ప్రేమికుల దినోత్సవం; ఇవి మీకు తెలుసా | Valentines Day: Important Notes In Love | Sakshi
Sakshi News home page

ప్రేమికుల దినోత్సవం; ఇవి మీకు తెలుసా

Published Fri, Feb 14 2020 10:29 AM | Last Updated on Fri, Feb 14 2020 10:29 AM

Valentines Day: Important Notes In Love - Sakshi

ప్రేమ రెండక్షరాల పదం.. ప్రేమ రెండు హృదయాల స్పందన..ప్రేమ రెండు మనస్సుల్లో చెదిరిపోని మధుర జ్ఞాపకం.. ప్రేమ నీకు నేనున్నానని తోడుగా నిలిచేది..ప్రేమ కష్టాల్లోనూ.. సుఖాల్లోనూ వెన్నంటి ఉండేది..  అలాంటి స్వచ్ఛమైన ప్రేమను పొందేందుకు రెండు మనుస్సులు ఎప్పుడూ పరితపిస్తుంటాయి. స్వచ్ఛమైన ప్రేమకు గుర్తుగా నిలిచిన పలువురి అభిప్రాయాలు వాలంటైన్స్‌డే సందర్భంగా..  

ప్రేమికుల రోజు వచ్చిందిలా
ప్రేమికుల రోజు అనగానే ముందుగా గుర్తుకొచ్చేది వాలంటైన్‌. వాలంటైన్‌ డేను జరుపుకోవడానికి కారణం ఆయనే. రోమ్‌నగరంలో మతాచార్యుడిగా వాలంటైన్‌ పనిచేసేవాడు. క్లాడియస్‌ అనే రాజు పాలించేవాడు. తన సామ్రాజ్యంలో సైనిక దళాల్ని ఏర్పాటు చేయాలనేది ఆయన కోరిక. రాజ్యంలో ఎవరూ పెళ్లిళ్లు చేసుకోవడానికి వీల్లేదని శాసిస్తాడు. వాలంటైన్‌ దీనిని వ్యతిరేకించారు. రహస్యంగా వివాహాలు చేశాడు. దీంతో అతనికి మరణశిక్ష విధించి కారాగారంలో బంధించాడు. జైల్లో ఉన్నప్పుడు తన కోసం చాలా మంది యువత వచ్చేవారు. కిటికీల్లోంచి వారు అందించిన పువ్వులు, సందేశాల(లేఖలు)తో జైలు గది నిండిపోయేది. సందర్శకుల్లో జైలు సంరక్షణ అధికారి కూతురు ఉండేది. వాలంటైన్‌తో మాట్లాడుతుండేది. ఆమె చూపే ప్రేమకు కృతజ్ఞతలు చెబుతూ ‘ప్రేమతో నీ వాలంటైన్‌’ అనే సందేశాన్ని లేఖలో రాస్తాడు. ఆ లేఖ రాసింది ఫిబ్రవరి 14, క్రీ.శ. 269 అందుకే అప్పటి నుంచి ఫిబ్రవరి 14న వాలంటైన్‌డేగా జరుపుకుంటున్నారు.

మధురమైన జ్ఞాపకం...
మంచిర్యాలటౌన్‌: రెండక్షరాలు... రెండు మనసులు.. ఆ రెండక్షరాలే రెండు గుండెల్లో ప్రేమను చిగురింపజేసే రెండు హృదయాల కలయిక. మదిలో పదిలంగా దాచుకున్న మాటను కానుకలతో.. ఆ మదిలోని మాటలను ఒకరితో ఒకరు పంచుకునేందుకు ఏర్పడిన రోజే ప్రేమికుల దినోత్సవం. 

పిల్లల విషయంలో
పెరిగే వయసుతో పాటు పిల్లల మనస్తత్వాలు మారుతుంటాయి. వారికి మంచి, చెడు, తప్పు, ఒప్పులను బేరీజు వేసుకోలేరు. టీనేజ్‌లో శరీరంలో జరిగే మార్పులు, ఆలోచనలో వచ్చే తేడాలతో వారు సతమతమవుతూ ఉంటారు. ఈ వయస్సులో వారిలో కలిగే అనుమానాలను వచ్చే మార్పులను, ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు వివరించాలి. టీనేజ్‌ పిల్లలు బయటి వ్యక్తులు చూపే ప్రేమకే లొంగిపోయే ప్రమాదం ఉంది.

ప్రేమతో గెలవండి
ప్రేమ ఒక అనిర్వచనీయమైన అనుభూతి, అందమైన అనుబంధం, అపురూప జ్ఞాపకం, మరుపురాని మధురఘట్టం. అనుభవించే వారికి మాత్రమే ప్రేమలోని మాధుర్యం అర్థమవుతుంది. ప్రేమించడం తప్పుకాదు... అలాగని పెద్దలను నొప్పించడమూ సరికాదు. అందరూ కలిసిమెలసి ఉన్నప్పుడే ఆ జీవితం సంతోషంగా సాగుతుంది. 

‘ప్రేమ’ మోసానికి గురికావద్దు..
ప్రేమ పేరిట అబ్బాయిలు చెప్పే మాయమాటలు నమ్మి మోసపోతున్న యువతుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. తరగతి గదుల్లోనో, కళాశాలల్లోనో, ఒకే ఊరిలోనో వెల్లివిరిసిన స్నేహం ప్రేమగా మారడానికి స్మార్ట్‌ఫోన్, వాట్సప్, ఇన్‌స్ట్రాగామ్, ఫేస్‌బుక్‌ల యుగంలో ఎక్కువ కాలం పట్టడం లేదు. అబ్బాయిలు చూపించే విపరీత ప్రేమకు పలువురు యువతులు త్వరగానే ఆకర్షణకు గురవుతున్నారు. చిన్న వయస్సులో ఏర్పడే ప్రేమలతో జీవిత లక్ష్యాలను నెరవేర్చుకోలేక కొందరు, ప్రేమ కోసం అడ్డదారులు తొక్కుతున్నారు.

కులాంతర వివాహాలకు ప్రభుత్వ ప్రోత్సాహం
సమాజంలో అంతరాలను తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కులాంతర వివాహాలను ప్రోత్సహిస్తున్నాయి. కులాంతర వివాహాలు జరిగే అవకాశం ఎక్కువగా ప్రేమించుకున్న జంటల్లోనే కనిపిస్తుంది. అమ్మాయిలో, అబ్బాయిలో ఒకరు ఎస్సీ కులానికి చెందిన వారిని ఇతర కులానికి  చెందిన వారు పెళ్లి చేసుకుంటే గతంలో రూ.50 వేలు ఉన్న ప్రోత్సాహకంను గతేడాది నవంబర్‌ నుంచి రూ.2.50 లక్షలకు ప్రభుత్వం పెంచింది. బీసీలకు చెందిన వారు ఇతర కులాలకు చెందిన వారిని  పెళ్లి చేసుకుంటే వారికి రూ.10వేలను బీసీ సంక్షేమశాఖ ద్వారా అందిస్తున్నారు. ప్రేమ పెళ్లిల్లోనే 90 శాతానికి పైగా కులాంతర వివాహాలే జరుగుతుండడంతో, ప్రభుత్వం అందిస్తున్న ఈ ప్రోత్సాహం వారికి కొంతమేర ఉపయోగకరంగా ఉంటుంది.  

ప్రేమ మైకంలో యువత...
మంచిర్యాలక్రైం:  ప్రేమ.. ఆకర్షణ... స్నేహం అనే ఈ పదాలకు అర్థాలు తెలియని జీవి తాలు... అన్నీ తమకే  తెలుసనుకునే నేటి యు వతరం.. మంచి చెప్పే మనుషులు కానీ జీవి తాలు చక్కదిద్దే గురువులు, తల్లి§దండ్రుల మా టలు కూడా వినని కనిపించని నేటి సమాజంలో.. ప్రేమ మైకంలో యువత తమ వయసును మరిచిపోయి విషవలయంలో చిక్కుకొని తెలిసితెలియని వయస్సులో బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. ప్రేమ పేరుతో మో సపోయిన సంఘటనలు జిల్లాలో కొన్ని ప్రేమి కుల దినోత్సవం సందర్భంగా మీ కోసం...

ప్రేమ పేరుతో మోసపోయిన  కొన్ని సంఘటనలు..
మందమర్రికి చెందిన 9వ తరగతి విద్యార్థిని ప్రేమ పేరుతో మోస పోయి ఓ బిడ్డకు జన్మనిచ్చింది. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి గర్భవతి చేసి తప్పించుకు తిరుగడం మొదలు పెట్టాడు. యువతి తల్లిదండ్రులు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అదే రాత్రి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఏం చేయాలో తెలియక ఆ పసికందును ఆసుపత్రిలోనే మరుగుదొడ్డిలో పడేసి వెళ్లిపోయారు.

మంచిర్యాలకు చెందిన సౌమ్య, శివకృష్ణలు (పేర్లు మార్చాము)ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.  రెండు సంవత్సరాలు గడిచాక నువ్వు బాగ లావయ్యావు... నీ అందమంత తగ్గిపోయింది.. నీ ప్రేమలో కట్నం కానుకలు లేకుండా నిన్నుపెళ్లి చేసుకున్నాని, వేధింపులకు గురి చేయడంతో సౌమ్య ఎవరికి చెప్పుకోలేక పోలీసులకు ఆశ్రయించింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రలు కూతురును దగ్గర తీసుకొని కోర్టుకు వెళ్లారు.

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎల్‌ఐసీ కాలనికి చెందిన మంద ప్రశాంత్‌ అదే కాలనికి చెందిన ఓ యువతితో నాలుగేండ్లుగా ప్రేమ వ్యవహారం సాగించాడు. చివరికి యువతి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవడంతో ప్రశాంత్‌ పెళ్లికి నిరాకరించాడు. దీంతో ప్రశాంత్‌ ఇంటిముందు సూపర్‌వాస్‌మల్‌–33 సేవించి ఆత్మహత్యయత్నానికి      పాల్పడింది.

 ఇవి మీకు తెలుసా
► వాలంటైన్స్‌ డే సందర్భంగా దాదాపుగా 151 మిలియన్ల     కార్డులు అమ్ముడు పోతాయి.
 400 మిలియన్‌ డాలర్ల విలువ చేసే పూలు అమ్ముడుపోతాయి.
భారత్‌ తో పాటు అమెరికా, కెనడా, మెక్సికో, యునైటేడ్‌ కింగ్‌డమ్, ఆస్ట్రేలియా, ఇటలీ, డెన్మార్క్,  జపాన్‌లలో  ఈ డే ను జరుపుకుంటారు.
వాలంటైన్‌ డే అంటే సందేశాలు ఇచ్చిపుచ్చుకునే రోజు అని .. కలానుగనంగా ఇది ప్రేమికుల రోజుగా మారింది. 
మనుషులే కాదు. పక్షుల ప్రేమకు ఇదే రోజు ఎంపిక చేశారు.  ఫిబ్రవరి లోనే పక్షులు ఎక్కువగా జంటలను వెతుక్కుంటాయని అందుకే ఇదే రోజును ఎంపిక చేశారని విశ్లేషకుల అభిప్రాయం.

ప్రేమ కవితలు
 ప్రియా.. ఓ ప్రియతమ.!
దివిలేని దేవతలంతా ఒక్కటై
ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని
‘రా..రమ్మని’స్వర్గపు వాకిలి
తెరిచినా..నే మాత్రం నిను వీడీ
పోలేను.. ఎందుకంటావా..? చెలీ
– అమృతం తాగిన దేవతలా చహచర్యం
– కన్నా అమృతం ఒలకిస్తూనీ అధరాల 
– నుంచి జారే ‘ప్రేమ సందేశమే’ నాకు 
– అమూల్యం.... అపూర్వం..!

అవును.. నిజమే.. ఒక ప్రేమకుడికి
ప్రేయసి సన్నిధానమే.. స్వర్గం..!
– జలకాలాడిన జలమే గంగాజలం.!!
– మరో ప్రేయసికి ప్రియుని తోడే
– లోకం.. అమ్మా నాన్నా.. అన్నం నీళ్లు అన్నీ అతనే..
– జ్ఞాపకాలే.. జ్ఞానగుళికలు, జీవన ప్రదాతలు..!!

‘ప్రేమ’అనేది ఒక ఉప్పెన..అది
ఎప్పుడు ఎలా పుడుతుందో..
ఎవరిని చుడుతుందో చెప్పలేరు. కానీ
‘ప్రేమ ప్రవాహం’ లో ‘ప్రేమ ముత్తు’లో 
మునిగి పోయినప్పుడుమాత్రం అంతా
 పరవశ..! అన్నింటా 
అతిశయమే..!!మధురమైన ఊసులతో
ఊరించి మైమరపించినా తియ్యటి 
తలపులతో కవ్వించి కలవర పెట్టినా..
ఏం చేసినా.. అది ప్రేమకే చెల్లు..!!  
కెరమెరి(ఆసిఫాబాద్‌)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement