ఓ రోజు ఓ ధనవంతుడు ఓ అడవిగుండా పోతున్నాడు. ఉన్నట్టుండి ముగ్గురు దొంగలు ఆయనను చుట్టుముట్టి బెదిరించారు. ఆయన దగ్గరున్నదంతా దోచుకున్నారు.వారిలో ఒకడు ‘‘ఇతని దగ్గరున్నదంతా దోచేసుకున్నాం. కనుక ఇతనుండి లాభమేంటీ... ఇతనుంటే మనకు ప్రమాదం కూడా. చంపేస్తేనే మనం బయటపడగలం’’ అని ఆవేశంగా అన్నాడు. ఆ మాటలతో ఆగలేదు. తన దగ్గరున్న కత్తిని తీసి అతనిపై దాడికి దిగాడు.ఇంతలో రెండో దొంగ అడ్డుపడి ‘‘అతనిని చంపడం వల్ల మనకేమీ లాభం లేదు... అతణ్ణి కట్టిపడేసి ఇక్కడే వదిలేద్దాం. తనపై జరిగిన దాడి గురించి రక్షక భటులకు చెప్పలేడు’’ అన్నాడు.ఈ మాటేదో బాగానే ఉందనుకుని దొంగలు అతన్ని తాళ్ళతో కట్టి నడి అడవిలో వదిలేసి వెళ్ళిపోయారు.కాసేపటి తర్వాత మూడోదొంగ ఒక్కడూ అతని దగ్గరకు వచ్చాడు.
‘‘నిన్ను మా వాళ్ళు బాగా వేధించారు కదూ. కొట్టారు. గాయపరిచారు కదూ... క్షమించు... నాకు నిన్ను చూస్తే జాలి వేస్తోంది. నేను నిన్ను విడిచిపెడతాను...’’ అంటూ అతని కట్లు విప్పి అతన్ని విడిచిపెట్టాడు. అంతేకాదు, అడవి నుంచి అతన్ని తనతోపాటు బయటకు తీసుకువచ్చాడు. ‘‘నావెంటే రా... నువ్వు ఏ అవాంతరం లేకుండా సులభంగా మీ ఇంటికి చేరుకోగలవు...’’ అన్నాడు.దొంగ చేస్తున్న సహాయానికి కృతజ్ఞతలు చెప్తూ ‘‘నువ్వు నాతోపాటు మా ఇంటికి రావాలి... ఎందుకంటే నువ్వు నాకెంతో సహాయం చేశావు. నీలోనూ ఎంతో కొంత మానవత్వం ఉంది. అది నాకెంతో ఆనందంగా ఉంది. నువ్వు మా ఇంటికి వస్తే మా కుటుంబసభ్యులను పరిచయం చేస్తాను.
నన్ను కాపాడింది నువ్వేనని వారికి చెప్తాను, వారెంతో సంతోషిస్తారు...’’ అన్నాడు.కానీ దొంగ తనను క్షమించమని, తాను వాళ్ళింటికి రాలేనని, అక్కడికి వచ్చినట్లు తెలిస్తే తనను రక్షకభటులు బంధించి కారాగారంలో పెడతారంటూ ఆ ధనవంతుడికి దారి చూపించి వెళ్ళిపోయాడు.మొదటి ఇద్దరు దొంగలకన్నా అతను మేలు. అతనను దొంగే అయినప్పటికీ అతనిలో మిగిలిన ఇద్దరిలోనూ లేని మంచి గుణం ఎంతోకొంత ఉంది. కనుకనే అతను ఆ ధనవంతుడిని ఇంటికి చేరే మార్గాన్ని చూపించాడు.సత్త్వ, రజస్తమో గుణాల గురించి చెబుతూ రామకృష్ణ పరమహంస ఈ కథను చెప్పారు.
– యామిజాల జగదీశ్
Comments
Please login to add a commentAdd a comment