కీళ్లవాతం మనిషికి తెలిసిన జబ్బుల్లో అత్యంత పురాతనమైన, దీర్ఘకాలిక వ్యాధి. ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షలమంది ప్రజలు కీళ్లవాతం వ్యాధులతో బాధపడుతున్నారు. ఐయితే చాలామంది తమ బాధల గురించి వైద్యులకు చెప్పరు. ఇది వయసు పెరుగుతున్నకొద్దీ వచ్చే సమస్యని అంగీకరిస్తారు. మరికొంతమంది ఈ సమస్యకు చికిత్స లేదని భావిస్తారు. ఇవేమీ నిజం కాదు.
కీళ్లవాతం అంటే...
కీళ్లవాతం అంటే కేవలం కీళ్ల దగ్గర మాత్రమే ఉంటుందనీ శరీరంలో ఏ ఇతర అవయవాల మీద దాని ప్రభావం ఉండదన్నది వాస్తవం కాదు. కీళ్లవాతం అనేది ఒక సాధారణమైన పదం. కానీ కీళ్లవాత సంబంధిత వ్యా«ధుల్లో వందకు పైగా రకాలున్నాయి. సమాజంలో ఈ వ్యాధులపైన పూర్తి అవగాహన లేదు. ఈ వ్యాధులకు పూర్తి స్థాయిలో వైద్యం చేసే అర్హులైన రుమటాలజిస్టులు కూడా దేశంలో చాలా తక్కువమందే ఉన్నారు. ఈ రెండు కారణాలవల్ల ఈ వ్యాధులతో రోగికి ఎంతో నష్టం చేకూరుతోంది.
అసలు ఈ జబ్బులు ఎందుకు వస్తాయి?
మన శరీరంలో ఉన్న రోగ నిరోధక వ్యవస్థ మనలోకి ఇన్ఫెక్షన్ కలగజేసే క్రిములు చొరబడకుండా కాపాడుతుంది. అయితే కొన్ని పరిస్థితుల వల్ల కంచే చేను మేసినట్లుగా ఈ రోగనిరోధక వ్యవస్థ మన సొంత అవయవాల మీదే దాడికి దిగి శరీరాన్ని నాశనం చేస్తుంది. దీన్నే ఆటో ఇమ్యూనిటీ అంటారు. దీనివల్ల శరీరంలోని ఏ భాగంపై ప్రభావం పడుతుందో ఆ అవయవం పనితీరు తగ్గుతుంది. ఈ ప్రక్రియలో సాధారణంగా కీలు మీద ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎక్కువ శాతం ఆటో ఇమ్యూన్ వ్యాధులలో కీళ్లనొప్పి మొదట బయటపడతాయి. కేవలం కీలు మీదే కాకుండా తల వెంట్రుక దగ్గర నుంచి కాలి గోరు వరకు దేనినైనా నాశనం చేసే శక్తి ఈ జబ్బులకు ఉంటుంది. జన్యుప్రవర్తన, పర్యావరణంలో జరిగే మార్పులు, అనేక రకాలైన వైరస్, ఇతర క్రిముల వల్ల ఈ జబ్బులు రావచ్చు.
వీటిని గుర్తించడం ఎలా?
కీళ్లవాతంలో కీళ్ల దగ్గర వాపు, నొప్పి, దృఢత్వం తగ్గడం అనేవి సాధారణంగా కనిపించే లక్షణాలు. అయితే ఈ జబ్బులు ఏ లక్షణాలతోనైనా మొదలయ్యే అవకాశాలు ఉంటాయి. నెమ్మదిగా చాప కింద నీరులా గానీ, అకస్మాత్తుగా గాని ప్రారంభం కావచ్చు. తేలికపాటిగా ఉండటం మొదలుకొని కొన్ని నిమిషాలు లేదా గంటలలోనే తీవ్రరూపం దాల్చేలా కూడా ఉండవచ్చు. దీని తీవ్రత తరచూ మారుతుంటాయి. అలాగే లక్షణాలు కూడా ఎల్లప్పుడూ ఒకేలా ఉండవు. అందరిలో ఒకేలా వ్యక్తం కావు. విపరీతమైన అలసట, బరువు తగ్గడం, ఆకలి మందగించడం అనేవి సాధారణ లక్షణాలు. వ్యాధి తీవ్రత ముదిరే ముందునుంచే ఈ లక్షణాలు ఉంటాయి. యుక్తవయసులో ఉన్నవారికి తరచూ గర్భస్రావం జరగడం, పక్షవాతం రావడం, గుండెపోటు రావడం, దీర్ఘకాలంగా మానని పుండ్లు, చర్మం మీద మచ్చలు, తరచూ విరేచనాలు, నడుమూ, మెడ నొప్పి, ఊపిరితిత్తుల్లో నీరు చేరడం, పొర ఏర్పడటం, నోరెండిపోవడం వంటివి సాధారణంగా కనిపించే లక్షణాలు.
ఈ జబ్బులు ఎవరిలో రావచ్చు?
వయసు పెరుగుతున్న కొద్దీ కీళ్లవాతానికి సంబంధించిన వ్యాధులు వచ్చే ముప్పు పెరుగుతుంది. బరువు ఎక్కువగా ఉండటం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఇవి తీవ్రరూపం దాలుస్తాయి. చిన్నవారిలో, పెద్దవారిలో మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా ఇవి వచ్చే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా 25 నుంచి 40 ఏళ్ల వయసున్న మహిళల్లో ఇవి వచ్చే అవకాశాలు ఒకింత ఎక్కువ.
సాధారణ కీళ్లవాతాలు :
రుమటాయిడ్ ఆర్థరైటిస్ : ఈ జబ్బులో మన సొంత రోగనిరోధక వ్యవస్థ కీళ్ల మధ్యన ఉండే పొరపై ప్రభావం చూపి, కీళ్లను ధ్వంసం చేస్తుంది. చేతివేళ్లు, కాళ్ల వేళ్లు, మోచేతుల కీళ్లు ప్రభావితమవుతాయి. నిర్లక్ష్యం చేస్తే కీళ్లు పూర్తిగా చెడిపోయి వంకర్లు తిరుగుతాయి. గుండె, శ్వాసవ్యవస్థ, మెదడు, మూత్రపిండాలపై కూడా ప్రభావం చూపించి ప్రాణాంతకంగా మారుతుంది. తొలిదశలోనే చికిత్స తీసుకోకపోతే మరణం సంభవించే అవకాశాలు 60% వరకు ఉంటాయి.
ఎస్‌ఎల్‌ఈ/లూపస్: ఈ రోగుల్లో రోగనిరోధక వ్యవస్థ మితిమీరి ప్రవర్తిస్తుంది. శరీరంలోని చర్మం, కీళ్లు, కిడ్నీలు, రక్తకణాలు, మెదడుతో పాటు ఇతర అవయవాలను నాశనం చేస్తుంది. దీన్ని అత్యంత తీవ్రమైన జబ్బుగా పరిగణిస్తారు. పురుషులతో పోలిస్తే మహిళల్లో ఈ జబ్బు వచ్చే అవకాశాలు ఐదు రెట్లు ఎక్కువ. ఈ వ్యాధిగ్రస్తుల్లో ఆరోగ్యసంబంధిత కారణాలతో జీవన నాణ్యత గణనీయంగా తగ్గిపోతుంది. అలాగే వీళ్లలో అంటువ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ. ఇటీవల ఈ వ్యాధి కారణంగా హాస్పిటళ్లలో చేరేవారి సంఖ్య విపరీతంగా పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశం. వ్యాధి ఉన్నవారిలో గర్భవతిగా ఉన్నప్పుడు బీపీ పెరుగుతుంది. పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువ. అలాగే నెలలు నిండకుండానే బిడ్డపుట్టడం, బరువు తక్కువగా పుట్టడం వంటివి కూడా తరచూ జరుగుతుంటాయి.
జాగ్రన్స్ సిండ్రోమ్ : రోగనిరోధక వ్యవస్థ మన శరీరంలోని తేమని ఉత్పత్తి చేసే గ్రంథుల మీద ప్రభావం చూపుతుంది. ఈ కారణంగా ఒంటికి కావలసిన తేమ, లాలాజలం, కన్నీరు ఉత్పత్తి తగ్గి చర్మం, నోరు, కళ్లు ఎండిపోవడం జరుగుతుంది. విపరీతమైన అలసట ఉంటుంది. అలాగే కీళ్ల దగ్గర నొప్పి, వాపు వస్తాయి. ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, నాడీవ్యవస్థ పైన కూడా ప్రభావం పుడుతుంది. ఈ జబ్బు సాధారణంగా 40, 50 ఏళ్ల వయసులఉన్న మహిళల్లో ఎక్కువగా వస్తుంది. ఈ వ్యాధి తరచుగా ఇతర రుమాటిక్ వ్యాధులతో కలిసి వ్యక్తమవుతుంటుంది.
మయోసైటిస్ : శరీర కదలికల్లో కండరాల భూమిక చాలా ప్రధానం. ఈ మయోసైటిస్ అనే తరహా కీళ్లవాతంలో మన రోగనిరోధక శక్తి కండరాలపై దాడిచేసి కదలకుండా మంచం పట్టేట్టు చేస్తుంది. తొలిదశలో గుర్తించకపోతే ఊపిరి తీసుకోడానికి తోడ్పడే కండరాలపై దాడి చేసి ప్రాణాంతకంగా మారుతుంది. అలాగే చర్మం, కీళు ఊపిరితిత్తుల మీద కూడా ఈ తరహా కీళ్లవాతం ప్రభావం చూపుతుంది. ఇది చిన్నపిల్లల్లోనూ తరచూ కనిపించవచ్చు.
సిస్టమిక్ స్క్లిరోసిస్ : పురుషులతో పోలిస్తే, మహిళల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వ్యాధి బారిన పడ్డవారు నల్లగా మారడం, చర్మం బిగుతుగా మారి పుండ్లు పడటం, చల్లని వాతావరణంలో ఉన్నప్పుడు వేళ్లు నీలంగా, తెల్లగా మారి కుళ్లిపోవడం వంటివి తరచూ జరుగుతాయి. అలాగే దీని ప్రభావం గుండె, జీర్ణకోశం, ఊపిరితిత్తులు (ఐఎల్‌డి), కండరాలు, కీళ్ల మీద
పడుతుంది.
స్పాండైలో ఆర్థరైటిస్: మిగతా కీళ్లవాతాలకు భిన్నంగా ఇది పురుషుల్లో ఎక్కువగా వస్తుంది. దీన్ని యాంకైలోజింగ్ స్పాండలైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, రియాక్టివ్ ఆర్థరైటిస్, ఐబిడి ఆర్థరైటిస్ అనే రకాలుగా విభజించవచ్చు. యుక్తవయసులోని పురుషుల్లో విపరీతమైన నడుమునొప్పితో, నడుము దగ్గర బిగుతుగా పట్టేసి కదల్లేని స్థితి కలిగిస్తుంది. అశ్రద్ధ చేస్తే కాలక్రమేణా వెన్నెముక వెదురు కర్రలా మారిపోయి జీవననాణ్యత కోల్పోవడం జరుగుతుంది. వీరి చర్మంపై సోరియాటిక్ మచ్చలు, కళ్లలో యువిౖయెటిస్, తరచూ విరేచనాలు కావడం, మడమల్లో విపరీతమైన నొప్పి రావడం కూడా తరచూ జరుగుతంటాయి.
పిల్లల్లో కీళ్లవాతం : జువెనైల్ ఆర్థరైటిస్ అనేది పిల్లల్లో తరచూ చూసే ఒక రకం కీళ్లవాతం. ఇది ఒకటి లేదా అంతకంటే ఎక్కవ కీళ్లను ప్రభావితం చేస్తుంది. ఈ జబ్బు ఉన్న పిల్లల్లో కంటిచూపు మీద ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఎక్కువ.
కీళ్లవాతం.. కొన్ని నిజాలు
Published Fri, Oct 12 2018 12:27 AM | Last Updated on Fri, Oct 12 2018 12:27 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment