‘అమ్మను మసిగుడ్డలా చూస్తున్నామా?’ అని ప్రశ్నిస్తుందో తెలుగు కథ.
‘ఇంట్లో నుంచి బయటకు పో అని అమ్మను నాన్న ఎందుకు అంటుంటాడు’ అని నిలదీస్తుంది మరో కథ.
‘అమ్మ ఒంటి నిండా మందులు చేరడానికి కారణం ఎవరు?’ అని వేదన చెందుతుంది ఇంకో కథ.
‘అమ్మకు కంటి నిండా నిద్రన్నా ఉంటుందా?’ అని కన్నీరు కారుస్తుంది కథ.
‘మదర్స్ డే’ రోజున అమ్మను తలచుకోవడం, గౌరవించడం అందరూ చేసేదే.
కాని ఆమె గురించి ఆలోచించాలి. సరిగా ఆలోచించాలి. ఆమె శ్రమను, గౌరవాన్ని, స్థానాన్ని సమస్థాయిలో ఉంచడం గురించి తెలుగులో వచ్చిన కొన్ని గొప్ప కథల ప్రస్తావన...
ఆమె పేరు ఏమిటో ఆమెకు గుర్తు లేదు. భర్త ‘అది’ అంటాడు. ఇంటికి రాగానే ‘అదెక్కడా?’ అని కొడుకును అడుగుతాడు. కొడుక్కు కూడా ‘అది’ అనడం అలవాటే. ‘పిల్లల బాధ నీకెందుకు? అది చూసుకుంటుంది కదా’ అని అంటుంటాడు. ఈ ‘అది’ ఆ ఇంట్లో ఏనాడూ కూచోవడానికి వీల్లేదు. నిలబడి చేస్తూ ఉండాల్సిందే. భర్త రిటైరైనా పార్ట్‌టైమ్ జాబ్ చేస్తూ సంపాదిస్తూ ఉంటాడు కాబట్టి అతను ఇంట్లో హాయిగా కూచోగలడు. కొడుకు, కోడలు ఉద్యోగాలు చేస్తారు.
డబ్బు ఉంది. వాళ్లు కూచుంటారు. ఈ ‘అది’కే ఏ సంపాదనా లేదు. ‘నేను తల్లిని కదా’ అనుకుంటుంది. అయితే? ‘నేను అత్తగారిని, నానమ్మని కదా’ అనుకుంటుంది. అయితే? ఇంట్లో ఎవరికీ ఏ విలువా లేదు. ‘అది.. ఇది’ అనడమే. ఒకరోజు ఆమె గేటు దగ్గర నిలబడి ఉంటే ఇద్దరు పనమ్మాయిలు మాట్లాడుకుంటూ వెళుతుంటారు. ఒకమ్మాయి అంటుంటుంది– ‘ఆ ఇంట్లో పని మానేశాను. ఆదివారం కూడా చేయిస్తున్నారు’ అని. విన్న ఆమె దిగ్భ్రమ చెందుతుంది.
ఇన్నేళ్లుగా ఇంత చాకిరీ చేస్తున్నా ప్రతిఫలం లేకపోగా చులకనగా చూడటమా? ఉన్నది ఉన్నట్టుగా ఆ పని మనుషుల వెంట నడుస్తుంది. ‘మనలాంటి వాళ్ల కోసం ఒక మేడమ్ మంచి హోమ్ నడుపుతున్నారు. అక్కడ చేర్పిస్తాం. పద’ అని వాళ్లు తీసుకెళ్లి చేర్పిస్తారు. ఆ మేడమ్ ఆమెను పేరు అడుగుతుంది. ఏనాడో మర్చిపోయిన పేరును గుర్తు చేసుకోవడం వల్ల ఆ తల్లి కొత్త అస్తిత్వం, ఆత్మగౌరవం పొందుతుంది. కె.రామలక్ష్మి రాసిన ‘అదెక్కడ’ కథ ఇది.
ఇలా ఇంట్లో అమ్మను చూసుకుంటున్నవారు ఉంటే ఈ కథ చెప్పే నీతి ఏమిటో గ్రహించాలి. ఒక ఇంట్లో ఒక తల్లి మరణిస్తుంది. దుప్పటి తీసి చూసిన భర్త అదిరిపోతాడు. ఎందుకంటే ఆమె శరీరం మొత్తం సుద్దముక్కలా తెల్లగా అయిపోయి ఉంటుంది. ఇలా ఎందుకు జరిగింది? ఇదేం వింత జబ్బు? ఆ కాలనీలో ఉన్న ఒక చురుకైన అమ్మాయి ఆ తల్లి ఒంటి నుంచి చిన్న ముక్క తీసి ల్యాబ్‌కు పరిగెత్తి పరీక్ష చేయిస్తే ఆ ముక్క ‘ఆస్ప్రిన్’ టాబ్లెట్ అని తేలుతుంది.
అంటే ఆమె శరీరం మొత్తం మందు బిళ్లలతో నిండిపోయిందా? అందుకే సుద్దముక్కలా మారిందా? నిజానికి ఆ చనిపోయినామెకు ‘సూపర్ మామ్’ అని పేరు. పిల్లల్ని బాగా పెంచేది. భర్తను బాగా చూసుకునేది. ఇల్లు బాగా పెట్టుకునేది. పైగా ఉద్యోగం చేస్తూ ఇవన్నీ చేసేది. పిల్లల్ని చదివించి, ప్రయోజకుల్ని చేసి, అమెరికా సంబంధాలు చూసి సెటిల్ చేసి... ఇన్ని చేసి అందరి ప్రశంసలు పొందిన ఆమె కొన్ని విషయాలు దాచింది. ఏమిటవి? ఆఫీసు పని వొత్తిడితో రోజూ ఒక తలనొప్పి మాత్ర వేసుకునేది.
ఇంటి పనులకు ఆటంకం రాకుండా ఒళ్లు ఏమాత్రం వెచ్చబడినా ఒక మాత్ర వేసుకునేది. శుభకార్యాలకు అడ్డు రాకుండా నెలసరిని వెనక్కు నెట్టడానికి మాత్రలు వేసుకునేది. గర్భసంచి తీయించేస్తే సప్లిమెంట్లు తెగ మింగింది. హార్మోనల్ ఇంబేలెన్స్ అంటే అందుకు మళ్లీ మందులు. అనారోగ్యం గురించి చెప్పి భర్తను, పిల్లల్ని డిస్ట్రబ్ చేయకుండా ఏ ఇబ్బంది వచ్చినా మాత్రలే మాత్రలు.
అందుకే మరణించగానే ఒళ్లు అలా తెల్లబడింది. తేలిపోయింది. ఇది అర్థమయ్యాక, ఆమె సూపర్‌మామ్ సిండ్రోమ్‌తో మరణించిందని అర్థమయ్యాక ఆ కాలనీ అమ్మాయి తన తల్లి దగ్గరకు పరిగెడుతుంది. ‘అమ్మా... నువ్వు గొప్పల కోసం నిన్ను నువ్వు బలిపెట్టుకోకు. కొద్దిగానే పని చెయ్. విశ్రాంతి తీసుకో. ఆరోగ్యం మెరుగు పర్చుకో’ అని చెప్పడానికి. కె.సత్యవతి రాసిన ‘సూపర్‌మామ్ సిండ్రోమ్’ ఇస్తున్న సందేశం అర్థమైందిగా.
ఒక భర్త భార్య మీద కోపం వచ్చిన ప్రతిసారీ ‘పో నా ఇంటి నుంచి’ అంటుంటాడు. అది అతని ఊతపదం. ఏ ఇల్లయినా భర్తదే. భార్యది కాదు. తండ్రిదే. తల్లిది కాదు. అందుకే భర్తలు భార్యల్ని ఇంటి నుంచి గెంటేస్తుంటారు. లేదా గెంటేస్తానని బెదిరిస్తుంటారు. పిల్లల్ని కన్నా, పొదుపు చేసి ఆ డబ్బు భర్త చేతిలో పెట్టినా, ఇల్లు దగ్గరుండి కట్టించినా, అందులో సంసారం చేసినా ఆ ఇల్లు మాత్రం ఆమెది కాదు. అతనిదే. ఒకరోజు ఆమెకు చివుక్కుమంటుంది. ఇంటి నుంచి రెండు మూడు చీరలతో బయటపడి దూరంగా ఒక గది అద్దెకు తీసుకుంటుంది.
చిన్న ఉద్యోగం వెతుక్కుంటుంది. స్టవ్వు గివ్వు పెట్టుకుని ఇంకెవరూ తనని బెదిరించ లేని తన ఇంట్లో ఉంటుంది. దాంతో ఆ భర్త తెగ కంగారు పడిపోతాడు. కాలనీ కంగారు పడుతుంది. బంధువులు కంగారు పడతారు. కాని ఆమె మాత్రం ‘అతడికి విడాకులు ఇవ్వను. కావాలంటే నా దగ్గరకు వచ్చి నా ఇంట్లో ఉండమనండి‘ అని వర్తమానం పంపుతుంది. ఏం కథ ఇది. ఏ ఇంట్లో అయినా అమ్మ ఈ మూడ్‌లో ఉందేమో ఎవరు గమనించాలి? ఇది కవన శర్మ ‘ఆమె ఇల్లు’ కథ.
పాటిబండ్ల రజని రాసిన ‘జేబు’ కథ ఉంటుంది. అందులో ఒకామె అందరూ జేబు రమణమ్మ అని పిలుస్తూ ఉంటారు. దాని కారణం ఆమె తన బాల్యంలో తల్లి ప్రతి రూపాయి కోసం తండ్రి దగ్గర చేయిజాస్తూ ఉండటమే. అలా తాను ఉండకుండా తన రవికకో, చీర కుచ్చిళ్లకో ఒక జేబు ఉండాలని భావిస్తుందామె. అలా జేబులాంటి గుడ్డ సంచిని దోపుకునే బతుకుతుంది. పసుపు కుంకాలుగా కోడలు తెచ్చిన భూమిని భర్త, కొడుకు అమ్మబోతే వారించి ‘అది కోడలి ఆర్థిక భద్రత కోసం ఉండాలి’ అని గట్టిగా నిలబడుతుంది. అమ్మకు ఉండాల్సిన ఆర్థిక స్వాతంత్య్రం గురించి ఆర్థిక గౌరవం గురించి ఆలోచిస్తున్నామా మనం.
‘మసిగుడ్డ’ లేకుండా వంట చేయడం అసాధ్యం. కాని మసిగుడ్డకు ఏ విలుగా ఉండదు. పిల్లల్ని తల్లి పెంచుతుంది. కాని ప్రోగ్రెస్ కార్డ్ మీద తండ్రి సంతకం చేస్తాడు. పిల్లలకు తల్లి ఒండి పెడుతుంది. కాని పిల్లలు వెచ్చాలకు డబ్బులిచ్చే తండ్రినే గౌరవిస్తారు. బంధువులు శుభలేఖ ఇస్తూ దానిపై అతని పేరే రాస్తారు. ఆస్తిపన్ను, కరెంటు బిల్లు, ఇంటి గడపకు నేమ్‌ప్లేట్ అన్నీ అతనివే. ఆమె మసిగుడ్డ. కాని అది లేకపోతే ఏ పనీ జరగదు. కుప్పిలి పద్మ రాసిన ‘మసిగుడ్డ’ కథ ఇది. కిచెన్‌లోకి నేడు వెళ్లి చూసినా అమ్మ పాత జాకెట్టే మసిగుడ్డగా కనిపిస్తుంది. నాన్న పాత చొక్కా కాదు. అమ్మకు గౌరవం ఇవ్వలేమా?
బతికినంత కాలం ఇంటి చాకిరీలో పడి, తెల్లవారుజామునే లేస్తూ, రాత్రి లేటుగా వంట గది సర్దుకుని పడుకుంటూ, చంటి పిల్లల వల్ల, వృద్ధులైన అత్తమామల వల్ల, వేరే సవాలక్ష బాధ్యతల వల్ల కంటి నిండుగా నిద్రపోని ఒక తల్లి తనకు నిద్ర కావాలని, కనీసం ఈ వృద్ధాప్యంలో అయినా హాయిగా నిద్రపోవాలని గుప్పెడు నిద్ర మాత్రలు మింగుతుంది. కంటి నిండా నిద్ర పోయే ‘లగ్జరీ’ ఇవాళ్టికీ అమ్మకు ఉందా?
అమ్మ గురించి మదర్స్ డే సందర్భంగా ఆలోచిద్దాం. అమ్మను మొదట మనిషిగా చూస్తే, వ్యక్తిగా చూస్తే, పౌరురాలిగా చూస్తే ఆమె హక్కులు అర్థమవుతాయి. ఆ హక్కులు ఆమెకు మిగల్చడమే అందరి విధి.
Comments
Please login to add a commentAdd a comment