రిస్క్‌లేని పెట్టుబడి అదొక్కటే..!
చీటీలు, మంత్లీ సేవింగ్స్ స్కీమ్స్, ఆర్డీలు, సేవింగ్స్ సర్టిఫికెట్ల కొనుగోలు.... వీటిలో ఏది తక్కువ రిస్క్‌తో ఎక్కువ రాబడినిస్తాయి?
- పి. పద్మజ, మచిలీపట్నం
ప్రైవేట్ చిట్‌ఫండ్స్..ముఖ్యంగా అన్ రిజిస్టర్డ్ చిట్‌ఫండ్లలో నూటికి నూరు శాతం రిస్కు ఉంటుంది. అయినా మీరు చీటీలు వేయదల్చుకుంటే రిజిస్టర్డ్ చిట్‌ఫండ్స్ కొంత ఫర్వాలేదు. ప్రైవేట్ చిట్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రత్యామ్నాయంగా కొన్ని సంప్రదాయ ఇన్వెస్ట్‌మెంట్ సాధనాలున్నాయి. మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బుకు వీటిలో అసలు రిస్కు ఉండదు. రిస్కు చేయగలను అనుకుంటే సగం మొత్తాన్ని ఈక్విటీ గ్రోత్ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టొచ్చు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) కింద నెలకు ఇంత అని స్థిరమొత్తంలో ఇన్వెస్ట్ చేయొచ్చు. గత 15 ఏళ్ల సగటు చూస్తే కొన్ని ఫండ్ స్కీములు దాదాపు 15-18 శాతం దాకా రాబడి ఇచ్చాయి.
మంత్లీ సేవింగ్స్ స్కీమ్స్ (పీపీఎఫ్): ఏడాదికి రూ. 500 కనీస డిపాజిట్‌తో పీపీఎఫ్ ఖాతా ప్రారంభించవచ్చు. 15 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేయాలి. పీపీఎఫ్‌పై ప్రస్తుతం 8.7 శాతం మేర వడ్డీ లభిస్తోంది. సెక్షన్ 80 సీ కింద అసలు, వడ్డీ మీద కూడా పన్ను మినహాయింపు ఉంటుంది. ఒకవేళ డిపాజిట్‌దారు చట్టపరంగా ఏవైనా చిక్కుల్లో ఇరుక్కున్నా పీపీఎఫ్ మొత్తాన్ని కోర్టులు అటాచ్ చేయడానికి లేదు.
రికరింగ్ డిపాజిట్లు: ప్రస్తుతం వీటిపై 8.4 శాతం మేర వడ్డీ రేటు లభిస్తోంది. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఈ ఖాతాలు తీసుకోవచ్చు.
నెలకు అత్యంత తక్కువగా రూ. 10 కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్: వీటిని మీ పేరున లేదా మీ పిల్లల పేరు మీదనైనా తీసుకోవచ్చు. ప్రస్తుతం 5 సంవత్సరాల ఎన్‌ఎస్‌సీలపై 8.5 శాతం, 10 సంవత్సరాల సర్టిఫికెట్స్‌పై 8.8 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. కనీస ఇన్వెస్ట్‌మెంట్ రూ.100.
- రజనీ భీమవరపు సీఎఫ్‌పీ, జెన్‌మనీ