Pigmentation
-
పిగ్మెంటేషన్ లేదా మంగు మచ్చలు.. ఇంట్లోనే ఇలా తగ్గించుకోవచ్చు!
వేసవికాలంలో ప్రధానంగా వేధించే సమస్య ముఖం మీద నల్లని లేదా గోధుమ రంగు మచ్చలు. వయసు పెరిగే కొద్దీ ఇవి మరింత బాధిస్తాయి. ఈ మచ్చలను మంగు మచ్చలు లేదా పిగ్మెంటేషన్ అంటారు. నుదురికి ఇరువైపులా, బుగ్గలు, ముక్కుకు ఇరువైపులా అందహీనంగా కనిపిస్తాయి. వీటి నివారణకు లేజర్ చికిత్సలు, మార్కెట్లో దొరికే క్రీమ్‌లకంటే ఇంట్లోనే చేసుకోగలిగిన పరిష్కారాలు మంచి ఫలితాన్నిస్తాయి. అసలు మంగు మచ్చలు ఎందుకు వస్తాయి? వయస్సుతోపాటు చర్మంపై పడే ప్రతికూలతల వల్ల ఈ మచ్చలు ఎక్కువగా వస్తుంటాయి. హరోన్ల సమతుల్యత లోపం వల్ల, మరికొందరికి వంశపారంపర్యంగా కూడా ఈ మచ్చలు రావచ్చు. అయితే వీటిని శారీరకమైన బాధలేవీ ఉండవు. శరీరంలో మెలనిన్ ఎక్కువగా తయారైతే.. ‘హైపర్ పిగ్మెంటేషన్’కు దారి తీస్తుంది. సూర్య కిరణాల్లోని అతినీలలోహిత కిరణాలు చర్మానికి హాని చేసి, ఆ సమయంలో మెలనిన్ ఎక్కువై మంగు మచ్చలు తయారవుతాయి. జీవక్రియ సమస్యలు, పోషకాహార లోపం, అధిక ఉష్ణోగ్రత, కాలుష్యం,అనుధార్మికత, ఔషధాల వల్ల కూడా ఇవి ఏర్పడతాయి. బంగాళ దుంప: బంగాళ దుంపల తురుమును పలచని గుడ్డలో వేసి రసం తీసుకోవాలి. ఒక కాటన్ ప్యాడ్‌ను గానీ, దూదిని గానీ ఈ రసంలో ముంచి మచ్చలపై పూయండి. 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజు విడిచి రోజు చేస్తుంటే తప్పకుండా మచ్చలు తొలగిపోతాయి. టమోటా: గింజలు తొలగించిన టమోటా గుజ్జుకు, కొద్దిగా తేనె కలిపి మచ్చలకు అప్లయ్ చేయాలి. 20 నిమిషాలు ఉంచి ఆరిన తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి మార్పు మీకే తెలుస్తుంది. టమోటా, ముల్తానా మట్టి: టమోటా రసంలో కాస్త గంధం పొడిని కలపండి. ఆ మిశ్రమంలో ముల్తాని మట్టిని కలిపి పేస్టులా చేయండి. అనంతరం ఆ పేస్టును ముఖంపై ఉన్న మచ్చలపై రాయండి. 20 నుంచి 30 నిమిషాల తర్వాత ముఖాన్ని కడగాలి. వారంలో రెండుస్లారు ఇలా చేస్తే మంచు మచ్చలు క్రమంగా తగ్గి పోతాయి. కలబంద: సహజసిద్ధమైన కలబంద గుజ్జు చాలా రకాల చర్మ సమస్యలకు పరిష్కారం. క్రమం తప్పకుండా కలబంద గుజ్జున రాస్తే మంగు మచ్చలు మాటుమాయం. నిమ్మ, రోజ్‌వాటర్: ఒక గిన్నెలో రోజ్ వాటర్, నిమ్మరసం, కీరదోస రసం, తేనె వేసి బాగా కలపండి. దీన్ని ముఖానికి బాగా పట్టించి, 15, 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. రోజ్ వాటర్ లేని పక్షంలో నిమ్మరసాన్ని వాడుకోవచ్చు. పసుపు: పసుపు, గేదె పాలు, ఎర్ర చందనం కలిపి ముఖానికి రాసుకుంటే సత్ఫలితాలు కనిపిస్తాయి. తాజా గేదె నెయ్యి మంగు మచ్చలపై రాస్తే ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతారు. -
ఈ డివైస్‌తో శాశ్వతంగా మొటిమలను పోగొట్టుకోవచ్చు..
సాధారణంగా తీసుకుంటున్న ఆహారంతోనో, వయసులో వచ్చే మార్పులతోనో, నెలసరి సమయాల్లోనో.. మొటిమలు రావడం.. అవి పూర్తిగా తగ్గకుండా నల్లటి మచ్చలుగా మిగిలిపోవడం, ఎర్రటి దద్దుర్లు ఏర్పడటం వంటివి చాలామందిలో కనిపించే సమస్యలే. వాటికి చెక్ పెడుతుంది చిత్రంలోని మినీ మెషిన్.ఈ ఎల్ఈడీ మెడికల్ డివైస్ (యాక్నే లైట్ షాట్).. వాడుతున్న తొలి రోజు నుంచే మెరుగైన ఫలితాలనివ్వడం మొదలుపెడుతుంది. అంటే ట్రీట్మెంట్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందన్న మాట. ఇది చర్మం మీద ఏర్పడే మొటిమల్ని, మచ్చల్ని, గాయాలను శాశ్వతంగా దూరం చేస్తుంది. చర్మాన్ని మృదువుగా మార్చేస్తుంది. దీన్ని వినియోగించే సమయంలో చేతులతో అవసరం ఉండదు. పైగా ఈ డివైస్‌ని సులభంగా ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. టార్గెటెడ్ డెలివరీ సిస్టమ్‌తో రూపొందిన ఈ మినీ మెషిన్.. మొటిమలు లేదా మచ్చలున్న చోట లైట్ థెరపీతో చర్మాన్ని మెరిపిస్తుంది. ఇది చాలా సురక్షితమైనది. ప్రభావవంతమైనది. వేగవంతమైనది కూడా. ఈ చికిత్సతో 90 శాతం మచ్చలు, మొటిమలు తొలగిపోతాయి. ఈ డివైస్‌ని వినియోగించి.. ముఖం మీదున్న రంధ్రాలను 80 శాతం వరకూ తగ్గించుకోవచ్చు. గాయాలను వాటి తాలుకు మచ్చలను 75 శాతం వరకూ నయం చేసుకోవచ్చు. దీన్ని మగవారు కూడా ఉపయోగించుకోవచ్చు. అయితే కంటి పరిసరాల్లో వినియోగిస్తున్నప్పుడు.. చిత్రంలోని ప్రత్యేకమైన కళ్లజోడును పెట్టుకోవాలి. బాగుంది కదూ! -
చర్మాన్ని బిగుతుగా చేసి.. ముఖాన్ని మెరిపిస్తుంది! మెషీన్ ధర?
అందాన్ని సంరక్షించుకోవాలంటే.. శ్రద్ధ ఎంత అవసరమో.. పోగొట్టుకున్న అందాన్ని తిరిగి రప్పించుకోవాలంటే చికిత్స కూడా అంతే అసవరం. ఈ హైడ్రో డెర్మాబ్రేషన్ వాటర్ డెర్మాబ్రేషన్ డీప్ క్లెన్సింగ్ ఫేషియల్ మెషిన్ .. అదిరిపోయే ట్రీట్మెంట్ని అందిస్తోంది.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా! డీప్ క్లీనింగ్, బ్లాక్ హెడ్ క్లియర్.. వంటి చాలారకాల చికిత్సలను ఇవ్వడంలో ఇది దిట్ట. ఆక్సిజన్ స్ప్రే గన్, కోల్డ్ హేమర్.. వంటి అటాచ్మెంట్ హెడ్స్‌ని కలిగిన ఈ మెషిన్ .. వయసుతో వచ్చే ముడతలను, పిగ్మెంటేషన్ మచ్చలను పూర్తిగా తొలగిస్తుంది. చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది. ముఖాన్ని మెరిపిస్తుంది. ఈ డివైజ్‌లో లైట్ థెరపీ మాస్క్ (చిత్రంలో గమనించొచ్చు) ఉంటుంది. ఇది మొత్తంగా 7 రంగుల్లో పని చేస్తూ.. ఏడు వేరువేరు ప్రయోజనాలను ఇస్తుంది. ఈ మాస్క్ (ఇలాంటి మాస్స్స్ను విడిగా మన బ్యూటీజర్లో చూశాం)ని ముఖానికి అమర్చుకుని.. సురక్షితంగా ట్రీట్మెంట్ పొందొచ్చు. మెషిన్ వెనుక వైపు రెండు వాటర్ ట్యాంక్స్ ఉంటాయి. వాటిలో నీళ్లు నింపుకుని.. ఆప్షన్స్‌ను బట్టి.. దీన్ని వినియోగించుకోవచ్చు. అలాగే మెషిన్ ముందువైపే డిస్ప్లే కనిపిస్తూ ఉంటుంది. ఇది చర్మంపైన పేరుకున్న మురికిని, చర్మం లోతుల్లోకి చేరుకున్న మృతకణాలను తొలగించి యవ్వనాన్ని తిరిగి తెస్తుంది. దీని ధర సుమారుగా 279 డాలర్లు. అంటే 23,068 రూపాయలు. ఇలాంటి మోడల్స్.. అదనపు సౌకర్యాలతో ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. అయితే పలు రివ్యూస్‌ని ఫాలో అయ్యి.. కొనుగోలు చేసుకోవడం మంచిది. చదవండి: Anti Aging Foods: ప్రతిరోజూ బొప్పాయి పండు, దానిమ్మ తింటున్నారా? అయితే.. -
Beauty Tips: పిగ్మెంటేషన్ సమస్యా? బంగాళా దుంప, నిమ్మరసం.. ఇంకా
Tips To Get Rid Of Pigmentation: రకరకాల కారణాల వల్ల ముఖంపై పిగ్మెంటేషన్ వస్తుంటుంది చాలామందికి. దానికి క్రీములు, ఇతర మందులు వాడే బదులు ఇలా చేసి చూస్తే సరి.. పిగ్మెంటేషన్ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. బంగాళా దుంపతో.. ►బంగాళా దుంప, నిమ్మరసం.. ఒక బంగాళా దుంపని తురిమి అందులో పావు కప్పు నిమ్మరసం కలపండి. ►పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉన్న చోట ఈ మాస్క్‌ని వేసుకుని అరగంట ఆగి చల్లని నీటితో కడిగేయాలి. ►ఇలా రోజుకి రెండుసార్లు చేయవచ్చు. నిమ్మరసం, తేనె.. ►రెండు టేబుల్ స్పూన్ల తేనెలో రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం కలిపి అవసరమున్న చోట ఈ మిశ్రమాన్ని పూతలా వేసుకోవాలి. ►తర్వాత గోరు వెచ్చని నీటిలో మెత్తటి బట్ట ముంచి పిండేయాలి. ►ఆ బట్టని ఈ మిశ్రమం అప్లై చేసిన చోట కవర్ చేసినట్లుగా వేయండి. ►ఇరవైనిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయండి. ►ఇలా వారానికి ఒకసారి చేయాలి. యాపిల్ సిడర్ వెనిగర్.. ►అర కప్పు యాపిల్ సిడార్ వెనిగర్ లో అర కప్పు నీరు కలపండి. ►పిగ్మెంటేషన్ ఉన్న చోట ఈ నీటిని పోయండి. నాలుగైదు నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయండి. ►ఇలా రోజుకి రెండు సార్లు నెల రోజుల పాటూ చేయండి. పసుపు, పాలు.. ►ఒక బౌల్లో ఐదారు టీ స్పూన్ల పసుపు తీసుకుని అందులో తగినంత పాలు పోసి మెత్తటి పేస్ట్ లా చేయండి. ►పిగ్మెంటేషన్ ఉన్నచోట ఈ పేస్ట్ అప్లై చేసి ఐదునిమిషాలు గుండ్రంగా మసాజ్ చేయండి. ►ఆరిన తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయండి. ►రోజూ స్నానానికి ముందు ఒకసారి ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. చదవండి: Aloe Vera Gel Night Cream: అలోవెరా జెల్‌తో నైట్ క్రీమ్ ఇలా తయారు చేసుకోండి! రోజూ రాసుకుంటే.. Eye Stress Relief: ఎక్కువ సేపు కంప్యూటర్ స్క్రీన్ చూసేవాళ్లు! రోజ్‌వాటర్, టీ బ్యాగ్‌లు, పుదీనా.. ఈ చిట్కాలు పాటిస్తే.. -
Beauty Tips: ఈ చిట్కాలతో ముఖంపై మంగు మచ్చలు మాయం!
కొంతమంది ఎత్తుకు తగిన బరువుతో ఆకర్షణీయమైన పర్సనాలిటీతో ఉంటారు. తీరా ముఖం దగ్గరికొచ్చేసరికి మచ్చలు కనిపించి ఉస్సురనిపిస్తాయి. ముఖాన్ని అందహీనంగా మార్చే ఈ నల్లటి మచ్చలనే మంగు మచ్చలంటారు. ఈ మచ్చలు ముఖం రెండు వైపులా బుగ్గలపై నుంచి ముక్కు వరకూ వ్యాపిస్తాయి. ఇవి ముఖంతో పాటు మెడ, భుజాలు, వీపు వెనుకభాగంలో కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఇదేమీ వ్యాధి కాదు కానీ, ఇలా మచ్చలు ఉన్న వారు ఆత్మన్యూనతతో పదిమందిలోకీ వెళ్లడానికి ఇబ్బంది పడతారు. అసలు ఇలాంటి మచ్చలు ఎందుకు వస్తాయో తెలుసుకుంటే వాటిని నివారించవచ్చు. తొలిదశలోనే ఉన్న వాటిని చిన్న చిన్న చిట్కాలతో నయం చేసుకోవచ్చు. శరీరతత్వాన్ని బట్టి ముఖంపై మొటిమలు, పులిపిర్లు, పెద్ద పరిమాణంలో ఉండే పుట్టుమచ్చలు, వయసుతో పాటు ఏర్పడిన మార్పులు, ఎండలో తిరగటం వల్ల ఏర్పడిన మచ్చలు మొదలైనవి ఏర్పడుతుంటాయి. వీటిలో కొన్ని వంశపారంపర్యంగా వస్తే, మరికొన్ని హార్మోన్లలో సమతుల్యత లోపించడం వల్ల కూడా రావచ్చు. వంశపారంపర్యంగా వచ్చే మచ్చలను నివారించలేకపోయినా, వాటి ప్రభావాన్ని తగ్గించవచ్చు. ఈ చిట్కాలతో ముఖంపై మంగు మచ్చలు మాయం! ►తాజా వెన్నను ముఖంపైన ఉండే మంగు మచ్చలపై రోజూ రుద్దుతుంటే క్రమేణా పలచబడి కొంతకాలానికి చర్మం రంగులో కలిసిపోతాయి. ►పచ్చి పసుపు, ఎర్రచందనం సమభాగాలుగా కలిపి పాలల్లో కలిపి రాస్తుంటే మంగు మచ్చలు, చెంపలపైన ఉన్న నల్లని మచ్చలూ తగ్గుతాయి. ►జాజికాయను పాలలో అరగదీసి రాయడం వల్ల గుణం కనిపిస్తుంది. ►పాలల్లో ఎర్రకందిపప్పు నూరి నేతిలో కలిపి మంగు మచ్చలపై రాస్తుంటే కొద్ది రోజుల్లోనే నలుపుదనం పోతుంది. ► పావు టీ స్పూన్ నిమ్మరసానికి సమంగా తేనె కలిపి మచ్చలపై బాగా రుద్ది 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. ఇలా నెల రోజులు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ►టొమాటోను రెండు ముక్కలుగా తరిగి, ఆ ముక్కలతో మచ్చలపై బాగా రుద్ది 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల మచ్చలు తగ్గడంతోపాటు ముఖ వర్చస్సు పెరుగుతుంది. ►అలోవెరా పేస్టును మచ్చలపై పూయాలి. ఆ మచ్చతడి ఆరిపోయాక చల్లని నీటితో శుభ్రంగా కడిగేయాలి. ఇలా చేయడం వల్ల క్రమంగా మచ్చలు తగ్గిపోతాయి. టీ స్పూన్ టొమాటో రసం, టీ స్పూన్ గంధం పొడి, రెండు టీ స్పూన్ల ముల్తాని మట్టి కలిపి మెత్తని పేస్టులా చేసి మచ్చలపై పట్టించి 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు లేదా మూడుసార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. ►రోజ్ వాటర్, కీరా రసం, నిమ్మరసం, తేనె సమంగా కలిపి మచ్చలపై రుద్ది 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడుగుతుంటే నెల రోజులు గడిచేసరికి మంచి మార్పు వస్తుంది. ►బంగాళదుంప చెక్కు తీసి, సన్నగా తురిమి పల్చని గుడ్డలో పిండి, రసం తీయాలి. దానిలో దూది ఉండలని ముంచి, వాటితో మచ్చలపై అద్దాలి. పావుగంట తర్వాత చల్లని నీటితో కడుక్కోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేయాలి. అన్నింటికన్నా ముఖ్యమైనది ఆత్మన్యూనతకు గురికాకుండా ఉండటం. ఆత్మన్యూనత వల్ల, బిడియం వల్ల పదిమందిలో కలవలేకపోవడం, కలిసినా, ముఖాన్ని చేతులతో కవర్ చేసుకోవడం వంటి వాటి వల్ల అందరి దృష్టి పడుతుంది. ఆత్మవిశ్వాసంతో ఉండి చక్కగా చిరునవ్వుతో మాట్లాడుతూ ఉంటే ఏ మచ్చలూ మన అందాన్ని మసక బార్చలేవు. చదవండి👉🏾 Sugarcane Juice: చెరుకు రసం తరచుగా తాగుతున్నారా.. అయితే -
ఆశ్చర్యం: మనిషి నాలుకపై వెంట్రుకలు.. ఎందుకలా!
Man Starts Growing Thick Black Hair: ఇంతవరకు మన చాలా అరుదైన వ్యాధులు గురించి విన్నాం. పైగా వాటిలో చాలా మటుకు జన్యు సంబంధ సమస్యల వల్ల సంభవించినవి. అయితే కొన్ని రకాలైన వ్యాధులు వ్యక్తిగత అపరిశుభ్రత వల్లనో లేక మరేదైన కారణం వల్లనో తెలయదు గానీ చాలా విచిత్రంగా వస్తుంటాయి. అవి కాస్త డాక్టర్ వద్ద చెప్పడానికి ఇబ్బందిగా కూడా ఉంటుంది. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి అరుదైన విచిత్రమైన వ్యాధితోనే బాధడపడుతున్నాడు. వివరాల్లోకెళ్లే..50 ఏళ్ల వ్యక్తికి నాలుక పై దట్టమైన జుట్టు పెరడం ప్రారంభించింది. దీంతో అతను వైద్యులను సంప్రదించాడు. వైద్యులు అతనికి లింగువా విల్లోసా నిగ్రా లేదా నల్లటి వెంట్రుకల నాలుక అనే అసాధారణ వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించారు. ఈ వ్యాధికి ముందు అతను పక్షవాతానికి గురయ్యాడు. అతని సంరక్షకులు ఆ సమయంలో అతని నాలుక పై నల్లటి మచ్చలు రావడం గమినించామని చెప్పారు. కానీ అవి కాస్త దట్టంగా వచ్చేంత వరకు అది జుట్టు అని వాళ్లు గుర్తించలేకపోయారు. దీంతో వాళ్ల చర్మవ్యాధి నిపుణిడిని సంప్రదించారు. అప్పడే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో వైద్యులు ఎందువల్ల ఈ వ్యాధి వచ్చిందనే దానిపై పరిశోధించడం మొదలుపెట్టారు. ఈ మేరకు బ్యాక్టీరియా లేదా శిలీంధ్రాల పెరుగుదలను తనిఖీ చేసే నిమిత్తం అతని నోటి నుంచి శ్లేష్మ నమూనాలను తీసుకున్నారు. అవన్నీ ప్రతికూత ఫలితాలనిచ్చాయి. దీంతో అతను ఒక అరుదైన నల్లని వెంట్రుకల నాలుక(బీహెచ్‌టీ) అనే వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుసుకున్నారు. నాలుక ఉపరితలంపై చిన్న, కోన్-ఆకారపు గడ్డలు, ఫిలిఫార్మ్ పాపిల్లే అని పిలవబడేవి, షెడ్, లేనప్పుడు ఈ వెంట్రుకలు వస్తాయిని చెప్పారు. నిజానికి మనం బ్రెష్ చేసినప్పుడు ఈ పాపిల్లే అని పిలవబడే షెడ్ క్లీన్ అయ్యి అవి కొంచెంగా పెరుగుతుంటాయి. అదిగాక నాలుక సాధారణ రాపిడికి గురి కానప్పుడూ ఇలాంటి సమస్య తలెత్తుందని చెప్పారు. అంతేకాదు సాధారణ నోటి పరిశుభ్రత పద్ధతులతో మనిషి నల్లటి వెంట్రుకల నాలుక త్వరగా క్లియర్ అవుతుందని చెప్పారు. వైద్యులు సూచనతో ఆ వ్యక్తి ఈ సమస్య నుంచి ఇప్పుడిప్పుడే నెమ్మదిగా నెమ్మదిగా రికవరి అవుతున్నాడు. నోటి అపరిశుభ్రత వల్లే ఇలాంటి వ్యాధులు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. (చదవండి: సింహాన్ని ఎత్తి పడేసిందిగా...దెబ్బకు పరుగు లంకించింది -
ఎండ బాధలకు చర్మగీతం
వేసవి తీవ్రత పెరుగుతూ పోతోంది. మనం ఎండలోకి వెళ్లగానే చర్మం మండుతున్నట్లు అనిపిస్తుంది. దాని తీవ్రతను మొదట తెలియజెప్పే జ్ఞానేంద్రియమూ చర్మమే. కాబట్టి ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు బయటకు వెళ్తే మొదట ప్రభావితమయ్యేది చర్మమే. చర్మానికి ఈ సీజన్లో వచ్చే సాధారణ సమస్యలు, వాటినుంచి కాపాడుకోవడం ఎలా అన్న అంశాలపై అవగాహన కలిగించడం కోసమే ఈ ప్రత్యేక కథనం. అసలు ఎండ అంటే ఏమిటో చూద్దాం... తీక్షణమైన కాంతితో మనకు హాని ఎందుకు కలుగుతుందో తెలుసుకునే ముందు అసలు కాంతి అంటే ఏమిటో చూద్దాం. మన భూమికి చేరే రేడియేషన్‌లో మనం చూడగలిగేదీ చూడటానికి ఉపయోగపడేది చాలా చాలా తక్కువ. సూర్యుడి నుంచి వచ్చే కాంతి అంతా రేడియేషన్ అంతా తరంగాల రూపంలో మనకు చేరుతుంది. ఇందులో రేడియో తరంగాలూ, ఎక్స్–కిరణాలూ, మైక్రోవేవ్ తరంగాలూ ఇలా ఎన్నెన్నో ఉంటాయి. దీన్నింతా ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రేడియేషన్ అంటారు. అయితే ఇందులో వేర్వేరు కిరణాలకు వేర్వేరు వేవ్‌లెంగ్త్ ఉంటుంది. అంటే కాంతి కిరణంలోని పక్కపక్కనే ఉండే అలలోని... ఒక పీక్‌కూ, మరో పీక్‌కూ మధ్యనున్న దూరాన్ని వేవ్లెంగ్త్గా చెప్పుకుంటే మన కళ్లకు కనిపించే కాంతి చాలా పరిమితమైన వేవ్లెంగ్త్తోనే ఉంటుంది. మరీ నిర్దిష్టంగా చెప్పాలంటే 400 – 700 నానో మీటర్ల రేంజ్లో ఉండే దాన్ని మాత్రమే మనం కాంతిగా పేర్కొంటాం. అంతకంటే తక్కువ వేవ్‌లెంగ్త్‌తో ఉండే కిరణాలను అల్ట్రా వయొలెట్ కిరణాలుగానూ, అంతకంటే ఎక్కువ వేవ్‌లెంగ్త్‌తో ఉండేవాటిని ఇన్ఫ్రా రెడ్ కిరణాలుగానూ చెబుతుంటారు. ఈ అన్ని వేవ్‌లెంగ్త్‌లతో కూడిన రేడియేషన్ కాంతి తీక్షణంగా, ప్రకాశవంతంగా కాయడమే ఎండ. మధ్యాన్నం 2 నుంచి 3 గంటల సమయంలో వెలువడే కిరణాలు చాలా హానికరం. సూర్యుడి నుంచి మన కంటి వరకు చేరే రేడియేషన్‌లోని చాలా హానికారక కిరణాలను ఓజోన్‌పొర వడపోస్తుంది. కేవలం 3 శాతం అల్ట్రా వయొలెట్ కిరణాలు మాత్రమే భూమి ఉపరితలం వరకు చేరతాయి. మానవులపై అల్ట్రావయొలెట్ కిరణాల ప్రభావం ఇలా... మామూలు కాంతిని మినహాయిస్తే... మనల్ని చేరే అల్ట్రా వయొలెట్ కిరణాల వల్ల చర్మంపై దుష్ప్రభావాలు ఉంటాయి. ఇక యూవీ–సి వల్ల కలిగే అనర్థాలు మాత్రం చాలా తీవ్రంగా ఉంటాయి. అత్యంత ప్రమాదకరమైన యూవీ–సీ అల్ట్రా వయొలెట్ కిరణాలు చాలా చాలా ప్రమాదకరమైనవి. అవి కొన్నిసార్లు ప్రాణాలకు సైతం ముప్పు కలిగించవచ్చు. చర్మంపై ప్రసరించినప్పుడు స్కిన్–క్యాన్సర్‌గానూ పరిణమించవచ్చు. అదృష్టవశాత్తు యూవీ–సీ రకానికి చెందిన కిరణాలను ఓజోన్ పొర అడ్డుకొని సకల జీవరాశినీ కాపాడుతుంటుంది. మనం ముందుగా చెప్పుకున్నట్లు 400 – 700 న్యానోమీటర్ల మేరకు ఉన్నదే కాంతి. అంతకు మించిన వేవ్లెంత్తోగానీ, అంతకు తగ్గిన వేవ్‌లెంత్‌తో గాని అంటే అల్ట్రావయొలెట్, ఇన్ఫ్రారెడ్ కిరణాలతో మన చర్మానికి ఎంతో ప్రమాదం అని తెలుసుకోవాలి. మన చర్మం తీవ్రమైన ఎండలోని తీక్షణ కాంతి కిరణాలను కొంతవరకు తట్టుకోలేదు. మనం సాధారణంగా తట్టుకోగల కాంతికిరణాలను మించిపోయి ఆ వేవ్లెంత్ ఫ్రీక్వెన్సీ 308 నానోమీటర్లు ఉన్నప్పుడు మన చర్మం ప్రభావితమవుతుంది. అయితే ఇక్కడ తట్టుకునే ప్రభావం కూడా వేర్వేరు వ్యక్తుల్లో వేర్వేరుగా ఉంటుంది. ఉదాహరణకు నల్లటిచర్మం (డార్క్ స్కిన్) ఉన్నవారు ఎండ తీవ్రత ఒకింత తీక్షణంగా ఉన్నా తట్టుకోగలరు. కానీ చర్మం రంగు తగ్గుతున్నకొద్దీ అంటే చర్మం ఫెయిర్‌గా అవుతున్న కొద్దీ ఎండ తీవ్రతను తట్టుకునే శక్తి తగ్గుతుంది. అందుకే తెల్లటి చర్మం (ఫెయిర్ స్కిన్) ఉన్నవారు ఎండ తీవ్రతకు చాలా త్వరగా ప్రభావితమవుతారు. ఎండ తీవ్రత ప్రభావం రెండు రకాలుగా ఉంటుంది. మొదట తీవ్రమైన ఎండకు ఎక్స్పోజ్ అయినప్పుడు మన చర్మం నల్లబారుతుంది. తొలుత ఇది తాత్కాలికం. ఎండకు వెళ్లడం తగ్గిస్తే ఇలా నల్లబారడమూ తగ్గుతుంది. ఇలా చర్మం నల్లబారడాన్ని పిగ్మెంటేషన్ అంటారు. తొలి దుష్ప్రభావం సన్‌బర్న్స్ రూపంలో... వైద్యపరిభాషలో ఎరిథిమా అని పిలిచే ఈ సమస్యను సాధారణ పరిభాషలో సన్బర్న్స్గా చెబుతారు. సాధారణంగా సూర్యుడి తీక్షణత ప్రభావం వల్ల ఎండలోకి వెళ్లగానే మొదట చర్మం ఎర్రగా మారుతుంది. ఆ తర్వాత మాడినట్లుగా నల్లబడుతుంది. కొన్ని సందర్భాల్లో చర్మంపైన ఎర్రగా పొక్కుల (బ్లిస్టర్స్) రూపంలోనూ ఇది వ్యక్తం కావచ్చు. చర్మం రంగును బట్టి కూడా దీని తీవ్రత తగ్గడం, పెరగడం ఉంటుంది. ఫెయిర్ చర్మం వారిలో సన్‌బర్న్ తీవ్రత ఎక్కువగానూ, నల్లటి చర్మం వారిలో తక్కువగానూ ఉంటుంది. బ్లిస్టర్స్ ఏర్పడితే దీని తీవ్రత ఎక్కువగా ఉందనడానికి సూచన. కొందరిలో భౌతిక లక్షణాలైన జ్వరం, వికారం, వాంతులు, నిస్సత్తువ కూడా కనిపించవచ్చు. కొందరిలో రక్తపోటు తగ్గడం, స్పృహతప్పడం కూడా జరగవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో రోగిని హాస్పిటల్‌కు తరలించాలి. చికిత్స: సన్‌బర్న్‌కు గురై చర్మం ఎర్రబారిన వారిని తక్షణం నీడకు తీసుకెళ్లాలి. కేవలం 12 – 24 గంటలు చల్లటిప్రాంతంలో ఉన్నా లేదా ఎయిర్‌కండిషన్ గదిలో ఉన్నా వారి లక్షణాలు వాటంతట అవే మాయమవుతాయి. చర్మంపై చల్లటి నీటిలో తడిపిన టవల్‌తో తుడవటం లాంటివీ చేయవచ్చు. అయితే సమస్య తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు డర్మటాలజిస్టుల సూచన మేరకు నాన్‌స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ (ఎన్ఎస్ఏఐడీస్), చర్మపు మంట తగ్గడానికి హైడ్రోకార్టికోసోన్ క్రీములు వాడాల్సిరావచ్చు. పొక్కులను పగలగొట్టకూడదు. మాయిశ్చరైజింగ్ క్రీములతో ఈ సమస్య తగ్గుతుంది. పిగ్మెంటేషన్ ఎండలో చర్మం రంగు నల్లబారడాన్ని పిగ్మెంటేషనగా చెప్పవచ్చు. యూవీ–ఏ, యూవీ... ఈ రెండింటి వల్ల చర్మంలోని మెలనిన్ కణాల్లో ఫొటోపిగ్మెంటేషన్ చర్య జరగడంవల్ల చర్మం రంగు నల్లగా మారుతుంది. అయితే దీని తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు అంటే... ఇమ్మిడియట్ పిగ్మెంటేషన్ డార్క్నెస్ (ఐపీడీ)లో నీడపట్టుకు వచ్చినప్పుడు కేవలం రెండు గంటల్లో దీని ప్రభావం తగ్గుతుంది. కానీ అదేపనిగా ఎండకు తిరిగే వారిలో తాత్కాలిక ఐపీడీ స్థానంలో పెరిసిస్టెంట్ పిగ్మెంట్ డార్కెనింగ్ (పీపీడీ) అనే కండిషన్ ఏర్పడుతుంది. ఇలా ఏర్పడ్డప్పుడు దీని ప్రభావం కొద్ది రోజులు మొదలుకొని, కొన్ని వారాల వరకు ఉండవచ్చు. నీడపట్టున ఉండటమే దీనికి నివారణ. పెరిసిస్టెంట్ పిగ్మెంట్ డార్కెనింగ్ (పీపీడీ) ఏర్పడినప్పుడు, ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోకుండా ఆ తర్వాత కూడా ఇంకా అదేపనిగా ఎండలో తిరగడం మంచిది కాదు. చెమటకాయలు (మిలీరియా) వైద్యపరిభాషలో మిలీరియా అని పిలిచే ఈ పరిణామంలో చర్మంపై ఉండే స్వేదగ్రంథుల్లో అడ్డంకి ఏర్పడి అవి ఉబ్బినట్లుగా అవుతాయి. బాగా చెమట పట్టినప్పుడు అది ఆవిరైపోయే పరిస్థితి లేనప్పుడు స్వేదగ్రంధుల చివర్లో చెక్కరతో కూడిన పదార్థం (పాలీశాకరైడ్ సబ్‌స్టాన్స్) రూపొంది అది చర్మగ్రంధి చివర అడ్డుగా నిలుస్తుంది. దాంతో లోపల ఉన్న స్వేదం బయటికి రాకుండా ఉండిపోయి, స్వేదగ్రంథిలో ఒత్తిడి పెంచుతుంది. ఫలితంగా స్వేదం పక్క కణజాలాల్లోకి స్రవించి చెమటకాయలు అదేపనిగా విస్తరించినట్లుగా అవుతాయి. అయితే పడకకే పరిమితమైన (బెడ్ రిడెన్) రోగుల్లో చెమట విపరీతంగా పట్టడం, వారు ఒళ్లు కదిలించలేకపోవడంతో ఇవి ఎక్కువగా వస్తుంటాయి. దీనిలోనూ మిలీరియా క్రిస్టలైన్ (సుడామినా), మిలీరియా రుబ్రా (ప్రిక్లి హీట్) ఉంటాయి. మిలీరియా క్రిస్టలైన్లో వీటి తీవ్రత అంతగా లేనప్పుడు చర్మంపై మంట ఉండదు. కానీ మిలీరియా రుబ్రాలో చెమటకాయలు ఎర్రగా చేతికి తగులుతూ ముళ్లతో గుచ్చిన ఫీలింగ్‌తో మంటనూ, తిమ్మిర్ల వంటి భావనను కలిగిస్తాయి. అవి మెడ, ఛాతీ, వీపు భాగంలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇక మిలీరియా పుస్టులోజా అనే కండిషన్ మరింత తీవ్రమైనది. ఇందులో స్వేదగ్రంధిలోని స్వేదనాళానికి అడ్డంకి ఏర్పడటంతో పాటు అది దెబ్బతినడం కూడా జరగవచ్చు. ఇవి చర్మంలోని ఛాతీ, వీపు ప్రాంతాలలో పాటు ప్రైవేట్ పార్ట్స్‌లో కూడా విస్తరించవచ్చు. ఇది కొన్ని వారాల పాటు ఉంటుంది. చికిత్స: చల్లటి ప్రదేశాల్లో ఉండటం, క్రమం తప్పకుండా స్నానం చేయడం, ఒంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం వంటి చర్యలతో దీన్ని నివారించవచ్చు. పిల్లలకు లేదా పెద్దలకు వాడే డస్టింగ్ పౌడర్, ప్రిక్లీ హీట్ పౌడర్లతోనూ ఉపశమనం ఉంటుంది. ఎండ నుంచి చర్మానికి రక్షణ ఇలా... ►ఈ సీజన్లో ప్రతి రోజు రెండుపూటలా గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయడం మంచిది. ►ఎండలో బయటకు వెళ్లేవారు తప్పనిసరిగా గొడుగు తీసుకెళ్లాలి. ఈ సీజన్లో మనం వేసుకునే దుస్తులు లైట్ కలర్లో ఉండాలి. గాలి ఆడే కాటన్ దుస్తులు, ఎండ తగలనివ్వని లాంగ్‌స్లీవ్స్ దుస్తులు వాడటం మేలు. ►యాంటీ ట్యానింగ్ సన్‌స్క్రీన్స్, ఇన్ఫ్రారెడ్ యూవీ – ఏ అండ్ బీ రేడియేషన్ నుంచి రక్షణ ఇచ్చే సన్‌స్క్రీన్స్ వాడుకోవచ్చు. ఈ వేసవిలో ఎస్పీఎఫ్ ఎక్కువగా ఉన్న సన్‌స్క్రీన్ లోషన్లను డాక్టర్ చెప్పిన రీతిలో పద్ధతిగా వాడాలి. తమ చర్మానికి అనుగుణంగా వాడుకోవాల్సిన సన్‌స్క్రీన్‌ను డాక్టర్లు సూచిస్తారు. ఈ క్రీములను బయటకు వెళ్లడానికి అరగంట ముందు రాసుకోవడం వల్ల ఎండలోని హానికరమైన కిరణాలనుంచి అవి చర్మాన్ని ప్రభావపూర్వకంగా రక్షించగలుగుతాయి. అయితే ప్రతి మూడు గంటలకు ఒకసారి ఈ క్రీములు వాడాలి. ►ఇక రాత్రి వేళల్లో డాక్టర్ సలహా మేరకు డీ–పిగ్మెంటేషన్ క్రీమ్స్ వాడటం వల్ల చర్మం నల్లబడకుండా ఉంటుంది. ఇక ఈత వంటి ఆటల్లో పాల్గొనే వారు వాటర్ప్రూట్ సన్‌స్క్రీన్స్ వాడాల్సి ఉంటుంది. ►కళ్ల సంరక్షణ కోసం నాణ్యమైన అద్దాలు వాడటం మేలు. అలాగే తలకు టోపీని వాడవచ్చు. సూర్యకిరణాలు నేరుగా ముఖానికి తాకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కళ్లజోళ్లలో అమర్చుకునే స్వెట్ ప్యాడ్స్ క్రమం తప్పకుండా మార్చుకునేలా జాగ్రత్త తీసుకోవాలి. ►చర్మం తన సాగేగుణాన్ని కోల్పోకుండా ఉండాలంటే ఎక్కువగా నీళ్లు, ద్రవాహారాలు తీసుకోవాలి. ప్రతిరోజూ కనీసం 12 గ్లాసులకు తగ్గకుండా నీళ్లు తాగాలి. ఈ సీజన్లో నీళ్లతో పాటు మజ్జిగ (బటర్‌మిల్క్), కొబ్బరినీళ్లు, పండ్ల రసాల వంటి ద్రవాహారాలు ఎక్కువగా తీసుకోవాలి. కోలా డ్రింక్స్ వంటివి చర్మానికి హాని చేస్తాయి. వాటికి దూరంగా ఉండాలి. ►తలకు రంగు వేసుకునే వారు సీజన్ మొదలు కావడానికి ముందే వేసుకోవడం మంచిది. లేదా చల్లటి వేళల్లో వేసుకోవాలి. ►స్విమ్మింగ్ చేసేవారు వాటర్ రెసిస్టెంట్ సన్‌స్క్రీన్ వాడాలి. ►వింటర్లో కోల్డ్ క్రీమ్స్ రాసుకున్నట్లే.... సమ్మర్లో మాయిశ్చరైజింగ్ క్రీమ్‌లు అవసరమవుతాయి. అవి చర్మంపై ఉండే తేమను కాపాడతాయి. వింటర్లో అయితే ఆయిల్ ఇన్ వాటర్ టైపు క్రీములు వాడతారు. సమ్మర్లో వాటర్ ఇన్ ఆయిల్ టైప్ ఆఫ్ క్రీములు వాడాలి. ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉండే క్రీములు వాడాలి. క్రీమ్ కంటే లోషన్ రూపంలో ఉండేవి వాడితే మంచిది. ►ఇక డియోడరెంట్స్ వాడేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణంగా డియోడరెంట్స్‌లో బర్గ్యాప్టెన్ అనే సోరోలెన్స్ పదార్థం ఉంటుంది. దాంతోపాటు దీనికి మంచి సువాసన (ఫ్రాగ్రెన్స్) రావడానికి కొన్ని రసాయనాలు వాడతారు. ఎండాకాలంలో చెమటలు ఎక్కువగా పట్టడం వల్ల ఇవన్నీ చర్మంపై ఎక్కువగా ప్రభావం చూపుతాయి. కాబట్టి నేరుగా డియోడరెంట్స్ చర్మంపై రాసుకోవడం కంటే ఫ్రాగ్రెన్స్‌ను కోరుకునేవారు వాటిని బట్టలపై (స్ప్రే చేసుకునేలా) వేసుకుంటే మంచిది. అందునా బట్టలు ధరించకముందే వాటిపై స్ప్రే చేసి... ఒక అరగంట తర్వాత వాటిని ధరించాలి. అలా ఉపయోగిస్తే చర్మానికి కలిగే హానిని తగ్గించినట్లు అవుతుంది. ►ఈ సీజన్లో వెంట్రుకలు, జుట్టు పొడిబారిపోతాయి. కాబట్టి తలకు నూనె రాయడం మేలు చేస్తుంది. అయితే కొంతమంది తల చల్లబడటానికి మెంథాల్ కలిసిన ఆయిల్‌ను వాడతారు. ఇది వారి వ్యక్తిగత ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. ►సాధారణంగా ఈ సీజన్లో బిగుతుగా ఉన్న వస్తువులు ధరించడం వల్ల చెమట పట్టడంతో వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లేదా మెటల్స్ వల్ల కలిగే అలర్జిక్ రియాక్షన్స్ వల్ల దురద వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మరికొందరిలో ఉంగరం ఉన్న చోట సబ్బు నురగ ఇరుక్కుపోయి... అక్కడ డిటర్జెంట్ వల్ల అలర్జీ రావచ్చు. ఇలాంటి సందర్భాల్లో తమకు సరిపడని... అంటే అలర్జీ కలిగించే వాటిని గుర్తించి, అలాంటి వాటిని ధరించకుండా దూరంగా ఉంచాలి. అలాగే మన ఆభరణాలు మరీ బిగుతుగా లేకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. యూవీతో దీర్ఘకాలిక పరిణామాలు ఫొటో ఏజింగ్: అదేపనిగా ఎండలో తిరగడం వల్ల కొన్ని అవాంఛనీయ దీర్ఘకాలిక పరిణామాలు ఏర్పడతాయి. అందులో ముఖ్యమైనది ఫొటోఏజింగ్. ఫొటోఏజింగ్ వల్ల చర్మంపై అవాంఛితమైన ముడతలు, వెడల్పుగా ప్యాచ్ వచ్చిన రీతిలో ఏర్పడే మచ్చలు (సోలార్ లెంటిజిన్స్), చర్మం తన సాగే గుణాన్ని కోల్పోవడం, చర్మంపైన రక్తనాళాలు దారపు పోచల్లా కనిపించడం (టెలాంజిక్టాసియాస్ – అవే తర్వాత సాలెగూళ్లలా అల్లుకుని కనిపిస్తాయి. వాటినే స్పైడర్ వెయిన్స్ అంటారు), చర్మం ఎండిపోయినట్టుగా అనిపించడం వంటి పరిణామాలు ఏర్పడతాయి. ఆ తర్వాత చర్మం చాలా ముదురుగా రఫ్‌గా కనిపిస్తుంది. అందుకే ఈ దశలోనైనా అదేపనిగా ఎండకు వెళ్లకుండా చర్మాన్ని కాపాడుకోవాలి. తద్వారా ఫొటో ఏజింగ్‌ను నివారించవచ్చు. యూవీకి ఎక్స్పోజ్ కావడం దీర్ఘకాలం కొనసాగితే మరిన్ని అనర్థాలు కూడా ఏర్పడే అకాశాలు ఉన్నాయి. హాని కలిగేది అల్ట్రా వయొలెట్, ఇన్ఫ్రా రెడ్ కిరణాలతోనే... మనకు చేరే కాంతితో పాటు మన వాతావరణంలో ప్రసరిస్తూ, ప్రవహిస్తూ ఉండే అల్ట్రా వయొలెట్, ఇన్ఫ్రా రెడ్ కిరణాలతో మన చర్మానికీ, కంటికి కూడా హాని కలిగే ప్రమాదం ఉంది. పైగా వేసవిలో ఈ కిరణాల తీవ్రత మరింత ఎక్కువగా ఉండటం వల్ల అమితమైన శక్తితో ఉండే ఈ కిరణాలు కంటికి హాని చేసే అవకాశాలు ఎక్కువ. అల్ట్రా వయొలెట్లో మూడు రకాలు కంటికి హాని చేయగల అల్ట్రా వయొలెట్ కిరణాల (యూవీ రేస్)ను మూడగా విభజించవచ్చు. అవి... యూవీ – ఏ (వీటి ఫ్రీక్వెన్సీ 320 – 400 న్యానో మీటర్లు)... తక్కువ శక్తిమంతమైనవి. యూవీ – బీ (వీటి ఫ్రీక్వెన్సీ 280 – 320 న్యానో మీటర్లు)... ప్రమాదకరమైనవి. యూవీ – సీ (వీటి ఫ్రీక్వెన్సీ 200 – 280 న్యానో మీటర్లు)... అత్యంత ప్రమాదకరం. మళ్లీ యూవీ–ఏ లో రెండు ఉప–రకాలు ఉంటాయి. అవి.. 340 – 400 న్యానో మీటర్ల వేవ్‌లెంత్‌తో ఉన్నవి యూవీ–ఏ1 అంటారు. 320 – 340 యూవీ–ఏ2 అంటారు. ఇన్ఫ్రా రెడ్ కిరాణాలూ మూడు రకాలు ఇన్ఫ్రారెడ్ – ఏ (వీటి ఫ్రీక్వెన్సీ 700 – 1400 న్యానో మీటర్లు) ఇన్ఫ్రారెడ్ – బీ (వీటి ఫ్రీక్వెన్సీ 1400 – 3000 న్యానో మీటర్లు) ఇన్ఫ్రారెడ్ – సీ (వీటి ఫ్రీక్వెన్సీ 3000 న్యానో మీ. – 1 మిల్లీమీటర్లు) ఇక అన్ని రకాల ఇన్ఫ్రారెడ్ కిరణాలూ చర్మానికి చాలా హానికరమైనవి. చర్మంపై అల్ట్రావయొలెట్ కిరణాల ప్రభావం ఇలా... యూవీ కిరణాలతో తాత్కాలిక ప్రభావాలు ►ఎరిథిమా (సన్‌బర్న్స్) ►పిగ్మెంటేషన్ (తక్షణం కనిపించేది ఇమ్మీడియట్ డార్క్పిగ్మెంటేషన్ (ఐపీడీ) / అదేపనిగా చాలాకాలంఎక్స్పోజ్ అయినప్పుడు కనిపించేది పెరిసిస్టెంట్ పిగ్మెంట్ డార్కెనింగ్ (పీపీడీ) యూవీలతో దీర్ఘకాలిక ప్రభావాలు ►ఫొటో ఏజింగ్ ►ఇమ్యూనోసప్రెషన్ ►ఎగ్సాసెర్బేషన్ ఆఫ్ఫోటోడెర్మటోసిస్ డాక్టర్ స్వప్నప్రియ డర్మటాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
గోబ్లాక్
పిగ్మెంటేషన్... మధ్య వయసులో కొందరికి వస్తుంటుంది. దీనిని వాడుకలో మంగు అంటుంటారు. ముఖంపై వచ్చే ఈ నల్ల (మంగు)మచ్చలు పోవడానికి ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు.కమలాపండురసం లేదా బంగాళదుంప రసం ముఖానికి పట్టించి, రసం చర్మంలో ఇంకిపోయే వరకు వేళ్లతో వలయాకారంగా మసాజ్ చేసుకోవాలి. మసాజ్ తర్వాత ఫేస్ ప్యాక్ వేయాలి. పిగ్మెంటేషన్ని తగ్గించే ఫేస్ ప్యాక్... :స్వచ్ఛమైన పసుపు– ఒక స్పూను బొప్పాయి గుజ్జు– ఒక స్పూను పుదీన పొడి లేదా గుజ్జు – ఒక స్పూను తులసి పొడి లేదా గుజ్జు – ఒక స్పూను∙బాదం పొడి – ఒక స్పూను∙పైవన్నీ కలపాలి. అవసరమైతే కొద్దిగా పన్నీరు వేసి జారుడుగా చేసుకోవాలి. ఈ ప్యాక్‌ను ముఖానికి వేసి అరగంట తర్వాత టిష్యూతో తుడిచేయాలి లేదా చన్నీటితో కడగాలి. ఇలా వారానికి రెండుసార్లు, ఒక నెలపాటు చేస్తే నలుపు తొలగి పోతుంది. ముఖం తిరిగి మునుపటి కాంతిని సంతరించుకుంటుంది. -
చందమామలో మచ్చలా!
ఆనందం స్వచ్ఛమైన ముఖం చంద్రబింబంలాగ ఉంటుంది. ముప్పైలు దాటి నలభైల్లోకి అడుగు పెట్టిన తర్వాత చందమామలో చిన్నచిన్నగా మచ్చలు మొదలవుతాయి. రొటీన్‌గా ఎదురయ్యే ముడతలకు తోడుగా అన్నమాట. దీనిని పిగ్మెంటేషన్ అంటారు. పిగ్మెంటేషన్‌ను పోవడానికి ఇంట్లో చేసుకునే ట్రీట్మెంట్ ఇది.ముఖాన్ని నిమ్మరసంతో కానీ స్కిన్ టానిక్ (సౌందర్యసాధనాలు లభించే దుకాణాల్లో రెడీమేడ్‌గా దొరుకుతుంది)తో కానీ శుభ్రంగా తుడవాలి. గ్రేప్ పౌడర్, కోడిగుడ్డు సొన, సీవుడ్ లోషన్లను ఒక్కొక్క స్పూన్ తీసుకుని కలిపి బ్రష్‌తో లేదా మునివేళ్లతో ముఖానికి పట్టించాలి. ప్యాక్ ఆరిన తర్వాత కొద్దికొద్దిగా పచ్చిపాలను వేస్తూ ముఖాన్ని బాగా మర్దనా చేయాలి. మసాజ్ పూర్తయిన తర్వాత స్పాంజ్‌తో ప్యాక్‌ను పూర్తిగా తుడిచేయాలి. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ పౌడర్‌తో (బాదం, చెర్రీ, సారపప్పు, అల్బుఖారా, జీడిపప్పు, కిస్మిస్లలో ఏదైనా ఒకటి లేదా అందుబాటులో ఉన్న రెండు– మూడు రకాలు తీసుకుంటే చాలు) ప్యాక్ వేయాలి. పొడులను గోరువెచ్చటి నీటితో కలిపి ప్యాక్ వేసుకోవాలి. ఈ ప్యాక్ ఆరిన తర్వాత కూడా పచ్చిపాలను వేస్తూ 10 నిమిషాలు మర్దనా చేసి, స్పాంజ్‌తో తుడవాలి. ఇప్పుడు కమలాపండురసం లేదా బంగాళదుంప రసంతో ఐదు నిమిషాల సేపు గాల్వానిక్ మసాజ్ చేయాలి (గాల్వానిక్ మెషీన్ లేకపోతే చేతివేళ్లతో 15 నిమిషాల సేపు మసాజ్ చేసుకోవచ్చు). మసాజ్ పూర్తయిన తర్వాత బొప్పాయి, మామిడి వంటి పండ్లతో ఫ్రూట్ ప్యాక్ వేయాలి. -
బొప్పాయితో బోలెడంత సౌందర్యం
బొప్పాయి పండు ఆరోగ్యానికే కాదు.. అందానికీ ఎంతో ముఖ్యమైనది. ఈ బొప్పాయి ప్యాక్‌తో ఇంట్లోనే ‘ఫేషియల్ గ్లో’ సొంతం చేసుకోవచ్చు. అందులోని విటమిన్-ఎ, విటమిన్-సి, మెగ్నీషియం, పొటాషియం మీ ముఖారబిందాన్ని రెట్టింపు చేస్తాయి. డ్రై స్కిన్ ఒక గిన్నెలో రెండు బొప్పాయి పండు ముక్కల్ని చిదిమి గుజ్జులా చేసుకోవాలి. అందులో ఒక చెంచా తేనె, మూడు చెంచాల పాలు కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఆ మిశ్రమంతో ముఖం, మెడపై ప్యాక్ వేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో ప్యాక్ వేసుకున్న చోట్లను శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ డ్రై స్కిన్ (పొడి చర్మం) వారికి మంచి మాయిశ్చరైజర్‌గా పని చేస్తుంది. మొటిమలు, జిడ్డు చర్మం రెండు చెంచాల బొప్పాయి గుజ్జులో ఒక చెంచా ముల్తానీ మట్టిని కలపాలి. ఆ మిశ్రమంతో రోజు విడిచి రోజు ప్యాక్ వేసుకోవాలి. అది పూర్తిగా ఆరిపోయాక గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. అలా చేస్తే జిడ్డుతనం పోయి చర్మం నిగారిస్తుంది. పిగ్మెంటేషన్ ముఖంపై నల్ల మచ్చలతో బాధపడే వారికి బొప్పాయి పండు మంచి ఉపశమనం. రెండు చెంచాల బొప్పాయి పండు గుజ్జులో ఒక చెంచా నిమ్మరసం కలిపి రోజూ స్నానం చేసే ముందు ముఖానికి అప్లై చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే నల్లమచ్చలు తొలగిపోతాయి. -
డర్మటాలజీ కౌన్సెలింగ్
నాడా కట్టుకున్నచోట నల్లమచ్చ...! నా వయసు 15 ఏళ్లు. నేను లెహంగా కానీ, సెల్వార్ గానీ కట్టుకున్నప్పుడు నా నడుము వద్ద నల్లగా మచ్చలాగా పడుతోంది. ఇలా నల్లమచ్చ పడకుండా ఉండాలంటే ఏం చేయాలో సలహా ఇవ్వండి. - సుశాంతి, కర్నూల్ మీరు చెబుతున్న సమస్య అమ్మాయిల్లో చాలా సాధారణంగా కనిపించేదే. నడుము దగ్గర కాస్త బిగుతుగా కట్టుకున్నప్పుడు ఇలా ఏర్పడటం సహజం. నడుము దగ్గరి నాడా బిగుతుగా ఉండటంతో అక్కడ ఒత్తిడి పడుతుంది. ఒత్తిడి పడ్డచోట రక్తప్రవాహం తగ్గుతుంది. దాంతో అక్కడ డార్క్ రంగును ఇచ్చే పిగ్మెంట్ కణాలు బాగా పెరుగుతాయి. దాంతో ఆ భాగం నల్లగా కనిపిస్తుంది. దీన్ని నివారించాలంటే... నాడాను మరీ బిగుతుగా కట్టుకోకుండా, కాస్త వదులుగా కట్టుకోండి. నాడా కట్టే ప్రాంతంలో కోజిక్ యాసిడ్, ఆర్బ్యుటిన్ ఉన్న స్కిన్ లెటైనింగ్ క్రీమ్ రాసుకోండి బిగుతుగా కట్టుకునే నాడాలకు బదులు, శరీరాన్ని అంటిపెట్టుకునేలా సాఫ్ట్ ఎలాస్టిక్‌తో ఉండే దుస్తులు వాడండి అప్పటికీ పిగ్మెంటేషన్ తగ్గకపోతే మీకు సమీపంలోని డర్మటాలజిస్ట్‌ను కలిసి గ్లైకోలిక్, ఫీనాల్ పీలింగ్ చికిత్సను ఒక కోర్స్లాగా తీసుకోవాల్సి ఉంటుంది. నా వయసు 16 ఏళ్లు. నేను సల్వార్, కమీజ్ లాంటి దుస్తులు ఎక్కువగా ధరిస్తుంటాను. అయితే స్లీవ్‌లెస్ లాంటివి వేసుకునే సమయంలో ఒక సమస్య ఎదురవుతుంది. నా దుస్తులు కప్పి ఉండే ప్రాంతం తెల్లగానూ, మిగతా ప్రాంతం కాస్త వన్నె తక్కువగానూ కనిపిస్తుంది. నా మోచేతి కింది భాగాలు కూడా... దుస్తులు కప్పి ఉండే భాగాల్లాగే నిగనిగలాడుతూ, మెరుస్తూ కనిపించాలంటే ఏం చేయాలో చెప్పండి. - రమ్య, హైదరాబాద్ శరీరంలో దుస్తులు కప్పి ఉండే భాగాలపై సూర్యకిరణాలు పడవు. కాబట్టి అక్కడి భాగం తేమను కోల్పోదు. ఫలితంగా సూర్యకాంతి వల్ల జరిగే నష్టం జరగదు. దాంతో దుస్తులు కప్పి ఉండేచోట చర్మం, సూర్యుడికి ఎక్స్పోజ్ అయ్యే భాగాలతో పోలిస్తే కాస్త తెల్లగానూ, మెరుపుతోనూ ఉంటుంది. మీ శరీరంలో సూర్యకాంతికి ఎక్స్పోజ్ అయ్యే భాగాలు తమ తేమను కోల్పోకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలివి... సూర్యకాంతికి ఎక్స్పోజ్ అయ్యే మీ చర్మానికి... షియాబట్టర్, అలోవీరా, గ్లిజరిన్ ఉండే మంచి మాయిశ్చరైజర్‌ను పూసుకోండి సూర్యకాంతికి ఎక్స్పోజ్ అయ్యే శరీర భాగాలకు చెందిన చర్మంపై అంటే ముఖం, మెడ, వీపుపైభాగం, చేతులు, కాళ్లు వంటి చోట్ల 50 ఎస్పీఎఫ్ ఉండే బ్రాడ్‌స్పెక్ట్రమ్ సన్‌స్క్రీన్ రాసుకుంటూ ఉండండి. ప్రతి మూడు గంటలకోసారి ఇలా సన్‌స్క్రీన్ రాసుకోవడం చేస్తూ ఉండాలి సాధారణంగా మీరు ఫుల్స్లీవ్స్ వేసుకోవడం వల్ల మిగతా మేనిభాగాలకు కూడా అదే నిగారింపు, మెరుపు వస్తుంది గ్లైకోలిక్ యాసిడ్ 6%, ఆర్బ్యుటిన్, కోజిక్యాసిడ్ ఉన్న క్రీములను రాత్రివేళల్లో మీ చర్మంపై పూసుకోండి పై సూచనలు పాటించినా ఇంకా మేనిపై ఆ తేడాలు తగ్గకపోతే డర్మటాలజిస్ట్‌ను కలిసి కెమికల్ పీలింగ్ చేయించుకోండి. డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ చీఫ్ డర్మటాలజిస్ట్, త్వచ స్కిన్ క్లినిక్, గచ్చిబౌలి, హైదరాబాద్ -
స్వర నేత్రుడు
మిణుగురులు సమాజానికి దివిటీలు -నిర్మలారెడ్డి చదువుకునే రోజుల్లోనే చూపును కోల్పోయిన దేవరకొండ వెంకట మోహనకృష్ణ (50) ఆ సమస్యను అధిగమించి తన జీవితాన్ని మలుచుకున్న తీరు ఎంతో స్ఫూర్తిదాయకమైనది. మోహనకృష్ణ మూడో తరగతిలో ఉన్నప్పుడు కామెర్లు వచ్చాయి. పసరు వైద్యం చేస్తే అది వికటించింది. కంటి రెటీనా పై పిగ్మెంటేషన్ ప్రారంభమై... క్రమక్రమంగా డిగ్రీ ఫైనలియర్‌కి వచ్చేటప్పటికి కంటిచూపు పూర్తిగా పోయింది. అయినా అధైర్యపడకుండా తల్లిదండ్రుల నుంచి అబ్బిన సంగీతాన్ని తన జీవితానికి చూపుగా మార్చుకున్నారు. మంగళంపల్లి బాలమురళీ కృష్ణ శిష్యుడిగా చేరారు. ఏన్నో వేదికల మీద పాటలు పాడారు. ఆ తర్వాత విజయవాడ ఆలిండియా రేడియో ఉద్యోగి అయ్యారు. ‘‘అమ్మ, నాన్న, భార్య, ఇద్దరు పిల్లలు... ఇదీ నా కుటుంబం. ఆసక్తి గలవారు వచ్చి నా దగ్గర సంగీతపాఠాలు నేర్చుకుంటారు. విదేశాలలో ఉన్న సంగీతాభిమానులు ఆన్‌లైన్‌లోనూ తరగతులు చెప్పమని అడుగుతుంటారు. ‘భగవంతుడు నీకు అన్యాయం చేశాడు!’ అనేవారు దగ్గరివాళ్లు. కానీ, నేనలా అనుకోలేదు. దేవుడు ఒకటి తీసుకున్నా ఇంకోటి ఇచ్చాడనుకుంటాను. సంగీతం ద్వారా ఎందరికో నన్ను చేరువచేశాడు. ఇప్పటి వరకు నాలుగు వందల మందికి సంగీతం నేర్పించి ఉంటాను. అందరికీ ఉచితంగా నేర్పించనేర్పిస్తున్నాను’’ అని తెలిపారు మోహనకృష్ణ. ఒక దారి మూసుకుపోతేనేం, వంద దారులు తెరుచుకునే ఉంటాయి. వాటిని మనోదృష్టితో చూడాలి. దారిని ఎంపిక చేసుకోవాలి. ఆ దారిలో గమ్యం చేరుకోవాలి. అర్ధంతరంగా చూపును కోల్పోయినా మరో అవకాశాన్ని అందిపుచ్చుకొని జీవితాన్ని మలుచుకున్న మోహన్కృష్ణలాంటి వాళ్లు సమాజానికి దివిటీల వంటివారు. ఫొటో: జి.రాజేష్ - బాలు, సాక్షి, విశాఖపట్నం