ఈ యాప్‌తో భవిష్యత్తు బంగారమే!
ప్రతి వ్యక్తిలోనూ ఒక శక్తి ఉంటుంది. అది చూడగలిగేవాళ్లు తమను తాము నిరూపించుకొని ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. చూడలేనివారు, తమ సామర్థ్యం విషయంలో స్పష్టత లేనివారు మాత్రం ఉన్న దగ్గరే ఆగి పోతారు. విధిని నిందిస్తూ నిరాశ నిస్పృహల్లో కూరుకుపోతారు. ఇప్పుడిక ఆ దిగులు అక్కర్లేదు. ‘మై కెరియర్ మై ఫ్యూచర్’ అనే సరికొత్త అప్లికేషన్ మనలోని శక్తి ఏమిటో మనకు తెలియజేసే అవకాశం కల్పిస్తోంది. మనల్ని మనం ఉన్నతంగా తీర్చిదిద్దుకునేలా చేస్తోంది.
ఐఐటీ మద్రాసు మేనేజ్‌మెంట్ విభాగం... ఐఐటీ స్థాయి విద్యానాణ్యతను సాధారణ ఇంజినీరింగ్ విద్యార్థులకు సైతం అందించాలన్న లక్ష్యంతో ఏర్పడ్డ బోధ్ బ్రిడ్జ్ సంస్థతో కలిసి ‘మై కెరియర్ మై ఫ్యూచర్’ (ఎంసిఎంఎఫ్) అప్లికేషన్‌ను సిద్ధం చేసింది. ఈ అప్లికేషన్‌ను తయారుచేసిన ముగ్గురు సభ్యుల బృందానికి ఐఐటీ మద్రాసు మేనేజ్‌మెంట్ విభాగం ప్రొఫెసర్ ఎల్.ఎస్ గణేష్ నేతృత్వం వహించారు. ఐఐటీలో ఎం.ఎస్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పూర్తి చేసి, బోధ్ బ్రిడ్జ్ విద్యాసంస్థను నెలకొల్పిన ఖమ్మం జిల్లా భద్రాచలానికి చెందిన కొండవీటి బాలరాజు, ఐఐటీ మద్రాసులో ‘ఆర్గనైజేషనల్ బిహేవియర్’లో పీహెచ్‌డీ చేసిన డాక్టర్ ప్రియదర్శిని ఈ బృందంలో సభ్యులు కావడం విశేషం!
ఏడాది పాటు ఈ బృందం అనేక పరిశోధనలు సాగించింది. ‘చదువుకు తగ్గ ఉపాధిని పొందడంలో మన పట్టభద్రులు ఎందుకు విఫలమవుతున్నారు?’ అనే అంశంపై లోతుగా అధ్యయనం చేసింది. పారిశ్రామికవేత్తలు, నటులు, క్రీడాకారులతో పాటు వివిధ రంగాల్లోని ప్రముఖులతో మాట్లాడి వారి విజయ రహస్యాలను తెలుసుకుంది. తల్లిదండ్రుల ఒత్తిడితోనో, స్నేహితులను అనుసరించడం ద్వారానో ఆసక్తి లేని రంగాన్ని ఎంపిక చేసుకుని అక్కడ రాణించలేక, కనీసం ఉపాధి కూడా పొందలేక అవస్థ పడుతున్న వారి గురించి ఆరా తీసింది.
‘‘చాలామందికి వారి ఆసక్తులపై స్పష్టత లేదు. ఒకవేళ ఆసక్తి ఉన్నా తల్లిదండ్రుల సహకారం ఉండటం లేదు. ఇలాంటి వారి ఆసక్తిని గుర్తించడమే లక్ష్యంగా ‘ఎంసీఎంఎఫ్’కు రూపకల్పన చేశాం. చిన్నచిన్న ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం ఇస్తే చాలు, ఎవరికి వారు తమకు ఇష్టమైన రంగాల్ని సులువుగా గుర్తించవచ్చు’’ అంటున్నారు పరిశోధన బృందానికి నేతృత్వం వహించిన ఎల్.ఎస్.గణేష్.
చాలామంది తాము చదివిన చదువుకు సంబంధం లేని ఉద్యోగాల్లో చేరారని, లేదంటే నిరుద్యోగులుగానో మిగిలారని గుర్తించింది బృందం. దీనికి పరిష్కారంగా పదో తరగతి, ఇంటర్ స్థాయిలోనే విద్యార్థులు తమలోని ఆసక్తిని గుర్తించి, రాణించగలిగే రంగాన్ని ఎంపిక చేసుకునే విధంగా కార్యాచరణను సిద్ధం చేసింది. ‘మై కెరియర్ మై ఫ్యూచర్’ నినాదంతో ఆసక్తిని గుర్తించే మొబైల్ అప్లికేషన్‌ను రూపొందించింది.
‘‘ఆసక్తి లేకున్నా తల్లిదండ్రుల ఒత్తిడితోనో, స్నేహితులు, ఉపాధ్యాయుల సలహాలతోనో ఇంజినీరింగ్‌ను ఎంచుకున్నామని చెప్పేవారు అధికం. వారికి ఇష్టమున్న రంగాన్ని గుర్తించడంలో విద్యార్థులకే ఓ స్పష్టత లేదన్న విషయాన్ని గ్రహించి పరిశోధనలకు శ్రీకారం చుట్టాను. దేశ విద్యారంగంలోనే ఈ అప్లికేషన్ ఓ వినూత్న సృష్టి’’ అంటున్నారు బోధ్ బ్రిడ్డ్ వ్యవస్థాపకులు బాలరాజు. ‘‘ఒక సైకాలజిస్ట్‌గా నేను గర్వపడుతున్న ప్రాజెక్టు ఇది.
విద్యార్థుల ఆసక్తిని తెలిపే సైకోమెట్రిక్ అప్లికేషన్ ఇది’’ అంటున్నారు డా॥ప్రియదర్శిని. పన్నెండు అంశాలకు సంబంధించిన 72 ప్రశ్నల్ని ఈ అప్లికేషన్‌లో పొందుపరిచారు. ఇందులో నాలుగు అంశాలు విద్యార్థి వ్యక్తిత్వానికి సంబంధించి, మరో ఎనిమిది అంశాలు అతడి ఆసక్తిని ప్రతిబింబించేలా ఉంటాయి. ఈ అప్లికేషన్‌ను ఇంగ్లీషుతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ విడుదల చేశారు. త్వరలో దేశంలోని అన్ని భాషల్లోనూ ఈ అప్లికేషన్‌ను విడుదల చేయడానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.
ఇతర దేశాల్లో ఉన్న భారతీయ విద్యార్థుల కోసం విదేశాల్లో కూడా అప్లికేషన్‌ను విడుదల చేయాలని ఐఐటీ మద్రాసు, బోధ్ బ్రిడ్జ్ సంస్థలు భావిస్తున్నాయి. విద్యార్థులందరికీ అందుబాటులో ఉంచాలన్న లక్ష్యంతో బీటెక్ గురు డాట్‌కామ్ (WWW.BTECHGURU.COM)లో ఉంచారు. నవంబర్ 17 వరకు ఈ అప్లికేషన్‌ను ఉచితంగా పొందవచ్చు. అప్లికేషన్‌ను పూరించిన తర్వాత ఏవైనా అనుమానాలు తలెత్తితే వీడియో చాటింగ్, స్కైప్‌తో పాటు, ఫోన్ ద్వారా బోధ్ బ్రిడ్జ్ సంస్థ ప్రతినిధులు చెన్నై నుంచి ఉచిత కౌన్సెలింగ్ అందిస్తారు.
- ఎం.అస్మతీన్, చెన్నై