇవ్వండి. ఉత్తమ విద్యావంతుల్ని చేయగలుగుతారు.
పైసిస్(ఫిబ్రవరి 20-మార్చి 20)
ఎందుకో తెలియదుగానీ మనుష్యుల వల్ల కాకుండా పెంపుడు జంతువుల కారణంగానో పక్షుల కారణంగానో కొంత ఇబ్బంది పడే సూచనలు కన్పిస్తున్నాయి- తగుజాగ్రత్తలతో ఉండడం మంచిది కదా! మీ కుటంబంలోనికి చుట్టపు చూపుగా వచ్చిన బంధువు కారణంగా మనఃస్పర్ధ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అవసరమైన మేరకే ఉండండి. మరీ ఎక్కువా తక్కువా వద్దు.
డా" మైలవరపు శ్రీనివాసరావు