
ఈ గేమ్స్ బల్లే... బల్లే...
ఫిబ్రవరి వచ్చిందంటే చాలు పంజాబ్‌లోని లూథియానా నగరం సమీపంలో ఉన్న కిలా రాయ్‌పూర్ గ్రామం అందరి నోటా వినిపిస్తుంది.
ఫిబ్రవరి వచ్చిందంటే చాలు పంజాబ్‌లోని లూథియానా నగరం సమీపంలో ఉన్న కిలా రాయ్‌పూర్ గ్రామం అందరి నోటా వినిపిస్తుంది. మూడు రోజులపాటు ఎక్కడ చూసినా సందడే సందడి... ఒక పక్క ఎడ్ల పందేలు... మరోవైపు శునకాల రేసులు... ఇంకో చోట గుర్రపు పందేలు... కాస్త ముందుకెళితే ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలు... వయో భేదం లేకుండా తమలో ఉన్న అపార ప్రతిభను ప్రదర్శించేందుకు ఉత్సాహంతో ఉరకలెత్తే వేలాది మంది పోటీదారులతో... లక్షలాది ప్రేక్షకులతో కిలా రాయ్‌పూర్ గ్రామం కళకళలాడుతుంది. సుదీర్ఘ చరిత్ర ఉన్న ఈ క్రీడోత్సవాల వివరాలు క్లుప్తంగా....
- కరణం నారాయణ (సాక్షి స్పోర్ట్స్)
రైతులకు వినోదం కోసం, వారందరినీ ఒకే తాటిపై తెచ్చేందుకు, వారిలో పోటీతత్వం పెంచేందుకు ఎనిమిది దశాబ్దాల క్రితం ఊపిరి పోసుకున్నవే కిలా రాయ్‌పూర్ క్రీడోత్సవాలు. 1933లో సంఘ సేవకుడు ఇందర్ సింగ్ గ్రేవాల్ ఈ క్రీడలకు అంకురార్పణ చేశారు.
ఈ క్రీడలను భారత గ్రామీణ ఒలింపిక్స్‌గా కూడా పిలుస్తారు. ప్రతి యేటా ఫిబ్రవరి తొలి వారంలో లూథియానాకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కిలా రాయ్‌పూర్ గ్రామంలో జరిగే ఈ క్రీడోత్సవాల్లో సుమారు 50 నుంచి 60 సంప్రదాయ క్రీడాంశాల్లో పోటీలను నిర్వహిస్తారు.
ఎడ్ల పందేలు ఈ క్రీడల్లో అన్నింటికంటే హైలైట్‌గా నిలుస్తాయి. విజేతలకు లక్షల రూపాయల్లో నజరానాలు లభిస్తాయి. దంతాలతో సైకిళ్లను ఎత్తడం... తల వెంట్రుకలతో ట్రాక్టర్‌లను లాగడం... కాళ్లపై నుంచి ట్రాక్టర్‌ను తీసుకెళ్లడం.. మండుతున్న వలయాలతో సైకిల్‌ను నడపడం... టగ్ ఆఫ్ వార్... ఇలా ఎన్నో అబ్బురపరిచే విన్యాసాలు ఈ క్రీడోత్సవాల్లో కనువిందు చేస్తాయి.
ఆరంభంలో కొద్దిమందికే పరిమితమైన ఈ క్రీడోత్సవాలు ఇంతింతై వటుడింతై అన్నట్లు నేడు విదేశీ జట్లు కూడా పాల్గొనే స్థాయికి చేరుకున్నాయి. ఈ క్రీడలను నిర్వహించే గ్రేవాల్ స్పోర్ట్స్ అసోసియేషన్ వీటి ద్వారా వచ్చే ఆదాయాన్ని హాకీ అకాడమీ నిర్వహణకు కేటాయిస్తోంది. ఈ హాకీ అకాడమీలో 150 మందికి శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం కిలా రాయ్‌పూర్ స్టేడియంలో 50 వేల మంది ప్రేక్షకులు ఈ క్రీడోత్సవాలను ఏకకాలంలో తిలకించే సౌకర్యం ఉంది.
ఒకప్పుడు ఈ క్రీడోత్సవాల్లో భారత అత్యుత్తమ క్రీడాకారులు తమ విన్యాసాలను ప్రదర్శించారు. హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్‌తోపాటు బల్బీర్ సింగ్, పర్గత్ సింగ్, దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్ తదితరులు ఇందులో పాల్గొన్నారు.