నస్రత్ జహాన్, మిమి చక్రవర్తి
సినీ గ్లామర్ ఓట్లు సాధిస్తుందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. ఆ నమ్మకంతోనే ఈసారి లోక్‌సభ ఎన్నికలకు ప్రకటించిన 42 మంది అభ్యర్థుల్లో ఐదుగురు సినీ నటులను బరిలోకి దించారు. ఈ ఐదుగురిలో నలుగురు హీరోయిన్లు.
♦ జాదవ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం టికెట్‌ను హీరోయిన్ మిమి చక్రవర్తికి ఇచ్చారు. క్రిస్‌కాస్, విలన్, టోటల్ దాదాగిరి వంటి హిట్ సినిమాల్లో మిమి నటించారు.
♦ జుల్ఫికర్, లవ్ ఎక్స్‌ప్రెస్, కెలార్ కీర్తి వంటి చిత్రాలతో పేరు తెచ్చుకున్న నస్రత్ జహాన్‌ను బసిర్‌హాత్ నియోజకవర్గం అభ్యర్థిగా ఎంపిక చేశారు. బంగ్లాదేశ్ సరిహద్దున ఉన్న ఈ నియోజకవర్గం మతపరంగా సున్నితమైనది.
♦ గత ఎన్నికల్లో తృణమూల్ తరఫున పోటీ చేసిన దేవ్, మూన్‌మూన్ సేన్‌కు ఈసారీ టికెట్లు ఇచ్చారు.
నటులే బాగా చక్కబెట్టగలరట!
ఎందుకింత మంది సినిమా వాళ్లకి అందులోనూ హీరోయిన్లకి టికెట్లిచ్చారని అడిగితే ఎందుకివ్వకూడదని ఎదురు ప్రశ్నిస్తున్నారు మమత. వాళ్లు ఇంటా బయటా బాగా చక్కబెట్టగలరని సమర్థించారు. నస్రత్ జహాన్ కూడా ఇదే అంటున్నారు. ‘ఈ రోజుల్లో మహిళలు శక్తిమంతులయ్యారు. వారు సాధించలేనిదంటూ ఏమీ లేదు. మా వృత్తిలో మేం ఎంత జాగ్రత్తగా ఉంటామో, ప్రజల విషయంలోనూ అలాగే ఉంటాం’ అన్నారామె.
ఇదంతా మమత ఎన్నికల రాజకీయ వ్యూహమని విపక్షాలు, ప్రత్యర్థులే కాకుండా సొంత పార్టీ నేతలూ అంటున్నారు. సినిమా స్టార్లంటే అందరికీ ఆకర్షణే. ఓట్లు రాబట్టడంతో వారి గ్లామర్ ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాదు.. సినీ స్టార్లకు టికెట్ ఇస్తే పార్టీలో ఎవరూ వ్యతిరేకించరు. టికెట్ల కోసం పార్టీలో జరిగే కుమ్ములాటలకు ఇలా తెరవేయవచ్చు అని వారంటున్నారు. వాళ్లు నెగ్గితే పార్టీకి ప్లస్ పాయింట్ అవుతుందని, ఒకవేళ ఓడిపోయినా ఎవరూ పట్టించుకోరని అంటున్నారు. ఫామ్‌లో ఉన్న హీరోయిన్లు ఓటర్లను బాగా ఆకట్టుకోగలరని తృణమూల్ ఎంపీ సౌగత రాయ్ అన్నారు. పార్టీకి ఎంతో కాలంగా సేవ చేస్తున్న వారిని కాదని ఇలా సినిమా వాళ్లకు టికెట్లు ఇవ్వడం వల్ల పార్టీ శ్రేణులు బాధపడవా అంటే పడవని సమాధానం చెప్పారు. సినిమా వాళ్లకు టికెట్లిచ్చినందుకు ఇప్పటి దాకా పార్టీలో ఎక్కడా అసంతృప్తి వ్యక్తం కాలేదని తృణమూల్ ఎంపీ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment