పొద్దున నిద్రలేస్తూనే ‘ఈ రోజు నేను నా జీవితాన్ని పాడుచేసుకుంటాను’ అనుకొని మరీ తమ జీవితాన్ని పాడు చేసుకునే వారు బహుశా ఎవరూ ఉండరు. నిర్ణీతపథం నుండి తప్పిపోయేవాళ్లలో ఎక్కువమంది చాలా మంచి వాళ్ళు, తెలివైనవాళ్లు, అవకాశమొచ్చిఉంటే అత్యున్నతమైన స్థితికి చేరగలిగిన సామర్థ్యం ఉన్నవాళ్లే ఉంటారు. కాని ఎక్కడో, ఎప్పుడో తీసుకున్న ఒక చిన్న తప్పుడు నిర్ణయం, అనవసరమైన తొందరపాటుతనం, సందిగ్ధంలో ఉన్నపుడు ఎవరైనా పెద్దల్ని సంప్రదించాలన్న ఇంగితం లోపించడమే జీవితంలో ‘తప్పిపోవడానికి’ కారణాలవుతూంటాయి. యేసుప్రభువు చెప్పిన తప్పిపోయిన కుమారుని ఉపమానం లోని చిన్న కుమారుడు, తండ్రి ఆధీనంలో జీవించడం కన్నా, తన వంతు ఆస్తిని తీసేసుకొని వెళ్లిపోయి సుదూరదేశంలో ‘స్వేచ్ఛగా’ జీవించాలన్న తన బలమైన కోరిక వల్ల ‘తప్పిపోయాడు’. కాని అతడూహించుకున్న తండ్రి ఆధిపత్యం లేని దూరదేశపు స్వేచ్ఛాజీవితం, అతనికి దూరపుకొండల నునుపు జీవితమే అయ్యింది.
తండ్రి దూరమవడంతోనే దుష్టసాంగత్యంలో దుర్వ్యసనాలు దగ్గరయ్యాయి. ఆస్తంతా కరిగి చిల్లిగవ్వ కూడా లేక ‘బతకడానికి’ చివరికి పందులు మేపవలసిన దుస్థితి దాపురించింది. కోరుకున్న ‘స్వేచ్ఛ’ అతనికి దొరికింది, కాని తండ్రి సాంగత్యంలో తనకుండిన ‘ఆధిక్యతలన్నీ’ అందుకు మూల్యంగా అతను కోల్పోయాడు. తండ్రిలేని, ఆయనతో పాటే ఉండే ఆంక్షలు, క్రమశిక్షణ లేని జీవితాన్ని కోరుకున్న అవివేకి అని అతన్ని అనాలా లేక అతనివి అతి తెలివి తేటలనాలా? (లూకా 15వ అధ్యాయం).చాలామంది అనుకొంటున్నట్టుగా యేసుప్రభువు ఈ ఉదంతాన్ని దేవుని ఎరుగని అన్యులకు చెప్పలేదు. దేవునితో పాటే జీవిస్తూ, దేవుని సహవాసపు అమూల్యత్వాన్ని గ్రహించక దేవునికి దూరం కావాలనుకునే, దూరమయ్యే ‘క్రైస్తవులకే’ ఆయన ఈ ఉదంతాన్ని చెప్పాడు. డబ్బుతో కొనగలిగే సుఖానుభవాలే గొప్ప అనుకున్నాడు కాని ఒక గొప్ప తండ్రికి కుమారుడుగా తనకు సహజంగా లభించిన డబ్బుతో వెలగట్టలేని ఎన్నో అత్యున్నతమైన ఆత్మీయ ఆశీర్వాదాలు ఎంత గొప్పవో గ్రహించలేకపోయాడు. తండ్రితో పాటే ఉంటూ ఆయన వారసుడుగా అన్నింటిపైనా ఆజమాయిషీ చేయడం చాలా చిన్న విషయమనుకున్నాడు.
అయితే దిగజారి ఎంతో హీనమైన పందులు మేపే పని దొరికినా చాలని చివరికి సరిపెట్టుకున్నాడు. తప్పిపోయిన జీవితమంటే పరమ తండ్రి అయిన దేవదేవుని మార్గదర్శకత్వం, ఆజమాయిషీ లేని జీవితమని ఈ ఉపమానం చెబుతోంది. రోజుకు వెయ్యిసార్లు దేవుని పేరెత్తుతూ కూడా, నిజజీవితంలో మాత్రం దేవునికి దూరంగా జీవించేవారికి, పేరుకు మాత్రం దేవుని పిల్లలమని చెప్పుకొంటూ నేతిబీరకాయలాగా దేవుడు లేని పిల్లలుగా జీవించే వేషధారులకు, ఒక్క ఆదివారం ఉదయం మాత్రం కొద్దిసేపు చర్చిలో దేవుని తలచుకొని మిగిలిన సోమవారం నుండి శనివారం దాకా సమయమంతా దేవునికి దూరంగా జీవించడానికే ఇష్టపడే నామకార్ధపు క్రైస్తవానికి ఈ తప్పిన కుమారుడు నిలువెత్తు నిదర్శనం! అందుకే అపొస్తలుడైన యాకోబు తనపత్రికలో తప్పిపోయిన మన పొరుగువారిని తిరిగి దారి మళ్లించడం మన క్రైస్తవ ధర్మమని అది దైవరాజ్యనిర్మాణంలో ప్రాముఖ్యమని పేర్కొన్నాడు(5:19.20). చర్చి జీవితంలో సరిదిద్దడం (ఇౌటట్ఛఛ్టిజీౌ), పడిపోయిన వారిని తిరిగి లేపడం అత్యంత ప్రాముఖ్యమైన అంశాలు.
తండ్రి ప్రేమ ఏమిటో యెరిగి కూడా దానికి దూరమై జీవితంలో పందులు మేపే స్థితిని కొనితెచ్చుకోవడమే తప్పిపోయిన కుమారుడు చేసిన తెలివి తక్కువ పని. అయితే అతను ‘బుద్ధి’ తెచ్చుకున్నపుడు మాత్రం తన స్థితికి తన స్నేహితులను నిందించలేదు. తనను తానే నిందించుకున్నాడు. ‘నేను పాపం చేశాను, నీకు యోగ్యుడనైన కుమారుణ్ణి కాను నేను’ అన్నాడతను. అంతే, తండ్రి అతని మీద మీద పడి, ఏడ్చి, ముద్దుపెట్టుకొని తనదంతా కుమారునికిచ్చాడు. ఈ ఉదంతం నేర్పేదొక్కటే! పశ్చాత్తా్తపం లేని నామకార్థపు జీవితంలో తండ్రితోపాటే ఉన్నా ఆయనవేవీ విశ్వాసివి కావు. కాని నిజమైన పశ్చాత్తా్తపంతో తిరిగొచ్చి తండ్రిని ఆశ్రయిస్తే తండ్రిదంతా కుమారునిదే! ఎందుకంటే తండ్రికి పశ్చాత్తా్తపపడ్డ కుమారుడే సర్వస్వమ్.
– రెవ. డా.టి.ఎ.ప్రభుకిరణ్
Comments
Please login to add a commentAdd a comment