‘పణప్పుర ఊరు’.. కేరళలో మారుమూల ఆదివాసీ గ్రామం. నిలంబూర్ అడవుల్లో ఉంది. పణప్పుర ఊరికి మలప్పురం తాలూకా కేంద్రం నుంచి ఓ బృందం బయలుదేరింది. కొంతదూరం కారులో సాగింది ప్రయాణం. కొంత దూరం జీప్‌లో వెళ్లారు. ఆ తర్వాత ఇక ఏ వాహనమూ వెళ్లే వీలు కనిపించలేదు. కనీసం టూ వీలర్ కూడా. ట్రెకింగ్ మొదలుపెట్టిందా టీమ్.
స్థానికులు కొడవళ్లు, గొడ్డళ్లతో దారిలో అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలు, తీగలను నరికేస్తూ వారికి దారి చేస్తున్నారు. ‘చెట్టు కొమ్మలనయితే నరికారు, మమ్మల్నేం చేస్తారు’ అన్నట్లు పెద్ద బండరాళ్లు! తాళ్లను పట్టుకుని ఆ బండల్ని ఎక్కారందరూ. కొండవాలులో మట్టి తడిసి ముద్దయి అడుగు పెడితే చాలు కాలు జారిపోతోంది. అలాంటి సాహసోపేతమైన ట్రెకింగ్‌ను విజయవంతంగా పూర్తి చేసిందా బృందం.
వైద్యం చేయడానికి!
దాదాపు పదిమంది ఇంత కష్టతరమైన దారిలో ప్రయాణించి పణప్పుర ఊరు వెళ్లింది అడ్వెంచర్ టూర్ కోసం కాదు. ఒక రోగికి వైద్యం చేయడానికి. ఎంత ఆశ్చర్యపోయినా సరే... ఇది నిజం. ఆ పేషెంట్ సెలబ్రిటీ ఏమీ కాదు. అంతరించిపోతున్న చోళ నాయకన్ ఆదివాసి జాతికి చెందిన రవి. యాభై ఏళ్ల రవికి డయాబెటిస్ ఉంది, కాలి వేలికి గాయమైంది. రక్తస్రావం ఆగడం లేదు. మనిషి చిక్కి శల్యమయ్యాడు. ఇన్‌ఫెక్షన్ కూడా సోకింది. అడవిలో తెలిసిన ఆకు పసర్లేవో వేసుకుంటూ వ్యాధి ముదర పెట్టుకున్నాడు. అంతకంటే మెరుగైన వైద్యం ఉందని తెలియదు కూడా అతడికి.
ఫారెస్ట్ సిబ్బంది ఈ సంగతిని డాక్టర్ అశ్వతి సోమన్‌కు చెప్పారు. డాక్టర్ అశ్వతి సోమన్ నిలంబూర్ మొబైల్ డిస్పెన్సరీలో మెడికల్ ఆఫీసర్. రవికి వైద్యం చేయడానికి తనకు ఉన్న మౌలిక వసతులు సరిపోవు. అందుకే అశ్వతి... మలప్పురం తాలూకా హాస్పిటల్ సిబ్బందిని, ఆపరేషన్‌కు అవసరమైన పరికరాలను సమకూర్చుకున్నారు. మెడికల్ టీమ్‌తో ఫారెస్ట్ సిబ్బంది సహాయంతో అడవి దారి పట్టారు. రవిని పరీక్షించి సర్జరీ చేసి ‘గాంగరిన్’ అయిన వేలిని తొలగించి, కట్టుకట్టారు. డయాబెటిస్‌ను అదుపులోకి తీసుకు వస్తే కానీ మిగతా చికిత్స ఇవ్వలేమని, అందుకు తాలూకా కేంద్రంలో ఉన్న హాస్పిటల్‌లో చేరాల్సిందేనని, తమతోపాటు వస్తే తీసుకువెళ్తామని చెప్పారు రవికి.
డాక్టర్ వైద్యం చేస్తాను రమ్మన్నప్పటికీ రవి మాత్రం తన గూడెం వదిలి వచ్చే పనే లేదన్నాడు. దాంతో ‘‘డయాబెటిస్‌ను, గాయాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల అప్పుడు వేలిని తొలగించాల్సి వచ్చింది. ఇప్పుడు మంచి వైద్యం అందితే ఆరోగ్యం బాగవుతుంది. అలా చేయకపోతే రేపటి రోజున కాలిని తొలగించాల్సి రావచ్చు, ఇంకా ముదిరిపోతే ప్రాణం మీదకే రావచ్చు’’ అని గట్టిగా హెచ్చరించారు అశ్వతి. ఆ భయంతో అతడు హాస్పిటల్‌కి రావడానికి ఒప్పుకున్నాడు. ఇప్పుడతడు మణప్పురం తాలూకా హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాడు.
రోగి దగ్గరకు డాక్టరే వెళ్లాలి
ఇంతమంది తరలి వెళ్లడం కంటే ఆ పేషెంట్‌నే హాస్పిటల్‌కి తెచ్చే ప్రయత్నం చేయవచ్చు కదా అని అడిగిన వాళ్లతో డాక్టర్ అశ్వతి ఒకే మాట చెప్పారు. ‘వైద్యరంగంలో నేర్పించే మొదటి పాఠం... డాక్టర్ దగ్గరకు పేషెంట్ కాదు, పేషెంట్ దగ్గరకు డాక్టర్ వెళ్లాలని. ఇక్కడ మరో చిక్కు కూడా ఉంది... ఈ పేషెంట్ వైద్యం కోసం హాస్పిటల్‌కు వచ్చే ఉద్దేశంలో లేడు. అలాంటప్పుడు డాక్టరే వెళ్లాలి. మాది రోగి ప్రాణాన్ని నిలపాల్సిన కర్తవ్యం’’ అన్నారు.
పోలిక ఎక్కడ?
మన దగ్గర అరకు, పాడేరు వంటి గిరిజన గ్రామాలు విషజ్వరాలతో మంచం పడితే వారి చెయ్యి పట్టుకుని నాడి చూడడానికి ఒక్క డాక్టరూ కనిపించట్లేదు. నొప్పులు పడుతున్న గర్భిణిని ప్రసవం కోసం మంచం మీద మోసుకు రావాల్సిన దుస్థితి. తరచూ ఇలాంటి సంఘటనలనే చూస్తున్న మనకు కేరళలో ఓ యువతి, వైద్యరంగంలోకి వచ్చి ఐదేళ్లు కూడా నిండని యువతి... పేషెంట్ కోసం ఇంతటి సాహసం చేసిందంటే ఆమెకు పాదాభివందనం చేయాలనిపిస్తుంది. డాక్టర్స్ డే రోజున ఇలాంటి డాక్టర్‌ను తలుచుకోవడం సంతోషంగా ఉంటుంది. వైద్యో నారాయణో హరి అని అందుకే అంటారు. ఇలాంటి డాక్టర్‌ని చూస్తే ఆ మాట మళ్లీ మళ్లీ అనాలనిపిస్తుంది.
– మంజీర
Comments
Please login to add a commentAdd a comment