జీన్స్, టీ షర్ట్, స్కూటీ, మెడలో ఓ స్లిమ్ బ్యాగ్ లేదా హెవీగా బ్యాక్‌ప్యాక్... ఇదీ ఈ తరం కాలేజీ అమ్మాయిల డ్రెసింగ్. ఇలాంటి అమ్మాయిలే పూనమ్ శరణ్, జ్యోతి చౌహాన్‌లు. వీళ్లను చూసిన ఓ జేబుదొంగకు ‘వీళ్లేంటి ఆఫ్‌ట్రాల్ అమ్మాయిలే కదా’ అనుకున్నాడు. ‘మేము అమ్మాయిలమే కానీ, ఆఫ్‌ట్రాల్ అమ్మాయిలం కాదు’ అని నిరూపించారీ ఇద్దరమ్మాయిలు.
వీళ్ల ధైర్యం, తెగువ, సమయస్ఫూర్తికి అల్వార్ జిల్లా ఎస్‌పీ కూడా ముచ్చటపడ్డాడు. వాళ్లను పోలీస్ స్టేషన్‌కి పిలిపించి ఇద్దరికీ పూలబొకేలు ఇచ్చి మరీ అభినందించారు. చెరో వెయ్యి రూపాయలిస్తూ... ‘ఆడపిల్లలు ఇలా ఉంటే సమాజంలో సమస్యలు అన్నీ వాటికవే సర్దుకుంటాయి. ఆకతాయిలు, చిల్లర దొంగలకు మీరొక పాఠం కావాలి. దొంగతనం చేయాలని చాచిన చేతులు మిమ్మల్ని చూసి జంకుతో వెనక్కి వెళ్లిపోవాలి’ అంటూ అమ్మాయిలను ప్రశంసల్లో ముంచెత్తారు.
వాళ్లు చేసిందేమిటి?
అది రాజస్తాన్‌లోని ఆల్వార్ నగరం. పూనమ్ శరణ్, జ్యోతి చౌహాన్ గడచిన శనివారం సాయంత్రం కోచింగ్ సెంటర్ నుంచి స్కూటీ మీద ఇంటికి వెళ్తున్నారు. పూనమ్ బండి నడుపుతోంది, జ్యోతి వెనుక ఉంది. ఒక ఆకతాయి బైక్ మీద వీళ్లను వెంబడించాడు. స్కూటీకి దగ్గరగా వచ్చి జ్యోతి చేతిలోని స్మార్ట్ ఫోన్ లాక్కుని తన బైక్ వేగం పెంచి ముందుకు వెళ్లిపోయాడు. క్షణకాలంలోనే తేరుకున్నారీ అమ్మాయిలు.
దొంగతనం జరినట్లు చుట్టు పక్కల వాళ్ల దృష్టిలో పడేటట్లు పెద్దగా అరుస్తూనే అతడి బైక్‌ను అనుసరించారు. బైక్ మీదున్న వ్యక్తిని రెండు కిలోమీటర్ల దూరం వెంబడించారు. జిడి గర్ల్స్ కాలేజ్ రోడ్డులోకి వెళ్లింది బైక్. కాలేజ్ దగ్గర ఆ రోడ్డు ఎండ్ అవుతుంది. డెడ్‌ఎండ్ కారణంగా బైక్ ముందుకు వెళ్లడానికి దారి లేదు, వెనక్కు తిరగడానికి వీల్లేకుండా స్థానిక ఇళ్లలోని వాళ్లంతా గుమిగూడిపోయారు. వాళ్లలో కొందరు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చేటప్పటికే ఆ అమ్మాయిలు స్థానికుల సహాయంతో బైక్ మీదున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
పౌరులే పోలీసులు
ఇదంతా తెలుసుకున్న జిల్లా ఎస్‌పీ రాహుల్ ప్రకాశ్... ఫోన్ అపహరణకు పాల్పడిన ఇక్బాల్‌ను అదుపులోకి తీసుకుని... పూనమ్, జ్యోతిల ధైర్యసాహసాలకు గాను వారిని స్టేషన్‌కి పిలిపించి ప్రశంసించారు. ప్రతి ఒక్కరూ ఇలాంటి చొరవ తీసుకోవాలని చెప్పారు రాహుల్ ప్రకాశ్. ప్రతి ఒక్కరిలో పోలీస్ ఉంటాడు. తమలోని పోలీసింగ్ నైపుణ్యాన్ని నిద్రపుచ్చకుండా చైతన్యంగా ఉంచుకోవాలి. నిజానికి పౌరులే మంచి పోలీసులు. ఈ అమ్మాయిలు చూపించిన ధైర్యం, చొరవ ప్రతి ఒక్కరికీ ఆదర్శం కావాలి’ అని సందేశమిచ్చారు.
– మంజీర
Comments
Please login to add a commentAdd a comment