ఆ ఋణం తీరేదెలా?
నేడు అంతర్జాతీయ మాతృదినోత్సవం
అది ఆదివారం. వంటింట్లో ఉన్న తల్లి దగ్గరకు కార్తీక్ ఎంతో ఉత్సాహంగా వచ్చాడు.
‘‘అమా! నువ్వు నాకెంత ఇవ్వాలో లెక్క రాశాను’’ అంటూ ఒక కాగితం అందించాడు.
తల్లి ఆశ్చర్యంగా, కొంత అయోమయంగా ఆ కాగితం వైపు చూసి ‘‘నేను వంట చేస్తున్నాను. నా చేతులు ఖాళీగా లేవు. అది ఏమిటో నువ్వే చదివి చెప్పు’’ అది.‘‘ఈ రోజు నేను నీ కోసం చాలా పనులు చేశాను.
నువ్వు ఒక్కో పనికి ఎంత చెల్లించాలో లెక్క రాశాను’’ అన్నాడు కార్తీక్.చేస్తున్న పనిని మధ్యలో వదిలేసి, కార్తీక్ చేతిలోంచి కాగితం అందుకుంది తల్లి. అందులో ఇలా రాసి ఉంది...‘‘మొక్కలకు నీళ్ళు పోశాను. దానికి 20 రూపా యలు. గది సర్దుకున్నాను. దానికి 50 రూపాయలు.మార్కెట్‌కు వెళ్ళాను. దానికి 30 రూపాయలు. వర్షం పడుతోంటే మేడ మీద నుండి బట్టలు తెచ్చాను. దానికి 20 రూపాయ లు. మొత్తం 120 రూపాయలు.
అది చదవగానే తల్లి బిత్తరపోయింది.
‘‘ఇక నుండి ఇలాగే లెక్క రాస్తానమ్మా. నేను ఇంట్లో చేసే ప్రతి పనికీ నువ్వు నాకు డబ్బులివ్వాలి’’ అన్నాడు.
అప్పటికే ఆ ఆశ్చర్యంలోంచి బయటపడ్డ ఆమె ‘‘తప్పకుండా ఇస్తాను. ఒకసారి పెన్ను ఇవ్వు’’ అంది.
కాగితం వెనుక ఆమె ఏదో రాసి, కార్తీక్‌కి ఇస్తూ.... ‘‘వీటికి కూడా లెక్క వెయ్యి. నేను నీకివ్వాల్సిన దాంట్లో నుంచి ఇది తీసివేసి, అప్పుడు నీకెంత రావాలో చెబితే అంత ఇచ్చేస్తాను’’ అంది.
కార్తీక్ ఆ కాగితం తీసుకుని చదివాడు.
నిన్ను తొమ్మిది నెలలు కడుపులో మోశాను... డబ్బులు తీసుకోలేదు.
నిన్ను పదమూడేళ్ళుగా జాగ్రత్తగా పెంచుతున్నాను. డబ్బులు తీసుకోలేదు.
నీకు రోజూ భోజనం వండి పెడుతున్నాను. డబ్బులు తీసుకోలేదు.
నీకు జ్వరం వచ్చినప్పుడల్లా కంటికి రెప్పలా కాపాడుతున్నాను.
డబ్బులు తీసుకోలేదు. ప్రతిరోజూ నీ చేత హోమ్‌వర్క్ చేయిస్తున్నాను. డబ్బులు తీసుకోలేదు. నువ్వు పడుకునేటప్పుడు కథలు చెప్తున్నాను. దానికీ డబ్బులు తీసుకోలేదు...అని ఉంది.అది మొత్తం చదివాక చిన్నారి కార్తీక్‌కు తన పొరపాటు ఏమిటో అర్థమైంది.
ఒక్కసారిగా కళ్ళ నిండా నీళ్ళు నిండుకున్నాయి. ‘‘సారీ అమ్మా’’ అంటూ కాగితం చింపేసి, బయటకు పరుగెత్తాడు.