గంటలో మీరు ఫిట్...
ఆరోగ్యం
ఇరవై ఏళ్ల యువతి నుంచి యాభయ్యేళ్ల నడివయస్కురాలి వరకు... తమ బాడీ పూర్తి ఫిట్‌నెస్‌తో ఉండాలని కోరుకుంటారు. అంతేకాదు, ప్రస్తుత కాలంలో ఫ్యాషన్‌కన్నా ఫిట్‌నెస్ వైపే ప్రతి ఒక్కరూ మొగ్గు చూపిస్తున్నారు. కొందరైతే జిమ్‌లో గంటల తరబడి గడుపుతూ శరీరాన్ని బిగువుగా, ఆరోగ్యంగా ఉంచుకునేందుకు రకరకాల ఎక్సర్‌సైజులు చేస్తున్నారు. జిమ్‌కు వెళ్లలేనివారు ఇంట్లోనే ఏ ట్రెడ్‌మిల్‌తోనో తంటాలు పడుతున్నారు. టైట్‌షెడ్యూల్‌లో ఉండే సినీతారలు కూడా ఫిట్‌నెస్ కోసం రోజుకో గంట సమయాన్ని కేటాయిస్తున్నారు.
అందులో నలభై నిమిషాల పాటు చెమటలు పట్టేలా రకరకాల వ్యాయామాలు చేస్తే, మిగిలిన 20 నిమిషాలు యోగ, స్విమ్మింగ్ తదితరాలతో సేదతీరుతున్నారు. కొవ్వును కరిగించి, కండరాలను పటిష్ఠపరచేందుకు గంటలో ప్రథమభాగం తోడ్పడితే, తక్కిన ఇరవై నిమిషాలు రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండేందుకు తోడ్పడతాయి. దీన్నే 40/20 ట్రెండ్ అంటున్నారు. అపోలో లైఫ్ ఫిట్‌నెస్ విభాగాధిపతి డా. సుమన్ డానియెల్ ఏమంటారంటే-దేనినైనా వినూత్నంగా చేయడానికి ఇష్టపడతున్న నేటి తరం వారు ఇప్పుడు వర్క్ ఔట్స్ విషయంలో కూడా దీనిని అనుసరిస్తున్నారు. అందుకే 40/20 ట్రెండ్‌కి శ్రీకారం చుడుతున్నారు. సంప్రదాయక కసరత్తుల కన్నా ఇది భిన్నంగా ఉండటం వల్ల విసుగు అనిపించదు, అలసట తెలియదు. అందుకే ఈ పద్ధతిని అనుసరించడం మంచిది.
ఫిట్‌నెస్ కోసం ప్రాణాలిచ్చేవాళ్లయితే... అదనపు కొవ్వును కరిగించుకునేందుకు తంటాలు పడే వారికీ పద్ధతి గొప్ప రిలీఫ్. ఎందుకంటే పురుషులతో సమానంగా వర్కవుట్లు, కార్డియో వాస్కులర్ ఎక్సర్‌సైజులు, కిక్ బాక్సింగ్ ప్రాక్టీస్ చేసేసరికి ఒళ్లు బాగా అలసిపోతుంది. కాసేపు స్విమ్మింగ్, బ్యాడ్మింటన్, యోగ, ధ్యానం వంటి వాటితో గడిపితే శరీరమే కాదు, మనసు కూడా సేదతీరుతుందని ఇప్పుడు ఫిట్‌నెస్ ట్రెయినర్లు అభిప్రాయపడుతున్నారు. రొటీన్‌కు భిన్నంగా ఉండే ఈ 40/20 పద్ధతి ఇప్పుడు బాగా ఫిట్టవుతోంది.