సెక్స్‌ వర్కర్‌ల కోసం అందం వద్దనుకుంది ! | TV Actress Jaya Bhattacharya Distributing Ration | Sakshi
Sakshi News home page

దాదా కూతుర్ని నేను

Published Fri, Jun 19 2020 8:34 AM | Last Updated on Fri, Jun 19 2020 8:34 AM

TV Actress Jaya Bhattacharya Distributing Ration - Sakshi

జయ : ముందు–తర్వాత

ఏమిటీ బెదిరింపు! దాదా కూతురైతే మాత్రం?! బెదిరింపు కాదు. దాదా కూతురు దాదాలానే ఉండాలట.వీధిలో చేతులు పైకి మడవాలి. ఆటోవాలాతో గొడవకు దిగాలి.పెట్స్‌ని వదిలేసిన వారి పని పట్టాలి. ‘‘దాదా కూతుర్ని నేను.. అంటోంది జయ. అందం వద్దనుకుంది.దాదాలా ఆదుకునే గుణం ముఖ్యమంది.

కరోనా వచ్చిపడింది. మనుషులే ఆఖరి గింజ కోసం బియ్యం డబ్బాలను బోర్లించుకుంటుంటే, వీధుల్లో తిరిగే మూగప్రాణులకు మెతుకులు ఆకాశం నుంచి రాలిపడతాయా? కరోనా ముందు నుంచే.. ఇరవై ఏళ్లుగా స్ట్రీట్‌ యానిమల్స్‌ని చేరదీసి పోషిస్తున్న జయా భట్టాచార్య దగ్గర కూడా లాక్‌డౌన్‌ కాలంలో చివరి మూడు వేల రూపాయలు మాత్రమే అకౌంట్‌లో మిగిలాయి. అవైనా ఆమె తండ్రికి వచ్చిన పెన్షన్‌ డబ్బులు. నిమోనియాతో బాధపడుతున్న తొంభై ఏళ్ల తన తండ్రికి చికిత్స చేయించడం కోసం ఆసుపత్రులు తిరుగుతున్నప్పుడే.. ఆమె దాచుకున్న డబ్బంతా కరిగిపోయింది. ముంబైలోని కలిగిన కుటుంబాలలో ఆమెకు కొంతమంది ఫ్రెండ్స్‌ ఉన్నారు. యానిమల్‌ వెల్ఫేర్‌ కోసం జయతో వాళ్లు రెండు దశాబ్దాలపాటు చేతులు కలిపి ఉన్నారు కాబట్టి ఈ కరోనా కాలంలో మూగజీవులకు లోటు లేకుండా గడిచిపోతుంది. చేతిలో ఉన్న మూడు వేల రూపాయలతో తనేం చేయగలనని జయ ఆలోచన చేసింది మాత్రం.. సెక్స్‌ వర్కర్‌ల కోసం!

సెక్స్‌ వర్కర్‌ల కోసం భోజనం ప్యాక్‌ చేస్తున్న జయ
లాక్‌డౌన్‌లో డొక్కలెండి మూలుగుతున్న జంతువులకు ఆహారం, నీళ్లు ఇవ్వడానికి అనుమతి ఇమ్మని పోలీసులను కోరేందుకు వెళ్లినప్పుడు రోజుల తరబడి తిండి లేక బలహీనంగా ఉన్న మహిళలు కొందరు జయ కంట్లో పడ్డారు. వాళ్లంతా ‘ఉపాధి’ కోల్పోయిన సెక్స్‌వర్కర్‌లు. తక్షణం వాళ్లకు ఎవరైనా చేయవలసిన సహాయం ఇంత ముద్ద పెట్టడం. జయ తన దగ్గరున్న డబ్బుతో కిచిడీ చేయడానికి అవసరమైన  సరకులు కొని, తన సహాయకులతో కలిసి తమ అపార్ట్‌మెంట్‌లోనే వండించి సెక్స్‌ వర్కర్‌లు ఉన్న చోటుకు తీసుకు వెళ్లారు. వాళ్లకు పెట్టి, వీళ్లూ వారితో కలిసి తిన్నారు. కూర్చోడం దూరంగానే అయినా మాటలు కలబోసుకోడానికి అదేమీ దూరం కాలేదు. అప్పుడే ట్రాన్స్‌జెండర్‌లు పడుతున్న ఇక్కట్ల గురించీ జయకు తెలిసింది. అడిగిన వారికి ఇవ్వడం తేలికే. అడగలేని వాళ్ల దగ్గరకు వెళ్లి ఇవ్వడంలోనే ఇబ్బంది ఎదురౌతుంది.. వాళ్లెలా రియాక్ట్‌ అవుతారోనని. వాళ్ల రియాక్షన్‌ తర్వాత. చూసేవాళ్లూ?! సెక్స్‌ వర్కర్‌లు. ట్రాన్స్‌జెండర్‌లు అసలు మనుషులే కాదన్నట్లు ఉంటాయి చూపులు. జయ ఆ చూపుల్ని పట్టించుకోలేదు. తనకున్న ఫ్రెండ్స్‌ నెట్‌వర్క్‌తో సమీప ప్రాంతాల్లోని ఆ రెండు కమ్యూనిటీల వారికి అవసరమైన సహాయం అందేలా చేయగలిగారు. అక్కడితో ఆగిపోకూడదని కూడా అనుకున్నారు.

మంచి పని తలపెట్టినప్పుడు ఎండ పూట కూడా నాలుగు చల్లటి చినుకులు పడతాయేమో! అమెరికాలోని డాలస్‌ నుంచి జయ అకౌంట్‌లోకి కొంత డబ్బొచ్చి పడింది. పూర్వపు స్నేహితుడు! ఇక్కడ ఈమె చేస్తున్న పని గురించి అక్కడికి తెలిసింది. ‘నన్నూ హెల్ప్‌ చెయ్యనివ్వు’ అని డబ్బు పంపాడు. జయ స్ఫూర్తితో టర్కీలో ఒకరు అక్కడి సెక్స్‌వర్కర్‌లకు, ట్రాన్స్‌జెండర్‌లకు సహాయం చేస్తూ ఆ ఫొటోలను జయకు పంపారు. జయ ఆశ్చర్యపోయారు. ఇంకా ఆశ్చర్యం.. ఆమె ఎవర్నీ నోరు తెరిచి అడక్కుండానే రేణుకా సహానే, సుహాసినీ మూలే, సునీతా రజ్వార్, అంకిత్‌ బాత్లా, ఇంకా.. తన క్లాస్‌మేట్స్, టీవీ ఫీల్డ్‌లో తనకు జూనియర్‌లు, సీనియర్‌లు జయకు డబ్బు పంపారు. జయ కొన్నాళ్ల క్రితం వరకు ‘థ్యాంక్యూ ఎర్త్‌’ అనే ఎన్జీవోను నడిపారు. 2010లో అది రిజిస్టర్‌ అయింది. మధ్యలో ఆర్థిక ఇబ్బందులొచ్చి బ్రేక్‌ పడింది. ఇప్పుడీ ఆర్థిక ప్రోత్సాహంతో సంస్థను మళ్లీ తెరిచే ఉద్దేశంలో ఉన్నారు. ఫ్రెండ్స్‌ అయినప్పటికీ వారు పంపిన డబ్బులో ఎంత వాడిందీ, దేనికి వాడిందీ ఎప్పటì కప్పుడు లెక్కరాసి పంపుతుంటారు జయ. 

జయా భట్టాచార్య (41) టీవీ నటి. ‘క్యూంకీ సాస్‌ భి కభి బహు థీ’ సీరియల్‌లో పాయల్‌గా వీక్షకులకు గుర్తుండే ఉంటుంది. ముప్పైకి పైగా సీరియళ్లలో నటించారు. పది సినిమాల్లో చిన్నచిన్న పాత్రలు వేశారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌లో సోషల్‌ వర్కర్‌గా తనకై తాను స్క్రిప్టు లేని పాత్రను పోషిస్తున్నారు. ఆదరణ కోసం ఎదురు చూస్తున్న సెక్స్‌ వర్కర్‌లు, ట్రాన్స్‌జెండర్‌లే ఆమె చేత ఆ పాత్రను డైరెక్ట్‌ చేయిస్తున్నారు. పాత్రకు అడ్డుపడుతోందని ఇటీవలే ఆమె గుండు చేయించుకున్నారు! ఆమె సహాయకుడు మొదట అందుకు అంగీకరించలేదు. రెండు రోజులు ఆగితే జయ మనసు మారుతుందని వాయిదా వేసి, ఇక లాభం లేదని ఆమె చెప్పినట్లు చేశాడు. ‘‘జుట్టు తీసేస్తే అందం పోతుంది మేడమ్‌ అని బాధపడ్డాడు అతను. ముఖం మీద, కళ్ల మీద పడుతుంటే ఎలా పని చేయడం అన్నాను. అయినా మా నాన్న దాదా. చుట్టు పక్కల ఆయనంటే టెర్రర్‌. ఆయన కూతురిగా నేను కళ్ల ముందు జరుగుతున్న తప్పుల్ని సరిచెయ్యాలి. అవసరం అయితే వీధుల్లో తగాదా పడాలి. సీనియర్‌ సిటిజన్స్‌ని ఎక్కించుకోకపోతే ఆటోవాలాలను గదమాయించాలి. పెట్స్‌ని ఎవరైనా వదిలించుకుంటే వారి పని చెప్పాలి. అందం కోసం చూసుకుంటే ఎలా..’’  అంటారు జయ.. అందంగా నవ్వుతూ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement