శిష్యుడు ఆశ్రమాన్ని శుభ్రం చేస్తున్నాడు. చూడకుండా చేయి తగలడంతో ఒక పింగాణీ పాత్ర కిందపడి, భళ్లున బద్దలైంది. గురువుగారికి కోపమెక్కువ. పైగా ఆయనకు అది ఇష్టమైన పాత్ర. అందులోనే భోంచేయడం ఆయన అలవాటు. శిష్యుడికి భయమేసింది. ఒళ్లంతా చమట పట్టింది. గురువు తనను ఏం చేయనున్నాడో! చకచకా ఆ పెంకులన్నీ ఏరి ఒకచోట జాగ్రత్తగా పెట్టాడు. గురువుకు ఏమని సమాధానం చెప్పాలా అని ఆలోచించసాగాడు.
కాసేపట్లో గురువు వస్తున్నట్టుగా పాదాల అలికిడి వినబడింది. శిష్యుడు ఎదురెళ్లి, వినయంగా చేతులు కట్టుకుని, ‘గురువర్యా, పొద్దున్నే నాకో సందేహం వచ్చింది. అడగమంటారా?’ అన్నాడు. శిష్యుడి వాలకం కొత్తగా అనిపించినప్పటికీ, అడగమన్నట్టుగా తలూపాడు గురువు. ‘అసలు మనుషులకు మరణం ఉండాల్సిందేనా?’ ప్రశ్నించాడు శిష్యుడు. ‘అది ప్రకృతి సహజం.
ప్రతిదీ ఏదో రోజు నశించి తీరవలసిందే’ చెప్పాడు గురువు. వెంటనే అందుకున్నాడు శిష్యుడు: ‘అయితే, ఇవ్వాళ మీ భోజన పాత్ర మరణించింది’. వివేకవంతుడు కావడంతో గురువుకు తక్షణం జరిగినదేమిటో అర్థమైంది. శిష్యుడి ప్రశ్నకు ఉన్న మూలం గుర్తించాడు. దానికి కారణమైన తన కోపగుణం కూడా మనసులో మెదిలింది. శిష్యుడిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ‘ఇవ్వాళ నా కోపం కూడా మరణించింది’ అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment