ఈ వారం యూటూబ్ హిట్స్ | this week youtube hits | Sakshi
Sakshi News home page

ఈ వారం యూటూబ్ హిట్స్

Published Mon, May 9 2016 12:29 AM | Last Updated on Sun, Sep 3 2017 11:41 PM

ఈ వారం యూటూబ్ హిట్స్

ఈ వారం యూటూబ్ హిట్స్

బ్యాటిల్‌ఫీల్డ్ 1 : ట్రైలర్
ఈ ఏడాది అక్టోబర్ 21న విడుదల కాబోతున్న వీడియో గేమ్ ‘బ్యాటిల్‌ఫీల్డ్ 1’ ట్రైలర్ ఇది. మొదటి ప్రపంచ యుద్ధం నేపథ్యంలో తయారౌతున్న ఈ గేమ్‌ను స్వీడన్ కంపెనీ.. ‘ఈ డైస్’ అభివృద్ధి చేస్తోంది. బ్యాటిల్‌ఫీల్డ్ సిరీస్‌లో ఈ ఫస్ట్ పర్సన్ షూటర్ గేమ్ 14వ ది. గేమ్ ఆడేవారే ఇందులో షూటర్ కాబట్టి దీనిని ఫస్ట్ పర్సన్ వీడియో గేమ్ అంటున్నారు. ఇందులో చారిత్రక యుద్ధ సన్నివేశాలు ఉంటాయి. శతఘు్నలు గర్జిస్తాయి. శత్రువులు నేల కూలుతారు.

యుద్ధట్యాంకులు, విమానాలు, నౌకలు.. కళ్ల ముందు యుద్ధవాతావరణాన్ని సృషించి గేమ్ ఆడేవారిని సాయుధుడైన సైనికుడిలా, దేశభక్తుడిలా మార్చేస్తాయి. డేనియల్ బెర్లిన్ డిజైన్ చేసిన ఈ కొత్త బ్యాటిల్‌ఫీల్డ్ గతంలో వచ్చినవాటికన్నా మరింత భిన్నంగా ఉండబోతోందని నిర్మాత అలెగ్జాండర్ గ్రాండెల్ చెబుతున్నారు. మైక్రోసాఫ్ట్ విండోస్, ప్లేస్టేషన్ 4, ఎక్స్‌బాక్స్ వన్ లలో ఇది రిలీజ్ అవబోతోంది. తొలి బ్యాటిల్ ఫీల్డ్ గేమ్ ‘బ్యాటిల్‌ఫీల్డ్ 1942’ అనే పేరుతో 2002లో మార్కెట్‌లోకి వచ్చింది. రెండో ప్రపంచ యుద్ధం ఆధారంగా అది తయారైంది.
 
టిఇ3ఎన్ : ట్రైలర్
రిభు దాస్‌గుప్తా దర్శకత్వంలో జూన్ 10 న విడుదలకు సిద్ధమౌతున్న బాలీవుడ్ చిత్రం టిఇ3ఎన్ ట్రైలర్ ఇది. 2013లో వచ్చిన కొరియన్ చిత్రం ‘మాంటేజ్’ ఆధారంగా ఈ.. టిఇ3ఎన్‌ను థ్రిల్లర్ మూవీగా మలిచారు. అమితాబ్ బచ్చన్, నవాజుద్దీన్ సిద్దికీ, విద్యాబాలన్, సవ్యసాచి చక్రవర్తి ప్రధాన పాత్రల్లో నటించారు. చిత్రంలో.. అమితాబ్ మనవరాలు ఏంజెలా ఎనిమిదేళ్ల క్రితం కిడ్నాప్ అవుతుంది. అప్పటి నుంచీ ఆయన న్యాయం కోసం పోరాడుతూనే ఉంటారు.

తన మనవరాలు ఆచూకీ తెలిసిందా అని అడిగేందుకు రోజూ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి వస్తుంటాడు. అయితే అక్కడ ఆయనకు నిర్లక్ష్యమే సమాధానంగా ఎదురవుతూ ఉంటుంది. ఎవరూ పట్టించుకోరు. ఏ విషయమూ చెప్పరు. చివరికి ఒక మతబోధకుడిని (నవాజుద్దీన్ సిద్దికీ) ఆశ్రయిస్తారు అమితాబ్. నవాజుద్దీన్ గతంలో పోలీసు. అతడి సహాయంతో ఏంజెలాను ఎవరు అపహరించిందీ అమితాబ్ తెలుసుకునే క్రమంలో సినిమా మలుపు తిరుగుతుంది. ఏంజెలా లాంటిదే మరో కిడ్నాప్ జరుగుతుంది.

దానిని ఛేదించేందుకు పోలీస్ ఆఫీసర్ విద్యాబాలన్, నవాజుద్దీన్ ముమ్మర ప్రయత్నాలు చేస్తుండగా ఏంజెలా కిడ్నాపర్‌ల విషయమై అమితాబ్‌కి ఆయన సొంత ప్రయత్నాల వల్ల సమాచారం దొరుకుతుంది. టిఇ3ఎన్.. ఉద్వేగం, ఉత్కంఠ కలిసిన చిత్రం అని ఈ ట్రైలర్‌ను చూస్తే అర్థమౌతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement