సంపదంటే డబ్బొక్కటే కాదు..!
ఆత్మీయం
సమస్త సంపదలకూ మూలం మహాలక్ష్మి. ఆమె కృప వల్లనే మనకు ఆకర్షణీయమైన రూపం ఏర్పడుతోంది. ఆమె కృప వల్లనే విద్యాధికులమై, విఖ్యాతి పొందుతున్నాం. ఆ దేవి దయ ఉంటే అన్నింటా అభివృద్ధి. అంతులేనన్ని సంపదలు. ఇక్కడ ఒక చిన్న విషయం... సాధారణంగా మనం సంపద అంటే డబ్బు ఒక్కటే అనుకుంటాము. అయితే ఆయుష్షు, ఆరోగ్యం, ఐశ్వర్యం, ధైర్యం, స్థ్యైర్యం, విజయం, వీర్యం, అభయం, శౌర్యం, సౌభాగ్యం, సాహసం, విద్య, వివేకం, ధనం, ధాన్యం, సంపద, బంగారం, వెండి, ఆభరణాలు, వస్తువులు, వాహనాలు, ఆయుధాలు, పశువులు, పుత్రపౌత్రాదులు, కీర్తిప్రతిష్ఠలు, సుఖసంతోషాలు మొదలైనవన్నీ సంపదలే. వీటన్నింటికీ అధినేత్రి అమ్మవారే.
లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఆమెను పూజించడం ఒక్కటే కాదు... కలకంఠి కంట కన్నీరు పెట్టని ఇంటనే తాను కొలువుంటానని అమ్మవారే స్వయంగా చెప్పిందట. అంటే ఏ ఇంట స్త్రీ కన్నీరు పెడుతుందో ఆ ఇంట ఆమె ఉండదన్నమాట. అందుకే స్త్రీ కంట కన్నీరు ఒలక కుండా చూసుకుందాం... ఆ కన్నీటికి తండ్రి కానీ, సోదరులు కానీ, భర్త కానీ, మరిది కానీ, బావ కానీ ముఖ్యంగా మరో స్త్రీ కారకురాలు కానే కాకూడదు. స్త్రీ ఎప్పుడూ హాయిగా, సంతోషంగా ఉండాలి. అదే అసలైన లక్ష్మీత్వం.