పెంపుడు శునకం పేరుమీదుగా మాల్డోవా
పేరులో నేముంది
ఒక కుక్క పేరు మీదుగా ఈ దేశానికి ఈ పేరు ఏర్పడిందటే ఆశ్చర్యం వేస్తోంది కదా! అవును ఇది నిజం. మోల్డా అనేది రోమన్ యువరాజు డ్రాగోస్ పెంపుడు శునకం. వేటాడ్డమంటే సదరు యువరాజులుంగారికి మహా ఇష్టం. దాంతో ఓ రోజాయన ఓ అడవి దున్నను వేటాడుతూ దట్టమైన అరణ్యంలోకి వెళ్లిపోయాడు. డ్రాగోస్ వెంట పరివారం, తోడుగా వేటకుక్కలు ఉన్నాయి. అడవిదున్న చాలా దూరం పాటు వీళ్లని తన వెంట తిప్పుకుంది. విపరీతంగా అలసిపోయిన యువరాజు, పరివారం ఇక తమ వల్ల కాదని చేతులెత్తేశారు.
అయితే యువరాజు పెంపుడు కుక్క మోల్డా మాత్రం అలా దాన్ని వెంబడిస్తూ వెళ్లి, చివరికి ఓ నది ఒడ్డున నీళ్లు తాగుతున్న దాని జాడ కనుక్కొని, తన అరుపులతో అందరినీ అప్రమత్తం చేసింది. అందరూ వచ్చే వరకూ దాన్ని నిలువరించింది. ఈ ప్రయత్నంలో మోల్డా కాస్తా ప్రాణాలు కోల్పోయింది. అందరూ కలిసి అడవిదున్నను బంధించారు కానీ, తాను ప్రాణసమంగా ప్రేమించే మోల్డా చనిపోవడంతో యువరాజు ఎంతో దుఃఖించాడు. వీరమరణం చెందిన తన శునకానికి అక్కడే సమాధి కట్టించాడు. దాని స్మృతిచిహ్నంగా మలిచాడు. క్రమేణా అదే దేశమైంది.