
షిరిడీసాయి తత్వంలో అహానికి చోటు లేదు. అహం పట్ల బాబాకు ఎనలేని కోపం ఉండేది. బాబా అన్ని వేళలా అందరికీ అహాన్ని వీడమని బోధించారు. భక్తుల్లో తనను ఆశ్రయించి వచ్చిన వారిలో మొదటగా అహాన్ని తొలగించేవారు. అహం అనేది మనిషికి గుడ్డితనం లాంటిదన్నది బాబా భావన. అహంకారపు చీకట్లు తొలగనిదే ఏ మనిషినీ తన దరికి చేర్చుకునేవారు కాదు. తన ప్రేమతత్వంలో మానసికానందాన్ని, తన జీవిత చరిత్ర రాయటానికి అనుమతి కోసం వచ్చిన హేమాదిపంతుకు బాబా మొదటగా ఈ సందేశాన్నే అందించారు. మతాలపేరిట మనుషుల నడుమ అంతరాలను ఆయన తన మతంలో చేర్చలేదు. సమస్తప్రాణులు ఒకటేనని, ప్రేమ, దయ, కరుణలతో మానవ జీవిక సాగాలని, భగవంతునియందు అపారనమ్మకంతో మంచికర్మలు చేయడమే పరమావధిగా జీవించాలని, దానగుణం కలిగి ఉండటం, పనిపట్ల శ్రద్ధ వహించటం, బాధ్యతలను ఏమారకపోవటం ప్రతిమనిషి పరమ కర్తవ్యాలని గీతాసారంలా... బాబా తనదైన సాయిగీతలా భక్తులకు చెప్పేవారు.
తనను విశ్వసించిన వారిని అనునిత్యం కంటికి రెప్పలా కాపాడుకుంటానని అభయమిచ్చేవారు. తన భక్తిసామ్రాజ్యంలో అందరూ సుఖసంతోషాలతో దేనికీ కొరత లేకుండా జీవిస్తారని భరోసా ఇచ్చే బాబా, యోగులలో పరమయోగి. నమ్మిన వారి ఏలిక. జీవితమంటేనే ప్రేమమయమని చాటిన సత్యస్వరూపుడు. బాబాను పూజించడంతో సంతృప్తి పడటం, ఉపవాసాలు ఉండి ఊరడిల్లడం, షిరిడీ వెళ్లి సంతోషపడటమే కాదు... ఆయన బోధలను ఆచరించేందుకు ప్రయత్నించాలి. అప్పుడే సద్గురువు అనుగ్రహం లభిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment