అలీ... ఫ్యామిలీ... | tribute to boxer mohemmed ali | Sakshi
Sakshi News home page

అలీ... ఫ్యామిలీ...

Published Sat, Jun 4 2016 11:59 PM | Last Updated on Mon, Sep 4 2017 1:40 AM

అలీ... ఫ్యామిలీ...

అలీ... ఫ్యామిలీ...

నివాళి
‘‘నాన్నా... నేనూ నీలాగే బాక్సర్‌ను అవుదామనుకుంటున్నా’’నని తన కూతురు అడిగిన క్షణాన ఆ తండ్రి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ‘ఛాతీపై దెబ్బలు తినేందుకు కాదు అమ్మాయిల శరీరం ఉన్నది...’ అంటూ ఇరవై ఏళ్లుగా ఆయన బాక్సింగ్‌లో ప్రమాదాల గురించి చెబుతూ వచ్చారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా తన సొంత కూతురే ఎదురుగా నిలబడి పంచ్‌లు కొట్టేందుకు సిద్ధం అంటోంది. తేరుకోవడానికి కాస్త ఆలస్యమైనా మనసు కష్టపెట్టడం ఇష్టం లేక ఒప్పుకున్నాడు.

అయితే మొహమ్మద్ అలీ కూతురు లైలా అలీ తండ్రిని నిరాశకు గురి చేయలేదు. మహిళల బాక్సింగ్‌లో జగజ్జేతగా నిలిచి తండ్రి గర్వపడేలా చేసింది. 24 బౌట్‌లు ఆడితే 21 నాకౌట్‌లు సహా అన్నీ విజయాలే. అలీ సంతానంలో ఎక్కువగా పాపులర్ అయింది లైలానే. సాధారణంగా తండ్రి వారసత్వాన్ని కుమారులు కొనసాగించడం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మాత్రం ఆడబిడ్డ తన తండ్రి గర్వపడేలా చేసింది.

 తొమ్మిది మంది పిల్లలు
మొహమ్మద్ అలీకి నలుగురు భార్యలు. మొత్తం తొమ్మిది మంది పిల్లలు. సోన్జీ రాయ్, బెలిండా బాయ్డ్, వెరొనియా పోర్ష్‌లకు విడాకులు ఇచ్చిన తర్వాత 1986లో లోనీ విలియమ్స్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పటివరకు ఆమెతోనే కలిసి ఉంటున్నాడు. మూడోభార్య పిల్లలైన లైలా అలీ, హనా అలీతోనే తండ్రికి అనుబంధం ఎక్కువ. లైలా బాక్సర్‌గా సత్తా చాటగా... హనా రచయిత్రిగా పేరు తెచ్చుకుంది. తరచు తండ్రిని కలుస్తూ, అతని గురించి ట్వీట్లు చేస్తూ హనా మాత్రమే తండ్రిని ప్రస్తావిస్తూ వస్తోంది. అలీ మరణం అనంతరం మా నాన్న శిఖర సమానుడు. ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్లిపోయాడు. నా జీవితంలో అత్యంత ప్రియమైన వ్యక్తి నీవు అంటూ హనా సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లో పోస్ట్ పెట్టింది. లైనా, హనా మాత్రమే గత జనవరిలో తండ్రి పుట్టిన రోజున కలిసి స్వయంగా శుభాకాంక్షలు తెలిపారు.

మిగతా ఐదుగురు అమ్మాయిలు ఖలియా, రాషెదా, జమీయుల్లా, మియా, మరియం పెద్దగా ఎక్కడా కనిపించరు. వాస్తవానికి నాలుగో భార్య విలియమ్స్ వ్యవహార శైలి కారణంగానే వారంతా తమ తండ్రితో ఎక్కువగా కలవలేకపోయారని అలీ తమ్ముడు చెబుతుంటాడు. అయితే పార్కిన్సన్ బారిన పడిన తర్వాత అలీ ఈ మాత్రమైనా జీవితాన్ని కొనసాగించగలిగాలంటే ఆమె చలవే అని మరికొందరు అంటారు. అలీ, విలియమ్స్‌కు అసద్ అమీన్ అనే దత్త పుత్రుడు ఉన్నాడు.

 కొరగాని కొడుకు
ప్రపంచం మొత్తం అభిమానించినా, నాన్న బాక్సింగ్ పంచ్ పవర్ విలువేమిటో, అందులో పదును ఏమిటో సొంత కొడుకు మాత్రం గుర్తించలేకపోయాడు. అలీ అసలు కొడుకు జూనియర్ అలీ మాత్రం గత రెండేళ్లుగా తండ్రికి దూరంగా ఉంటున్నాడు. నాన్న తనను సరిగా పట్టించుకోలేదని, ఫలితంగా సరైన దిశ లేకుండా పేదరికానికే పరిమితమయ్యానని అతను తన ఆక్రోశం వెళ్లగక్కాడు. రెండేళ్ల క్రితం ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తాను తండ్రి గురించి ఆలోచించడం మానేశానని, ఆయనకు ఏం జరిగినా తనకు అనవసరమని గట్టిగా చెప్పేశాడు.

బాక్సింగ్ దిగ్గజానికి వారసుడుగా ఉండాల్సిన కుమారుడు అనామకుడిగా మిగిలిపోయాడు. మరోవైపు అలీ ఇన్నేళ్ల పాపులర్ కెరీర్‌లో మరో ఇద్దరు మహిళలు కూడా తమను పెళ్లి చేసుకున్నాడని, తమతో సంబంధం కొనసాగించాడని ముందుకు రాగా, మరో ఇద్దరు తామూ అలీ సంతానమేనని ప్రకటించుకున్నా అవి నిర్ధారణ కాలేదు.  - మొహమ్మద్ అబ్దుల్ హాదీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement