అవమానం... అసమానం
ఆత్మీయం
మనం ప్రతి వారిచేతా గౌరవింపబడాలి అని ప్రతి మనిషీ కోరుకుంటాడు తన గౌరవానికి. ఏ కాస్త భంగం వాటిల్లినా, తనకు అవమానం జరిగినట్లుగా భావిస్తాడు. వ్యక్తిలో ఉండే సంస్కారాలను బట్టి, అతని విద్యాగంధాన్ని బట్టి అవమానం స్థాయిలో హెచ్చుతగ్గులుంటాయి. అవమానం అనేది ఒక వ్యక్తి తనకు ఎదురైన వివిధ సంఘటనలపై స్పందించే తీరుపైన ఆధారపడి ఉంటుంది. ఒంటరిగా ఉన్నప్పుడు అంతగా స్పందించని వ్యక్తి, ఇతరులతో కలిసి ఉన్నప్పుడు దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తాడు.
వ్యక్తిగతంగా, మానసికంగా, శారీరకంగా, భావోద్వేగపరంగా వ్యక్తి ఎంత బలంగా ఉంటే అవమానం గురించి అంత తక్కువగా ఆలోచిస్తాడు. బలహీనంగా ఉంటే అవమానం ఎక్కువగా జరిగినట్లు భావిస్తాడు. అవమానం వల్ల మనిషి అభద్రతా భావానికి లోనవుతాడు. హింసాత్మకంగా మారతాడు. అవమానాన్ని తట్టుకోవాలంటే మానసికంగా బలంగా ఉండాలి. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోగలగాలి. ఆధ్యాత్మికంగా ఉన్నతిని కలిగి ఉండాలి. క్షమాగుణం కలిగి ఉండాలి.
తనపై తనకు అవగాహన ఉండాలి. ముఖ్యంగా ఇతరులను అవమానం చేయాలన్న ఆలోచన ఉండకూడదు. సకల శాస్త్ర సారం ఏమి చెబుతోందంటే ఇతరులు తనకు ఏమి చేస్తే తనకు అవమాన మో, బాధాకరమో, అవి తాను ఇతరులకు చేయకూడదు. అదేవిధంగా ఇతరులు ఏమి చేస్తే తనకు ఆనందం కలుగుతుందో, సంతోషం చేకూరుతుందో అది తాను ఇతరుల పట్ల ఆచరించాలి. అలాంటివారికి మానావమానాల ప్రసక్తి ఉండదు.