బాక్సర్ అలీని పట్టించుకోని కొడుకు!
లాస్ ఏంజెల్స్: బాక్సింగ్ దిగ్గజం మహ్మద్ అలీని ప్రపంచ మొత్తం అభిమానించినా, అతని విలువేమిటో సొంత కొడుకు జూనియర్ అలీ గుర్తించలేకపోయాడు. దాదాపు రెండు సంవత్సరాలుగా తండ్రిగా దూరంగా ఉంటున్న జూనియర్ ఆలీ.. ఒకానొక సందర్భంలో తండ్రిపై తన అసహనాన్ని వెల్లగక్కాడు. తండ్రి సరిగా పట్టించుకోలేకపోవడం వల్లే తాను పేదరికంలో మగ్గాల్సి వస్తుందన్నాడు. రెండేళ్ల క్రితం ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తాను తండ్రి గురించి ఆలోచించడం మానేశానని, ఆయనకు ఏం జరిగినా తనకు అనవసరమని గట్టిగా చెప్పేశాడు. ప్రస్తుతం చికాగాలో తల్లి తరపు తాతయ్య దగ్గర భార్యతో కలిసి జూనియర్ అలీ జీవిస్తున్నాడు. అతనికి భార్య షకీరా, పిల్లలు అమీరా(8), షకీరా(7)లు ఉన్నారు. కాగా, ఒక స్వచ్ఛంద సంస్థ అందించే సహకారంతోనే భార్యను తన ఇద్దరు పిల్లల్ని పోషించడం జూనియర్ అలీ దుర్భర పరిస్థితికి అద్దం పడుతోంది.
మొహమ్మద్ అలీకి నలుగురు భార్యలు కాగా, మొత్తం తొమ్మిది మంది పిల్లలు. అందులో మొదటి భార్య కొడుకే జూనియర్ అలీ. సోన్జీ రాయ్, బెలిండా బాయ్డ్, వెరొనియా పోర్ష్‌లకు విడాకులు ఇచ్చిన తర్వాత 1986లో లోనీ విలియమ్స్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పటివరకు ఆమెతోనే కలిసి ఉంటున్నాడు. మూడోభార్య పిల్లలైన లైలా అలీ, హనా అలీతోనే తండ్రికి అనుబంధం ఎక్కువ. లైలా బాక్సర్‌గా సత్తా చాటగా... హనా రచయిత్రిగా పేరు తెచ్చుకుంది. అయితే లైలా, హనాలను తరచు జూనియర్ అలీ కలిసినా, తండ్రి గురించి మాత్రం కనీసం తెలుసుకునే ప్రయత్నంకూడా చేయకపోవడం బాధాకరమే. ప్రపంచానికి ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన మొహ్మద్ అలీ కుమారుడు ఒక అనామకుడిలా మిగిలిపోవడం విచారకరం.