
ఇవాళ్టితో పదకొండేళ్లు పూర్తయ్యాయి ఐశ్వర్య, అభిషేక్‌ల పెళ్లయి! పదకొండేళ్ల నుంచి కూడా ఈ జంటపై ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంది. ఐశ్వర్య ఇగోయిస్ట్ అనీ, అభిషేక్ ఆమెతో వేగలేకపోతున్నారనీ, ‘త్వరలోనే’ ఈ కపుల్ విడిపోయే అవకాశాలున్నాయని ఇప్పటికీ ఏదో ఒక కోడి కూస్తూనే ఉంది. పెళ్లయ్యాక కూడా అభిషేక్ తల్లిదండ్రులతోనే కలిసి ఉండటం లేదని ఐశ్వర్యకు నచ్చడం లేదట. ఐశ్వర్య తన మాజీ కో–స్టార్‌లతో కలివిడిగా ఉండటం అభిషేక్‌కు చికాకు తెప్పిస్తోందట. ఇప్పుడు కొత్తగా ఏమంటున్నారంటే... ఐశ్వర్య అనుమానపు భార్యట! అభిషేక్ ఫోన్ కాల్స్‌ని చెక్ చేస్తూ ఉంటుందట. ‘నెవర్’ అని ఐశ్వర్య సమాధానం. అయినా పెళ్లిరోజు మాట్లాడుకోవలసిన సంగతులా ఇవీ. భార్యాభర్తలన్నాక ఏదో ఒక టైమ్‌లో జీవిత భాగస్వామిపై చికాకు పడటం, అతి ప్రేమతో (పొసిసివ్‌నెస్) అనుమానించడం ప్రతి ఇంట్లోనూ ఉండేది. అలాగే ఐష్, అభీలు!
అసలీ వదంతులన్నిటికీ కారణం.. ఈ హీరోహీరోయిన్‌లకు పెళ్లికి మునుపున్న వేరే ప్రణయ సంబంధాలే. అవి ఎన్ని ఉన్నా వివాహబంధంతో ఒకటి అయ్యారు కాబట్టి.. గతాన్ని లాక్కొచ్చి, వర్తమానంలో పడేసి, భవిష్యత్తును అశాంతి పరచడం ఈ వదంతివాదులకు భావ్యం కాదు. త్వరలో ఐశ్వర్య నటించిన ‘ఫన్నీ ఖాన్’ రిలీజ్ అవుతోంది. అభిషేక్ నటించిన ‘మన్‌మర్జియాన్’ పూర్తి కావచ్చింది. ఐశ్వర్యది మ్యూజికల్ కామెడీ. అభిషేక్‌ది రొమాంటిక్ డ్రామా. వీటి కోసం ఎదురుచూడ్డం మానేసి, ఇద్దరూ కలిసి ఎందుకు నటించడం లేదని ఆలోచిస్తే.. మళ్లీ అక్కడో గాసిప్ క్రియేట్ అవుతుంది. అవసరమా?!
Comments
Please login to add a commentAdd a comment