పసుపుపచ్చ దాహం | Watermelon specials in summer | Sakshi
Sakshi News home page

పసుపుపచ్చ దాహం

Published Sat, Mar 31 2018 3:45 AM | Last Updated on Sat, Mar 31 2018 3:45 AM

Watermelon specials in summer  - Sakshi

దాహానికి రంగుండదు. కాని దాహం తీర్చేవాటికి రంగు ఉంటుంది. పుచ్చ ఎర్రన... కీర పచ్చన... కొబ్బరి తెల్లన... వీటన్నింటిలో నిమ్మరసం కలిపితే... పసుపు పచ్చ నిమ్మ నుంచి కొన్ని చుక్కలను పిండి రుచి తెస్తే.... ఆ దాహం పుల్లపుల్లగా తియ్యతియ్యగా తీరుతుంది. ఎర్రటి ఎండను హాయిగా మార్చుతుంది.


కీర దోస లెమనేడ్‌
కావలసినవి: కీర దోస – 2; పుదీనా – పావు కప్పు; నిమ్మ చెక్క తురుము – అర టీ స్పూను; నిమ్మ రసం – పావు కప్పు; వేడి నీళ్లు – నాలుగు కప్పులు; పంచదార – 5 టేబుల్‌ స్పూన్లు
గార్నిషింగ్‌ కోసం: ఐస్‌ క్యూబ్స్‌ – అర కప్పు; సన్నగా తరిగిన కీర దోస చక్రాలు – 10; తాజా పుదీనా ఆకులు – కొద్దిగా
తయారీ: కీర దోసను శుభ్రంగా కడిగి, తొక్క తీసి, సన్నగా తురిమి పక్కన ఉంచాలి
పుదీనా ఆకులు, నిమ్మ చెక్కలను మిక్సీలో వేసి మెత్తగా చేసి, బాణలిలో వేసి కొద్దిగా వేయించి తీసేసి, పల్చటి వస్త్రంలో వడబోసి, ఒక పాత్రలోకి రసం తీసుకుని పక్కన ఉంచాలి      వేడి నీళ్లలో పంచదార, నిమ్మ రసం వేసి, స్టౌ మీద ఉంచి, పంచదార కరిగే వరకు కలిపి దింపేయాలి
 కీర దోస రసానికి ఈ మిశ్రమం జత చేయాలి ∙గంటసేపు ఫ్రీజర్‌లో ఉంచి తీశాక, ఒక గ్లాసులో కొద్దిగా రసం పోసి, ఐస్‌ క్యూబ్స్, పుదీనా ఆకులు, కీర దోస చక్రాలు జత చేసి అందించాలి.


పుచ్చకాయ అల్లం లెమనేడ్‌
కావలసినవి: పుచ్చకాయ ముక్కలు – 4 కప్పులు; పంచదార – ఒక కప్పు; నీళ్లు – ఒక కప్పు; అల్లం తురుము – అర టీ స్పూను; సబ్జా గింజలు – టీ స్పూను; కీర దోస చక్రాలు – అర కప్పు (గింజలు తీసేయాలి); సోడా – ఒక కప్పు; నిమ్మ రసం –  టేబుల్‌ స్పూను
తయారీ: కీర దోస చక్రాలను సోడాలో వేసి పక్కన ఉంచాలి.
పుచ్చకాయ ముక్కలను మిక్సీలో వేసి మెత్తగా ప్యూరీలా అయ్యేవరకు మిక్సీ తిప్పాక, సన్నని రంధ్రాలున్న జల్లెడతో పెద్ద పాత్రలోకి వడ పోయాలి
ఒక పాన్‌లో పంచదార, నీళ్లు, అల్లం తురుము వేసి స్టౌ మీద సన్నని మంట మీద ఉంచి, పంచదార కరిగి, కొద్దిగా తీగ పాకంలా అవుతుండగా దింపేయాలి
ఒక కప్పులో పొడి చేసిన ఐస్, కొద్దిగా పంచదార మిశ్రమం సిరప్, కొద్దిగా నిమ్మ రసం, నాలుగు టేబుల్‌ స్పూన్ల పుచ్చకాయ రసం పోసి బాగా కలపాలి
 సబ్జా గింజలు జత చేయాలి
 సోడాలో నానబెట్టిన కీరదోస ముక్కలు సహా సోడాను జత చేసి, బాగా కలిపి చల్లగా సర్వ్‌ చేయాలి.


కమలా – దానిమ్మ లెమనేడ్‌
కావలసినవి: చల్లటి గ్రీన్‌ టీ – ముప్పావు కప్పు; తాజా కమలాపండు రసం – అర కప్పు; దానిమ్మ రసం – అర కప్పు; నిమ్మ రసం – టేబుల్‌ స్పూను; గార్నిషింగ్‌ కోసం – కమలా పండు చక్రం; ఐస్‌ – తగినంత
తయారీ: ఒక గ్లాసులో చల్లటి గ్రీన్‌ టీ, దానిమ్మ రసం, కొద్దిగా ఐస్‌ వేసి కలిపి, కమలాపండు రసం ఉన్న గ్లాసులో పోయాలి  నిమ్మరసం జత చేయాలి
కమలాపండు చక్రంతో గ్లాసును అలంకరించి అందించాలి
 ఇది మంచి డిన్నర్‌ డ్రింక్‌. సోడా బదులు ఈ లెమనేడ్‌ వాడటం ఆరోగ్యానికి మంచిది.


స్ట్రాబెర్రీ లెమనేడ్‌
కావలసినవి: స్ట్రాబెర్రీలు – ఒక కప్పు (శుభ్రంగా కడిగి, బాగు చేసి ముక్కలు చేయాలి); పంచదార – 2 టేబుల్‌ స్పూన్లు; తాజా నిమ్మ రసం – ఒక కప్పు; నీళ్లు – 5 కప్పులు
తయారీ: ఒక పాత్రలో స్ట్రాబెర్రీ ముక్కలు, పంచదార వేసి స్టౌ మీద ఉంచి, బాగా ఉడికే వరకు మధ్యమధ్యలో కలుపుతుండాలి
దింపిన తరవాత గరిటెతో మెత్తగా మెదిపి, వడపోయాలి
 ఒక పాత్రలో నిమ్మ రసం, నీళ్లు, స్ట్రాబెర్రీ  రసం వేసి బాగా కలపాలి
 ఐస్‌ జత చేసి గ్లాసులలో అందించాలి.


కొబ్బరి నీళ్ల లెమనేడ్‌
కావలసినవి: కొబ్బరి నీళ్లు – 4 కప్పులు; నిమ్మ రసం – 5 టేబుల్‌ స్పూన్లు; తేనె లేదా పంచదార – 3 టేబుల్‌ స్పూన్లు; నిమ్మ కాయలు – 2 (చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేయాలి); ఐస్‌ క్యూబ్స్‌ – 2 కప్పులు; పుదీనా ఆకులు – గార్నిషింగ్‌కి సరిపడా
తయారి: ఒక గిన్నెలో కొబ్బరి నీళ్లు, నిమ్మ రసం, పంచదార /తేనె వేసి పంచదార కరిగేవరకు బాగా కలపాలి
 నిమ్మ ముక్కలు, ఐస్‌ క్యూబ్స్‌ వేసి మరోమారు బాగా కలిపి, గ్లాసులలో పోయాలి
 పుదీనా ఆకులతో అలంకరించి సర్వ్‌ చేయాలి.


నిమ్మకాయను ప్రతిరోజూ ఏదో ఒక రూపంలో తీసుకోవడం చాలా అవసరం. శరీరానికి అవసరమైన సి విటమిను నిమ్మలో పుష్కలంగా ఉంది. శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను నిమ్మకాయ బాగా తగ్గిస్తుంది.
నిమ్మలో ఉండే విటమిన్‌ సి... ఎముకలు క్యాల్షియంను స్వీకరించేలా చేస్తుంది. అందువల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి. నిమ్మరసంలోని ఫ్లావనాయిడ్లు క్యాన్సర్‌ కారక కణాలను నిరోధిస్తాయి.
 కొద్దిగా నిమ్మరసాన్ని గ్రీన్‌ టీ కి జత చేసి తాగితే, టీలోని 80 శాతం యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి అందుతాయి.
 తరచుగా నిమ్మరసం తీసుకోవడం వల్ల శరీరంలోని అదనపు కొవ్వు కరిగి, బరువు తగ్గేందుకు దోహదపడుతుంది.
 శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపే శక్తి నిమ్మరసంలో పుష్కలంగా ఉంది.
మానసిక ఒత్తిడి తగ్గించి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చే లక్షణం నిమ్మలో మెండుగా ఉంది.
కాలేయంలో పేరుకుపోయే విషపదార్థాలను తొలగించి, కాలేయం చురుకుగా పనిచేసేలా చేస్తుంది.
 వయసు పెరుగుతున్నా చర్మం ముడతలు పడనీయదు.
పంటి నొప్పిని తగ్గిస్తుంది. పళ్ల నుంచి వెలువడే రక్తస్రావాన్ని అడ్డుకుంటుంది.


- సుజాత స్టీఫెన్‌ ,న్యూట్రిషనిస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement