రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని ఓ మెస్‌లో చోరీకి వచ్చిన ఓ దొంగ ‘ఆవేదన’
ఎంత వెతికినా ఏమీ లభించకపోడంతో సీసీ కెమెరా ముందు గోడువెళ్లబోసుకున్న వైనం
చివరకు ఓ వాటర్ బాటిల్ తీసుకున్నా రూ. 20 నోటు పెట్టి వెళ్లిన చోరుడు
సాక్షి, హైదరాబాద్: ఎంతో ఆశతో చోరీకి వస్తే ఏమీ దొరక్కపోవడంతో ఓ చోరుడు తెగ ఫీలయ్యాడు! ‘ఎంత వెతికినా కనీసం ఒక్క రూపాయి కూడా లేదు... మీకో దండం’ అంటూ యజమానులను ఉద్దేశించి అక్కడి సీసీ కెమెరాల వైపు చూస్తూ హావభావాలు ప్రదర్శించాడు. చివరకు ఓ వాటర్ బాటిల్ చోరీ చేసి తిరిగి వెళదామనుకున్నప్పటికీ వెనక్కు వచ్చి టేబుల్‌పై రూ. 20 నోటు పెట్టి మరీ వెళ్లాడు.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న వినాయక మెస్‌లో గత బుధవారం జరిగిన ఈ విచిత్ర చోరీ యత్నం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఆస్తి నష్టం లేకపోవడంతో మెస్ నిర్వాహ కులు పోలీసులకు ఫిర్యాదు చేయనప్పటికీ ఇందుకు సంబంధించిన సీసీటీవీ క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ సన్నివేశం ప్రపంచాన్ని చుట్టేసింది.
మండల కేంద్రం కావడంతో..
మహేశ్వరం మండల కేంద్రంలో ఉన్న మెస్ కావడంతో క్యాష్ కౌంటర్‌లో దండిగా కాసులు ఉంటాయనుకున్న దొంగ.. తలకు టోపీ, ముఖానికి టవల్‌తో ప్రధాన ద్వారానికి వేసిన తాళం పగులగొట్టి లోనికి ప్రవేశించాడు. తొలుత క్యాష్ కౌంటర్ వద్ద, ఆ తర్వాత కిచెన్‌లో ఆరు నిమిషాలకుపైగా వెతికినా ఏమీ దొరక్కపోవడంతో నిరాశ చెందాడు. తన ఆవేదనను హావభావాల ద్వారా అక్కడి సీసీ కెమెరాల వైపు చూస్తూ ప్రదర్శించాడు.
అనంతరం క్యాష్ కౌంటర్ వెనుక ఉన్న రెండు ఫ్రిజ్‌లలో వెతుకుతూ ఒక దాంట్లోంచి వాటర్ బాటిల్ తీసుకొని రెండు అడుగులు ముందుకు వేశాడు. కానీ ఒక్క రూపాయి కూడా దొరకని మెస్‌లోంచి వాటర్ బాటిల్ చోరీ చేయడానికి మనస్కరించకలేదో ఏమో.. తన ప్యాంటు బ్యాక్ పాకెట్ నుంచి పర్సు బయటకు తీసి అందులో నుంచి రూ. 20 తీసి వాటర్ బాటిల్‌ను కొట్టేయలేదు కొనుక్కొని వెళ్తున్నా అన్నట్లుగా చూపుతూ అక్కడి నుంచి వెనుతిరిగాడు.
Comments
Please login to add a commentAdd a comment