చందమామలో మచ్చలా!
ఆనందం
స్వచ్ఛమైన ముఖం చంద్రబింబంలాగ ఉంటుంది. ముప్పైలు దాటి నలభైల్లోకి అడుగు పెట్టిన తర్వాత చందమామలో చిన్నచిన్నగా మచ్చలు మొదలవుతాయి. రొటీన్‌గా ఎదురయ్యే ముడతలకు తోడుగా అన్నమాట. దీనిని పిగ్మెంటేషన్ అంటారు. పిగ్మెంటేషన్‌ను పోవడానికి ఇంట్లో చేసుకునే ట్రీట్‌మెంట్ ఇది.ముఖాన్ని నిమ్మరసంతో కానీ స్కిన్ టానిక్ (సౌందర్యసాధనాలు లభించే దుకాణాల్లో రెడీమేడ్‌గా దొరుకుతుంది)తో కానీ శుభ్రంగా తుడవాలి.
గ్రేప్ పౌడర్, కోడిగుడ్డు సొన, సీవుడ్ లోషన్‌లను ఒక్కొక్క స్పూన్ తీసుకుని కలిపి బ్రష్‌తో లేదా మునివేళ్లతో ముఖానికి పట్టించాలి. ప్యాక్ ఆరిన తర్వాత కొద్దికొద్దిగా పచ్చిపాలను వేస్తూ ముఖాన్ని బాగా మర్దనా చేయాలి. మసాజ్ పూర్తయిన తర్వాత స్పాంజ్‌తో ప్యాక్‌ను పూర్తిగా తుడిచేయాలి.
ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ పౌడర్‌తో (బాదం, చెర్రీ, సారపప్పు, అల్‌బుఖారా, జీడిపప్పు, కిస్‌మిస్‌లలో ఏదైనా ఒకటి లేదా అందుబాటులో ఉన్న రెండు– మూడు రకాలు తీసుకుంటే చాలు) ప్యాక్ వేయాలి. పొడులను గోరువెచ్చటి నీటితో కలిపి ప్యాక్ వేసుకోవాలి. ఈ ప్యాక్ ఆరిన తర్వాత కూడా పచ్చిపాలను వేస్తూ 10 నిమిషాలు మర్దనా చేసి, స్పాంజ్‌తో తుడవాలి. ఇప్పుడు కమలాపండురసం లేదా బంగాళదుంప రసంతో ఐదు నిమిషాల సేపు గాల్వానిక్ మసాజ్ చేయాలి (గాల్వానిక్ మెషీన్ లేకపోతే చేతివేళ్లతో 15 నిమిషాల సేపు మసాజ్ చేసుకోవచ్చు). మసాజ్ పూర్తయిన తర్వాత బొప్పాయి, మామిడి వంటి పండ్లతో ఫ్రూట్ ప్యాక్ వేయాలి.