
సర్కస్‌ను వృత్తిగా చేసుకుని ఒక యువకుడు పొట్టపోసుకునేవాడు. సర్కస్‌లో పులుల విన్యాసాలను చూసేందుకు ప్రజలు ఎగబడేవారు. చిన్నా, పెద్దా అంతా కిక్కిరిసిపోయేవారు. సర్కస్ ద్వారా వచ్చే ఆదాయంతో పులులకు తిన్నంత మాంసం పెట్టేవాడు. ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. అకస్మాత్తుగా ప్రభుత్వం ఎందుకో ఆ ఏడాది సర్కస్‌ను నిషేధించింది. దాంతో ఆ యువకుడు తను పైసా పైసా వెనకేసి దాచుకున్న డబ్బుతో మాంసం తెచ్చి పులుల కడుపు నింపేవాడు. ఆ డబ్బంతా అయిపోయింది. చేతిలో చిల్లిగవ్వలేదు. తను ఎలాగోలా కడుపునింపుకునేవాడు. కానీ పులుల కడుపు నింపాలంటే మాటలా! పులులు ఆకలి బాధతో అల్లాడిపోసాగాయి.
తన కష్టాన్ని మిత్రుడితో చెప్పుకుని కన్నీరుమున్నీరయ్యాడా యువకుడు. పులి వంటి వాటిని అడవిలో వదిలేస్తే అవే రాజాలా బతికేస్తాయని సలహా ఇచ్చాడు మిత్రుడు. మిత్రుడి సలహా ఆ యువకుడికి ఎంతగానో నచ్చింది. పులులను దగ్గరలోని అడవిలోకి తోలుకెళ్లాడు. పులులు కూడా సంతోషంగా అడవిలోకి వెళ్లాయి. కొన్ని రోజులకే పులులపై సీమకుక్కలు దాడిచేసి చంపేశాయన్న వార్త ఊరంతా పాకింది. పులులను కుక్కలు దాడి చేసి చంపడమేమిటా అని ఆశ్చర్యపోవడం ప్రజల వంతయ్యింది. ఈ విషయం ఆ సర్కస్ యువకుడికీ తెలిసి చనిపోయిన తమ పులులను చూసి రోదించసాగాడు. ‘నా పులులను సర్కస్ లో ఉంచుకోకుండా అడవిలో పెంచితే ఈ రోజు ఈ పులులు కుక్కల దాడిలో చనిపోయేవి కావు కదా’ అని వాపోయాడు.
ఈ కథలోలాగే చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల అతి గారాబంతో, ప్రేమతో వాళ్లు అడిగిందల్లా తెచ్చి వాళ్లముందుంచుతారు. ఇలాంటి పిల్లలు పెరిగి పెద్దయి తమ కాళ్లపై తాము నిలబడే పరిస్థితి వచ్చినప్పుడు ఎదురయ్యే సవాళ్లకు బెంబేలెత్తుతారు. ప్రతీ చిన్న విషయానికీ ఆందోళన చెందుతారు. పిల్లలకు ప్రేమను పంచడం తప్పుకాదు ప్రేమతో పాటు ధైర్యసాహసాలు నూరిపోయాలి. పోరాటపటిమను చిన్నప్పటి నుంచి నేర్పాలి.
– తహూరా సిద్దీఖా
Comments
Please login to add a commentAdd a comment