‘ఆ ముగ్గురు’ ముచ్చెమటలు పట్టిస్తున్నారు | Three TMC Women MPs Elected To Parliament From West Bengal | Sakshi
Sakshi News home page

త్రిమణుల్‌ పార్టీ

Published Fri, Jul 5 2019 12:31 AM | Last Updated on Fri, Jul 5 2019 8:43 AM

Three TMC Women MPs Elected To Parliament From West Bengal - Sakshi

నుస్రత్‌ జహాన్, మిమీ చక్రవర్తి, మహువా మొయ్‌త్రా. ముగ్గురూ ఫస్ట్‌ టైమ్‌ ఎంపీలు. ముగ్గురూ పశ్చిమ బెంగాల్  ఎంపీలు. ముగ్గురూ తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీలు. ముగ్గురూ వేర్వేరే అయినా ఒక్కొక్కరూ ఒక్కో మమతా బెనర్జీ! ఇప్పుడా ముగ్గురూ ఢిల్లీలో ఉన్నారు. రోజూ పార్లమెంటు సమావేశాలకు వెళ్లొస్తున్నారు. ఊరికే వెళ్లిరావడం కాదు. ‘ఫస్ట్‌ టైమ్‌ కదా’ అని మౌనంగా కూర్చొని రావడం లేదు. వర్షాకాల సమావేశాలకే ముచ్చెమటలు పోయిస్తున్నారు! మాటల్తో ఒకరు.. ట్వీట్‌లతో ఒకరు.. యాటిట్యూడ్‌తో ఒకరు.  మాటలు మొయ్‌త్రావి.  ట్వీట్‌లు నుస్రత్‌వి. యాటిట్యూడ్‌ మిమీది. లక్ష్మి, పార్వతి, సరస్వతి.. త్రిశక్తులు. నేటి రాజకీయాల్లో కావలసింది. అలాంటి శక్తిమణులే. తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఈ ముగ్గురు ఎంపీలూ త్రిమణులేనని అంటున్నారు బెంగాల్‌ ప్రజలు.

పాలిటిక్స్‌లోకి రాకముందు మొయ్‌త్రా జేపీ మోర్గాన్‌ కంపెనీలో ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్‌. కంపెనీ ఉన్న న్యూయార్క్‌లో, కంపెనీ బ్రాంచ్‌ ఉన్న లండన్‌లో పని చేశారు. కెరీర్‌ బాగా పీక్‌లో ఉన్నప్పుడు పాలిటిక్స్‌లోకి వచ్చేశారు. ‘పిచ్చా!’ అన్నారు తెలిసివాళ్లు. మొయ్‌త్రా పట్టించుకోలేదు. 2009లో విదేశాల నుంచి వచ్చీ రావడంతోనే బీజేపీ సోషల్‌ మీడియాను కంట్రోల్‌ చేస్తోందనీ, కత్తెర వేస్తోందని విరుచుకుపడ్డారు. అప్పుడు మాత్రమే ఆమె ఎవరో బెంగాల్‌ ప్రజలకు తెలిసింది. ఇప్పుడీ  సమావేశాల్లో దేశం మొత్తానికీ తెలిసింది. ఎన్డీయే నియంతృత్వ పోకడలపై ఆమె ప్రారంభ ప్రసంగం పార్లమెంట్‌ను ఊపి పడేసింది.  సభలో ఆమె ఆవేశం, ఆగ్రహం, మాటల ప్రవాహం, ఆమె తీసిన పాయింట్‌లు, రూలింగ్‌ పార్టీని ఆమె పొడుతున్న పోట్లు ఇంటర్నెట్‌ను జామ్‌ చేశాయి. 543 మంది సభ్యులున్న లోక్‌సభ.. ఆమె మాట్లాడుతున్నంత సేపూ కళ్లింత చేసి చూస్తూనే ఉంది. ఒకరిద్దరు సీనియర్స్‌ ‘ఇక చాలు కూర్చోమ్మా’ అన్నారు. వాళ్ల మాటలు మొయ్‌త్రా ప్రసంగ ధ్వనిలో కొట్టుకుని పోయాయి. అపోజిషన్‌కు వేలు పెట్టడానికైనా పట్టు లేని సభలో ఆమె ఆ ఒక్క ప్రసంగంతో ‘ఉమన్‌ హీరో ఆఫ్‌ ది నేషన్‌’ అయ్యారు. 

మిగతా ఇద్దరు.. నుస్రత్‌ జహాన్, మిమీ చక్రవర్తి! ఇద్దరూ ముప్పైలలో ఉన్నవారు. బెంగాల్‌ గ్లామర్‌ ఇండస్ట్రీ నుంచి వచ్చినవారు. ఇప్పటికే పార్లమెంటు బయట నుస్రత్‌ జహాన్‌ తనేమిటో చూపించారు. పేరును బట్టి ఆమె ముస్లిం అని తెలుస్తూనే ఉంది. ముస్లిం అయి ఉండి, హిందూ సంప్రదాయం ప్రకారం నుదుటిపై సిందూరాన్ని పెట్టుకుని, చీర ధరించి పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేసినందుకు నెటిజన్‌లు ఆమెను ట్రోల్‌ చేశారు. వాటికి నుస్రత్‌ గట్టి సమాధానమే ఇచ్చారు. ‘సిందూరం భారతదేశానికి సంకేతం తప్ప ఒక కులానికో, మతానికో కాదు. హింసను, పగను ప్రేరేపించే ఉన్మాదుల కామెంట్‌లను నేను పట్టించుకోను. నేనేం ధరించాలన్నది పూర్తిగా నా ఇష్టం. ముస్లింగానే ఉంటూ అన్ని మతాలను గౌరవిస్తాను’’ అని నుస్రత్‌ ట్వీట్‌ చేశారు. ఈ వ్యాఖ్యలను మొదట సమర్థించినవారు సాటి ఫస్ట్‌ టైమ్‌ ఎంపీ మిమీ చక్రవర్తి. ‘‘నుస్రత్‌ నిజమైన భారతీయ స్త్రీని ప్రతిబింబించింది’’ అన్నారు మిమీ. భారతీయ ఇస్లాం ప్రపంచంలో మాత్రం నుస్రత్‌ మాటలకు పెద్ద దుమారమే చెలరేగింది.

యూపీలోని ప్రసిద్ధ ‘జమీమా షేక్‌ ఉల్‌ హింద్‌’ మత పెద్ద అసద్‌ క్వాస్మీ మరికొంచెం వెనక్కు వెళ్లి నుస్రత్‌ను విమర్శించారు. ‘‘ఇస్లాంలో ఇతర మతస్థుల వారిని పెళ్లి చేసుకోవడం నిషిద్ధం. కానీ నుస్రత్‌ జైనమతానికి చెందిన వ్యక్తిని వివాహమాడారు. సిందూరం ధరించడం  ఇస్లాంకు వ్యతిరేకం. అయినా  ఆమె ధరించారు. నుస్రత్‌ సినిమా రంగం నుంచి వచ్చినట్లు నాకు తెలియదు. సినిమా వాళ్లు సంప్రదాయాలు పాటించరు’’అని అసద్‌ అన్నారు. ఆయన అలా అంటే.. బీజేపీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ మరోలా అన్నారు. నుస్రత్‌ను హిందూ మతంలోకి ఆహ్వానించారు. అక్కడితో ఆగకుండా.. ‘‘భవిష్యత్తు హిందూమతంలోనే సురక్షితంగా ఉంటుందని, హిందూమతం స్త్రీలను గౌరవిస్తుందని నుస్రత్‌ గుర్తించారు’’ అని అన్నారు. ఎవరికి కావలసిన విధంగా వారు నుస్రత్‌ వ్యాఖ్యలకు అన్వయం చెప్పుకున్నప్పటికీ ఆమె ఉద్దేశం మాత్రం ఒకటే. తను భారతీయురాలినని చెప్పడం.  

అసలు నుస్రత్, మిమీ ఢిల్లీలో తొలిసారిగా దేశ ప్రజలకు సాక్షాత్కరించినప్పుడే పార్లమెంటు ప్రాంగణం ఒక విధమైన యవ్వనశోభతో అలరారింది. ‘‘ఎవరీ అమ్మాయిలు?’’ అనుకున్నారు. ‘‘అమ్మాయిలు కాదు. ఎంపీలు’’ అనే సమాధానం వచ్చింది. ‘‘ఎంపీలేంటి ఇంత అందంగా!’’ అని మరో ప్రశ్న. ‘‘సినిమావాళ్లు కదా’’ అని సమాధానం. ‘‘ఎంత సినిమావాళ్లు అయితే మాత్రం పార్లమెంటుకు ఇలాగా రావడం.. ఇంత మోడర్న్‌గా, ఫస్ట్‌డే కాలేజీకి వచ్చినట్లుగా’’ అని విమర్శ. ఆ రోజేం జరిగిందో చూడండి. ఇద్దరూ స్మార్ట్‌ క్యాజువల్స్‌లో ఉన్నారు. క్యాజువల్‌గా పార్లమెంటుకు వచ్చినట్లు వచ్చారు. దెబ్బకు ఇంటర్నెట్‌ ‘టిజ్జీ’ అయిపోయింది. టిజ్జీ అంటే యాంగ్జయిటీ, కన్‌ఫ్యూజన్‌. ‘‘వీళ్లేంట్రా బాబూ.. ఇంతందంగా ఉన్నారు’’ యూత్‌ ఆశ్చర్యపోయింది. నిజమే. రాజకీయాల్ని కొత్తగా నిర్వచించడానికి పనిగట్టుకుని ఎంపీలుగా ఎన్నికై పార్లమెంటుకు వచ్చినట్లుగా అనిపించారు నుస్రత్, మిమీ. అక్కడ గోల్‌గప్పా, పానీపూరీ తిన్నారు. యంగ్‌ గర్ల్స్‌ అండ్‌ ఉమెన్‌తో సెల్ఫీలు దిగారు.

తర్వాత నుస్రుత్‌ టర్కీ వెళ్లిపోయి తన ఫ్యాషన్‌ బిజినెస్‌ పార్టనర్‌ నిఖిల్‌ జైన్‌ను పెళ్లి చేసుకుని వచ్చారు. అందుకే తొలి విడత ప్రమాణ స్వీకారాలలో ఆమె పార్లమెంటులో లేరు. ఒక ఇంగ్లిష్‌ చానెల్‌ అయితే ఇరవై నాలుగ్గంటలూ నుస్రుత్‌ చుట్టూతానే తిరిగింది. ఆమె హోమ్‌లో ఉంటే హోమ్‌కి. జిమ్‌లో ఉంటే జిమ్‌కి. బసిర్‌హాట్‌లో ఉంటే బసిర్‌హాట్‌కి. అది ఆమె ఎన్నికైన పార్లమెంటు నియోజకవర్గం. ముస్లిం అభ్యర్థిగా ఎన్నికై, ‘నుస్రత్‌ జహాన్‌ రూహీ జై  అనే నేను’ అని ప్రమాణ స్వీకారం చేశారామె! ‘జై హింద్‌’, ‘వందేమాతరం’, ‘జై బంగ్లా’ అన్నారు చివర్లో. ఒక్కరు మాట్లాడితే ఒట్టు.. ‘దేశమంతా నాకొక్కటే’ అని ఆమె ఆ టైప్‌లో చెప్పేశాక.

ఇక దక్షిణ కోల్‌కతాలోని జాదవ్‌పూర్‌ నియోజకవర్గం నుంచి ఎంపికైన మిమీ చక్రవర్తి.. సభలో గానీ, బయటగానీ ఎలా ఉండబోతారో ఇప్పటికైతే పూర్తిగా తెలియనప్పటికీ.. సొంత వ్యక్తిత్వం, సొంత అభిప్రాయాలు గల వ్యక్తిగా ఆమె ఇప్పటికే తనని తను రుజువు చేసుకున్నారు. ఓటు వేసి గెలిపించిన సొంత నియోజకవర్గం ప్రజలే.. ‘ఏమిటమ్మాయ్‌.. ఆ దుస్తులు! పార్లమెంటుకు వచ్చేశావ్‌ కదా.. కాస్త ఒద్దికైనవి వేసుకో’’ అన్నప్పటికీ చిరునవ్వు నవ్వారే తప్ప కొంచెం కూడా తన డ్రెసింగ్‌ స్టెయిల్‌ని మార్చుకోలేదు. ‘నా బట్టలదేముందిలెండి అత్తయ్యగారూ.. మీకేం కావాలో చెప్పండి.. చేసిపెడతాను’ అని కొత్త కోడలి లౌక్యంతో వాళ్ల అభీష్టాన్ని సున్నితంగా తిరస్కరించారు. చెప్పినట్లు చెయ్యకపోవచ్చు కానీ, అడిగింది చేసిపెట్టగల పిల్లే అనుకున్నారు కాబట్టే జాదవ్‌పూర్‌ ఓటర్లు ఆమెను గెలిపించారు.

మిమీ చక్రవర్తిపై పోటీచేసి ఓడిపోయిన వ్యక్తులు సామాన్యులేమీ కాదు. బీజేపీ ప్రత్యర్థి అనుపమ్‌హజ్రా టీచర్‌. సామాజిక కార్యకర్త. గ్రామీణ పారిశుధ్యంలో డాక్టరేట్‌ ఉంది. గ్రామీణాభి వృద్ధి మీద ఎన్నో పుస్తకాలు కూడా రాశారు. అంతర్జాతీయ పత్రికల్లో ఆయన వ్యాసాలు వస్తుంటాయి. అన్నిటినీ మించి బీజేపీ కార్డు ఉంది. అయినప్పటికీ మిమీపై ఓడిపోయారు. సీపీఎం ప్రత్యర్థి వికాస్‌ రంజన్‌ భట్టాచార్య మాజీ మేయర్‌. ‘లా’ తెలిసినవారు. చిన్నవయసులోనే రాజకీయాలలోకి వచ్చిన వారు. ఆయనా ఓడిపోయారు. వాళ్లిద్దర్నీ వదిలేసి ‘అందమైన ముఖం’గా మాత్రమే సుపరిచితురాలైన మిమీని గెలిపించుకుంది జాదవ్‌పూర్.

మళ్లొకసారి మహువా మొయ్‌త్రా దగ్గరికి వద్దాం. పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. ఈ లోపు సెంటర్‌కి, బెంగాల్‌కీ; మోదీకి, మమతకు మధ్య ఫైర్‌ అండ్‌ వార్‌ ఎలాగున్నా.. వచ్చే ఐదేళ్లూ పార్లమెంట్‌లో మొయ్‌త్రా ఏం మాట్లాడతారు, ఎలా మాట్లాడతారు అనే గమనింపు దేశవ్యాప్తంగా ఉంటుంది. ప్రధానీ ఉంటారు. అలాంటి ఒక ఎంపీ బీజేపీలో ఉంటే బాగుంటుందన్న ఆలోచన ఆయనకు వచ్చినా రావచ్చు! అంత గట్టి షాక్‌ ఇచ్చారు మొయ్‌త్రా తన స్పీచ్‌తో.. బీజేపీ పాలనలో దేశం నియంతృత్వంలోకి వెళుతోంది అనడానికి ఇవిగో..  ప్రాథమిక సంకేతాలు అని ఆమె ఒక్కో పాయింట్‌నీ సభలో ఎత్తి చూపారు. ఎవరైనా అడ్డు తగిలినప్పుడు ‘దయచేసి వాళ్లను అదుపు చేయండి’ అని మొయ్‌త్రా విజ్ఞప్తి చేస్తున్న ప్రతిసారీ ఆమె దేశంలోని లక్షలాది మంది వర్కింగ్‌ ఉమన్‌ తరఫున మాట్లాడినట్లే ఉంది. అధికారపక్షంలో పెద్ద తలకాయలు ఉంటాయి. అవి ప్రతిపక్షంలోని ‘పిల్లల్ని’ మాట్లాడనివ్వవు. విమర్శించనివ్వవు. ఆరోపణలు చేయనివ్వవు. ఆ పెద్ద తలకాయల్ని సైతం.. తను మాట్లాడుతున్నంత సేపూ ఒక ఆర్డర్‌లో పెట్టగలిగారు ఈ కృష్ణానగర్‌ ఎంపీ మొయ్‌త్రా. బీజేపీని తట్టుకుని తృణమూల్‌ కాంగ్రెస్‌ నిలబడగలిగితే కనుక మెయ్‌త్రా వచ్చే ఎన్నికల నాటికి పశ్చిమబెంగాల్‌ సీఎం అభ్యర్థిగా ఎదిగినా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు.

నుస్రత్‌  జహాన్‌ (29)
బెంగాలీ నటి. బసిర్‌ మాట్‌ ఎంపీ ∙ఈ ఏడాది మార్చిలో రాజకీయాల్లోకి వచ్చారు ∙చదువంతా కోల్‌కతాలోనే. డిగ్రీ చదివారు ∙‘ఫెయిర్‌ వన్‌ మిస్‌ కోల్‌కతా’ టైటిల్‌ (2010) విజేత. బీజేపీ ప్రత్యర్థి శాయంతన్‌ బసుపై 3.5 లక్షల మెజారిటీతో గెలిచారు ∙సెవన్‌ (2020 రిలీజ్‌) అనే సినిమాకు సంతకం చేశారు.

మిమి  చక్రవర్తి (30)
సినిమా, టీవీ నటి. జాదవ్‌పూర్‌ ఎంపీ∙ ఈ ఏడాదే పాలిటిక్స్‌లోకి వచ్చారు∙ ‘మోస్ట్‌ డిజైరబుల్‌ ఉమన్‌’ (2016 టైమ్స్‌ లిస్ట్‌). ఇంగ్లిష్‌ లిటరేచర్‌లో డిగ్రీ. చేతిలో ఇంకా రెండు మూడు సినిమాలు ఉన్నాయి∙ నిర్మొహమాటంగా మాట్లాడతారని పేరు.

మహువా మొయ్‌త్రా (44)
2019 మే 23 వరకు కరీంపూర్‌ ఎమ్మెల్యే ∙ప్రస్తుతం కృష్ణానగర్‌ ఎంపీ. కోల్‌కతాలో ఎకనమిక్స్, యు.ఎస్‌.లో మ్యాథ్స్‌ చదివారు ∙జాబ్‌ వదులుకుని 2009లో పాలిటిక్స్‌లోకి వచ్చారు∙ మొదట కాంగ్రెస్‌లో, తర్వాత తృణమూల్‌లో చేరారు. మోర్గాన్‌లో అనే కొలీగ్‌నే పెళ్లాడారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement