బ్రహ్మపుత్రుల బంధువు..!
సామాజిక సేవ
ఏటికి ఎదురీదడం అసాధ్యం అంటుంటారు. అలాంటిది రవీంద్రనాథ్ ఏకంగా వరదకే ఎదురీదవచ్చంటారు. గత 20 సంవత్సరాలుగా వరదల విషయంలో బ్రహ్మపుత్ర నదీ తీర ప్రాంత ప్రజల ను విజ్ఞానవంతులను చేస్తున్నాడాయన.
ప్రపంచంలో నాలుగో పెద్ద నది బ్రహ్మపుత్ర. టిబెట్, చైనా, భారత్, బంగ్లాదేశ్‌ల మీదుగా ప్రవహించే ఈ నదికి వరదలు రావడమనేది చాలా సాధారణమైన విషయం. గత వంద సంవత్సరాల చరిత్రను పరిశీలిస్తే ప్రతి ఏడాదీ వరదలు వచ్చిన దాఖలాలున్నాయి. పర్యవసనంగా తీవ్రస్థాయిలో ఆస్తినష్టం, ప్రాణ నష్టం సంభవించాయి. వరదలు వచ్చి వెళ్లడం ఒక ముప్పు అయితే... ఆ బీభత్సకాండ ముగిసిన తర్వాత ఏర్పడే భయంకరమైన పరిస్థితి మరీ ఘోరంగా ఉంటుంది. అంటువ్యాధులతో ప్రజలు అనారోగ్యం పాలవుతారు.
హిమాలయ పర్వతసానువుల్లోని కైలాసగిరిలో జనించి, బంగ్లాదేశ్ తీర ప్రాంతంలో బంగాళాఖాతంలో కలిసే వరకూ బ్రహ్మపుత్ర నది కూడా వరద రూపంలో తన తీర ప్రాంతంలోని ప్రజలను ఇబ్బంది పెడుతుంది. అలా బ్రహ్మపుత్ర వరదలతో ఇబ్బందులు పడే ప్రాంతాల్లో ఒకటి ...కొకరికటపబ్నా గ్రామం.
అస్సాం పరిధిలో ఉండే ఈ గ్రామం... వరదలను ఎదుర్కొనడంలో ఇతర పరీవాహక ప్రాంతాలన్నింటికీ ఆదర్శంగా నిలుస్తోంది! ఆ విషయంలో పూర్తి క్రెడిట్ దక్కాల్సింది రవీంద్రనాథ్‌కి.
ఐఐటీ ఢిల్లీలో ఇంజినీరింగ్ చదివిన ఆయనకి ఎన్నో ఉద్యోగాలు వచ్చాయి. కానీ వాటి పట్ల ఆసక్తి చూపలేదు. తన చదువుతో తను ఉద్యోగాన్ని సంపాదించుకోవడం, ఆస్తులను సంపాదించుకోవడం కంటే... తీర ప్రాంతంలో ఉండే అమాయక ప్రజల ధన, ప్రాణాలను కాపాడటమే మిన్నగా భావించాడు. వారి సమస్యల నుంచి గట్టెక్కించాలంటే వారిని విజ్ఞానవంతులను చేయడమే పరిష్కారమార్గమని భావించాడు. అందుకోసం రూరల్ వాలంటీర్ సెంటర్ (ఆర్వీసీ)ని ఏర్పాటు చేశాడు. కొంతమంది యువకులను కలుపుకొని వరదబాధిత ప్రాంతాల్లో సహాయ సహకారాలు అందించడం ఆరంభించాడు. బ్రహ్మపుత్ర నదీ పరివాహక ప్రాంత ప్రజలకు బంధువయ్యాడు.
తాగే నీరు, శానిటేషన్ వ్యవస్థల మీద వరద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఆ రెండిటి విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తే... వరద తర్వాత పర్యవసనాలను సులభంగా తట్టుకోవచ్చన్న తన ఆలోచనను అమల్లోపెట్టాడు రవీంద్రనాథ్. ప్రభుత్వ సహకారంతో శుద్ధమైన నీటిని పంపిణీ చేసే ఏర్పాట్లను చేశాడు. వరదలు సంభవించిన సమయాల్లో ఆర్వీసీ అందించే సహకారం బ్రహ్మపుత్ర పరీవాహక ప్రాంత ప్రజలకు వరప్రదంగా మారింది. అస్సాం ఎగువ ప్రాంతంలో వరద తాకిన ఆరున్నర గంటల తర్వాత వరదనీరు బంగ్లాదేశ్‌ను చేరుకొంటుంది. అంతలోపు ఎక్కడిక్కడ ప్రజలను అలర్ట్ చేసే వ్యవస్థను ఏర్పాటు చేశాడు రవీంద్రనాథ్. ఇంటర్నెట్, ఇ-మెయిల్, మొబైల్ కమ్యూనికేషన్స్ ద్వారా సమాచారాన్ని అందరికీ చేరవేస్తారు. ప్రస్తుతం బ్రహ్మపుత్ర తీర ప్రాంతంలోని మొత్తం 800 కిలోమీటర్ల పరిధిలో విస్తరించింది ఆర్వీసీ వ్యవస్థ. దాని ద్వారా ఎంతో సేవ చేస్తోన్న రవీంద్రనాథ్‌ను యునిసెఫ్, యూరోపియన్ యూనియన్లు గుర్తించి, సాంకేతిక సహకారం అందించడానికి ముందుకొచ్చాయి!