కండరాలను తినేసే వ్యాధి..!
మెడిక్షనరీ
ఆ వ్యాధి పేరే కండరాలను తినేసే వ్యాధి. ఇంగ్లిష్‌లో దాన్ని ‘ఫ్లెష్ ఈటింగ్ డిసీజ్’గా పేర్కొంటారు. వైద్య పరిభాషలో నెక్రొటైజింగ్ ఫ్యాషియైటిస్ అని పిలిచే ఈ వ్యాధి ఒక రకం బ్యాక్టీరియా వల్ల వస్తుంది. వీలైనంత త్వరగా చికిత్స తీసుకోకపోతే అది కాస్త ప్రమాదకరంగా కూడా మారే అవకాశం కూడా ఉంది. చర్మంపై చిన్న చిన్న గాయాలు, గాట్లు, ఏవైనా కీటకాలు కుట్టడం వల్ల ‘గ్రూప్-ఏ స్ట్రెప్టోకోకస్’ (జీఏఎస్) అనే బ్యాక్టీరియా చర్మంలోకి చేరుతుంది. చర్మం కింద ఉంటే సూపర్‌ఫీషియల్ ఫేషియా అనే కనెక్టివ్ కణజాలంలోకి ఆ బ్యాక్టీరియా విస్తరిస్తుంది.
ఫలితంగా చర్మంపై దద్దుర్లు, ఎర్రటి మచ్చలతో పాటు నీళ్ల విరేచనాలు, జ్వరం, మగతగా ఉండటం, నిస్సత్తువ వంటి లక్షణాలు కనిపిస్తాయి. పరిస్థితి తీవ్రంగా ఉంటే రక్తపోటు పడిపోవడం జరుగుతుంది. ఇంట్రావీనస్ యాంటీబయాటిక్ థెరపీ, ఒక్కోసారి చర్మంపై చచ్చుబడిపోయిన మేరకు మృతకణాజాలాన్ని శస్త్రచికిత్సతో తొలగించడం, మందులతో పడిపోయిన రక్తపోటును మళ్లీ యథాతథ స్థితికి తేవడం, ఒక్కోసారి రక్తమార్పిడి, ఇమ్యూనోగ్లోబ్యులిన్ వంటి మందులను రక్తనాళానికి ఎక్కించడం (ఇంట్రావీనస్ ఇమ్యూనోగ్లోబ్యులిన్) ... వంటి ప్రక్రియలతో డాక్టర్లు ఫ్లెష్ ఈటింగ్ డిసీజ్‌కు చికిత్స అందిస్తారు.