తియ్యటి ఘుమఘుమల సువాసనలు కరిగించిన బటర్, కారమిలైజ్ చేసిన పంచదారల కలయిక నుండి వచ్చే మాధుర్యం.. నైపుణ్యం కలిగిన రెండు మూడు చేతుల మధ్యన మృదువుగా నలుగుతున్న పిండి... క్యాండీడ్ ఫ్రూట్స్‌ను జల్లుతున్న మరో కొన్ని చేతులు... వారి వెనకాలే పెద్ద పెద్ద అవెన్‌లు... అంతే... ఎంతో ఆదరణ పొందిన కరాచీ బేకరీ బిస్కెట్లు సిద్ధం...
దేశవ్యాప్తంగా ఇంత ఆదరణ పొందిన ఈ బిస్కెట్ల ప్రయాణం సుమారు 60 సంవత్సరాల క్రితమే ప్రారంభమైంది. ఈ బేకరీ ఖాన్‌చంద్ రామ్‌నాని ఆలోచన నుంచి పుట్టుకొచ్చింది.
కరాచీ బిస్కెట్లు...
ఈ పేరుకి, పాకిస్థాన్‌లోని కరాచీకి ఏ మాత్రం సంబంధం లేదు. తన స్వస్థలం మీద మమకారంతో మాత్రమే ఈ పేరు పెట్టుకున్నారు. పుట్టుకతో సింధీ అయిన ఖాన్‌చంద్ రామ్‌నామీ, దేశ విభజన సమయంలో పాకిస్థాన్ కరాచీ నుంచి ప్రస్తుత ఇండియాకి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. 1953లో తనముద్రను ప్రతిబింబించేలా బిస్కెట్లు, కేక్‌లు, పేస్ట్రీల అమ్మకాలలో ప్రఖ్యాతి చెందారు. మొట్టమొదటి ఔట్‌లెట్‌ను ముజాంజాహి మార్కెట్‌లో ప్రారంభించారు. ఇటీవలే దుబాయ్‌లో కూడా వీరి ఔట్‌లెట్ తొలి అడుగు వేసింది.1960లో రామ్‌నామీ స్వయంగా తన సొంత బేకింగ్ యూనిట్‌ను ప్రారంభించి, తన మార్కులో ఫ్రూట్ బిస్కెట్లను తయారుచేయడం ప్రారంభించారు. అంతే, హైదరాబాదీల మనసులను ఇట్టే దోచేసుకున్నారు. నోటికి లవణ రుచిని కూడా చూపిస్తున్నారు. టూటీ ఫ్రూటీతో బిస్కెట్ల మీద నక్షత్రాల్లా మిణుకుమిణుకు మంటూ నోరూరేలా చేస్తున్నారు. టీ టైమ్ తినడానికి అనువుగా కాజు బిస్కెట్లు, ఉప్పు బిస్కెట్లు తయారుచేస్తున్నారు. ‘‘మా నాన్నగారు నాణ్యత మీదే మనసు లగ్నం చేశారు. ఆ నాణ్యతనే నేటికీ కొనసాగిస్తున్నాం. నా సోదరులిద్దరూ గతించారు. నా మేనల్లుళ్లు సోషల్‌మీడియాలో మా బేకరీ వస్తువుల గురించి ప్రచారం చేస్తుంటారు. నేను నిత్యం పనులలో బిజీగా ఉన్నా కూడా అందరికీ సకాలంలో డెలివరీలు అందేలా జాగ్రత్తపడుతుంటాను’’ అంటారు లేఖ్‌రాజ్ రామ్‌నాని.
ఇక్కడి ప్రత్యేకతలు...
ఎగ్‌లెస్ కుకీస్ కరాచీ బేకరీ ప్రత్యేకత. అలాగని వీరు కొత్తరకాలు తయారుచేయడంలేదని కాదు. ఇక్కడ పదిరకాల బిస్కెట్లు, షెర్మాల్ నుంచి ఒరిజానో వరకు 40 రకాల కుకీలు తయారుచేస్తున్నారు. కాజు, ఫ్రూట్స్, ఉస్మానియా... అన్నీ అప్పటికప్పుడు అమ్ముడైపోతాయి. హైదరాబాద్‌లో వీరికి విశేష ఆదరణ రావడంతో, నాణ్యత విషయంలో మరింత జాగ్రత్తలు పాటిస్తున్నారు. 2018 లో ముంబైలో కొత్తబ్రాంచ్ తెరిచారు. 2020 నాటికి ప్రపంచవ్యాప్తంగా 100 ఔట్‌లెట్‌లు పూర్తిచేయాలనే సంకల్పంతో ఉన్నారు. స్థానిక దుకాణాలు మొదలు, అమెజాన్.కామ్ వంటి ఆన్‌లైన్ సంస్థల వరకు కరాచీ బిస్కెట్లను అమ్ముతున్నాయి. హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి ప్రయాణించేవారు ఈ బిస్కెట్లను తమ బంధువులకు తప్పనిసరిగా తీసుకువెళ్తారు. నానాటికీ పెరుగుతున్న ప్రజాదరణతో ఈ ఔట్‌లెట్ల సంఖ్య పెరుగుతోంది. లేఖరాజ్ మాటల ప్రకారం. ... నిజమైన హైదరాబాదీకి ఉదయం టీతో పాటు కరాచీ బిస్కెట్లతోనే తెల్లవారుతుంది.
మా కుటుంబీకులకు ఒక నమ్మకం ఉంది. తక్కువ మాట్లాడాలి, ఎక్కువ పని చేయాలి. అందువల్లే మేం ఎక్కువ ఇంటర్వ్యూలు ఇవ్వడానికి ఇష్టపడం. చేతలతోనే మాట్లాడతాం.
– లేఖ్‌రాజ్ రామ్‌నాని (ఖాన్‌చంద్ రామ్‌నాని కుమారుడు)
కారం బిళ్లలు
కావలసినవి: బియ్యప్పిండి – ఒక కప్పు; సెనగ పిండి – ఒక కప్పు; మిరప కారం – ఒక టీ స్పూను; ఉప్పు – రుచికి తగినంత; అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను; నువ్వులు – ఒక టేబుల్ స్పూను; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా.
తయారీ: ∙ఒక పాత్రలో బియ్యప్పిండి, సెనగ పిండి, అల్లం వెల్లుల్లి ముద్ద, మిరపకారం, ఉప్పు వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి ∙నువ్వులు వేసి మరోమారు కలపాలి ∙ఈ మిశ్రమాన్ని సుమారు అర గంట సేపు పక్కన ఉంచాలి ∙చేతికి నూనె పూసుకుని పిండిని కొద్దికొద్దిగా తీసుకుంటూ ఉండలా చేసి, చేతితో వడ మాదిరిగా ఒత్తి పక్కన పెట్టుకోవాలి ∙ఈ విధంగా అన్నీ చేసుకోవాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, తయారుచేసి ఉంచుకున్న కారం బిళ్లలను అందులో వేసి దోరగా వేయించి పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి ∙ఇవి పదిహేను రోజుల దాకా నిల్వ ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment