
అహ్మదాబాద్: కేరళ, గుజరాత్ జట్ల మధ్య రంజీ ట్రోఫీ తొలి సెమీఫైనల్ మ్యాచ్ చప్పగా మొదలైంది. తొలిరోజు ఆటలో మొదట బ్యాటింగ్‌కు దిగిన కేరళ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ సచిన్ బేబీ (193 బంతుల్లో 69 బ్యాటింగ్, 8 ఫోర్లు) జిడ్డుగా బ్యాటింగ్ చేశాడు. దీంతో సోమవారం ఆట ముగిసే సమయానికి కేరళ జట్టు 89 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది.
మొదట ఓపెనర్లు అక్షయ్ చంద్రన్ (30; 5 ఫోర్లు), రోహన్ (30; 5 ఫోర్లు) 20 ఓవర్ల వరకు వికెట్ పడిపోకుండా 60 పరుగులు జతచేశారు. 3 పరుగుల వ్యవధిలో వీరిద్దరూ అవుటయ్యారు. కాసేపయ్యాక వరుణ్ నాయనార్ (10) నిష్క్రమించగా... కెప్టెన్ సచిన్, జలజ్ సక్సేనా (30; 4 ఫోర్లు) గుజరాత్ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టేలా బ్యాటింగ్ చేశారు.
గుజరాత్ జట్టు ఏకంగా ఏడుగురు బౌలర్లను మార్చిమార్చి ప్రయోగించినా... ప్రయోజనం లేకపోయింది. వీళ్లిద్దరు 27.5 ఓవర్ల పాటు క్రీజులో పాతుకుపోవడంతో ప్రత్యర్థి బౌలర్లు, ఫీల్డర్లు అలసిపోయారు. ఎట్టకేలకు మూడో సెషన్ మొదలయ్యాక సక్సేనాను అర్జాన్ నగ్వాస్‌వాలా బౌల్డ్ చేయడంతో వీరి భాగస్వామ్యానికి తెరపడింది. నాలుగో వికెట్‌కు ఈ జోడీ 71 పరుగులు జోడించింది. తర్వాత మొహమ్మద్ అజహరుద్దీన్ (30 బ్యాటింగ్; 3 ఫోర్లు) కూడా నాయకుడికి అండగా నిలవడంతో గుజరాత్ జట్టుకు కష్టాలు కొనసాగాయి.
132 బంతుల్లో సచిన్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అబేధ్యమైన ఐదో వికెట్‌కు అజహరుద్దీన్, సచిన్ 49 పరుగులు జతచేశారు. టెస్టులు, దేశవాళీ టోర్నీలో సెషన్‌కు 30 ఓవర్లు వేస్తారు. అయితే సచిన్ 25వ ఓవర్లో క్రీజులోకి వచ్చి ఓ సెషన్ ఓవర్లను మించే క్రీజులో నిలిచాడు. 193 బంతులంటే 32 ఓవర్ల పైచిలుకు బంతుల్ని అతను ఎదుర్కొన్నాడు. అర్జాన్, ప్రియజీత్, రవి బిష్ణోయ్ తలా ఒక వికెట్ తీశారు.
స్కోరు వివరాలు
కేరళ తొలి ఇన్నింగ్స్: అక్షయ్ (రనౌట్) 30; రోహన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) రవి బిష్ణోయ్ 30; వరుణ్ (సి) ఉర్విల్ (బి) ప్రియజీత్‌సింగ్ 10; సచిన్ బేబీ (బ్యాటింగ్) 69; జలజ్ సక్సేనా (బి) అర్జాన్ 30; అజహరుద్దీన్ (బ్యాటింగ్) 30; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (89 ఓవర్లలో 4 వికెట్లకు) 206. వికెట్ల పతనం: 1–60, 2–63, 3–86, 4–157. బౌలింగ్: చింతన్ గజా 18–536–0, అర్జాన్ 16–4–39–1, ప్రియజీత్ సింగ్ 12–0–33–1, జైమీత్ 9–1–26–0, రవి బిష్ణోయ్ 15–2–33–1, సిద్ధార్థ్ దేశాయ్ 16–8–22–0, విశాల్ జైస్వాల్ 3–1–13–0.