అంగడి బొమ్మల అక్షరప్రేమ | they want to change her profession | Sakshi
Sakshi News home page

అంగడి బొమ్మల అక్షరప్రేమ

Published Wed, Jul 16 2014 12:05 AM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM

అంగడి బొమ్మల అక్షరప్రేమ - Sakshi

అంగడి బొమ్మల అక్షరప్రేమ

వారు సమాజం చేతుల్లో శాపగ్రస్థులైన పడతులు...పొట్టకూటి కోసం శరీరాన్ని తాకట్టు పెడుతున్న దయనీయ మూర్తులు... ఇతరుల దేహకాంక్షలో దహించుకుపోతున్న ఈ అంగడి బొమ్మలు ఇప్పుడు తమ బతుకులు తామే బాగు చేసుకొనేందుకు సిద్ధమయ్యారు. నాలుగక్షరాలు నేర్చుకొనేందుకు స్వయంగా ఓ స్కూలు పెట్టుకున్నారు. దేశంలోనే వినూత్నమైన ఈ విద్యాలయం ఇలాంటి బాధాసర్పదష్టుల పట్లనిర్లిప్తంగా ఉన్న సర్కారుకు చెంపపెట్టు.
 
సంగ్లి... పసుపు, చెరుకులకు ఆసియా ఖండంలోనే అతి పెద్ద మార్కెట్ ప్లేస్. మహారాష్ట్రలోని ఈ నగరం ఎప్పుడూ అమ్మకాలు, కొనుగోళ్లు గోలలోనే పగలు-రేయి గడుపుతుంది. అలాంటి రణగొణ ధ్వనుల మధ్య ఒక ఉదయం గణగణ మంటూ గంట కొట్టింది. బిలబిల మంటూ 30-40 మంది యువతులు వచ్చి ఆ ప్రాంగణంలో కూర్చున్నారు. కర్కశకాలపు వికృత చేష్టల తాలూకు అచ్చులు వారి ముఖం మీద ముద్రితమై ఉన్నాయి. ఇంతలో ఒక నడివయస్కురాలు వచ్చి అక్కడ నిలబడగానే అందరూ లేచి నిలబడ్డారు.

‘‘భగవంతుడా! శక్తినివ్వు...’’ అంటూ అందరూ సామూహికంగా ప్రార్థనా గీతం ఆలపించి కూర్చున్నారు. వారి మధ్య నుండి ఒక యువతి వచ్చి. బ్లాక్ బోర్డ్ మీద ఎబిసిడి అని రాస్తుండగా, అక్కడున్న కూర్చున్న వారందరూ ఆ అక్షరాలను దిద్దుతున్నారు. ఆ రోజు నేర్చుకోవాల్సిన అక్షరాల కోటా పూర్తవగానే అందరూ లేచి ఎవరి పనులకు వారు తిరిగి వెళ్లిపోయారు.
     
ఇందులో విశేషం ఏముంది అనుకుంటున్నారా? ఆ స్కూల్ ఉన్నది ఒక రెడ్ లైట్ ఏరియాలో. అక్కడ పాఠం నేర్చుకొనే యువతులే కాదు, నేర్పించే యువతులూ వేశ్యలే!
 
‘మేడమ్స్ స్కూల్ ఫర్ సెక్స్ వర్కర్స్’! మన దేశంలో వేశ్యల కోసం ఏర్పడ్డ ఏకైక విద్యాలయం ఇది. ఇక్కడ ఉన్నవారు వారి ఫ్యామిలీని పోషించుకునే మార్గం లేక ఈ వృత్తిని చేపట్టిన పెళ్లికాని అమ్మాయిలతో పాటు పిల్లల తల్లులు కూడా ఎంతోమంది ఉన్నారు. వారి పరిస్థితి మార్చేందుకు గాను ఒక అడుగు ముందుకు వేశారు - మేడమ్ బందావల్. వారి కోసం ఈ స్కూల్ ప్రారంభించారు.

 ఈ స్కూలులో ఇప్పుడు అక్షరాలు దిద్దుతున్న మందార వయసు 22 ఏళ్ళు. పదేళ్ళ వయసులో ఉండగా ఆమెను ఎవరో పట్నంలో ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి ఇక్కడ అమ్మేశారు. పొట్ట నింపుకోవడం కోసం ఈ వృత్తిలో కొనసాగుతున్న ఆమెను ‘నీకు ఏం కావాలి’ అని అడిగితే, ‘నాకు చదువుకోవాలని ఉంది’ అని సమాధానమిస్తుంది.

పూజది మరో కథ. దారిద్య్ర రేఖ దిగువన బతుకుతున్న పూజ వద్ద అవిటి కొడుకుకు వైద్యం చేయించడానికి డబ్బులు లేవు. చేయడానికి పని లేదు. ఇలాంటి పరిస్థితుల నడుమ పూజ ఇక్కడికి చేరుకోక తప్పలేదు. ఇలాంటి మందారలు, పూజలు అక్కడ ఎందరో! ఈ సమాజం నుండి వారికి జరిగే మేలు శూన్యమే. ఈ పరిస్థితుల్లో ఎవరి కోసమో ఎదురు చూసే కన్నా తమని తాము ఉద్ధరించుకోవడం మంచిదని భావించి ఇలా ఒక పాఠశాలను ఏర్పరచుకున్నారు.
 
‘‘ఎనిమిదేళ్ల క్రితం ఈ పాఠశాలను ప్రారంభించాను. ఈ సమాజం మమ్మల్ని పగటిపూట అంటరానివారిగా, రాత్రి మాత్రమే మనుషుల్లా చూస్తుంది. మాలో చాలా మందికి చదువంటే తెలీదు. కొంతమందికి చదువు అంటే ఇష్టం ఉన్నా కూడా చదివే స్థోమత లేదు. అందుకే కనీసం ప్రాథమిక విద్య అయినా అందించాలని ఈ స్కూల్ ప్రారంభించా. బతకడానికి కావాల్సినట్టు... అంటే... బస్సు, రైళ్ల పేర్లు చదవడం, బ్యాంక్‌లో డబ్బులు ఎలా వేసుకోవాలో, తీసుకోవాలో తెలిసేలా చదివిస్తాం’’ అని చెప్పారు మేడమ్ బందావల్.
 
‘‘ఈ స్కూల్‌ను ప్రారంభించినప్పుడు మమ్మల్ని చూసి ఎంతోమంది నవ్వారు. ఎద్దేవా చేశారు. 50-55 ఏళ్లు ఉన్నవారికి చదువు నేర్పించి ఏం చేస్తారు? అంతేకాదు మా వాళ్లు ఎవరైనా చుట్టుపక్కల వేరే ప్రాంతాలకు వెళ్తే.. ‘ఏయ్... ఇది స్వరూప్ థియేటర్ (రెడ్ లైట్ ఏరియాలోని చోటు)లో ఉండేది. ఇక్కడికెందుకు వచ్చింది?’ అని తిట్టి పంపించేస్తారు. ఇలా వేరే బతుకు బతుకుదాం అనుకున్నా సమాజం ఒప్పుకోవడం లేదు’’ అంటూ ఆవేదన చెందారు మేడమ్ బందావల్.

అందుకేనేమో వారిలో ఈ తెగింపు. ఐఏఎస్సో, ఐపీఎస్సో అవుదామని కాక, స్వీయ అభివృద్ధి కోసం విద్యాభ్యాసం చేస్తున్నారు. కానీ, విచారకరం ఏమిటంటే, తమ బాగు కోసం వేశ్యలు తమకు తాము చేపట్టిన ఈ పనికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం లేకపోవడం. గత ఎనిమిదేళ్లలో ఎన్ని దరఖాస్తులు పెట్టినా, కనీసం ఒక టీచర్‌ను కూడా వారికి ఇవ్వలేకపోయింది అక్కడి ప్రభుత్వం. స్వచ్ఛంద సంస్థల ఆదరణకు కూడా దూరమైన ఈ పాఠశాలకు కనీసం ఈ ఏడాదైనా పురోగతి దక్కుతుందో లేదో ఆ భగవంతుడికే తెలియాలి.
 - జాయ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement