mimi chakraborty
-
కోల్‌కతా ఘటనపై పోస్ట్.. నటికి బెదిరింపులు
కోల్‌కతాలోని ఆస్పత్రిలో మహిళా డాక్టర్ని అత్యాచారం చేసి దారుణంగా చంపిన సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇప్పటికే చాలాచోట్ల ఆమెకు మద్ధతు తెలుపుతూ, నిందితులని కఠినంగా శిక్షించాలని నిరసన ర్యాలీలు జరుగుతున్నాయి. కోల్‌కతాలోనూ కొన్నిరోజుల క్రితం అలానే ర్యాలీ జరిగింది. ఈ క్రమంలోనే అందులో పాల్గొన్న హీరోయిన్ మిమీ చక్రవర్తికి ఇప్పడు బెదిరింపులు వస్తున్నాయి.(ఇదీ చదవండి: హీరో కిరణ్ అబ్బవరం పెళ్లి సందడి మొదలు)డాక్టర్ హత్యకు నిరసనగా ర్యాలీలో పాల్గొన్నందుకుగానూ తనని కూడా అత్యాచారం చేసి చంపుతామని బెదిరిస్తున్నారని మిమీ చక్రవర్తి చెప్పుకొచ్చింది. ఇందుకు సంబంధించిన కొన్ని స్క్రీన్ షాట్స్‌ని తన ట్విటర్లో పోస్ట్ చేసింది. మహిళల హక్కుల కోసం పోరాడుతుంటే.. కొందరేమో సోషల్ మీడియాలో అత్యాచార బెదిరింపులు చేస్తున్నారని రాసుకొచ్చింది. అలానే సైబర్ క్రైమ్ పోలీసుల్ని ట్యాగ్ చేసింది.2008 నుంచి సీరియల్స్ చేసిన మిమీ.. 2012 నుంచి సినిమాల్లో హీరోయిన్గా నటించడం మొదలుపెట్టింది. 2014-2024 మధ్య మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ తరఫున ఎంపీగానూ పనిచేసింది. ఇలా ఓ సెలబ్రిటీకే వేధింపులు తప్పట్లేదు అంటే బెంగాల్లో సాధారణ మనుషులు పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు!(ఇదీ చదవండి: ఆశ్రమంలో 'డబుల్ ఇస్మార్ట్' హీరోయిన్.. త్వరలో సన్యాసం)AND WE ARE DEMANDING JUSTICE FOR WOMEN RIGHT????These are just few of them.Where rape threats has been normalised by venomous men masking themselves in the crowd saying they stand by women.What upbringing nd education permits this????@DCCyberKP pic.twitter.com/lsU1dUOuIs— Mimi chakraborty (@mimichakraborty) August 20, 2024 -
టీఎంసీ ఎంపీ మిమి చక్రవర్తి రాజీనామా
కోల్‌కతా: ప్రముఖ బెంగాలీ నటి, టీఎంసీ ఎంపీ మిమి చక్రవర్తి పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనా మా చేసినట్లు చెప్పారు. రాజకీయాలు తనకు ఇష్టం లేని అంశమని చెప్పారు. జాదవ్‌పూర్ నుంచి మొదటిసారిగా లోక్‌సభకు ఎన్నికైన మిమి గురువారం టీఎంసీ చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీని రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలో కలిశారు. ఈ నెల 13వ తేదీనే పదవికి రాజీనామా లేఖను పంపినట్లు అనంతరం తెలిపారు. తనకు రాజకీయాలు పడవని అనుభవం ద్వారా తెలుసుకున్నానని చెప్పారు. అయితే, రాజీనామాను సీఎం మమత అంగీకరించిందీ లేనిదీ మిమి తెలుపలేదు. టీఎంసీ అంగీకరించాక నిబంధనల మేరకు లోక్‌సభ స్పీకర్‌కు రాజీనామా లేఖను అందజేస్తానన్నారు. మరికొద్ది నెలల్లోనే లోక్‌సభ ఎన్నికలు జరగనుండగా ఈ పరిణామం చోటుచేసుంది. -
టీఎంసీకి షాక్.. ఎంపీ సభ్యత్వానికి మిమీ చక్రవర్తి రాజీనామా
కోల్‌కతా: సార్వత్రిక ఎన్నికల ముందు పశ్చిమబెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి షాక్ తగిలింది. నటి, టీఎంసీ నేత మిమీ చక్రవర్తి తన లోక్‌సభ ఎంపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన నియోజకవర్గంలో స్థానిక పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె ప్రకటించారు స్థానిక నేతలతో విభేదాల కారణంగానే తాను రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. కాగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో జాదవ్‌పూర్ స్థానం నుంచి మిమీ చక్రవర్తి ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. తన రాజీనామా లేఖను టీఎంసీ అధినేతి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి అందజేశారు. అయితే ఆమె సీఎం ఆమోదించలేదు. ప్రొటోకాల్ ప్రకారం లోక్‌సభ ఎంపీ రాజీనామాను స్పీకర్‌కు సమర్పించాలి. ఇంకా లోక్‌సభ స్పీకర్‌కు రాజీనామాను అందజేయ్యకపోవడంతో ఇది అధికారిక రాజీనామాగా పరిగణించకపోవచ్చు. -
సినిమా స్టోరీని తలపించే మోసాలు, ఆఖరికి తల్లిదండ్రులను కూడా
కోల్‌కతా: ఒంటిపై మడత నలగని సూటు, బూటు. ఐఏఎస్ అధికారిగా దర్పం. నీలి బుగ్గకారులో ప్రయాణం. ప్రముఖ రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉన్నతాధికారులతో పరిచయాలు. ప్రజా సేవకుడిగా ఫోజులు. మున్సిపల్ కార్పొరేషన్లో కీలక అధికారినంటూ జనాన్ని మభ్యపెట్టడం. ప్రజల్లో ‘గుర్తింపు’కోసం పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఓ మోసగాడు సాగించిన లీలలు ఇవీ. సొంత డబ్బులతో ఉత్తుత్తి కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలు నిర్వహించి, చివరికి పోలీసులకు దొరికిపోయాడు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడాడంటూ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. సదరు మాయగాడు ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కిస్తున్నాడు. పశ్చిమ బెంగాల్‌లోని సీల్దా ప్రాంతానికి చెందిన దేవాంజన్ దేవ్ వయసు కేవలం 28 సంవత్సరాలు. అయితేనేం మోసాల్లో ఆరితేరిపోయాడు. అతడి తండ్రి మనోరంజన్ దేవ్ బెంగాల్ ఎక్సైజ్ శాఖలో డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేసి, పదవీ విరమణ పొందారు. దేవాంజన్ చారుచంద్ర కాలేజీలో జువాలజీ సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాడు. కలకత్తా యూనివర్సిటీలో జెనటిక్స్లో పీజీ చదవడానికి ప్రవేశం పొందాడు. కానీ, చదువు మధ్యలోనే అటకెక్కింది. 2014లో సివిల్ సర్వీసెస్ పరీక్ష రాశాడు. ప్రిలిమినరీ పరీక్షలోనే విజయం సాధించలేకపోయాడు. అయినప్పటికీ పరీక్షల్లో నెగ్గానని తన తల్లిదండ్రులను నమ్మించాడు. ఐఏఎస్ అధికారిగా ట్రైనింగ్ కోసం ముస్సోరి వెళ్తున్నానని చెప్పాడు. కానీ, ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలో చేరాడు. ఆ సమయంలో కొన్ని పాటల ఆల్బమ్‌లు రూపొందించాడు. 2017లో ఇంటికి తిరిగివచ్చాడు. ట్రైనింగ్ పూర్తయ్యిందని చెప్పాడు. రాష్ట్ర సచివాలయంలో తనకు ఉద్యోగం వచ్చిందని బుకాయించాడు. అప్పటి నుంచి మోసాలే వృత్తిగా జీవనం సాగించాడు. కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ అధికారినంటూ నకిలీ లెటర్హెడ్లు, గుర్తింపు కార్డులు సృష్టించాడు. కార్పొరేషన్ ఈ–మెయిళ్లను పోలిన ఈ–మెయిళ్లు సైతం రూపొందించుకున్నాడు. పోర్జరీ పత్రాలతో బ్యాంకు ఖాతాలు తెరిచాడు. అర్బన్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ పేరిట ఓ కంపెనీ స్థాపించాడు. కోల్‌కతాలోని కస్బా ప్రాంతంలో ఆఫీసు ప్రారంభించాడు. తాను పెద్ద అధికారినని, ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటూ జనానికి చెప్పేవాడు. దీంతో ఇరుగు పొరుగు, బంధుమిత్రులు గొప్పగా చూడసాగారు. దేవాంజన్కు అమితమైన గౌరవం ఇచ్చారు. మోసాన్ని పసిగట్టిన మిమీ చక్రవర్తి 2020లో కరోనా వైరస్ వ్యాప్తిని దేవాంజన్ దేవ్ తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. శానిటైజర్లు, మాస్కులు, పీపీఈ కిట్లు, గ్లౌజ్‌లు సేకరించి, ప్రముఖుల చేతుల మీదుగా ప్రజలకు పంపిణీ చేశాడు. ఈ ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేశాడు. దీంతో అతడికి మరింత ప్రచారం లభించింది. దేవాంజన్ ఇటీవల సొంత డబ్బులతో కరోనా వ్యాక్సినేషన్ కేంద్రాలు నిర్వహించాడు. వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తామంటూ ప్రచారం సాగించాడు. ఓ వ్యాక్సినేషన్ కేంద్రానికి అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, సినీ నటి మిమీ చక్రవర్తిని ఆహ్వానించాడు. ఆమె నకిలీ టీకా తీసుకొని మోసపోయింది. అనారోగ్యానికి గురైంది కూడా. దాంతో ఆమెకు అనుమానం వచ్చింది. కోల్‌కతా మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసింది. అధికారులు రంగంలోకి దిగారు. దేవాంజన్ గుట్టును రట్టు చేశారు. అతడు నిర్వహించే వ్యాక్సినేషన్ కేంద్రాల్లో అసలైన కరోనా టీకాలకు బదులు అమికాసిన్ అనే యాంటీబయాటిక్ ఇస్తున్నట్లు గుర్తించారు. దాదాపు 2,000 మందికి ఈ ఇంజెక్షన్లు ఇచ్చినట్లు తేల్చారు. పోలీసులు అతడిపై హత్యాయత్నం కేసు పెట్టారు. -
Mimi Chakraborty: నకిలీ వ్యాక్సిన్.. నటికి అస్వస్థత
కోల్‌కతా: కోవిడ్–19 నకిలీ వ్యాక్సిన్ తీసుకున్న నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మిమి చక్రవర్తి అస్వస్థతకు లోనయ్యారు. ఆమె కడుపు నొప్పి, లో బీపీ, డీ హైడ్రేషన్‌తో బాధపడుతున్నట్టుగా శనివారం ఆమె సన్నిహితులు వెల్లడించారు. అయితే నకిలీ వ్యాక్సిన్ తీసుకున్నందువల్లే ఆమె అనారోగ్యం బారిన పడ్డారా అన్నది డాక్టర్లు ధృవీకరించాల్సి ఉంది.. ‘‘ప్రస్తుతానికి మీమీ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. ఆమె ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతున్నారు. ఆమె అనారోగ్యానికి కారణం నకిలీ వ్యాక్సినేనా అన్నది ఇప్పుడే చెప్పలేమని మిమికి చికిత్స చేసిన వైద్యుడు వెల్లడించారు. హైపర్ టెన్షన్‌తో ఆమె బాధపడుతున్నార’’ ని మిమి సన్నిహితులు తెలిపారు. కాగా, 32 ఏళ్ల మిమి గత కొంతకాలంగా లివర్ సంబంధిత జబ్బుతో బాధపడుతున్నారు. జాదవ్‌పూర్ పార్లమెంటు సభ్యురాలు మిమి చక్రవర్తిని ఐఎఎస్ అధికారిగా చెప్పుకున్న దేబాంజన్ దేబ్ అనే వ్యక్తి కరోనా టీకా కేంద్రానికి ముఖ్య అతిథి ఆహ్వానించడంతో ఆమె వెళ్లి టీకా తీసుకున్నారు. అయితే వ్యాక్సిన్ సర్టిఫికెట్ రాకపోవడంతో మిమి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారించగా అది నకిలీ వ్యాక్సిన్ కాంప్ అని తేలిన విషయం తెలిసిందే. చదవండి: నటికి టోకరా ఇలా... -
ఐఏఎస్ అధికారినంటూ.. నటి, ఎంపీకి నకిలీ టీకా
కోల్‌కతా: ఐఏఎస్ అధికారిని.. వ్యాక్సినేషన్ క్యాంప్‌ని ప్రారంభించాల్సిందిగా నటి, ఎంపీ మిమి చక్రవర్తిని కోరడమే కాక.. ఆమెకు కూడా నకిలీ వ్యాక్సిన్ వేసిన ఓ వ్యక్తిని కోల్‌కతా పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. టీకా తీసుకున్న తర్వాత ఆమె మొబైల్‌కు ఎలాంటి మెసేజ్ రాకపోవడంతో అనుమానించిన మిమి చక్రవర్తి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన అధికారులు మిమి చక్రవర్తిని బురిడీ కొట్టించిన వ్యక్తి దేవాంజన్ దేవ్‌ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమబెంగాల్ కోల్‌కతా సమీపంలోని కస్బా ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ సందర్భంగా మిమి చక్రవర్తి మాట్లాడుతూ.. ‘‘దేవాంజన్ దేవ్ అనే వ్యక్తి కొన్ని రోజుల క్రితం నా దగ్గరకు వచ్చి తనను తాను ఐఏఎస్ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ అధ్వర్యంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని తెలిపాడు. నన్ను ముఖ్య అతిథిగా హాజరుకావాల్సిందిగా కోరాడు. అతడు చేస్తున్నది మంచి పని కావడంతో సరే అన్నాను. టీకా తీసుకునేలా జనాలను ప్రోత్సాహించడం కోసం నేను కూడా వ్యాక్సిన్ తీసుకున్నాను’’ అని తెలిపారు. ‘‘వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత నాకు ఎలాంటి సర్టిఫికేట్ ఇవ్వలేదు. దాని గురించి నిందితుడిని ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానం చెప్పాడు. ఆ తర్వాత టీకా తీసుకున్నట్లు కోవిన్ నుంచి నా సెల్‌కు ఎలాంటి మెసేజ్ రాలేదు. దాంతో నాకు అనుమానం వచ్చి.. నాతో పాటు వ్యాక్సిన్ తీసుకున్న వారిని ప్రశ్నించాను. వారు కూడా నాలానే తమకు ఎలాంటి సర్టిఫికేట్ ఇవ్వలేదని.. టీకా వేసుకున్నట్లు ఎలాంటి మెసేజ్ రాలేదని తెలిపారు. ఈ వ్యవహారం ఏదో తేడాగా ఉందని భావించి పోలీసులకు ఫిర్యాదు చేశాను. అతను నీలిరంగు బెకన్, నకిలీ స్టిక్కర్ ఉన్న కారులో నా దగ్గరకు వచ్చాడు’’ మిమి చక్రవర్తి అని తెలిపారు. మిమి చక్రవర్తి ఫిర్యాదు మేరకు పోలీసులు దేవాంగన్ దేవ్‌ని అరెస్ట్ చేశారు. ఇక వ్యాక్సినేషన్ క్యాంప్‌లో దాదాపు 250 మందికి టీకా వేశారు. వీరందరికి వేసిన వ్యాక్సిన్ నిజమైనదా.. కాదా అనే దాని గురించి దర్యాప్తు చేస్తున్నారు. ఏ డోస్ మీద కూడా ఎక్స్పైరీ డేట్ లేకపోవడంతో ప్రస్తుతం వాటిని కోల్‌కతాకు పంపినట్లు అధికారులు తెలిపారు. చదవండి: నిర్మాత సురేష్ బాబును బురిడీ కొట్టించిన కేటుగాడు -
డ్రగ్స్ కేసు: వాళ్లంతా భార్యల కోసం ప్రార్థిస్తారు!
కోల్‌కతా: బాలీవుడ్లో ప్రకంపనలు రేపుతున్న డ్రగ్స్ వ్యవహారంపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, నటి మిమి చక్రవర్తి స్పందించారు. పితృస్వామ్య వ్యవస్థలో మహిళలు మాత్రమే మత్తుకు బానిసలై మాదకద్రవ్యాల కోసం పరితపించిపోతారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. డ్రగ్స్ కేసులో ఇంతవరకు కేవలం నటీమణులకు మాత్రమే సమన్లు జారీ అయిన నేపథ్యంలో తనదైన శైలిలో ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఈ మేరకు.. ‘‘అవును.. పితృస్వామ్యమా.. బాలీవుడ్లో ఉన్న మహిళలు హష్, డ్రగ్స్ సహా ఇంకేం కావాలనుకున్నా దాన్ని దక్కించుకుంటారు. అయితే అక్కడున్న పురుషులు మాత్రం వంటపని, ఇంటిపనిలో నిమగ్నమై, తమ భార్యలు బాగుండాలంటూ ప్రార్థనలు చేస్తారు. అంతేకాదు కళ్ల నిండా నీళ్లు నింపుకొని.. ‘‘దేవుడా తనను కాపాడు’’ అంటూ చేతులెత్తి మొక్కుతూ ఉంటారు’’అని మిమి చక్రవర్తి చురకలు అంటించారు. (చదవండి: డ్రగ్స్ కేసు: రియా ఎవరి పేర్లు చెప్పలేదు!) కాగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతితో బయటపడ్డ మాదక ద్రవ్యాల కేసులో ఇప్పటికే అతడి ప్రేయసి రియా చక్రవర్తిని ఎన్సీబీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనేతో పాటు శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్, రకుల్ ప్రీత్ సింగ్ సమన్లు జారీ చేశారు. అయితే ఈ కేసులో ఇంతవరకు ఒక్క నటుడి పేరు కూడా ఇంతవరకు బయటకు రాకపోవడం గమనార్హం. ఈ క్రమంలో మిమి చక్రవర్తి ఈ మేరకు స్పందించారు. ఇక తనను వేధించిన ఓ క్యాబ్ డ్రైవర్‌పై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని అరెస్టు చేశారు. కాగా నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న మిమి టీఎంసీలో చేరి లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు. జాదవ్‌పూర్ నియోజకవర్గానికి ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్నారు. (చదవండి: మిమి చక్రవర్తితో ట్యాక్సీ డ్రైవర్ అసభ్య ప్రవర్తన) Yes patriarchy Women in bollywood go for Hash nd drugs or whatever nd men in bollywood cook nd clean nd pray for their better half wit joined hands nd tears in eye “Bhagwan unki raksha karna” — Mimssi (@mimichakraborty) September 24, 2020 -
ఎంపీతో అసభ్య ప్రవర్తన, ట్యాక్సీ డ్రైవర్ అరెస్టు
కోల్‌కత: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, హీరోయిన్ మిమి చక్రవర్తితో అసభ్యకరంగా ప్రవర్తించిన ట్యాక్సీ డ్రైవర్‌ను కోల్‌కత పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. జిమ్ నుంచి తిరిగి ఇంటికి వెళ్తున్న ఎంపీ కారును పశ్చిమ బెంగాల్‌లోని గరియాహట్ వద్ద సదరు ట్యాక్సీ డ్రైవర్ వెంబడించడమే కాకుండా ఆసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు. దీంతో డ్రైవర్‌ను మిమి పోలీసులకు పట్టించి అతడిపై ఫిర్యాదు చేశారు. వివరాలు.. సోమవారం మధ్యాహ్నం జిమ్ నుంచి తిరిగి వస్తున్న ఎంపీ మిమి చక్రవర్తి కారును ఓ ట్యాక్సీ డ్రైవర్ వెంబడించడం ఆమె గమనించారు. అతడు కారు పక్కనే తన ట్యాక్సీని తీసుకువచ్చి అసభ్యకరంగా ప్రవర్తించాడు. అయితే మొదట ఆమె దీనిని పట్టించకోకుండా తన దారిన తను వెళ్లిపోయారు. సదరు డ్రైవర్ మళ్లీ తన కారును ఓవర్ టేక్ చేసి అదే తరహాలో ప్రవర్తించడంతో అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. (చదవండి: కరోనా ఎఫెక్ట్ : స్వీయ నిర్బంధంలో హీరోయిన్) ఎంపీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేసినట్లు గరియాహట్ పోలీసులు తెలిపారు. నిందితుడిని మెట్ర పాలిటన్ బైపాస్ సమీపంలోని ఆనందపూర్‌కు చెందిన లక్ష్మణ్ యాదవ్ (32)గా గుర్తించారు. అతనిపై ఐపీసీ సెక్షన్ 354,354ఎ,354డి, 509 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై ఎంపీ మాట్లాడుతూ.. ‘నా కారును ఓ ట్యాక్సీ వెంబడించడం గమనించాను. నేను నా కారులో ఉన్నాను. అయితే ఆ డ్రైవర్ నా వైపు చూస్తూ అసభ్యకరంగా సైగ చేశాడు. మొదట అది నేను పట్టించుకోకుండా నా కారు వేగంగా ముందుకు పోనిచ్చాడు. అతడు నా కారు అతి వేగంగా ఓవర్ టేక్ చేసి మళ్లీ అదే తరహా ఆసభ్యకరంగా సైన్ చేశాడు. ఇప్పుడు నేను అతడిని వదిలేస్తే ఆ తర్వాత అతడి ట్యాక్సీలో ప్రయాణించే మరికొందరూ స్త్రీలు కూడా అతడి వేధింపులు ఎదుర్కొవాల్సి వస్తుంది. అది సురక్షితం కాదని ఆలోచించాను. వెంటనే అతడి కారును వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించాను’ అని ఆమె ఓ ప్రకటనలో తెలిపారు.(చదవండి: శివసైనికుల దాడి : బీజేపీలో చేరిన నేవీ అధికారి) -
కరోనా ఎఫెక్ట్ : స్వీయ నిర్బంధంలో హీరోయిన్
కోల్‌కతా : భారత్‌లో కరోనా వైరస్ సోకినవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కరోనా పాజిటివ్‌గా తేలినవారిలో ఎక్కువ మంది విదేశాల నుంచి వచ్చినవారే ఉన్నారు. ఈ నేపథ్యంలో విదేశీ ప్రయాణం ముగించుకుని ఇండియా చేరుకున్న పలువురు స్వీయ నిర్బంధంలో ఉంటున్నారు. తాజాగా బెంగాలీ నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మిమి చక్రవర్తి కూడా ఆ జాబితాలో చేరిపోయారు. తన తాజా చిత్రం బాజి షూటింగ్ కోసం లండన్‌కు వెళ్లిన మిమి చక్రవర్తి మంగళవారం ఇండియా చేరుకున్నారు. కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో థర్మల్ స్క్రీనింగ్ చేయించుకోవడంతోపాటు, కరోనా వైరస్‌కు సంబంధించి ఇతర ఫార్మాలిటీలను కూడా పూర్తి చేశారు. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా 7 రోజుల పాటు ఇంట్లో స్వీయ నిర్బంధంలో ఉండనున్నట్టు మిమి చక్రవర్తి ప్రకటించారు. ఈ 7 రోజులు పాటు ఎవరిని కలవకూడదని నిర్ణయం తీసుకున్నారు. ‘నేను యూకే నుంచి దుబాయ్ మీదుగా ఇండియాకు వచ్చాను. అందుకే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ఇంట్లో నన్ను కలవద్దని నా తల్లిదండ్రులకు చెప్పాను. నా తండ్రికి ఇప్పుడు 65 ఏళ్లు. 7 రోజుల పాటు ఇంట్లోనే ఉండాలని నిర్ణయించుకున్నాను. మనం ప్రస్తుతం చాలా కష్ట కాలంలో ఉన్నాం. కానీ తొందరలోనే ఈ పరిస్థితి మారుతుంది. ప్రభుత్వం చెప్పిన విధంగా శుభ్రత, చేతులు కడుక్కోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. భద్రత చర్యల్లో భాగంగా ఇతరులతో దూరంగా మెలగాలి’ అని తెలిపారు. చదవండి : సౌదీ పర్యటన; బీజేపీ ఎంపీ స్వీయ నిర్బంధం ఎయిర్‌పోర్టు అధికారులపై సోనం ప్రశంసలు! -
డాన్స్‌తో అదరగొట్టిన మహిళా ఎంపీలు
కోల్‌కతా: సంచలనాలకు, వివాదాలకు మారు పేరుగా నిలిచారు తృణమూల్ కాంగ్రెస్ యువ ఎంపీలు నుస్రత్ జహాన్, మిమి చక్రవర్తి. సినిమా రంగం నుంచి అది కూడా అతి చిన్న వయసులోనే పార్లమెంటుకు ఎన్నికయ్యి రికార్డు సృష్టించిన వీరు.. ప్రతి నిత్యం ఏదో ఓ వార్తతో మీడియాలో కనిపిస్తూనే ఉంటారు. వీరిలో నుస్రత్ జహాన్ ముస్లిం అనే సంగతి తెలిసిందే. ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఆమె హిందూ సంప్రదాయ పద్దతిలో నుదుట సింధూరం, చీర ధరించి హాజరయ్యి విమర్శల పాలయ్యారు. అయితే తనను విమర్శించే వారిని పెద్దగా పట్టించుకోరు నుస్రత్. ఈ క్రమంలో తాజాగా ఈ యువ ఎంపీలు మరోసారి వార్తాల్లో నిలిచారు. పశ్చిమ బెంగాల్లో దసరా నవరాత్రి ఉత్సవాలు ఎంత ఘనంగా జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం బెంగాల్ ప్రజలు దుర్గా పూజ కోసం సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో దుర్గా పూజ ఉత్సవాల ప్రధాన్యతను తెలిపే థీమ్ సాంగ్‌ను ఒకదాన్ని రిలీజ్ చేశారు. అయితే ఈ సాంగ్‌లో టీఎంసీ ఎంపీలు నుస్రత్ జహాన్, మిమి చక్రవర్తి నటిచడం విశేషం. టీఎంటీ బార్ కంపెనీ రిలీజ్ చేసిన ఈ సాంగ్‌లో ఇద్దరు ఎంపీలు దుర్గా మాతను పూజిస్తూ.. డాన్స్ చేశారు. వీరితో పాటు మరో ప్రసిద్ధ బెంగాలీ నటి శుభశ్రీ గంగూలి కూడా ఈ ఆడిపాడారు. ‘ఆషే మా దుర్గా షే’ టైటిల్‌తో ఉన్న ఈ పాటకు ఇంద్రదీప్ దాస్ గుప్తా సంగీతం అందించారు. బాబా యాదవ్ కొరియోగ్రాఫ్ చేసిన ఈ పాట ఇంటర్నెట్లో దుమ్ము రేపుతోంది. ఫేస్బుక్లో పోస్ట్ చేసిన ఈ పాట ఇప్పటికే 1.5 మిలియన్ వ్యూస్ సంపాదించింది. -
హనీమూన్: భర్తతో విహరిస్తున్న ఎంపీ!
నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్, భర్త నిఖిల్ జైన్‌తో కలిసి మాల్దీవుల్లో ప్రణయయాత్ర చేస్తున్నారు. పార్లమెంటుకు తొలిరోజు వెస్టర్న్ దుస్తులు ధరించి వచ్చినందుకు తృణమూల్ ఎంపీలైన నుస్రత్ జహాన్, మిమి చక్రవర్తి సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. నూతన దంపతులైన నుస్రత్, నిఖిల్ ప్రస్తుతం మాల్దీవుల్లో హానీమూన్ జరుపుకొంటున్నారు. ఈ హనీమూన్‌కు సంబంధించి పలు ఫొటోలను నుస్రత్ జహాన్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. యెల్లో ప్యాంట్, కలర్‌ఫుల్ ప్రింటెడ్ టాప్ ధరించి.. స్టైలిష్ హ్యాట్ పెట్టుకొని.. భర్తతో దిగిన ఓ ఫొటోను ఆమె పోస్టు చేశారు. మరోవైపు ఈ ప్రయణయాత్రలోనే ఆమె హిందూ మహిళల తరహాలో సంప్రదాయబద్ధంగా సింధూర దూజ్‌ను జరుపుకున్నారు. హిందూ వైవాహిక సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ.. చీరను ధరించి.. నుదుట కుంకమ పెట్టుకొని.. ఆమె భర్తతో కలిసి ఈ వేడుకను జరిపారు. ఇక, స్ట్రిప్డ్ బ్లూ టాప్ ధరించి ఒంటరిగా దిగిన ఫొటోను కూడా ఆమె పోస్టు చేయగా.. ‘హనీ.. హనీమూన్ ఎలా ఉంది’ అంటూ తోటి తృణమూల్ ఎంపీ మిమి చక్కవర్తి సరదాగా కామెంట్ చేశారు. ‘దీనికి ఇక్కడ హానీ బాగుంది. మూన్ బావున్నాడు. సూర్యుడే కొంచెం ఎక్కువ ఎండ కాస్తున్నాడు’ అంటూ నుస్రత్ తెలివిగా చమత్కరించారు. -
‘ఆ ముగ్గురు’ ముచ్చెమటలు పట్టిస్తున్నారు
నుస్రత్ జహాన్, మిమీ చక్రవర్తి, మహువా మొయ్‌త్రా. ముగ్గురూ ఫస్ట్ టైమ్ ఎంపీలు. ముగ్గురూ పశ్చిమ బెంగాల్ ఎంపీలు. ముగ్గురూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు. ముగ్గురూ వేర్వేరే అయినా ఒక్కొక్కరూ ఒక్కో మమతా బెనర్జీ! ఇప్పుడా ముగ్గురూ ఢిల్లీలో ఉన్నారు. రోజూ పార్లమెంటు సమావేశాలకు వెళ్లొస్తున్నారు. ఊరికే వెళ్లిరావడం కాదు. ‘ఫస్ట్ టైమ్ కదా’ అని మౌనంగా కూర్చొని రావడం లేదు. వర్షాకాల సమావేశాలకే ముచ్చెమటలు పోయిస్తున్నారు! మాటల్తో ఒకరు.. ట్వీట్లతో ఒకరు.. యాటిట్యూడ్‌తో ఒకరు. మాటలు మొయ్త్రావి. ట్వీట్లు నుస్రత్వి. యాటిట్యూడ్ మిమీది. లక్ష్మి, పార్వతి, సరస్వతి.. త్రిశక్తులు. నేటి రాజకీయాల్లో కావలసింది. అలాంటి శక్తిమణులే. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఈ ముగ్గురు ఎంపీలూ త్రిమణులేనని అంటున్నారు బెంగాల్ ప్రజలు. పాలిటిక్స్‌లోకి రాకముందు మొయ్‌త్రా జేపీ మోర్గాన్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్. కంపెనీ ఉన్న న్యూయార్క్‌లో, కంపెనీ బ్రాంచ్ ఉన్న లండన్‌లో పని చేశారు. కెరీర్ బాగా పీక్‌లో ఉన్నప్పుడు పాలిటిక్స్‌లోకి వచ్చేశారు. ‘పిచ్చా!’ అన్నారు తెలిసివాళ్లు. మొయ్‌త్రా పట్టించుకోలేదు. 2009లో విదేశాల నుంచి వచ్చీ రావడంతోనే బీజేపీ సోషల్ మీడియాను కంట్రోల్ చేస్తోందనీ, కత్తెర వేస్తోందని విరుచుకుపడ్డారు. అప్పుడు మాత్రమే ఆమె ఎవరో బెంగాల్ ప్రజలకు తెలిసింది. ఇప్పుడీ సమావేశాల్లో దేశం మొత్తానికీ తెలిసింది. ఎన్డీయే నియంతృత్వ పోకడలపై ఆమె ప్రారంభ ప్రసంగం పార్లమెంట్‌ను ఊపి పడేసింది. సభలో ఆమె ఆవేశం, ఆగ్రహం, మాటల ప్రవాహం, ఆమె తీసిన పాయింట్లు, రూలింగ్ పార్టీని ఆమె పొడుతున్న పోట్లు ఇంటర్నెట్ను జామ్ చేశాయి. 543 మంది సభ్యులున్న లోక్‌సభ.. ఆమె మాట్లాడుతున్నంత సేపూ కళ్లింత చేసి చూస్తూనే ఉంది. ఒకరిద్దరు సీనియర్స్ ‘ఇక చాలు కూర్చోమ్మా’ అన్నారు. వాళ్ల మాటలు మొయ్‌త్రా ప్రసంగ ధ్వనిలో కొట్టుకుని పోయాయి. అపోజిషన్‌కు వేలు పెట్టడానికైనా పట్టు లేని సభలో ఆమె ఆ ఒక్క ప్రసంగంతో ‘ఉమన్ హీరో ఆఫ్ ది నేషన్’ అయ్యారు. మిగతా ఇద్దరు.. నుస్రత్ జహాన్, మిమీ చక్రవర్తి! ఇద్దరూ ముప్పైలలో ఉన్నవారు. బెంగాల్ గ్లామర్ ఇండస్ట్రీ నుంచి వచ్చినవారు. ఇప్పటికే పార్లమెంటు బయట నుస్రత్ జహాన్ తనేమిటో చూపించారు. పేరును బట్టి ఆమె ముస్లిం అని తెలుస్తూనే ఉంది. ముస్లిం అయి ఉండి, హిందూ సంప్రదాయం ప్రకారం నుదుటిపై సిందూరాన్ని పెట్టుకుని, చీర ధరించి పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేసినందుకు నెటిజన్లు ఆమెను ట్రోల్ చేశారు. వాటికి నుస్రత్ గట్టి సమాధానమే ఇచ్చారు. ‘సిందూరం భారతదేశానికి సంకేతం తప్ప ఒక కులానికో, మతానికో కాదు. హింసను, పగను ప్రేరేపించే ఉన్మాదుల కామెంట్లను నేను పట్టించుకోను. నేనేం ధరించాలన్నది పూర్తిగా నా ఇష్టం. ముస్లింగానే ఉంటూ అన్ని మతాలను గౌరవిస్తాను’’ అని నుస్రత్ ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యలను మొదట సమర్థించినవారు సాటి ఫస్ట్ టైమ్ ఎంపీ మిమీ చక్రవర్తి. ‘‘నుస్రత్ నిజమైన భారతీయ స్త్రీని ప్రతిబింబించింది’’ అన్నారు మిమీ. భారతీయ ఇస్లాం ప్రపంచంలో మాత్రం నుస్రత్ మాటలకు పెద్ద దుమారమే చెలరేగింది. యూపీలోని ప్రసిద్ధ ‘జమీమా షేక్ ఉల్ హింద్’ మత పెద్ద అసద్ క్వాస్మీ మరికొంచెం వెనక్కు వెళ్లి నుస్రత్‌ను విమర్శించారు. ‘‘ఇస్లాంలో ఇతర మతస్థుల వారిని పెళ్లి చేసుకోవడం నిషిద్ధం. కానీ నుస్రత్ జైనమతానికి చెందిన వ్యక్తిని వివాహమాడారు. సిందూరం ధరించడం ఇస్లాంకు వ్యతిరేకం. అయినా ఆమె ధరించారు. నుస్రత్ సినిమా రంగం నుంచి వచ్చినట్లు నాకు తెలియదు. సినిమా వాళ్లు సంప్రదాయాలు పాటించరు’’అని అసద్ అన్నారు. ఆయన అలా అంటే.. బీజేపీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ మరోలా అన్నారు. నుస్రత్‌ను హిందూ మతంలోకి ఆహ్వానించారు. అక్కడితో ఆగకుండా.. ‘‘భవిష్యత్తు హిందూమతంలోనే సురక్షితంగా ఉంటుందని, హిందూమతం స్త్రీలను గౌరవిస్తుందని నుస్రత్ గుర్తించారు’’ అని అన్నారు. ఎవరికి కావలసిన విధంగా వారు నుస్రత్ వ్యాఖ్యలకు అన్వయం చెప్పుకున్నప్పటికీ ఆమె ఉద్దేశం మాత్రం ఒకటే. తను భారతీయురాలినని చెప్పడం. అసలు నుస్రత్, మిమీ ఢిల్లీలో తొలిసారిగా దేశ ప్రజలకు సాక్షాత్కరించినప్పుడే పార్లమెంటు ప్రాంగణం ఒక విధమైన యవ్వనశోభతో అలరారింది. ‘‘ఎవరీ అమ్మాయిలు?’’ అనుకున్నారు. ‘‘అమ్మాయిలు కాదు. ఎంపీలు’’ అనే సమాధానం వచ్చింది. ‘‘ఎంపీలేంటి ఇంత అందంగా!’’ అని మరో ప్రశ్న. ‘‘సినిమావాళ్లు కదా’’ అని సమాధానం. ‘‘ఎంత సినిమావాళ్లు అయితే మాత్రం పార్లమెంటుకు ఇలాగా రావడం.. ఇంత మోడర్న్‌గా, ఫస్ట్‌డే కాలేజీకి వచ్చినట్లుగా’’ అని విమర్శ. ఆ రోజేం జరిగిందో చూడండి. ఇద్దరూ స్మార్ట్ క్యాజువల్స్లో ఉన్నారు. క్యాజువల్‌గా పార్లమెంటుకు వచ్చినట్లు వచ్చారు. దెబ్బకు ఇంటర్నెట్ ‘టిజ్జీ’ అయిపోయింది. టిజ్జీ అంటే యాంగ్జయిటీ, కన్ఫ్యూజన్. ‘‘వీళ్లేంట్రా బాబూ.. ఇంతందంగా ఉన్నారు’’ యూత్ ఆశ్చర్యపోయింది. నిజమే. రాజకీయాల్ని కొత్తగా నిర్వచించడానికి పనిగట్టుకుని ఎంపీలుగా ఎన్నికై పార్లమెంటుకు వచ్చినట్లుగా అనిపించారు నుస్రత్, మిమీ. అక్కడ గోల్గప్పా, పానీపూరీ తిన్నారు. యంగ్ గర్ల్స్ అండ్ ఉమెన్‌తో సెల్ఫీలు దిగారు. తర్వాత నుస్రుత్ టర్కీ వెళ్లిపోయి తన ఫ్యాషన్ బిజినెస్ పార్టనర్ నిఖిల్ జైన్‌ను పెళ్లి చేసుకుని వచ్చారు. అందుకే తొలి విడత ప్రమాణ స్వీకారాలలో ఆమె పార్లమెంటులో లేరు. ఒక ఇంగ్లిష్ చానెల్ అయితే ఇరవై నాలుగ్గంటలూ నుస్రుత్ చుట్టూతానే తిరిగింది. ఆమె హోమ్‌లో ఉంటే హోమ్‌కి. జిమ్‌లో ఉంటే జిమ్‌కి. బసిర్హాట్లో ఉంటే బసిర్హాట్కి. అది ఆమె ఎన్నికైన పార్లమెంటు నియోజకవర్గం. ముస్లిం అభ్యర్థిగా ఎన్నికై, ‘నుస్రత్ జహాన్ రూహీ జై అనే నేను’ అని ప్రమాణ స్వీకారం చేశారామె! ‘జై హింద్’, ‘వందేమాతరం’, ‘జై బంగ్లా’ అన్నారు చివర్లో. ఒక్కరు మాట్లాడితే ఒట్టు.. ‘దేశమంతా నాకొక్కటే’ అని ఆమె ఆ టైప్‌లో చెప్పేశాక. ఇక దక్షిణ కోల్‌కతాలోని జాదవ్‌పూర్ నియోజకవర్గం నుంచి ఎంపికైన మిమీ చక్రవర్తి.. సభలో గానీ, బయటగానీ ఎలా ఉండబోతారో ఇప్పటికైతే పూర్తిగా తెలియనప్పటికీ.. సొంత వ్యక్తిత్వం, సొంత అభిప్రాయాలు గల వ్యక్తిగా ఆమె ఇప్పటికే తనని తను రుజువు చేసుకున్నారు. ఓటు వేసి గెలిపించిన సొంత నియోజకవర్గం ప్రజలే.. ‘ఏమిటమ్మాయ్.. ఆ దుస్తులు! పార్లమెంటుకు వచ్చేశావ్ కదా.. కాస్త ఒద్దికైనవి వేసుకో’’ అన్నప్పటికీ చిరునవ్వు నవ్వారే తప్ప కొంచెం కూడా తన డ్రెసింగ్ స్టెయిల్‌ని మార్చుకోలేదు. ‘నా బట్టలదేముందిలెండి అత్తయ్యగారూ.. మీకేం కావాలో చెప్పండి.. చేసిపెడతాను’ అని కొత్త కోడలి లౌక్యంతో వాళ్ల అభీష్టాన్ని సున్నితంగా తిరస్కరించారు. చెప్పినట్లు చెయ్యకపోవచ్చు కానీ, అడిగింది చేసిపెట్టగల పిల్లే అనుకున్నారు కాబట్టే జాదవ్‌పూర్ ఓటర్లు ఆమెను గెలిపించారు. మిమీ చక్రవర్తిపై పోటీచేసి ఓడిపోయిన వ్యక్తులు సామాన్యులేమీ కాదు. బీజేపీ ప్రత్యర్థి అనుపమ్హజ్రా టీచర్. సామాజిక కార్యకర్త. గ్రామీణ పారిశుధ్యంలో డాక్టరేట్ ఉంది. గ్రామీణాభి వృద్ధి మీద ఎన్నో పుస్తకాలు కూడా రాశారు. అంతర్జాతీయ పత్రికల్లో ఆయన వ్యాసాలు వస్తుంటాయి. అన్నిటినీ మించి బీజేపీ కార్డు ఉంది. అయినప్పటికీ మిమీపై ఓడిపోయారు. సీపీఎం ప్రత్యర్థి వికాస్ రంజన్ భట్టాచార్య మాజీ మేయర్. ‘లా’ తెలిసినవారు. చిన్నవయసులోనే రాజకీయాలలోకి వచ్చిన వారు. ఆయనా ఓడిపోయారు. వాళ్లిద్దర్నీ వదిలేసి ‘అందమైన ముఖం’గా మాత్రమే సుపరిచితురాలైన మిమీని గెలిపించుకుంది జాదవ్‌పూర్. మళ్లొకసారి మహువా మొయ్‌త్రా దగ్గరికి వద్దాం. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. ఈ లోపు సెంటర్‌కి, బెంగాల్‌కీ; మోదీకి, మమతకు మధ్య ఫైర్ అండ్ వార్ ఎలాగున్నా.. వచ్చే ఐదేళ్లూ పార్లమెంట్లో మొయ్‌త్రా ఏం మాట్లాడతారు, ఎలా మాట్లాడతారు అనే గమనింపు దేశవ్యాప్తంగా ఉంటుంది. ప్రధానీ ఉంటారు. అలాంటి ఒక ఎంపీ బీజేపీలో ఉంటే బాగుంటుందన్న ఆలోచన ఆయనకు వచ్చినా రావచ్చు! అంత గట్టి షాక్ ఇచ్చారు మొయ్‌త్రా తన స్పీచ్‌తో.. బీజేపీ పాలనలో దేశం నియంతృత్వంలోకి వెళుతోంది అనడానికి ఇవిగో.. ప్రాథమిక సంకేతాలు అని ఆమె ఒక్కో పాయింట్నీ సభలో ఎత్తి చూపారు. ఎవరైనా అడ్డు తగిలినప్పుడు ‘దయచేసి వాళ్లను అదుపు చేయండి’ అని మొయ్‌త్రా విజ్ఞప్తి చేస్తున్న ప్రతిసారీ ఆమె దేశంలోని లక్షలాది మంది వర్కింగ్ ఉమన్ తరఫున మాట్లాడినట్లే ఉంది. అధికారపక్షంలో పెద్ద తలకాయలు ఉంటాయి. అవి ప్రతిపక్షంలోని ‘పిల్లల్ని’ మాట్లాడనివ్వవు. విమర్శించనివ్వవు. ఆరోపణలు చేయనివ్వవు. ఆ పెద్ద తలకాయల్ని సైతం.. తను మాట్లాడుతున్నంత సేపూ ఒక ఆర్డర్లో పెట్టగలిగారు ఈ కృష్ణానగర్ ఎంపీ మొయ్‌త్రా. బీజేపీని తట్టుకుని తృణమూల్ కాంగ్రెస్ నిలబడగలిగితే కనుక మెయ్త్రా వచ్చే ఎన్నికల నాటికి పశ్చిమబెంగాల్ సీఎం అభ్యర్థిగా ఎదిగినా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. నుస్రత్ జహాన్ (29) బెంగాలీ నటి. బసిర్ మాట్ ఎంపీ ∙ఈ ఏడాది మార్చిలో రాజకీయాల్లోకి వచ్చారు ∙చదువంతా కోల్‌కతాలోనే. డిగ్రీ చదివారు ∙‘ఫెయిర్ వన్ మిస్ కోల్‌కతా’ టైటిల్ (2010) విజేత. బీజేపీ ప్రత్యర్థి శాయంతన్ బసుపై 3.5 లక్షల మెజారిటీతో గెలిచారు ∙సెవన్ (2020 రిలీజ్) అనే సినిమాకు సంతకం చేశారు. మిమి చక్రవర్తి (30) సినిమా, టీవీ నటి. జాదవ్‌పూర్ ఎంపీ∙ ఈ ఏడాదే పాలిటిక్స్‌లోకి వచ్చారు∙ ‘మోస్ట్ డిజైరబుల్ ఉమన్’ (2016 టైమ్స్ లిస్ట్). ఇంగ్లిష్ లిటరేచర్‌లో డిగ్రీ. చేతిలో ఇంకా రెండు మూడు సినిమాలు ఉన్నాయి∙ నిర్మొహమాటంగా మాట్లాడతారని పేరు. మహువా మొయ్‌త్రా (44) 2019 మే 23 వరకు కరీంపూర్ ఎమ్మెల్యే ∙ప్రస్తుతం కృష్ణానగర్ ఎంపీ. కోల్‌కతాలో ఎకనమిక్స్, యు.ఎస్.లో మ్యాథ్స్ చదివారు ∙జాబ్ వదులుకుని 2009లో పాలిటిక్స్‌లోకి వచ్చారు∙ మొదట కాంగ్రెస్‌లో, తర్వాత తృణమూల్‌లో చేరారు. మోర్గాన్‌లో అనే కొలీగ్‌నే పెళ్లాడారు. -
అధికార పార్టీ అశ్లీల రికార్డింగ్ డ్యాన్స్.. రచ్చ
కోల్‌కతా : తృణముల్ కాంగ్రెస్ ఎంపీ మిమి చక్రవర్తి మంగళవారం లోక్‌సభలో ప్రమాణం స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె నియోజకవర్గమైన జాధవ్‌పూర్‌లో టీఎంసీ కార్యకర్తలు బుధవారం ఏర్పాటు చేసిన రికార్డింగ్ డ్యాన్స్ రచ్చగా మారింది. డ్యాన్స్‌లో భాగంగా యువతి అసభ్యకరమైన దుస్తులను వేసుకొని అదే పనిగా అక్కడి యువకులను రెచ్చగెట్టే రీతిలో ప్రదర్శన చేయడం వివాదాస్పదమైంది. ఓ అధికార పార్టీ అత్యంత అసభ్యకరంగా, అశ్లీలంగా రికార్డ్ డ్యాన్స్ ప్రదర్శన నిర్వహించడంపై ప్రత్యర్థి పార్టీలు భగ్గుమంటున్నాయి. ఓ మహిళా ఎంపీని అభినందించేందుకు ఉద్దేశించిన కార్యక్రమంలో రికార్డు డ్యాన్స్‌ల పేరిట అశ్లీల నృత్యాలు చేయిస్తారా? అని మండిపడుతున్నాయి. ఆశించినరీతిలో లోక్‌సభ ఫలితాలు రాకపోవడంతో రాష్ట్రంలో ఎక్కడా వేడుకలు చేయొద్దని బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ టీఎంసీ కార్యకర్తలను ఆదేశించారు. ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తూ.. ఈ అశ్లీల నృత్య ప్రదర్శనను నిర్వహించడం గమనార్హం. ఈ వేడుకలో అత్యధిక సంఖ్యలో టీఎంసీ కార్యకర్తలే పాల్గొన్నారు. ఈ మొత్తం వీడియోనూ ఫోన్లలో రికార్డు చేసిన కొందరు యువకులు సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. బీజేపీ నాయకుడు సునీప్దాస్ ఈ వీడియోపై స్పందిస్తూ..' ఇందులో నాకు కొత్తగా ఏమి కన్పించడం లేదు. టీఎంసీలో ముందు నుంచే ఈ కల్చర్ అంతర్భాగంగా ఉంద’ని విమర్శించారు. మమతాబెనర్జీకి తెలియకుండా టీఎంసీ కార్యకర్తలు ఏ పని చేయరని, ఇప్పటికైనా ఈ సంఘటనపై మిమి చక్రవర్తి స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. -
‘అరే.. మమ్మల్ని కింద పడేస్తారా ఏంటి’
కోల్‌కతా : తృణముల్ కాంగ్రెస్ (టీఎంసీ) నుంచి పోటీచేసి తొలిసారి ఎంపీగా ఎన్నికయిన నుస్రత్ జహాన్, మిమి చక్రవర్తీలు లోక్‌సభ సభ్యులుగా మంగళవారం ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ప్రమాణ స్వీకారం అనంతరం బయటకు వచ్చిన మహిళా ఎంపీల చుట్టూ విలేకరుల గుమిగూడారు. వారిని కదలనీయకుండా చుట్టుముట్టి.. ప్రశ్నలు అడుగుతూ.. ఫోటోలు తీస్తూ ఇబ్బంది పెట్టారు. ముందుకు వెళ్లడానికి దారి లేకుండా చుట్టూ చేరారు. ఒకానొక సమయంలో ఈ మహిళా ఎంపీలు తిరిగి పార్లమెంట్‌లోకి వెళ్దామనుకున్నారు. కానీ అది కూడా వీలు పడలేదు. దాంతో తమకు దారి ఇవ్వాల్సిందిగా విలేకరులను కోరారు. అయితే వారి మాటలను ఎవరూ పట్టించుకోలేదు. దాంతో సహనం కోల్పోయిన ఈ యువ ఎంపీలు విలేకరుల మీద మండి పడ్డారు. ‘మీరంతా ఇలా చుట్టుముట్టడం చాలా ఇబ్బందిగా ఉంది. మమ్మల్ని పడేస్తారా ఏంటి.. అర్థం చేసుకోండి.. మమ్మల్ని వెళ్లనివ్వండి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరి ఇబ్బంది గమనించిన భద్రతా సిబ్బంది అక్కడకు వచ్చి.. ఎంపీలు వారి వాహనం వద్దకు వెళ్లేందుకు సాయం చేశారు. కారు దగ్గరకి వచ్చాక కూడా విలేకరులు వీరిని వదిలిపెట్టలేదు. ఒక్క ఫోటో అంటూ ఇబ్బంది పెట్టారు. దాంతో ఈ మహిళా ఎంపీలు క్యూలైన్లో తమకు దూరంగా నిలబడితే ఫోటో దిగుతామని కండిషన్ పెట్టి.. ఫోటోలు దిగి అక్కడ నుంచి బయటపడ్డారు. -
పెళ్లి తర్వాత ప్రమాణ స్వీకారం
-
పెళ్లి తర్వాత ప్రమాణ స్వీకారం
తృణముల్ కాంగ్రెస్ (టీఎంసీ) నుంచి పోటీచేసి తొలిసారి ఎంపీగా ఎన్నికయిన నుస్రత్ జహాన్, మిమి చక్రబర్తీలు లోక్‌సభ సభ్యులుగా మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. తమ ప్రమాణ స్వీకారం ’బంగ్లా’లో చేసిన వీరు, తమ ప్రసంగం చివరలో ’వందేమాతరం’, ’జై హిందీ’, ’జై బంగ్లా’ వంటి పదాలు ఉపయోగించారు. తర్వాత వెంటనే లోక్‌సభ స్పీకర్ ’ఓం బిర్లా’కు పాదాభివందనం చేశారు. నుస్రత్ జహాన్ ఇటీవలే టర్కీకు చెందిన వ్యాపారవేత్త నిఖిల్ జైన్‌ను వివాహం చేసుకోగా, మిమి చక్రబర్తీ ఆ వేడుకకు హాజరయ్యారు. దీంతో మంగళవారం సభకు వచ్చిన ఈ ఇద్దరు లోక్‌సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. నుస్రత్ జహాన్ బసిర్హాట్, మిమి జాదవ్‌పూర్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. -
‘ఇరుకు’ మాటలు
‘హవ్వా! పాశ్చాత్య దుస్తులు ధరించి పవిత్రమైన పార్లమెంట్ ముందు ఫొటోలు దిగుతారా? ఇదేమైనా సినిమా షూటింగ్ అనుకుంటున్నారా? ఎప్పుడు ఎలాంటి వస్త్రధారణ ఉండాలో మీకు తెలియదా? ఇదేమి షూటింగ్ స్పాట్ కాదు, హాలిడే డెస్టినేషన్ కాదు. పార్లమెంట్ అనేది ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటిది. టిక్‌టాక్‌ల స్థలం కాదు. పేజ్‌త్రీ పార్టీకి వెళ్లినట్టుగా ఆ డ్రెస్ ఏంటి? ఫొటోలు తీసుకోవడం మానేసి పని మీద దృష్టిపెట్టండి’ ఇలా అనేక రకాల కామెంట్లు చేశారు. ఆధునిక దుస్తులు ధరించి పార్లమెంట్ ముందు ఫొటోలు తీసుకున్నందుకు మిమి చక్రవర్తి, నుస్రత్ జహ్రాన్‌కు సోషల్ మీడియాలో ఎదురైన స్పందన ఇది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బెంగాలీ యువ నటీమణులు మిమి చక్రవర్తి, నుస్రత్ జహాన్ రూహి భారీ విజయాలు అందుకున్నారు. జాదవపూర్ నుంచి మిమి చక్రవర్తి 2,95,239 ఆధిక్యంతో విజయం సాధించగా, బాసిర్హాత్లో నుస్రత్ జహాన్ 3,50,369 మెజార్టీతో విజయదుందుభి మోగించారు. గెలిచిన ఆనందంలో ఉత్సాహంతో తొలిసారిగా పార్లమెంట్లో అడుగుపెట్టి పరవశించారు. తమ అదృష్టానికి మురిసిపోతూ ఆనంద క్షణాలను కెమెరాలో బంధించి సోషల్‌మీడియాలో షేర్ చేశారు. ఇక అక్కడి నుంచి మొదలైంది ఇరుకు మనస్కుల దాడి. ట్విటర్లో ట్రోలింగ్ మొదలెట్టేశారు. ఇంతకీ వారు ధరించిన డ్రెస్ ఏంటి? మిమి చక్రవర్తి తెల్లని చొక్కా, డెనిమ్ జీన్స్ ప్యాంట్ వేసుకోగా.. జహ్రాన్ వైన్ కలర్ పెప్పలప్ జిప్డ్ టాప్, ప్యాంట్ ధరించారు. లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్, బాలీవుడ్ నటుడు సన్నిడియోల్ కూడా జీన్స్, టీషర్టులు ధరించి తొలిసారిగా పార్లమెంట్లో అడుగుపెట్టినా ఛాందసులకు చీమ కుట్టినట్టు కూడా అనిపించదు. లోక్‌సభకు ఎన్నికైన యువతులు హుందాగా ఉన్న ఆధునిక వస్త్రాలు ధరించి పార్లమెంట్‌కు రావడం మాత్రం నేరంగా తోస్తుంది.ప్రజాప్రతినిధులు హుందాగా ఉండే దుస్తులు ధరించాలనే వాదనలో ఎవరికీ అభ్యంతరాలు ఉండవు. కానీ ఫలానా దుస్తులు వేసుకుంటేనే హుందాతనం వస్తుందని వాదించడంలో అర్థం లేదు. ఆధునిక తరానికి ప్రతినిధులుగా చట్టసభలో అడుగుపెట్టబోతున్న యువతుల వస్త్రధారణపై వివాదం చేయడం శోచనీయం. మిమి చక్రవర్తి, నుస్రత్ జహాన్ వివాదంతో మరోసారి మహిళ వస్త్రధారణ చర్చనీయాంశంగా మారింది. వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు వీరికి మద్దతుగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఎటువంటి దుస్తులు ధరించారనే దాని ఆధారంగా వీరి సామర్థ్యాలను అంచనా వేయడం సరికాదని పేర్కొన్నారు. పార్లమెంట్ చర్చల్లో వీరు ఎంత సమర్థవంతంగా పాల్గొంటారనే దానిపై దృష్టి పెట్టాలిగానీ వస్త్రధారణపై కాదని పేర్కొన్నారు. – పోడూరి నాగ శ్రీనివాసరావు, సాక్షి వెబ్ డెస్క్ ఈ వివాదాలు మాకు కొత్తేమి కాదు. గతంలోనూ ఇలాంటివి ఎదుర్కొన్నాం. ఎంపీలు అభ్యర్థులుగా ఎంపికైన నాటి నుంచే మా మీద బురద చల్లడం మొదలుపెట్టారు. మేమేంటో మా పని తీరు ద్వారానే నిరూపించుకున్నాం. ఇప్పుడు మరింత కష్టపడి పనిచేసి విమర్శలకు సమాధానం చెబుతాను. అసంబద్ధ వ్యాఖ్యలను పట్టించుకోకుండా నా నియోజకవర్గ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలన్న పట్టుదలతో ముందడుగు వేస్తాను. – నుస్రత్ జహాన్ ఏ రకంగా చూసినా నేను, నుస్రత్ జహాన్ ధరించిన దస్తులు అమర్యాదకరంగా లేవు. మగాళ్లు జీన్స్, టీషర్ట్ ధరించి పార్లమెంట్‌కు వచ్చినా ఎవరూ అభ్యంతరాలు వ్యక్తం చేయరు. మా విషయంలోనే ఎందుకు భిన్నంగా స్పందిస్తున్నారు? వస్త్రధారణ విషయంలో మమ్మల్ని ఎంతగా విమర్శించినా, దూషించినా పట్టించుకోము. పార్లమెంట్ మర్యాదను మంటగలిపామని మేము అనుకోవడం లేదు. సహజత్వం నాకు ఇష్టం. నాకు మద్దతుగా నిలిచినవారికి ధన్యవాదాలు. – మిమి చక్రవర్తి -
నాపై క్రిమినల్ కేసులు లేవు..!
కోల్‌కతా : తొలిసారిగా ఎన్నికల బరిలో దిగుతున్న బెంగాలీ నటి మిమీ చక్రవర్తి నామినేషన్ దాఖలు చేశారు. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా బెంగాల్‌లోని జాధవ్‌పూర్ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో తన మొత్తం ఆస్తుల విలువ రూ. 2. 43 కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు. ఇందులో తన చరాస్తుల విలువ 1.24 కోట్ల రూపాయలని వెల్లడించారు. నాపై క్రిమినల్ కేసులు లేవు.. తన చేతిలో ప్రస్తుతం రూ. 25 వేల నగదు ఉందని పేర్కొన్న మిమీ చక్రవర్తి, బ్యాంకు డిపాజిట్ల రూపంలో 71.89 లక్షల రూపాయలు ఉందని అఫిడవిట్లో తెలిపారు. ఇక మ్యూచువల్ ఫండ్స్ రూపంలో 50 వేల రూపాయలు కలిగి ఉన్నానని వెల్లడించారు. స్థిరాస్తుల విషయానికి వస్తే 1.19 కోట్ల రూపాయల విలువైన సొంత ఫ్లాట్ కలిగి ఉన్నానని పేర్కొన్నారు. తన కారు మీద 19 లక్షల రూపాయల లోన్ ఉందని తెలిపారు. గతేడాది ఆర్థిక సంవత్సరంలో 15.39 లక్షల రూపాయల ఆదాయం పొందినట్లు వెల్లడించారు. ఇక కలకత్తా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మిమీ చక్రవర్తి తనపై ఎటువంటి క్రిమినల్ కేసులు లేవని, ఓ కేసులోనూ తాను దోషిగా తేలలేదని అఫిడవిట్లో పేర్కొన్నారు. కాగా 2019 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ తరపున 41 శాతం సీట్లు మహిళలకు కేటాయిస్తున్నట్లు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముగ్గురు నటీమణులు నుస్రత్ జహాన్, మిమీ చక్రవర్తి, మున్ మున్ సేన్‌లకు మమత టికెట్లు ఖరారు చేశారు. వీరిలో అసనోల్ నియోజక వర్గం నుంచి కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియోకు పోటీగా మున్ మున్ సేన్ బరిలోకి దిగుతుండగా.. మిమీ చక్రవర్తి జాధవ్‌పూర్ నుంచి పోటీ చేస్తున్నారు. -
గ్లౌవ్స్‌తో కరచాలనం.. ఓటర్లపై ఇంత వివక్షా..?
కోల్కత్తా: తృణమూల్ కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థి, ప్రముఖ నటి మిమి చక్రవర్తి ఎన్నికల ప్రచారం వివాదాస్పదంగా మారింది. ప్రచారంలో భాగంగా ఆమె పోటీచేస్తున్న జాదవ్‌పూర్ నియోజకవర్గంలో శుక్రవారం తన కార్యకర్తలతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె చేతికి గ్లౌవ్స్‌లు ధరించి అభిమానులతో కరచాలనం చేశారు. ఈ చర్యతో ఆమె తీవ్ర విమర్శల పాలైయ్యారు. గ్లౌవ్స్‌లతో ఓటర్లతో కరచాలనం చేస్తున్న ఆమె ఫోటోను బీజేపీ నేత సురేందర్ పూనియా సోషల్ మీడియాలో షేర్ చేశారు. దళితులు, మైనార్టీలను కనీసం చేతితో ముట్టుకోలేని వ్యక్తిని ఎలా పార్లమెంట్‌కు ఎన్నుకోవాలి. ఓటర్లపై ఇంత వివక్షా..? ఇలాంటి వ్యక్తులు పార్లమెంట్‌కు వెళ్లేందుకు భారత ప్రజాస్వామ్యంలో అర్హత లేదని, ఘటన దురదృష్టకరమన్నారు. ఆమెకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో కామెంట్లు కావడంతో మిమి చక్రవర్తి స్పందించారు. ‘‘గత కొద్ది రోజులుగా విరామం లేకుండా ప్రచారం చేస్తున్న. కార్యకర్తలతో కరచాలనం చేసే సందర్భంగా వారి గోళ్లు తాకి చేతికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయాలకు రక్షణగా గ్లౌవ్స్‌ను వేసుకోవాల్సి వచ్చింది. అంటూ వివరించే ప్రయత్న చేశారు. Sad & Disgusting ! TMC candidate from Jadavpur Lok Sabha constituency Ms Mimi Chakraborty greeting Dalit & Poor voters with gloves in the hands 👎 Ms Queen Elizabeth, are they untouchable🤔?? Indian democracy don’t deserve such People in Parliament. pic.twitter.com/8VRd1uh526 — Major Surendra Poonia (@MajorPoonia) April 11, 2019 -
నటులే బాగా చక్కబెట్టగలరట!
సినీ గ్లామర్ ఓట్లు సాధిస్తుందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. ఆ నమ్మకంతోనే ఈసారి లోక్‌సభ ఎన్నికలకు ప్రకటించిన 42 మంది అభ్యర్థుల్లో ఐదుగురు సినీ నటులను బరిలోకి దించారు. ఈ ఐదుగురిలో నలుగురు హీరోయిన్లు. ♦ జాదవ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం టికెట్‌ను హీరోయిన్ మిమి చక్రవర్తికి ఇచ్చారు. క్రిస్‌కాస్, విలన్, టోటల్ దాదాగిరి వంటి హిట్ సినిమాల్లో మిమి నటించారు. ♦ జుల్ఫికర్, లవ్ ఎక్స్‌ప్రెస్, కెలార్ కీర్తి వంటి చిత్రాలతో పేరు తెచ్చుకున్న నస్రత్ జహాన్‌ను బసిర్హాత్ నియోజకవర్గం అభ్యర్థిగా ఎంపిక చేశారు. బంగ్లాదేశ్ సరిహద్దున ఉన్న ఈ నియోజకవర్గం మతపరంగా సున్నితమైనది. ♦ గత ఎన్నికల్లో తృణమూల్ తరఫున పోటీ చేసిన దేవ్, మూన్‌మూన్ సేన్‌కు ఈసారీ టికెట్లు ఇచ్చారు. నటులే బాగా చక్కబెట్టగలరట! ఎందుకింత మంది సినిమా వాళ్లకి అందులోనూ హీరోయిన్లకి టికెట్లిచ్చారని అడిగితే ఎందుకివ్వకూడదని ఎదురు ప్రశ్నిస్తున్నారు మమత. వాళ్లు ఇంటా బయటా బాగా చక్కబెట్టగలరని సమర్థించారు. నస్రత్ జహాన్ కూడా ఇదే అంటున్నారు. ‘ఈ రోజుల్లో మహిళలు శక్తిమంతులయ్యారు. వారు సాధించలేనిదంటూ ఏమీ లేదు. మా వృత్తిలో మేం ఎంత జాగ్రత్తగా ఉంటామో, ప్రజల విషయంలోనూ అలాగే ఉంటాం’ అన్నారామె. ఇదంతా మమత ఎన్నికల రాజకీయ వ్యూహమని విపక్షాలు, ప్రత్యర్థులే కాకుండా సొంత పార్టీ నేతలూ అంటున్నారు. సినిమా స్టార్లంటే అందరికీ ఆకర్షణే. ఓట్లు రాబట్టడంతో వారి గ్లామర్ ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాదు.. సినీ స్టార్లకు టికెట్ ఇస్తే పార్టీలో ఎవరూ వ్యతిరేకించరు. టికెట్ల కోసం పార్టీలో జరిగే కుమ్ములాటలకు ఇలా తెరవేయవచ్చు అని వారంటున్నారు. వాళ్లు నెగ్గితే పార్టీకి ప్లస్ పాయింట్ అవుతుందని, ఒకవేళ ఓడిపోయినా ఎవరూ పట్టించుకోరని అంటున్నారు. ఫామ్‌లో ఉన్న హీరోయిన్లు ఓటర్లను బాగా ఆకట్టుకోగలరని తృణమూల్ ఎంపీ సౌగత రాయ్ అన్నారు. పార్టీకి ఎంతో కాలంగా సేవ చేస్తున్న వారిని కాదని ఇలా సినిమా వాళ్లకు టికెట్లు ఇవ్వడం వల్ల పార్టీ శ్రేణులు బాధపడవా అంటే పడవని సమాధానం చెప్పారు. సినిమా వాళ్లకు టికెట్లిచ్చినందుకు ఇప్పటి దాకా పార్టీలో ఎక్కడా అసంతృప్తి వ్యక్తం కాలేదని తృణమూల్ ఎంపీ స్పష్టం చేశారు. -
సైనిక చర్య తరువాతా.. కొనసాగుతున్న సినిమా షూటింగ్
సైనిక చర్చతో అట్టుడుకుతున్న టర్కీలో బెంగాలీ సినిమాకు సంబందించిన యూనిట్ సభ్యులు చిక్కు కున్నారు. యష్ దాస్ గుప్తా, మిమి చక్రవర్తి, సౌరవ్ దాస్ లీడ్ రోల్స్ లో బిర్సా దాస్ గుప్తా దర్శకత్వంలో తెరకెక్కుతున్న బెంగాలీ సినిమా షూటింగ్ ప్రస్తుతం టర్కీలో జరుగుతోంది. అయితే షూటింగ్ సమయంలోనే టర్కీలో సైనికుల తిరుగుబాటు జరగటంతో యూనిట్ సభ్యుల బంధువులు భయాందోళనలకు గురయ్యారు. అయితే టర్కీలోని ఇస్తాంబుల్ లో షూటింగ్ జరుపుకుంటున్న యూనిట్ సభ్యుల నుంచి సురక్షితంగా ఉన్నామంటూ సమాచారం అందటంతో ఊపిరి పీల్చుకున్నారు. ఓ లోకల్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిత్ర దర్శకుడు ప్రస్తుతం టర్కీలో పరిస్థితులను వివరించారు. శుక్రవారం సాయంత్రం నుంచి అక్కడి సాధారణ పరిస్థితులు ఏర్పాడ్డాయని, సామాన్య ప్రజలు రోజువారి కార్యక్రమాలు యథావిదిగా చేసుకుంటున్నారని తెలిపాడు. దాదాపు 35 మంది బెంగాలీలతో పాటు మరో 45 మంది టర్కీకి చెందిన సాంకేతిక నిపుణుల సాయంతో సినిమా షూటింగ్ నిరాటంకంగా సాగుతున్నట్టుగా తెలిపారు. పలువురు బెంగాలీ సినీ ప్రముఖులు ఇస్తాంబుల్ లో షూటింగ్ జరుపుకుంటున్న యూనిట్ సభ్యులకు మద్దతు తెలియజేశారు.