లావణ(ఫైల్), తొలగించిన కిటికీ గ్రిల్
సాక్షి, విశాఖపట్నం: చీమలాపల్లిలోని ఓ ఇంట్లో దొంగతనానికి దొంగలు స్కెచ్ వేశారు. మంగళవారం అర్ధరాత్రి ఒంటి సమయంలో ఆ ఇంటి కిటికీ స్రూ్కలు విప్పి.. మెస్ తొలగించి లోపలికి ప్రవేశించారు. దొంగతనానికి ప్రయత్నిస్తుండగా వారిని అడ్డుకున్న వివాహితను కత్తితో పొడిచారు. ఓ వైపు రక్తం కారుతున్నా.. ఆమె వారిని ప్రతిఘటించడంతో అక్కడి నుంచి పరారయ్యారు. జీవీఎంసీ 95వ వార్డు పరిధి చీమలాపల్లిలో కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించి బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలివీ..
చీమలాపల్లిలో ఆళ్ల అప్పారావు, లలితకుమారి దంపతులు పెద్ద కుమారుడు వినయ్‌కుమార్, చిన్నకుమారుడు అవినాష్ కుమార్, కోడలు లావణ్య(అవినాష్ భార్య)తో కలిసి సొంత ఇంట్లో నివాసం ఉంటున్నారు. అవినాష్ నగరంలోని ఒక ప్రైవేట్ కంపెనీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి అతను నైట్ డ్యూటీకి వెళ్లాడు. ఇంట్లో ఓ గదిలో లావణ్య(25) నిద్రిస్తుండగా.. మరో గదిలో అప్పారావు, లలితకుమారి, వినయ్‌కుమార్ పడుకున్నారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట సమయంలో ఇంటి హాలులోని కిటికీ గ్రిల్ స్రూ్క లు విప్పి, మెస్ కట్ చేసి.. కిటికీ తలుపు గడియ విరగొట్టి.. ఇద్దరు దొంగలు లోపలికి చొరబడ్డారు.
అప్పారావు, లలితకుమారి, వినయ్‌కుమార్ పడుకుని ఉన్న గది తలుపునకు బయట గడియపెట్టారు. లావణ్య పడుకుని ఉన్న గది తలుపును గట్టిగా తన్నడంతో బోల్టు ఊడి.. తలుపు తెరుచుకుంది. దీంతో వారు లోపలకి ప్రవేశించారు. ఈ హఠాత్పరిణామానికి నిద్రలేచిన లావణ్య తేరుకునే లోపే గదిలో ఉన్న బీరువాను తెరిచేందుకు యత్నించారు. ఈ క్రమంలో లావణ్య వారిని గట్టిగా పట్టుకుని కేకలు వేసింది. ఆమె అరుపులకు ఏం జరిగిందో అని పక్క గదిలో ఉన్న అప్పారావు, లలితకుమారి, వినయ్‌కుమార్ నిద్రలేచారు. బయటకు వద్దామని ప్రయత్నిస్తే గది బయట గడియవేసి ఉండటంతో వాళ్లు రాలేని పరిస్థితి నెలకుంది. ఆ సమయంలో తన గది నుంచి ఇంటి హాలు వరకు ఇద్దరు దొంగలను లావణ్య ప్రతిఘటిస్తూనే ఉంది.
ఆమెతో పాటు కుటుంబ సభ్యులు కూడా పెద్దగా కేకలు వేయడంతో దొంగలు తప్పించుకునేందుకు లావణ్యను పొట్ట భాగం, కాళ్లపైన కత్తితో పొడిచి అక్కడి నుంచి పరారయ్యారు. కారుతున్న రక్తంతోనే లావణ్య.. అత్తమామలు, బావ నిద్రిస్తున్న తలుపు గడియ తీసింది. వెంటనే ఆమెను నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. క్రైం డీసీపీ నాగన్న, ఏడీసీపీ దుర్గాప్రసాద్, గంగాధర్, ఏసీపీ పెంటారావు, క్రైమ్ సీఐ దుర్గాప్రసాద్, పెందుర్తి లా అండ్ సీఐ నాగేశ్వరరావు తదితరులు ఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రంగంలోకి దిగిన క్లూస్ టీమ్ వేలిముద్రలను సేకరించింది. డాగ్ స్క్వాడ్ ఇంటి పరిసర ప్రాంతాలు, సమీపంలో ఉన్న కొన్ని ప్రదేశాల్లో తనిఖీలు చేపట్టింది.
కాగా.. మొత్తం నలుగురు దుండగులు దొంగతనానికి వచ్చి.. ఇద్దరు ఇంట్లోకి ప్రవేశించినట్టు స్థానికులు చెబుతున్నారు. ఇంటి ప్రహరీ దూకి వీరంతా వచ్చినట్టు భావిస్తున్నారు. అప్పారావు ఇంటి పక్కనే ఉన్న మరో ఇంటి బయట ఆరేసున్న దుస్తులను ముక్కలుగా చేసి ముఖానికి కట్టుకుని లోపలికి ప్రవేశించినట్లు తెలుస్తోంది. వాటిని దొంగలు ఇంటి బయట కుర్చీలో వదిలేసి వెళ్లారు. డాగ్ స్క్వాడ్ బృందం పరిశీలనలో ప్రహరీ బయట ఒక టార్చ్‌లైట్, డ్రింక్ బాటిల్‌ను గుర్తించారు. కాగా ఇంటి కిటికీ గ్రిల్స్ తొలగించి లోపలికి ప్రవేశించిన దుండగులు.. పారిపోయేటప్పుడు ప్రధాన ద్వారం తాళం తీసుకుని వెళ్లినట్లు బాధితులు చెబుతున్నారు. దొంగతనానికి వచ్చిన వారు చెడ్డీగ్యాంగ్‌గా ప్రచారం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment