ఎండ బాధలకు చర్మగీతం | They went out in the sun Must carry an umbrella | Sakshi
Sakshi News home page

ఎండ బాధలకు చర్మగీతం

Published Thu, Mar 28 2019 1:54 AM | Last Updated on Thu, Mar 28 2019 1:54 AM

They went out in the sun Must carry an umbrella - Sakshi

వేసవి తీవ్రత పెరుగుతూ పోతోంది. మనం ఎండలోకి వెళ్లగానే చర్మం మండుతున్నట్లు అనిపిస్తుంది. దాని తీవ్రతను మొదట తెలియజెప్పే జ్ఞానేంద్రియమూ చర్మమే. కాబట్టి ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు బయటకు వెళ్తే మొదట ప్రభావితమయ్యేది చర్మమే. చర్మానికి ఈ సీజన్‌లో వచ్చే సాధారణ సమస్యలు, వాటినుంచి కాపాడుకోవడం ఎలా అన్న అంశాలపై అవగాహన కలిగించడం కోసమే ఈ ప్రత్యేక కథనం. 

అసలు ఎండ అంటే ఏమిటో చూద్దాం...
తీక్షణమైన కాంతితో మనకు హాని ఎందుకు కలుగుతుందో తెలుసుకునే ముందు అసలు కాంతి అంటే ఏమిటో చూద్దాం. మన భూమికి చేరే రేడియేషన్‌లో మనం చూడగలిగేదీ చూడటానికి ఉపయోగపడేది చాలా చాలా తక్కువ. సూర్యుడి నుంచి వచ్చే కాంతి అంతా రేడియేషన్‌ అంతా తరంగాల రూపంలో మనకు చేరుతుంది. ఇందులో రేడియో తరంగాలూ, ఎక్స్‌–కిరణాలూ, మైక్రోవేవ్‌ తరంగాలూ ఇలా ఎన్నెన్నో ఉంటాయి. దీన్నింతా ఎలక్ట్రోమ్యాగ్నెటిక్‌ రేడియేషన్‌ అంటారు. అయితే ఇందులో వేర్వేరు కిరణాలకు వేర్వేరు వేవ్‌లెంగ్త్‌ ఉంటుంది. అంటే కాంతి కిరణంలోని పక్కపక్కనే ఉండే అలలోని... ఒక పీక్‌కూ, మరో పీక్‌కూ మధ్యనున్న దూరాన్ని  వేవ్‌లెంగ్త్‌గా చెప్పుకుంటే మన కళ్లకు కనిపించే కాంతి చాలా పరిమితమైన వేవ్‌లెంగ్త్‌తోనే ఉంటుంది. మరీ నిర్దిష్టంగా చెప్పాలంటే 400 – 700 నానో మీటర్ల రేంజ్‌లో ఉండే దాన్ని మాత్రమే మనం కాంతిగా పేర్కొంటాం. అంతకంటే తక్కువ వేవ్‌లెంగ్త్‌తో ఉండే కిరణాలను అల్ట్రా వయొలెట్‌ కిరణాలుగానూ, అంతకంటే ఎక్కువ వేవ్‌లెంగ్త్‌తో ఉండేవాటిని ఇన్‌ఫ్రా రెడ్‌ కిరణాలుగానూ చెబుతుంటారు. ఈ అన్ని వేవ్‌లెంగ్త్‌లతో కూడిన రేడియేషన్‌ కాంతి తీక్షణంగా, ప్రకాశవంతంగా కాయడమే ఎండ.


మధ్యాన్నం 2 నుంచి 3 గంటల సమయంలో వెలువడే కిరణాలు చాలా హానికరం. సూర్యుడి నుంచి మన కంటి వరకు చేరే రేడియేషన్‌లోని చాలా హానికారక కిరణాలను ఓజోన్‌పొర వడపోస్తుంది. కేవలం 3 శాతం అల్ట్రా వయొలెట్‌ కిరణాలు మాత్రమే భూమి ఉపరితలం వరకు చేరతాయి. మానవులపై అల్ట్రావయొలెట్‌ కిరణాల ప్రభావం ఇలా... మామూలు కాంతిని మినహాయిస్తే... మనల్ని చేరే అల్ట్రా వయొలెట్‌ కిరణాల వల్ల  చర్మంపై దుష్ప్రభావాలు ఉంటాయి. ఇక యూవీ–సి వల్ల కలిగే అనర్థాలు మాత్రం చాలా తీవ్రంగా ఉంటాయి. అత్యంత ప్రమాదకరమైన యూవీ–సీ అల్ట్రా వయొలెట్‌ కిరణాలు చాలా చాలా ప్రమాదకరమైనవి.  అవి  కొన్నిసార్లు ప్రాణాలకు సైతం ముప్పు కలిగించవచ్చు. చర్మంపై ప్రసరించినప్పుడు స్కిన్‌–క్యాన్సర్‌గానూ పరిణమించవచ్చు. అదృష్టవశాత్తు యూవీ–సీ రకానికి చెందిన కిరణాలను ఓజోన్‌ పొర అడ్డుకొని సకల జీవరాశినీ కాపాడుతుంటుంది. మనం ముందుగా చెప్పుకున్నట్లు 400 – 700 న్యానోమీటర్ల మేరకు ఉన్నదే కాంతి. అంతకు మించిన వేవ్‌లెంత్‌తోగానీ, అంతకు తగ్గిన వేవ్‌లెంత్‌తో గాని అంటే అల్ట్రావయొలెట్, ఇన్‌ఫ్రారెడ్‌ కిరణాలతో మన చర్మానికి ఎంతో ప్రమాదం అని తెలుసుకోవాలి. 

మన చర్మం తీవ్రమైన ఎండలోని తీక్షణ కాంతి కిరణాలను కొంతవరకు తట్టుకోలేదు. మనం సాధారణంగా తట్టుకోగల కాంతికిరణాలను మించిపోయి ఆ వేవ్‌లెంత్‌ ఫ్రీక్వెన్సీ 308 నానోమీటర్లు ఉన్నప్పుడు మన చర్మం ప్రభావితమవుతుంది. అయితే ఇక్కడ తట్టుకునే ప్రభావం కూడా వేర్వేరు వ్యక్తుల్లో వేర్వేరుగా ఉంటుంది. ఉదాహరణకు నల్లటిచర్మం (డార్క్‌ స్కిన్‌) ఉన్నవారు ఎండ తీవ్రత ఒకింత తీక్షణంగా ఉన్నా తట్టుకోగలరు. కానీ చర్మం రంగు తగ్గుతున్నకొద్దీ అంటే చర్మం ఫెయిర్‌గా అవుతున్న కొద్దీ ఎండ తీవ్రతను తట్టుకునే శక్తి తగ్గుతుంది. అందుకే తెల్లటి చర్మం (ఫెయిర్‌ స్కిన్‌) ఉన్నవారు ఎండ తీవ్రతకు చాలా త్వరగా ప్రభావితమవుతారు. ఎండ తీవ్రత ప్రభావం రెండు రకాలుగా ఉంటుంది. మొదట తీవ్రమైన ఎండకు ఎక్స్‌పోజ్‌ అయినప్పుడు మన చర్మం నల్లబారుతుంది. తొలుత ఇది తాత్కాలికం. ఎండకు వెళ్లడం తగ్గిస్తే ఇలా నల్లబారడమూ తగ్గుతుంది. ఇలా చర్మం నల్లబారడాన్ని పిగ్మెంటేషన్‌ అంటారు. 

తొలి దుష్ప్రభావం సన్‌బర్న్స్‌ రూపంలో... 
వైద్యపరిభాషలో ఎరిథిమా అని పిలిచే ఈ సమస్యను సాధారణ పరిభాషలో సన్‌బర్న్స్‌గా చెబుతారు. సాధారణంగా సూర్యుడి తీక్షణత ప్రభావం వల్ల ఎండలోకి వెళ్లగానే మొదట చర్మం ఎర్రగా మారుతుంది. ఆ తర్వాత మాడినట్లుగా నల్లబడుతుంది. కొన్ని సందర్భాల్లో చర్మంపైన ఎర్రగా పొక్కుల (బ్లిస్టర్స్‌) రూపంలోనూ ఇది వ్యక్తం కావచ్చు. చర్మం రంగును బట్టి కూడా దీని తీవ్రత తగ్గడం, పెరగడం ఉంటుంది. ఫెయిర్‌ చర్మం వారిలో సన్‌బర్న్‌ తీవ్రత ఎక్కువగానూ, నల్లటి చర్మం వారిలో తక్కువగానూ ఉంటుంది. బ్లిస్టర్స్‌ ఏర్పడితే దీని తీవ్రత ఎక్కువగా ఉందనడానికి సూచన. కొందరిలో భౌతిక లక్షణాలైన జ్వరం, వికారం, వాంతులు, నిస్సత్తువ కూడా కనిపించవచ్చు. కొందరిలో రక్తపోటు తగ్గడం, స్పృహతప్పడం కూడా జరగవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో రోగిని హాస్పిటల్‌కు తరలించాలి. 

చికిత్స: సన్‌బర్న్‌కు గురై చర్మం ఎర్రబారిన వారిని తక్షణం నీడకు తీసుకెళ్లాలి. కేవలం 12 – 24 గంటలు చల్లటిప్రాంతంలో ఉన్నా లేదా ఎయిర్‌కండిషన్‌ గదిలో ఉన్నా వారి లక్షణాలు వాటంతట అవే మాయమవుతాయి. చర్మంపై చల్లటి నీటిలో తడిపిన టవల్‌తో తుడవటం లాంటివీ చేయవచ్చు. అయితే సమస్య తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు డర్మటాలజిస్టుల సూచన మేరకు నాన్‌స్టెరాయిడల్‌ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్‌ (ఎన్‌ఎస్‌ఏఐడీస్‌), చర్మపు మంట తగ్గడానికి హైడ్రోకార్టికోసోన్‌ క్రీములు వాడాల్సిరావచ్చు. పొక్కులను పగలగొట్టకూడదు. మాయిశ్చరైజింగ్‌ క్రీములతో ఈ సమస్య తగ్గుతుంది. 

పిగ్మెంటేషన్‌
ఎండలో చర్మం రంగు నల్లబారడాన్ని పిగ్మెంటేషనగా చెప్పవచ్చు. యూవీ–ఏ, యూవీ... ఈ రెండింటి వల్ల చర్మంలోని మెలనిన్‌ కణాల్లో ఫొటోపిగ్మెంటేషన్‌ చర్య జరగడంవల్ల చర్మం రంగు నల్లగా మారుతుంది. అయితే దీని తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు అంటే... ఇమ్మిడియట్‌ పిగ్మెంటేషన్‌ డార్క్‌నెస్‌ (ఐపీడీ)లో నీడపట్టుకు వచ్చినప్పుడు కేవలం రెండు గంటల్లో దీని ప్రభావం తగ్గుతుంది. కానీ అదేపనిగా ఎండకు తిరిగే వారిలో తాత్కాలిక ఐపీడీ స్థానంలో పెరిసిస్టెంట్‌ పిగ్మెంట్‌ డార్కెనింగ్‌ (పీపీడీ) అనే కండిషన్‌ ఏర్పడుతుంది. ఇలా ఏర్పడ్డప్పుడు దీని ప్రభావం కొద్ది రోజులు మొదలుకొని, కొన్ని వారాల వరకు ఉండవచ్చు. నీడపట్టున ఉండటమే దీనికి నివారణ. పెరిసిస్టెంట్‌ పిగ్మెంట్‌ డార్కెనింగ్‌ (పీపీడీ) ఏర్పడినప్పుడు, ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోకుండా ఆ తర్వాత కూడా ఇంకా అదేపనిగా ఎండలో తిరగడం మంచిది కాదు. 

చెమటకాయలు (మిలీరియా)
వైద్యపరిభాషలో మిలీరియా అని పిలిచే ఈ పరిణామంలో చర్మంపై ఉండే స్వేదగ్రంథుల్లో అడ్డంకి ఏర్పడి అవి ఉబ్బినట్లుగా అవుతాయి. బాగా చెమట పట్టినప్పుడు అది ఆవిరైపోయే పరిస్థితి లేనప్పుడు స్వేదగ్రంధుల చివర్లో చెక్కరతో కూడిన పదార్థం (పాలీశాకరైడ్‌ సబ్‌స్టాన్స్‌) రూపొంది అది చర్మగ్రంధి చివర అడ్డుగా నిలుస్తుంది. దాంతో లోపల ఉన్న స్వేదం బయటికి రాకుండా ఉండిపోయి, స్వేదగ్రంథిలో ఒత్తిడి పెంచుతుంది. ఫలితంగా స్వేదం పక్క కణజాలాల్లోకి స్రవించి చెమటకాయలు అదేపనిగా విస్తరించినట్లుగా అవుతాయి. అయితే పడకకే పరిమితమైన (బెడ్‌ రిడెన్‌) రోగుల్లో చెమట విపరీతంగా పట్టడం, వారు ఒళ్లు కదిలించలేకపోవడంతో ఇవి ఎక్కువగా వస్తుంటాయి.

దీనిలోనూ మిలీరియా క్రిస్టలైన్‌ (సుడామినా), మిలీరియా రుబ్రా (ప్రిక్లి హీట్‌) ఉంటాయి. మిలీరియా క్రిస్టలైన్‌లో వీటి తీవ్రత అంతగా లేనప్పుడు చర్మంపై మంట ఉండదు. కానీ మిలీరియా రుబ్రాలో చెమటకాయలు ఎర్రగా చేతికి తగులుతూ ముళ్లతో గుచ్చిన ఫీలింగ్‌తో మంటనూ, తిమ్మిర్ల వంటి భావనను కలిగిస్తాయి. అవి మెడ, ఛాతీ, వీపు భాగంలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇక మిలీరియా పుస్టులోజా అనే కండిషన్‌ మరింత తీవ్రమైనది. ఇందులో స్వేదగ్రంధిలోని స్వేదనాళానికి అడ్డంకి ఏర్పడటంతో పాటు అది దెబ్బతినడం కూడా జరగవచ్చు. ఇవి చర్మంలోని ఛాతీ, వీపు ప్రాంతాలలో పాటు ప్రైవేట్‌ పార్ట్స్‌లో కూడా విస్తరించవచ్చు. ఇది కొన్ని వారాల పాటు ఉంటుంది. 

చికిత్స: చల్లటి ప్రదేశాల్లో ఉండటం, క్రమం తప్పకుండా స్నానం చేయడం, ఒంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం వంటి చర్యలతో దీన్ని నివారించవచ్చు. పిల్లలకు లేదా పెద్దలకు వాడే డస్టింగ్‌ పౌడర్, ప్రిక్లీ హీట్‌ పౌడర్లతోనూ ఉపశమనం ఉంటుంది. 

ఎండ నుంచి చర్మానికి రక్షణ ఇలా...
►ఈ సీజన్‌లో ప్రతి రోజు రెండుపూటలా గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయడం మంచిది. 

►ఎండలో బయటకు వెళ్లేవారు తప్పనిసరిగా గొడుగు తీసుకెళ్లాలి. ఈ సీజన్‌లో మనం వేసుకునే దుస్తులు లైట్‌ కలర్‌లో ఉండాలి. గాలి ఆడే కాటన్‌ దుస్తులు, ఎండ తగలనివ్వని లాంగ్‌స్లీవ్స్‌ దుస్తులు వాడటం మేలు. 

►యాంటీ ట్యానింగ్‌ సన్‌స్క్రీన్స్, ఇన్‌ఫ్రారెడ్‌ యూవీ – ఏ అండ్‌ బీ రేడియేషన్‌ నుంచి రక్షణ ఇచ్చే సన్‌స్క్రీన్స్‌ వాడుకోవచ్చు. ఈ వేసవిలో ఎస్‌పీఎఫ్‌ ఎక్కువగా ఉన్న సన్‌స్క్రీన్‌ లోషన్‌లను డాక్టర్‌ చెప్పిన రీతిలో పద్ధతిగా వాడాలి. తమ చర్మానికి అనుగుణంగా వాడుకోవాల్సిన సన్‌స్క్రీన్‌ను డాక్టర్లు సూచిస్తారు. ఈ క్రీములను బయటకు వెళ్లడానికి అరగంట ముందు రాసుకోవడం వల్ల ఎండలోని హానికరమైన కిరణాలనుంచి అవి చర్మాన్ని ప్రభావపూర్వకంగా రక్షించగలుగుతాయి. అయితే ప్రతి మూడు గంటలకు ఒకసారి ఈ క్రీములు వాడాలి.  

►ఇక రాత్రి వేళల్లో డాక్టర్‌ సలహా మేరకు డీ–పిగ్మెంటేషన్‌ క్రీమ్స్‌ వాడటం వల్ల చర్మం నల్లబడకుండా ఉంటుంది. ఇక ఈత వంటి ఆటల్లో పాల్గొనే వారు వాటర్‌ప్రూట్‌ సన్‌స్క్రీన్స్‌ వాడాల్సి ఉంటుంది. 

►కళ్ల సంరక్షణ కోసం నాణ్యమైన అద్దాలు వాడటం మేలు. అలాగే తలకు టోపీని వాడవచ్చు. సూర్యకిరణాలు నేరుగా ముఖానికి తాకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కళ్లజోళ్లలో అమర్చుకునే స్వెట్‌ ప్యాడ్స్‌ క్రమం తప్పకుండా మార్చుకునేలా జాగ్రత్త తీసుకోవాలి. 

►చర్మం తన సాగేగుణాన్ని కోల్పోకుండా ఉండాలంటే ఎక్కువగా నీళ్లు, ద్రవాహారాలు తీసుకోవాలి. ప్రతిరోజూ కనీసం 12 గ్లాసులకు తగ్గకుండా నీళ్లు తాగాలి. ఈ సీజన్‌లో నీళ్లతో పాటు మజ్జిగ (బటర్‌మిల్క్‌), కొబ్బరినీళ్లు, పండ్ల రసాల వంటి ద్రవాహారాలు ఎక్కువగా తీసుకోవాలి. కోలా డ్రింక్స్‌ వంటివి చర్మానికి హాని చేస్తాయి. వాటికి దూరంగా ఉండాలి. 

►తలకు రంగు వేసుకునే వారు సీజన్‌ మొదలు కావడానికి ముందే వేసుకోవడం మంచిది. లేదా చల్లటి వేళల్లో వేసుకోవాలి. 

►స్విమ్మింగ్‌ చేసేవారు వాటర్‌ రెసిస్టెంట్‌ సన్‌స్క్రీన్‌ వాడాలి. 

►వింటర్‌లో కోల్డ్‌ క్రీమ్స్‌ రాసుకున్నట్లే.... సమ్మర్‌లో మాయిశ్చరైజింగ్‌ క్రీమ్‌లు అవసరమవుతాయి. అవి చర్మంపై ఉండే తేమను కాపాడతాయి. వింటర్‌లో అయితే ఆయిల్‌ ఇన్‌ వాటర్‌ టైపు క్రీములు వాడతారు. సమ్మర్‌లో వాటర్‌ ఇన్‌ ఆయిల్‌ టైప్‌ ఆఫ్‌ క్రీములు వాడాలి. ఎక్కువగా వాటర్‌ కంటెంట్‌ ఉండే క్రీములు వాడాలి. క్రీమ్‌ కంటే లోషన్‌ రూపంలో ఉండేవి వాడితే మంచిది. 

►ఇక డియోడరెంట్స్‌ వాడేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణంగా డియోడరెంట్స్‌లో బర్‌గ్యాప్టెన్‌ అనే సోరోలెన్స్‌ పదార్థం ఉంటుంది. దాంతోపాటు దీనికి మంచి సువాసన (ఫ్రాగ్రెన్స్‌) రావడానికి కొన్ని రసాయనాలు వాడతారు. ఎండాకాలంలో చెమటలు ఎక్కువగా పట్టడం వల్ల  ఇవన్నీ చర్మంపై ఎక్కువగా ప్రభావం చూపుతాయి. కాబట్టి నేరుగా డియోడరెంట్స్‌ చర్మంపై రాసుకోవడం కంటే ఫ్రాగ్రెన్స్‌ను కోరుకునేవారు వాటిని బట్టలపై (స్ప్రే చేసుకునేలా) వేసుకుంటే మంచిది. అందునా బట్టలు ధరించకముందే వాటిపై స్ప్రే చేసి... ఒక అరగంట తర్వాత వాటిని ధరించాలి. అలా ఉపయోగిస్తే చర్మానికి కలిగే హానిని తగ్గించినట్లు అవుతుంది. 

►ఈ సీజన్‌లో వెంట్రుకలు, జుట్టు పొడిబారిపోతాయి. కాబట్టి తలకు నూనె రాయడం మేలు చేస్తుంది. అయితే కొంతమంది తల చల్లబడటానికి మెంథాల్‌ కలిసిన ఆయిల్‌ను వాడతారు. ఇది వారి వ్యక్తిగత ఇష్టంపై ఆధారపడి ఉంటుంది.  

►సాధారణంగా ఈ సీజన్‌లో బిగుతుగా ఉన్న వస్తువులు ధరించడం వల్ల చెమట పట్టడంతో వచ్చే ఫంగల్‌ ఇన్ఫెక్షన్స్‌ లేదా మెటల్స్‌ వల్ల కలిగే అలర్జిక్‌ రియాక్షన్స్‌ వల్ల దురద వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మరికొందరిలో ఉంగరం ఉన్న చోట సబ్బు నురగ ఇరుక్కుపోయి... అక్కడ డిటర్జెంట్‌ వల్ల అలర్జీ రావచ్చు. ఇలాంటి సందర్భాల్లో తమకు సరిపడని... అంటే అలర్జీ కలిగించే వాటిని గుర్తించి, అలాంటి వాటిని ధరించకుండా దూరంగా ఉంచాలి. అలాగే మన ఆభరణాలు మరీ బిగుతుగా లేకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. 

యూవీతో దీర్ఘకాలిక పరిణామాలు 
ఫొటో ఏజింగ్‌: అదేపనిగా ఎండలో తిరగడం వల్ల కొన్ని అవాంఛనీయ దీర్ఘకాలిక పరిణామాలు ఏర్పడతాయి. అందులో ముఖ్యమైనది ఫొటోఏజింగ్‌. ఫొటోఏజింగ్‌ వల్ల చర్మంపై అవాంఛితమైన ముడతలు, వెడల్పుగా ప్యాచ్‌ వచ్చిన రీతిలో ఏర్పడే మచ్చలు (సోలార్‌ లెంటిజిన్స్‌), చర్మం తన సాగే గుణాన్ని కోల్పోవడం, చర్మంపైన రక్తనాళాలు దారపు పోచల్లా కనిపించడం (టెలాంజిక్టాసియాస్‌ – అవే తర్వాత సాలెగూళ్లలా అల్లుకుని కనిపిస్తాయి. వాటినే స్పైడర్‌ వెయిన్స్‌ అంటారు), చర్మం ఎండిపోయినట్టుగా అనిపించడం వంటి పరిణామాలు ఏర్పడతాయి. ఆ తర్వాత చర్మం చాలా ముదురుగా రఫ్‌గా కనిపిస్తుంది. అందుకే ఈ దశలోనైనా అదేపనిగా ఎండకు వెళ్లకుండా చర్మాన్ని కాపాడుకోవాలి. తద్వారా ఫొటో ఏజింగ్‌ను నివారించవచ్చు. యూవీకి ఎక్స్‌పోజ్‌ కావడం దీర్ఘకాలం కొనసాగితే మరిన్ని అనర్థాలు కూడా ఏర్పడే అకాశాలు ఉన్నాయి.

హాని కలిగేది అల్ట్రా వయొలెట్, ఇన్‌ఫ్రా రెడ్‌ కిరణాలతోనే... 
మనకు చేరే కాంతితో పాటు మన వాతావరణంలో ప్రసరిస్తూ, ప్రవహిస్తూ ఉండే అల్ట్రా వయొలెట్, ఇన్‌ఫ్రా రెడ్‌ కిరణాలతో మన చర్మానికీ, కంటికి కూడా హాని కలిగే  ప్రమాదం ఉంది. పైగా వేసవిలో ఈ కిరణాల తీవ్రత మరింత ఎక్కువగా ఉండటం వల్ల అమితమైన శక్తితో ఉండే ఈ కిరణాలు కంటికి హాని చేసే అవకాశాలు ఎక్కువ. 

అల్ట్రా వయొలెట్‌లో మూడు రకాలు 
కంటికి హాని చేయగల అల్ట్రా వయొలెట్‌ కిరణాల 
(యూవీ రేస్‌)ను మూడగా విభజించవచ్చు. అవి... 
యూవీ – ఏ 
(వీటి ఫ్రీక్వెన్సీ 320 – 400 న్యానో మీటర్లు)...
తక్కువ శక్తిమంతమైనవి. 
యూవీ – బీ 
(వీటి ఫ్రీక్వెన్సీ 280 – 320 న్యానో మీటర్లు)...
ప్రమాదకరమైనవి. 
యూవీ – సీ 
(వీటి ఫ్రీక్వెన్సీ 200 – 280 న్యానో మీటర్లు)...
అత్యంత ప్రమాదకరం. 
మళ్లీ యూవీ–ఏ లో రెండు ఉప–రకాలు ఉంటాయి. అవి.. 340 – 400 న్యానో మీటర్ల వేవ్‌లెంత్‌తో ఉన్నవి యూవీ–ఏ1 అంటారు. 320 – 340 యూవీ–ఏ2 అంటారు.  

ఇన్‌ఫ్రా రెడ్‌ కిరాణాలూ మూడు రకాలు
ఇన్‌ఫ్రారెడ్‌ – ఏ
(వీటి ఫ్రీక్వెన్సీ 700 – 1400 
న్యానో మీటర్లు) 
ఇన్‌ఫ్రారెడ్‌ – బీ 
(వీటి ఫ్రీక్వెన్సీ 1400 – 3000 న్యానో మీటర్లు)
 ఇన్‌ఫ్రారెడ్‌ – సీ 
(వీటి ఫ్రీక్వెన్సీ 3000 న్యానో మీ.  – 1 మిల్లీమీటర్లు)
ఇక అన్ని రకాల ఇన్‌ఫ్రారెడ్‌ కిరణాలూ చర్మానికి చాలా హానికరమైనవి. 

చర్మంపై అల్ట్రావయొలెట్‌ కిరణాల ప్రభావం ఇలా...
యూవీ కిరణాలతో తాత్కాలిక ప్రభావాలు   
►ఎరిథిమా (సన్‌బర్న్స్‌)  
►పిగ్మెంటేషన్‌ (తక్షణం కనిపించేది ఇమ్మీడియట్‌ డార్క్‌పిగ్మెంటేషన్‌ (ఐపీడీ) / అదేపనిగా చాలాకాలంఎక్స్‌పోజ్‌ అయినప్పుడు కనిపించేది పెరిసిస్టెంట్‌ పిగ్మెంట్‌ డార్కెనింగ్‌ (పీపీడీ) 

యూవీలతో దీర్ఘకాలిక ప్రభావాలు
►ఫొటో ఏజింగ్‌ 
►ఇమ్యూనోసప్రెషన్‌ 
►ఎగ్సాసెర్బేషన్‌ ఆఫ్‌ఫోటోడెర్మటోసిస్‌

డాక్టర్‌ స్వప్నప్రియ
డర్మటాలజిస్ట్, కేర్‌ హాస్పిటల్స్, 
బంజారాహిల్స్, హైదరాబాద్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement