అంబేడ్కర్‌వాద రాజకీయాలు | Today Dr.B.R.Ambedkar 125th Jayanti | Sakshi
Sakshi News home page

అంబేడ్కర్‌వాద రాజకీయాలు

Published Tue, Apr 14 2015 12:38 AM | Last Updated on Fri, Aug 17 2018 8:12 PM

Today Dr.B.R.Ambedkar 125th Jayanti

ఇప్పటి అవ సరం ఏమిటంటే అంబేడ్కర్ వాదులు అంబేడ్కర్‌ను సరిగా అర్థం చేసుకుని, అంబేడ్కర్‌వాద వ్యతిరేక రాజకీయాల నుంచి అంబేడ్కరవాద రాజకీయాలను కాపాడుకోవడం.

అవినాశ్ మిశ్రా

1991లో జరిగిన బాబా సాహెబ్ అంబేడ్కర్ శత జయంతి... నవ్యాధునిక భారత స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న సమకాలీన సహచరులందరి కన్నా ఎత్తై నాయకునిగా ఆయనను సుస్థిరపరచడమే కాకుండా, దళిత రాజకీయాల సరళిని కూడా పెద్ద ఎత్తున మార్చివేసింది. అప్పటి వరకు ప్రధాన రాజకీయ ప్రక్షాల అలక్ష్యానికి గురై ఉన్న అంబేడ్కర్  ప్రజాస్వామ్య, పౌరహక్కుల అవగాహన... అకస్మాత్తుగా ఆయా పక్షాల ఎన్నికల నియమావళిలో ప్రధాన ఎజెండాగా చోటు సంపాదించుకుంది. దేశం కూడా వారసత్వ, కుటుంబ, ఏకపక్ష పాలన నుండి రాజకీయాలు దూరంగా జరగడాన్ని వీక్షించింది.
 
ఇలా అనడం, 1991 ముందు నాటి దళిత రాజకీయ చైతన్యాన్ని తక్కువ చెయ్యడం కాదు. అయితే 1991 అనంతరం దళితుల రాజకీయ దృక్పథంలో స్పష్టంగా కనిపించిన మార్పులు విస్మరించలేనివి. 1991లో పునరావిష్కృతమైన అంబేడ్కర్‌వాద రాజకీయాలతో దళిత రాజకీయాలలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ప్రధాన రాజకీయ పక్షాలను ఢీకొనాలని కాన్షీరామ్ తీసుకున్న నిర్ణయం అంబేడ్కర్ సిద్ధాంతాలను ప్రజల చెంతకు తీసుకెళ్లింది. అంబేడ్కర్ పట్టణ దళితులకు మాత్రమే ప్రాతినిధ్యం వహించలేదని గ్రామీణ దళితులలో కాన్షీరామ్ విశ్వాసం నెలకొల్పారు.

దళిత రాజకీయాలు ప్రభుత్వంలో ఉన్నత హోదాలు పొందాలనుకుంటున్న వారి కోసం ఉద్దేశించినవి కాదనీ, జీవన పోరాటం చేస్తున్న లక్షలాది శ్రామికుల కోసమేనని ఆయన చెప్పగలిగారు. అలా ఆయన దళిత ఉద్యమస్వామ్యాన్ని పైస్థాయి నుంచి కింది స్థాయిలోని వారికి అందుబాటులోకి తెచ్చారు. ఆ క్రమంలో అంతవరకు వదిలివేయబడిన వర్గంలో ఉన్న కులాలన్నిటినీ ఆయన అంబేద్కర్ వాద సంరక్షణలోకి తేగలిగారు. ఇంకోమాటలో చెప్పాలంటే 1991 తర్వాతి పరిణామాలను ‘నిర్వర్గీకరణ దళిత రాజకీయాలు’గా అర్థం చేసుకోవచ్చు.
 
కాగా అంబేడ్కర్ ఎప్పుడూ తన జీవితకాలంలో సూత్రీకరణలు చేయలేద న్న విషయం అర్థం చేసుకోవడంలో మన నాయకులు విఫలమయ్యారు. కొత్త కొత్త ఆలోచనలతో ఆయన ప్రయోగాలు చేస్తూ వెళ్లారు. అలా చేయడంలో ఉన్న ప్రమాదం ఏమిటంటే అదొక నిలకడలేనితనంగా కనిపించడం. కానీ ఆయన నిలకడకన్న బాధ్యతకే ఎప్పుడూ ప్రాధాన్యం ఇచ్చారు. ప్రజలను ఆయన సమస్యకు కారణాలను విశ్లేషించగల విజ్ఞులుగా చూడదలచుకున్నారు. ఇప్పటి అవ సరం ఏమంటే అంబేడ్కర్ వాదులు అంబేడ్కర్‌ను సరిగా అర్థం చేసుకుని, అంబేడ్కర్‌వాద వ్యతిరేక రాజకీయాలనుంచి అంబేడ్కర్‌వాద రాజకీయాలను కాపాడుకోవడం.
(వ్యాసకర్త జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ రాజకీయ అధ్యయన విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ avinashmishra.jnu@gmail.com)

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement