పశువులు తిరుగుతున్నాయి జాగ్రత్త | Tollywood Celebrities Reaction On Piyanka Reddy Murder Case | Sakshi
Sakshi News home page

పశువులు తిరుగుతున్నాయి జాగ్రత్త

Published Sat, Nov 30 2019 3:30 AM | Last Updated on Sat, Nov 30 2019 5:36 AM

Tollywood Celebrities Reaction On Piyanka Reddy Murder Case - Sakshi

హైదరాబాద్‌లో శంషాబాద్‌ హైవే మీద అఘాయిత్యం జరిగింది. వెటర్నరీ డాక్టర్‌ ప్రియాంక రెడ్డిపై నలుగురు దుర్మార్గుల దాష్టీకం సాగింది. ఇది సిగ్గు పడాల్సిన సమయం కడుపులో అగ్గి రగలాల్సిన సమయం. ప్రతి అమ్మాయికి రోడ్డు మీద తిరుగుతున్న పశువుల గురించి హెచ్చరించాల్సిన సమయం.

సాక్షి ఫీచర్స్‌ డెస్క్‌: అమ్మాయీ... పని మీద బజారుకు వెళుతున్నావు జాగ్రత్త. రోడ్డు మీద పశువులు తిరుగుతున్నాయి. అమ్మాయీ.. చదువుకోవడానికి కాలేజీకి వెళుతున్నావు జాగ్రత్త. దారిలో పశువులు రంకెలు వేస్తున్నాయి. అమ్మాయీ... ఉద్యోగానికి బండెక్కి వెళుతున్నావు జాగ్రత్త. పశువులు మాటేసి, దారి కాచి పడేస్తున్నాయి. పశువులు ఇవి. ప్యాంటూ షర్టూ వేసుకున్న పశువులు. మీసాలు గడ్డాలు ఉన్న పశువులు. ఛాతీ మీద వెంట్రుకలుండే పశువులు. మగవాడంటే మొలభాగం మాత్రమే అని, స్త్రీ అంటే కటి భాగం మాత్రమే అని భావించే పశువులు. పశువులకే తలవొంపులు తెచ్చే పశువులు.

అమ్మాయీ.. జాగ్రత్త.
బయలుదేరే ముందు నీ హ్యాండ్‌ బ్యాంగ్‌లో కత్తి పెట్టుకో. కారప్పొడి పెట్టుకో. వీలైతే ఒక తుపాకీ పెట్టుకో. కుప్పకూల్చే ఒక పిడుగునే పెట్టుకో. అన్నింటికీ మించి చాలా చాలా ధైర్యం పెట్టుకో. నిన్ను నువ్వు కాపాడుకోవాల్సిన సమయస్ఫూర్తి పెట్టుకో. అమ్మాయీ... పశువులు ముందు నమ్మించేలా వస్తాయి. నమ్మకాన్ని కలిగిస్తాయి. తోక ఊపుతాయి. మాట కలుపుతాయి. వెంటనే నమ్మకు తల్లీ. ఏమాత్రం నమ్మకు. మగది అని తెలిస్తే ఆఖరుకు పశువును కూడా నమ్మకు. మగ మనిషిని అసలు ఏమాత్రం నమ్మకు. అమ్మాయీ... పశువు ఒకోసారి ప్రేమ అనే చర్మం కప్పుకొని వస్తుంది. ప్రియుడు అనే పేరుతో వస్తుంది.

కబుర్లు చెబుతుంది. కానుకలు ఇస్తుంది. ఒంటరి ప్రదేశంలో కలుద్దామని చెబుతుంది. వెళ్లకు తల్లీ. వెళ్లకు. ప్రేమను కూడా కలుషితం చేసే స్థాయిలో, ప్రేమకు కూడా పాపం అంటగట్టే స్థాయిలో, ప్రేమంటేనే భయపడే స్థాయిలో పశువులు కొమ్ములు విసురుతాయి. దొరికావా? కూల్‌డ్రింకుల్లో మత్తుమందులు కలుపుతాయి. నగ్నంగా వీడియోలు తీస్తాయి. కారులో తిప్పుతూ కోరలు దింపుతాయి. తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టి పెంచుకున్న తల్లివమ్మా నువ్వు. ఈ ప్రేమ పశువుల నుంచి నిన్ను నువ్వే కాపాడుకోవాలి.

ఎప్పుడో ఒకసారి పులి ఎదురొస్తుంది. ఎప్పుడో ఒకసారి పాము కరుస్తుంది. ఎప్పుడో ఒకసారి తేలు కనపడుతుంది. కాని ఇది అలా కాదు తల్లీ. అనుక్షణం ప్రమాదం నీ పక్కనే పొంచి ఉంటుంది. ఊరు అని లేదు, వాడ అని లేదు, వీధి అని లేదు, హైవే అని లేదు, రాత్రి అని లేదు, పగలు అని లేదు. తనవాళ్లని లేదు, పరాయి వాళ్లని లేదు. నువ్వొక అమ్మాయివైతే, స్త్రీవైతే, మహిళవైతే, చిన్నారి పాపవైనా సరే, ప్రమాదంలో ఉన్నట్టే. చాలా ప్రమాదంలో ఉన్నట్టే. అనుక్షణం నువ్వు వేయి కళ్లతో లక్ష ఆయుధాల పహారాతో నిన్ను నువ్వు రక్షించుకోవాల్సిందే.

మరి ఈ సమాజం ఏం చేస్తుంది?
చూస్తూ ఉంటుంది. అంతా జరిగాక ‘అయ్యయ్యో’ అంటుంది. ఫేస్‌బుక్‌లో పోస్టులు రాస్తుంది. టీవీ కెమెరాల ముందు ఖండిస్తుంది. కొవ్వొత్తులతో ప్రదర్శనలు చేస్తుంది. ర్యాలీలు నిర్వహిస్తుంది. అంతే తప్ప తన ఇంట్లో మగవాళ్లు ఎలా ఉన్నారు, తన ఇంట్లో మగ అబ్బాయిలు ఎలా ఉన్నారు అని చూసుకోదు. చెక్‌ చేసుకోదు. వాళ్లు ఎలాంటి ఆలోచనల్లో ఉన్నారో, ఎలాంటి అఘాయిత్యపు తెగింపులో ఉన్నారో నిఘా పెట్టదు. వాళ్లను ముందు తమ ఇంటి స్త్రీలను గౌరవించమని నేర్పదు. ఇంట్లోని స్త్రీలను గౌరవించినవాడే బయట సమాజంలో ఉన్న స్త్రీలను గౌరవిస్తాడు. ఇంట్లో అవమానించినవాడు బయట అఘాయిత్యానికి సిద్ధంగా ఉంటాడు. అందుకే ఇవాళ సమాజంలో అతి అరుదుగా వినిపిస్తున్నది ‘సంస్కారం’ అనేమాటే తల్లీ! సంస్కార హీనమైన సమాజంలోనే ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతుంటాయి. స్త్రీని గౌరవించని సంస్కారం, స్త్రీకి రక్షణ ఇవ్వలేని సంస్కారం, ఒంటరిగా ఒక స్త్రీ కనిపిస్తే ఆమెకు నిజమైన సహాయం చేయలేని సంస్కారం, ఆమెకు ఏ ఆందోళనా ఇవ్వకుండా ఇల్లు చేరేలా చూసే సంస్కారం... ఇది లేకుండా పోయిందమ్మా.

అదృశ్యమైపోయింది. ఏ సైంటిస్టులైనా వచ్చి తిరిగి సృష్టిస్తే, మాత్రలుగా తయారుచేసి మింగిస్తే, ఇంజక్షన్లుగా జబ్బల్లో పొడిస్తే తప్ప ఈ సంస్కారం ఇప్పుడప్పుడే సమాజంలో వచ్చేలా లేదమ్మా! అమ్మాయీ... మన చదువులు చట్టుబండలు... ఇవి ర్యాంకులు ఎలా తెచ్చుకోవాలో చెప్తాయి గాని, క్యాంపస్‌ సెలక్షన్‌లో ఎలా జాబ్‌ కొట్టాలో నేర్పుతాయిగానీ, వీసా తెచ్చుకొని ఎలా దూరదేశాలకు ఎగిరిపోవాలో చెబుతాయిగానీ, పక్కనే ఉన్న ఒక ఆడపిల్లను, స్త్రీని, మహిళను, తల్లిని, చెల్లిని, ఉపాధ్యాయురాలిని, ఉద్యోగినిని ఎలా గౌరవించాలో నేర్పించవు. గతంలో కాండక్ట్‌ సర్టిఫికెటు ప్రతి ఒక్కరికీ ఒక యోగ్యతా పత్రంగా ఉండేది. ఇవాళ కాండక్ట్‌ అనేది ఒక హేళన చేయదగ్గ సంగతి అయిపోయిందమ్మా. అయినా తల్లీ! నువ్వు తెలుసుకోవాలి! ఎప్పుడూ నీ ఫోన్‌లో పోలీసు శాఖల నంబర్లు ఏమేమి ఉండాలో తెలుసుకోవాలి. షీ టీమ్‌ల నంబర్లు ఉంచుకోవాలి. అర్జెంట్‌గా నీకు సహాయం చేసేవారి నంబర్లు నోటికి వచ్చి ఉండాలి.

గుంపులో ఉంటేనే సేఫ్టీ లేదు తల్లీ. ఒంటరి ప్రదేశానికి చేరుకోగానే నువ్వు తక్షణమే ఏ రక్షణ విభాగానికి ఫోన్‌ చేయాలో నీకు తెలిసి ఉండాలి. చాలు తల్లి! చాలు! వంట నేర్చుకున్నది చాలు! ఊడ్చడం నేర్చుకున్నది చాలు! అంట్లు కడగడం నేర్చుకున్నది చాలు! ఇక ఈ చేతులు ఉక్కుముక్కలుగా ఎలా మార్చాలో తెలుసుకోవాలి. శరీరాన్ని ఒక ఆయుధంగా ఎలా మార్చుకోవాలో తెలియాలి. యుద్ధవిద్యల్లో నువ్వు ఆరితేరాలి. పద్ధతిగా వస్తే ఒంటరిగా పెద్ద సైన్యంతో పోరాడవచ్చు. కాని ఇవి ఎటునుంచి ఎలా దాడి చేస్తాయో తెలియని పశువులమ్మా! పాశవిక మందలమ్మా! కొమ్ములతో పొడిచి కామం తీర్చుకోవాలనుకునే వికృత జంతువులమ్మా! పురుగులమ్మా! చెదకు మందు కనిపెట్టగలిగాం కానీ, ఈ వికృత మగవాంఛకు మందు కనిపెట్టలేకపోయాం.

అందుకే నువ్వు ఎంత పెద్ద మూకతో అయినా సరే, తలపడే స్థయిర్యాన్ని, ధైర్యాన్ని సదా కలిగి ఉండాలమ్మా! తల్లిదండ్రులారా... అమ్మాయిల కోసం ఆందోళన పడుతూనే ఉన్నారు. అబ్బాయిల కోసం ఆందోళన పడండి. వారితో మాట్లాడండి. వారి భావోద్వేగాలు వినండి. వారి మానసిక స్థితి తెలుసుకోండి. వారిని నిత్యం గమనించండి. వారు ప్రమాదంలో పడకుండా, ఒకరిని ప్రమాదంలో పడవేయకుండా ఎలా తమను తాము అదుపు చేసుకోవాలో తెలియచేయండి. మాట్లాడండి తల్లిదండ్రులారా.... మాట్లాడండి... మాట్లాడుతూనే ఉండండి... అబ్బాయిలు పశువులుగా మారకుండా ఉండేందుకు... పశువులుగా మారినవారు మనుషులుగా మారేంత వరకూ మాట్లాడుతూనే ఉండండి. ఈ పశు సంస్కృతి ప్రియాంకారెడ్డితో ఆఖరు కావాలి. ఈ పశుహేల ఆమె అర్ధరాత్రి ఆక్రందనలతో అంతం కావాలి. అందుకు అందరం చైతన్యవంతం అవుదాం. సంస్కారవంతం అవుదాం.

ఉరిశిక్ష అనడం వల్లే చంపేస్తున్నారు
నిర్భయ చట్టంలో నేరం రుజువైతే ఉరిశిక్ష తప్పనిసరి అనేసరికి ఎక్కడ తమ గురించి చెబుతుందో అనే ఉద్దేశ్యంతో నిందితులు ఆ బాధితురాలిని అతికిరాతకంగా చంపేస్తున్నారు. చట్టం ఫెయిల్యూర్‌ బాధ్యత ప్రభుత్వాలదే. ఐదేళ్ల నుంచి యాభై ఏళ్లలోపున్న ఆడవారిపై అరవై శాతం అఘాయిత్యాలు జరుగుతున్నాయని పోలీసులే ధ్రువీకరించారు. ఒక స్త్రీ తనకు తాను జాగ్రత్తలు తీసుకున్నా ఆమెకు భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థదే.
– బి.అనిత, అడ్వకేట్‌

మానసిక స్థితిలో మార్పు రావాలి
ఇలాంటి అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేయాలనే నిర్భయ చట్టం తీసుకువచ్చారు. కానీ, మగాడు ఆ శిక్షలకు కూడా భయపడటం లేదు. మగవాడిలో ఇలాంటి నేర ప్రవృత్తి ఎందుకు పెరుగుతుందో, మానసిక స్థితి ఏంటో తెలుసుకోవాలి. దానికి చికిత్స చేయాలి. చట్టాలు వస్తున్నాయి. తగిన శిక్షలు అమలవుతున్నాయి. అలాగని ఏవీ తగ్గడం లేదు. మనుషులకు భయం అనేది పోయింది. ఇంటర్నెట్‌లో పోర్న్‌ సైట్స్‌ చూసి కూడా ఇలా ఉన్మాదుల్లా తయారవుతున్నారు.
– జి.మమత, అడ్వకేట్‌

అమాయకురాలైన ప్రియాంకా రెడ్డిపై ఆత్యాచారం చేసి హత్య చేశారు. మానవాళిని కదిలించే ఓ విషాదకరమైన çఘటన ఇది. ఈ ఘటనలో దోషులైనవారిని క్రూరమృగాలతో పోల్చితే అవి కూడా సిగ్గుపడతాయి. ఈ సమాజంలో మహిళగా పుట్టడం నేరమా? ప్రియాంకా రెడ్డి మరణానికి కారకులై, తప్పు చేసిన వారికి శిక్షపడేలా మనమందరం పోరాడాలి. ప్రియాంక ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను – అనుష్క

ప్రియాంకా రెడ్డి సంఘటన నన్ను తీవ్రంగా కలచి వేసింది. మాటలు రావడం లేదు. రోజు రోజుకీ పరిస్థితులు దిగజారిపోతున్నాయి. నేను ఎంతో సేఫ్‌ ప్లేస్‌గా భావించిన హైదరాబాద్‌లో ఇలాంటి ఘటన జరగడం బాధ కలిగించింది. ఏ సమయంలోనైనా, ఎక్కడికి వెళ్లినా మహిళలు సురక్షితంగా తిరిగి రాగల పరిస్థితులు దేశంలో ఎప్పుడు వస్తాయో? ప్రియాంకను కిరాతకంగా చంపిన దోషులకు శిక్ష పడాలి. – కీర్తీ సురేష్‌

చాలా కోపం తెప్పించే ఘటన ఇది. మహిళలపై రోజు రోజుకీ జరుగుతున్న అఘాయిత్యాలు నన్ను బాధపెడుతున్నాయి. అసలు మహిళలు సురక్షితంగా ఉండగల ప్లేస్‌ ఎక్కడైనా ఉందా? అనిపిస్తోంది. ప్రియాంకారెడ్డి ఘటనలో నేరస్తులకు పెద్ద శిక్ష విధించాలి – కాజల్‌ అగర్వాల్‌

ఇలాంటి దిగ్భ్రాంతికర సంఘటనపై ఎలా స్పందించాలో కూడా నాకు అర్థం కావడం లేదు. ఇలాంటి నేరం చేయాలనే ఆలోచన కూడా రాని విధంగా నేరస్తులను శిక్షించాలి – రకుల్‌ప్రీత్‌ సింగ్‌

ప్రియాంకా రెడ్డి ఘటన తెలిసిన తర్వాత నా గుండె పగిలిపోయింది. స్పందించడానికి మాటలు రావడం లేదు. ఇలాంటి వార్తలను చదవాలన్నా చాలా విచారకరంగా ఉంది. అసలు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఆ రాక్షసులను ఉరి తీయాలి – రాశీ ఖన్నా

ఇది చాలా హేయమైన సంఘటన. చాలా కలత చెందాను. ఈ అమానవీయ ఘటనలో ప్రియాంకా ఎంతటి క్షోభను అనుభవించి ఉంటుందో ఊహించుకోవడానికే కష్టంగా ఉంది. వారి కుటుంబ సభ్యుల బాధను మాటల్లో చెప్పలేం. నిందితులకు శిక్షపడాలి. – లావణ్యా త్రిపాఠి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement