నాడా కట్టుకున్నచోట నల్లమచ్చ...!
నా వయసు 15 ఏళ్లు. నేను లెహంగా కానీ, సెల్వార్ గానీ కట్టుకున్నప్పుడు నా నడుము వద్ద నల్లగా మచ్చలాగా పడుతోంది. ఇలా నల్లమచ్చ పడకుండా ఉండాలంటే ఏం చేయాలో సలహా ఇవ్వండి.
- సుశాంతి, కర్నూల్
మీరు చెబుతున్న సమస్య అమ్మాయిల్లో చాలా సాధారణంగా కనిపించేదే. నడుము దగ్గర కాస్త బిగుతుగా కట్టుకున్నప్పుడు ఇలా ఏర్పడటం సహజం. నడుము దగ్గరి నాడా బిగుతుగా ఉండటంతో అక్కడ ఒత్తిడి పడుతుంది. ఒత్తిడి పడ్డచోట రక్తప్రవాహం తగ్గుతుంది. దాంతో అక్కడ డార్క్ రంగును ఇచ్చే పిగ్మెంట్ కణాలు బాగా పెరుగుతాయి. దాంతో ఆ భాగం నల్లగా కనిపిస్తుంది. దీన్ని నివారించాలంటే... నాడాను మరీ బిగుతుగా కట్టుకోకుండా, కాస్త వదులుగా కట్టుకోండి. నాడా కట్టే ప్రాంతంలో కోజిక్ యాసిడ్, ఆర్బ్యుటిన్ ఉన్న స్కిన్ లెటైనింగ్ క్రీమ్ రాసుకోండి బిగుతుగా కట్టుకునే నాడాలకు బదులు, శరీరాన్ని అంటిపెట్టుకునేలా సాఫ్ట్ ఎలాస్టిక్‌తో ఉండే దుస్తులు వాడండి అప్పటికీ పిగ్మెంటేషన్ తగ్గకపోతే మీకు సమీపంలోని డర్మటాలజిస్ట్‌ను కలిసి గ్లైకోలిక్, ఫీనాల్ పీలింగ్ చికిత్సను ఒక కోర్స్‌లాగా తీసుకోవాల్సి ఉంటుంది.
నా వయసు 16 ఏళ్లు. నేను సల్వార్, కమీజ్ లాంటి దుస్తులు ఎక్కువగా ధరిస్తుంటాను. అయితే స్లీవ్‌లెస్ లాంటివి వేసుకునే సమయంలో ఒక సమస్య ఎదురవుతుంది. నా దుస్తులు కప్పి ఉండే ప్రాంతం తెల్లగానూ, మిగతా ప్రాంతం కాస్త వన్నె తక్కువగానూ కనిపిస్తుంది. నా మోచేతి కింది భాగాలు కూడా... దుస్తులు కప్పి ఉండే భాగాల్లాగే నిగనిగలాడుతూ, మెరుస్తూ కనిపించాలంటే ఏం చేయాలో చెప్పండి.
- రమ్య, హైదరాబాద్
శరీరంలో దుస్తులు కప్పి ఉండే భాగాలపై సూర్యకిరణాలు పడవు. కాబట్టి అక్కడి భాగం తేమను కోల్పోదు. ఫలితంగా సూర్యకాంతి వల్ల జరిగే నష్టం జరగదు. దాంతో దుస్తులు కప్పి ఉండేచోట చర్మం, సూర్యుడికి ఎక్స్‌పోజ్ అయ్యే భాగాలతో పోలిస్తే కాస్త తెల్లగానూ, మెరుపుతోనూ ఉంటుంది. మీ శరీరంలో సూర్యకాంతికి ఎక్స్‌పోజ్ అయ్యే భాగాలు తమ తేమను కోల్పోకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలివి... సూర్యకాంతికి ఎక్స్‌పోజ్ అయ్యే మీ చర్మానికి... షియాబట్టర్, అలోవీరా, గ్లిజరిన్ ఉండే మంచి మాయిశ్చరైజర్‌ను పూసుకోండి సూర్యకాంతికి ఎక్స్‌పోజ్ అయ్యే శరీర భాగాలకు చెందిన చర్మంపై అంటే ముఖం, మెడ, వీపుపైభాగం, చేతులు, కాళ్లు వంటి చోట్ల 50 ఎస్‌పీఎఫ్ ఉండే బ్రాడ్‌స్పెక్ట్రమ్ సన్‌స్క్రీన్ రాసుకుంటూ ఉండండి. ప్రతి మూడు గంటలకోసారి ఇలా సన్‌స్క్రీన్ రాసుకోవడం చేస్తూ ఉండాలి సాధారణంగా మీరు ఫుల్‌స్లీవ్స్ వేసుకోవడం వల్ల మిగతా మేనిభాగాలకు కూడా అదే నిగారింపు, మెరుపు వస్తుంది గ్లైకోలిక్ యాసిడ్ 6%, ఆర్బ్యుటిన్, కోజిక్‌యాసిడ్ ఉన్న క్రీములను రాత్రివేళల్లో మీ చర్మంపై పూసుకోండి పై సూచనలు పాటించినా ఇంకా మేనిపై ఆ తేడాలు తగ్గకపోతే డర్మటాలజిస్ట్‌ను కలిసి కెమికల్ పీలింగ్ చేయించుకోండి.
డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ
చీఫ్ డర్మటాలజిస్ట్,
త్వచ స్కిన్ క్లినిక్,
గచ్చిబౌలి, హైదరాబాద్
డర్మటాలజీ కౌన్సెలింగ్
Published Thu, Jul 9 2015 11:30 PM | Last Updated on Sun, Sep 3 2017 5:11 AM
Advertisement