రోడ్డు మీద చెత్త పడితే ఎత్తేయొచ్చు. మురికి అయితే కడిగేయొచ్చు. కానీ సమాజంలో కంపు.. అది.. భరించలేని విధంగా మారితే? మన సమాజంలో మహిళల పట్ల మర్యాద లేదు. వారి పనికి గుర్తింపు లేదు. వారి మనుగడకు భరోసా లేదు. వారి అస్తిత్వాన్నే చీకటిలో కలిపేసే ధోరణి! స్త్రీల విషయం ఒక్కటనే కాదు.. వంచన, కపటం, మాయ తప్ప నీతి, నిజాయితీలేని ఈ సమాజంపై అసహ్యం కలిగింది ఆమెకు. ‘తను కాలిపోతూ, మనిషిని కాల్చేస్తూ పారదర్శక నైజం కలిగిన సిగరెట్ మీ కన్నా నయంగా ఉంది’ అంటూ ఓ పాట రాసింది. పాడింది. వీడియో చేసింది.
‘స్మోకింగ్ కిల్స్.. బట్ సిగరెట్ రాక్స్’ అనే పేరుతో రూపొందించిన ఆ మల్టీ లింగ్వల్ వీడియోను యూట్యూబ్‌లో విడుదల చేసింది.. దశాబ్ద కాలానికి పైగా ఘోస్ట్ (అజ్ఞాత) రైటర్‌గా, సింగర్‌గా, కంపోజర్‌గా కొనసాగిన ఫీబా మార్టిన్! ఆ వీడియో ఇప్పుడొక సోషల్ మీడియా సెన్సేషన్! ఇన్నాళ్లు ఎన్నో విభాగాల్లో దేశంలోని పలు భాషల సినీ పరిశ్రమల్లో ఘోస్ట్‌గా వర్క్ చేసిన ఫీబా తన కష్టం ఇప్పటికైనా గుర్తింపు పొందాలని ఆకాంక్షిస్తోంది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..
ప్రపంచ పౌరురాలు
అమ్మ తమిళియన్. నాన్నది ఇంగ్లండ్. నేను నా భర్తతో కలిసి ముంబైలో ఉంటున్నాను. బెంగళూరులో పన్నెండు మంది చిన్నారులను మేము అడాప్ట్ చేసుకున్నాం. క్తుప్లంగా ఇవీ మా కుటుంబ వివరాలు. ఇక నా విషయం. డబుల్ మాస్టర్స్ చేశాను. ఎంఏ లిటరేచర్, కూచిపూడి ఆంధ్ర యూనివర్సిటీ నుంచి చేశాను. ప్రస్తుతం పీహెచ్‌డీ చేస్తున్నాను. గతంలో సాఫ్ట్‌వేర్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా జాబ్ చేశాను. కార్పొరేట్ జాబ్ వదిలేసి ఇప్పుడు ఫుల్‌టైం మ్యూజిక్, రైటింగ్‌కే కేటాయిస్తున్నాను. అన్ని దేశాలు, అన్ని రాష్ట్రాలు తిరుగుతుంటాను. ప్రపంచ పౌరురాలిని అనుకోండి. ఇప్పటి వరకు రెండు వందల చిత్రాలకు మ్యూజిక్, డైరెక్షన్, రైటింగ్ విభాగాల్లో ఘోస్ట్‌గా వర్క్ చేశాను. చాలామంది మ్యుజీషియన్స్ దగ్గర ఘోస్ట్ కంపోజర్‌గా చేశాను. వారి పేర్లు ఏవీ చెప్పలేను. ఆర్‌పీ పట్నాయక్ గారు చేసిన ‘ఈమీ’ హాలీవుడ్ చిత్రానికి పనిచేశాను.
అందులో రైటర్‌గా నాకు ఆయన టైటిల్ క్రెడిట్ ఇచ్చారు. అనేక చిత్రాలకు ర్యాప్ మ్యూజిక్ పాడాను. తెలుగులో వచ్చిన మ్యాక్సిమమ్ ర్యాప్ పాటలు నేను పాడినవే. ఇక్కడి అందరి ర్యాపర్‌లతో కలిసి పనిచేశాను. అలాగే తమిళ్, కన్నడ, బెంగాళీ, హిందీ, ఇంగ్లిష్ జింగిల్స్‌కి వాయిస్ ఇచ్చాను. ఆర్‌పీ, రామ్‌గోపాల్ వర్మ తప్ప మరెవ్వరూ నాకు గుర్తింపు ఇవ్వలేదు. ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలని, జీవితకాలమంతా ఒకరి కింద పనిచెయ్యకూడదనే లక్ష్యంతో ఇప్పుడు పనిచేస్తున్నాను. ప్రస్తుతం పారిస్‌లోని రాక్‌బ్యాండ్ ‘పుల్‌ఆర్ట్ బీ’తో ర్యాపర్‌గా ట్రావెల్ చేస్తున్నాను. సంగీత కచేరీలో పాల్గొంటున్నాను. మోడలింగ్ చేస్తున్నాను. అవికాక సొంతగా ప్రైవేటు ఆల్బమ్స్ మీద ఫోకస్ చేస్తున్నాను. రెండేళ్ల క్రితం రాంగోపాల్‌వర్మ కలిసి చేసిన ఒక ప్రాజెక్ట్ రిలీజ్ అయి ఉంటే ఈపాటికి మంచి గుర్తింపు వచ్చి ఉండేది. వీడియో వెనుకజనాలతో బాగా విసిగిపోయి ఉన్నాను.
చెప్పేదొకటి, చేసేదొకటి. రిలేషన్‌షిప్స్‌కి, పనికి, ఆడవాళ్లకి వాల్యూ లేదు. ఇవన్నీ చూసి చూసి సమాజం మీద ఏవగింపు కలిగింది. ఏ భావన అయినా.. నేను చేసేది, నాకు తెలిసింది, రాయటం, కంపోజ్ చెయ్యటమే. దానినే మాటల్లో పెట్టి ఈ ర్యాప్ చేశాను. పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. జీవితంలో నాకు ఎదురైన చేదు అనుభవాలే ఈ వీడియోకి ప్రేరణ. సౌత్‌లో, ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో నేను ఎదుర్కొన్న చేదు అనుభవాలు అని చెప్పాలి. ఇందులో చూపించినట్లు నేను స్మోక్ చెయ్యను, డ్రింక్ చెయ్యను. అవన్నీ గ్రాఫిక్స్‌తో చేశాను. భావాన్ని అర్థం చేసుకునే వారికే ఈ వీడియో అర్థమవుతుంది. మనుషుల కంటే సిగరెట్ ఎంతో మేలు. ప్యాకెట్ మీద వార్నింగ్ ఉంటుంది. సిగరెట్ తన గురించి ఏమీ దాచదు. తాగితే చస్తావ్ అంటుంది. ఆ తర్వాత చావడం, బతకడం మన చాయిస్. భక్తి, బంధం.. వీటి ముసుగులో మనుషులు మోసం చెయ్యటం దారుణం అనిపిస్తుంది. అది తీవ్రంగా గాయపరుస్తుంది. సిగరెట్ డబ్బా మీద ఉన్న హెచ్చరిక మనుషుల ముఖాల మీద కూడా ఉంటే బాగుండు. ఇదే ఈ పాటలో రాశాను.
– ఓ మధు
క్యాస్టింగ్ కౌచ్ ఉంది
అడిగారు కాబట్టి చెబుతున్నాను. ‘క్యాస్టింగ్ కౌచ్’ అన్ని పరిశ్రమల్లోనూ ఉంది. ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లోనూ ఉంది. పెద్ద కార్పొరేట్ కంపెనీల్లో మాత్రం.. మనం ఎప్పుడొచ్చాం అనే దగ్గర నుంచి మన పని, మన మూమెంట్స్ అన్నీ రికార్డ్ అవుతుంటాయి కనుక క్యాస్టింగ్ కౌచ్ కొంత తక్కువ. కానీ ఫిలిం ఇండస్ట్రీలో అలా ఉండదు. అలాగే సినిమా పరిశ్రమలో గుర్తింపు రావడం కష్టం. పేమెంట్లు కూడా సరిగా అందవు. చేసిన పనికి గుర్తింపు లభించక పోవటం అక్కడ చాలా కామన్ విషయం. ‘నెక్ట్స్ ప్రాజెక్ట్‌లో మీ పేరు పెడతాం, ఈసారికి చెయ్యండి’ అనేవాళ్లే ఎక్కువ.
– ఫీబా మార్టిన్
Comments
Please login to add a commentAdd a comment