మిమి చక్రవర్తి, నుస్రత్ జహాన్
‘హవ్వా! పాశ్చాత్య దుస్తులు ధరించి పవిత్రమైన పార్లమెంట్ ముందు ఫొటోలు దిగుతారా? ఇదేమైనా సినిమా షూటింగ్ అనుకుంటున్నారా? ఎప్పుడు ఎలాంటి వస్త్రధారణ ఉండాలో మీకు తెలియదా? ఇదేమి షూటింగ్ స్పాట్ కాదు, హాలిడే డెస్టినేషన్ కాదు. పార్లమెంట్ అనేది ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటిది. టిక్‌టాక్‌ల స్థలం కాదు. పేజ్‌త్రీ పార్టీకి వెళ్లినట్టుగా ఆ డ్రెస్ ఏంటి? ఫొటోలు తీసుకోవడం మానేసి పని మీద దృష్టిపెట్టండి’ ఇలా అనేక రకాల కామెంట్లు చేశారు. ఆధునిక దుస్తులు ధరించి పార్లమెంట్ ముందు ఫొటోలు తీసుకున్నందుకు మిమి చక్రవర్తి, నుస్రత్ జహ్రాన్‌కు సోషల్ మీడియాలో ఎదురైన స్పందన ఇది.
ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బెంగాలీ యువ నటీమణులు మిమి చక్రవర్తి, నుస్రత్ జహాన్ రూహి భారీ విజయాలు అందుకున్నారు. జాదవపూర్ నుంచి మిమి చక్రవర్తి 2,95,239 ఆధిక్యంతో విజయం సాధించగా, బాసిర్‌హాత్‌లో నుస్రత్ జహాన్ 3,50,369 మెజార్టీతో విజయదుందుభి మోగించారు. గెలిచిన ఆనందంలో ఉత్సాహంతో తొలిసారిగా పార్లమెంట్‌లో అడుగుపెట్టి పరవశించారు. తమ అదృష్టానికి మురిసిపోతూ ఆనంద క్షణాలను కెమెరాలో బంధించి సోషల్‌మీడియాలో షేర్ చేశారు. ఇక అక్కడి నుంచి మొదలైంది ఇరుకు మనస్కుల దాడి. ట్విటర్‌లో ట్రోలింగ్ మొదలెట్టేశారు.
ఇంతకీ వారు ధరించిన డ్రెస్ ఏంటి?
మిమి చక్రవర్తి తెల్లని చొక్కా, డెనిమ్ జీన్స్ ప్యాంట్ వేసుకోగా.. జహ్రాన్ వైన్ కలర్ పెప్పలప్ జిప్‌డ్ టాప్, ప్యాంట్ ధరించారు. లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్, బాలీవుడ్ నటుడు సన్నిడియోల్ కూడా జీన్స్, టీషర్టులు ధరించి తొలిసారిగా పార్లమెంట్‌లో అడుగుపెట్టినా ఛాందసులకు చీమ కుట్టినట్టు కూడా అనిపించదు. లోక్‌సభకు ఎన్నికైన యువతులు హుందాగా ఉన్న ఆధునిక వస్త్రాలు ధరించి పార్లమెంట్‌కు రావడం మాత్రం నేరంగా తోస్తుంది.ప్రజాప్రతినిధులు హుందాగా ఉండే దుస్తులు ధరించాలనే వాదనలో ఎవరికీ అభ్యంతరాలు ఉండవు.
కానీ ఫలానా దుస్తులు వేసుకుంటేనే హుందాతనం వస్తుందని వాదించడంలో అర్థం లేదు. ఆధునిక తరానికి ప్రతినిధులుగా చట్టసభలో అడుగుపెట్టబోతున్న యువతుల వస్త్రధారణపై వివాదం చేయడం శోచనీయం. మిమి చక్రవర్తి, నుస్రత్ జహాన్ వివాదంతో మరోసారి మహిళ వస్త్రధారణ చర్చనీయాంశంగా మారింది. వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు వీరికి మద్దతుగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఎటువంటి దుస్తులు ధరించారనే దాని ఆధారంగా వీరి సామర్థ్యాలను అంచనా వేయడం సరికాదని పేర్కొన్నారు. పార్లమెంట్ చర్చల్లో వీరు ఎంత సమర్థవంతంగా పాల్గొంటారనే దానిపై దృష్టి పెట్టాలిగానీ వస్త్రధారణపై కాదని పేర్కొన్నారు.
– పోడూరి నాగ శ్రీనివాసరావు, సాక్షి వెబ్ డెస్క్
ఈ వివాదాలు మాకు కొత్తేమి కాదు. గతంలోనూ ఇలాంటివి ఎదుర్కొన్నాం. ఎంపీలు అభ్యర్థులుగా ఎంపికైన నాటి నుంచే మా మీద బురద చల్లడం మొదలుపెట్టారు. మేమేంటో మా పని తీరు ద్వారానే నిరూపించుకున్నాం. ఇప్పుడు మరింత కష్టపడి పనిచేసి విమర్శలకు సమాధానం చెబుతాను. అసంబద్ధ వ్యాఖ్యలను పట్టించుకోకుండా నా నియోజకవర్గ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలన్న పట్టుదలతో ముందడుగు వేస్తాను.
– నుస్రత్ జహాన్
ఏ రకంగా చూసినా నేను, నుస్రత్ జహాన్ ధరించిన దస్తులు అమర్యాదకరంగా లేవు. మగాళ్లు జీన్స్, టీషర్ట్ ధరించి పార్లమెంట్‌కు వచ్చినా ఎవరూ అభ్యంతరాలు వ్యక్తం చేయరు. మా విషయంలోనే ఎందుకు భిన్నంగా స్పందిస్తున్నారు? వస్త్రధారణ విషయంలో మమ్మల్ని ఎంతగా విమర్శించినా, దూషించినా పట్టించుకోము. పార్లమెంట్ మర్యాదను మంటగలిపామని మేము అనుకోవడం లేదు. సహజత్వం నాకు ఇష్టం. నాకు మద్దతుగా నిలిచినవారికి ధన్యవాదాలు.
– మిమి చక్రవర్తి
Comments
Please login to add a commentAdd a comment