వ్రత గామిని వరదాయిని | Varalakshmi Vratham Pooja Procedure | Sakshi
Sakshi News home page

వ్రత గామిని వరదాయిని

Published Sun, Aug 19 2018 12:57 AM | Last Updated on Sun, Aug 19 2018 12:57 AM

Varalakshmi Vratham Pooja Procedure - Sakshi

‘వర’ అంటే ‘కోరుకున్నది’ అనీ. శ్రేష్ఠమైనది అనీ అర్థం. అంటే అందరూ కోరుకొనే సంపదలు వరాలు. వాటిని ఇచ్చేదీ, వాటి రూపంలో ఉన్నదీ వరలక్ష్మి. వారి వారి ప్రజ్ఞాస్థాయీ భేదాల రీత్యా ఒక్కొక్కరికీ ఒక్కొక్కటి వరం. కోరినవేవి కావలన్నా భగవత్సంకల్పం లేనిదీ, ఆయన దయ రానిదీ పొందలేం. అసలు ఆనందం, సంపదలేని వస్తువును మనం కోరుకోం. అలా మనం కోరుకునే వాటిలో ఆనందరూపంగా ఉన్నదీ, ఆనందాలను ప్రసాదించేదీ వరలక్ష్మి. వరాలిచ్చే మాతను కొలువు దీర్చడం, ధూపదీప నైవేద్యాలతో అర్చించడం, భక్తి శ్రద్ధలతో పూజించడం అన్నీ ప్రాముఖ్యం కలిగినవే. అమ్మవారి వ్రత విధానంలో మనకు ఉపయోగపడే అంశాలు, జీవన శైలికి ఉపకరించే విలువైన పాఠాలూ ఎన్నో ఉన్నాయి.

కలశం: సృష్టికి సంకేతం. లోపల ఉన్న నీరు సమాజానికి ప్రతి రూపం. కలశానికి కట్టే సూత్రం అనుబంధానికి సూచిక. ఒక్క నీటి చుక్కలో కదలిక ఉంటే చాలు, దానంతటదే వ్యాపిస్తుంది. అలాగే పండుగ రోజున మంచి ఆలోచనలు, మనల్ని ముందుకు నడిపించే యోచనలు చేయాలి. అవి బహుముఖీన విస్తరించాలని అమ్మవారిని కోరుకోవడమే కలశ ప్రాధాన్యం. కలశం అడుగున ధాన్యం ఉంచుతాం. ధాన్యమంటే. జీవనాధారం. అంటే జీవిక కోసం మనం ఏ వృత్తి చేపట్టినా శ్రద్ధగా చేయాలనేదే దాని భావం.

కలశ వస్త్రం: వస్త్రం రంగు ప్రకృతికి నిదర్శనం. ఆ వస్త్రంలో అగ్ని, వరుణ, వనస్పతి, ఆదిత్య, పిత దేవతలు, నక్షత్రాలు ఉంటారు. అగ్నిదేవుడు శుభ్రతను నేర్పుతాడు. సూర్యుడు తేజస్సు, వనస్పతి త్యాగం, పితదేవతలు అనుబంధం, నక్షత్రాలు స్థిరత్వానికి నిదర్శనం. వస్త్రానికి చంద్రుడు అధిదేవత. చంద్రుడి నుంచి సౌఖ్యం, అమృతత్వం ప్రాప్తిస్తాయి. పైగా చంద్రుడు అమ్మవారికి తమ్ముడు. కాబట్టే మనకు చందమామ. ఒక కుటుంబ వ్యవస్థను సూచించే ఈ వ్రతం నుంచి.. మహిళలే కాదు.. పురుషులూ తెలుసుకోవాల్సిన విషయాలెన్నో ఉన్నాయి. రేపు రాబోయే శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా పూజా ద్రవ్యాలపై అవగాహనకు...

మామిడి ఆకులు: కలశానికి మామిడి ఆకులతో అలంకరణ చేస్తాం. మామిడి ప్రాణశక్తిని అందిస్తుంది. చెడును పరిహరిస్తుంది. అందుకే బంధుమిత్రులు వచ్చే సమయంలో... శుభకార్యాలవేళలో మామిడి తోరణాలు తప్పనిసరి.

కొబ్బరికాయ: నిస్వార్థమైన జీవితానికి, అందులోని నీరు మనం పొందాల్సిన ఆనందానికి సంకేతాలు. కష్టపడి కోయడం, పెచ్చుతీయడం, పగులగొట్టి పెంకు తొలగించడం... ఇవన్నీ చేస్తే కానీ కొబ్బరి, తియ్యని నీళ్లు రావు. ‘‘ఆ కష్టం మాకు తెలుసు, అయినప్పటికీ అన్ని సందర్భాల్లో మేం ఆ స్థాయిని ప్రదర్శించలేం. అలంకరించిన ఈ కొబ్బరికాయని సమర్పిస్తున్నాం. స్వీకరించి మాకు శుభాలనివ్వు తల్లీ!’’ అంటూ వరలక్ష్మిని కోరుకోవడమే నారికేళం విశిష్టత.

పసుపు కుంకుమలు: ఎరుపు అనురాగానికి ప్రతీక. పసుపు త్యాగాన్ని సూచిస్తుంది. వైవాహిక జీవితం ఆనందంగా, సాఫీగా సాగడానికి ఈ రెండూ అవసరం. అవి కుటుంబంలోని అందరికీ ప్రసాదించమని అమ్మవారిని మనసారా ప్రార్థించాలి.

పానకం, వడపప్పు: ప్రకృతి సిద్ధంగా వచ్చే మార్పుల్ని తట్టుకోవడానికి స్త్రీలకు శక్తి కావాలి. శరీరానికి చలవ అవసరం. అమ్మవారికి నైవేద్యం పెట్టే పెసరపప్పు, పానకంలో అవి లభిస్తాయి. పెసరపప్పు శక్తినిస్తుంది. పానకం చలవ. తేనె భార్యభర్తల అనురాగాన్ని.. పాలు.. ఆత్మీయ అనుబంధాన్నీ సూచిస్తాయి.

పూలసేవ: వరలక్ష్మీదేవతా మూర్తిని పూలతో పూజిస్తాం. అందుకు కలువ, మందార పూలు ప్రశస్తమైనవి. కలువ పూలకు సౌందర్యం, సౌకుమార్యం, సౌగంధం.. అనే మూడు విశేష లక్షణాలున్నాయి. ఇవి స్త్రీ తత్వాన్ని, ప్రత్యేకతను, విలువను తెలపుతాయి. కలువలది ఎంత సౌందర్యం అంటే నీటిలోంచి తీయగానే వాడిపోతాయి. ఎంత సౌకుమార్యమంటే చేత్తో తాకితేనే కందిపోతాయి. సౌగంధం అంటే పరిమళాన్నందించడం. ఏ ఇబ్బందులు లేకుండా, భర్తతో ఆనందమయ జీవితాన్ని కోరుకుంటూ అమ్మవారికి కలువ పూలతో పూజ చేయాలి. మందార పూలు వైవాహిక జీవితానికి సంకేతం. అందంగా విరిసిన నాలుగు రేకులు, పుప్పొడి కుటుంబ వ్యవస్థను ప్రతిఫలిస్తాయి. మందారం అంటేనే సంతోషం కలిగించేదని అర్థం. ఆ పూలతో పూజించడం అంటే కుటుంబ శ్రేయస్సుని కాంక్షించడమే.

అష్టోత్తర శతనామాలు: అమ్మవారిని 108 నామాలతో పూజిస్తాం. ఒక్కొక్క నామానికి ఓ విశిష్టత. వేదాల్లో వాటికి సంబంధించి 108 కథలున్నాయి. బ్రహ్మ వైవర్త, విష్ణు, స్కంద, పద్మ, ఖాండ పురాణాల్లో లకీ‡్ష్మ మాత వైభోగం, పూజాప్రాశస్త్యం గురించి అద్భుతంగా చెప్పబడింది. అమ్మవారి పూజలో పదహారు శ్రీ సూక్తాలున్నాయి. ఉపచారాలున్నాయి. ఆ పూజ అమేయ శక్తినిస్తుంది. అనేక శుభాలను ఒనగూరుస్తుంది. ధనలాభం, సౌభాగ్యం, విద్య, సంసార సౌఖ్యం, వాగ్ధాటి, వాహన ప్రాప్తి, శరీరకాంతి, ధైర్యం... ఇలా పదహారు ప్రయోజనాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

మహత్వం: లక్ష్మీ అమ్మవారిని బిల్వ నిలయ అంటారు. బిల్వవృక్షం వద్ద యజ్ఞయాగాదులు నిర్వహిస్తారు. అప్పుడు రాక్షసులు చెట్టు దాకా రాగలరు కానీ, ఏ ఆటంకం కలిగించలేరు. అమ్మవారు నిర్దాక్షిణ్యంగా కట్టడి చేసి యజ్ఞ కార్యానికి ఇబ్బంది రాకుండా కాపాడుతుంది. అంతటి ప్రభావాన్వితమైన వరలక్ష్మీ దేవిని పూజించడం వల్ల సిద్ధి, బుద్ధి, శక్తి, సంపదలు సంప్రాప్తిస్తాయి.

వాస్తవానికి ‘ప్రతి స్త్రీలోనూ లక్ష్మీ కళ ఉన్నది’ అని ఆర్ష వాక్యం. అందుకే స్త్రీలను లక్ష్మీరూపాలుగా ఆరాధించడం, స్త్రీలు లక్ష్మీరూపాన్ని అర్చించడం – ఈ శ్రావణ వరలక్ష్మీ వ్రతం దివ్యత్వం.  ఏ పనికైనా మహిళే ఆదిశక్తి. ఆమెదే ఉన్నత స్థానం. అందరి మాటలు ఓర్పుగా వింటుంది. ఇతర దేవతలతో పనులు చేయిస్తుంది. గుణాల చేత వ్యాపిస్తుంది. దోషాలు తొలగిస్తుంది. ఈ అనంత విశ్వాన్ని ‘లక్షించేది’ లక్ష్మి. అందరూ లక్షించేది లక్ష్మిని. లక్షించడం అంటే చూడటమని అర్థం. అందరినీ తన కరుణామృతపూర్ణమైన చలువ చూపులతో ‘కనిపెట్టుకుని’, గమనించి, పాలించే శక్తి – అని భావార్థం. కనులు తెరవడాన్ని సృష్టిగా, రెంటి నడుమ ఉన్నది స్థితిగా భావించవచ్చు.

పరమేశ్వర శక్తితో జరిగే సృష్టి స్థితి లయలే ‘ఈక్షణ’ శక్తిగా వేదఋషులు అభివర్ణించారు. సర్వసాక్షియైన ఈ భగవద్దర్శన శక్తిని లక్ష్మిగా ఉపాసించడం లక్ష్మీ ఆరాధనలోని ప్రత్యేకత. అందరూ ఆనందాన్నీ, ఐశ్వర్యాన్నీ, జ్ఞానాన్నీ, ‘లక్ష్యం’గా పెట్టుకొనే జీవిస్తారు. ఇలా అందరికీ లక్ష్యమైన జ్ఞాన, ఆనంద, ఐశ్వర్యాల సాకార రూపమే ‘లక్ష్మి’. ఈ దివ్యభావాన్ని సగుణంగా, లీలారూపంగా పురాణాలు వ్యక్తీకరించాయి.  జ్యోతిషపరంగా దర్శిస్తే భృగు ప్రజాపతికి ప్రధానమైన రోజు శుక్రవారం. అందుకే దీనిని ‘భృగు’వారమనీ వ్యవహరిస్తారు.

భృగు పుత్రికగా లక్ష్మీదేవికి ’భార్గవి’ అని దివ్యనామం. పర్వతరాజు పుత్రి పార్వతిలాగా భృగు పుత్రిక భార్గవి. ఈ లక్ష్మిని నారాయణుడికిచ్చి వివాహం చేశాడు భృగువు. నారాయణుడి సంకల్ప, దయాశక్తుల రూపం లక్ష్మి. విష్ణు దయనే ఆయా లోకాల్లో లక్ష్ములుగా, ఆరు ఐశ్వర్యాల రూపంగా వివిధ నామాలతో పేర్కొంటారు. స్వర్గలక్ష్మి, భూలక్ష్మి, గృహలక్ష్మి, వనలక్ష్మి...ఇలా విశిష్ట శోభ, సంపద కలిగిన చోట్లను లక్ష్మీ స్థానాలుగా చెబుతారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement