అనుభూతుల భరిణె! | Welcome to Africa ... | Sakshi
Sakshi News home page

అనుభూతుల భరిణె!

Published Thu, Feb 27 2014 11:20 PM | Last Updated on Sat, Sep 2 2017 4:10 AM

అనుభూతుల భరిణె!

అనుభూతుల భరిణె!

ప్రముఖ సినీ రచయిత, నటుడు, ‘మిథునం’ చిత్ర దర్శకుడు తనికెళ్ల భరణి ఇటీవల దక్షిణాఫ్రికా వెళ్లొచ్చారు. ఆయన యాత్రానుభవాలు, అక్కడి విశేషాలు...‘సాక్షి’ పాఠకులకు ప్రత్యేకం.
 
దక్షిణాఫ్రికా తెలుగు అసోసియేషన్ వాళ్ళు ఫోన్ చేసి, ‘మేము ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ చేస్తున్నాం మీ ‘మిథునం’ అక్కడ ప్రదర్శించాలనుకుంటున్నాం. మీరూ, బాలూ గారు వస్తే బావుంటుంది’ అన్నారు. అమెరికా, యూరోపు వెళుతుంటాం కానీ దక్షిణాఫ్రికా వెళ్ళడం తక్కువే అవడంతో ఆ ప్రదేశం, అక్కడి తెలుగు వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏమిటో చూద్దామనిపించి, సరే అని ఒప్పుకున్నాను. అలా జనవరి 16న నాతోపాటు ‘అంతకుముందు ఆ తర్వాత’ సినిమా దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ, హీరోయిన్ ఇషా, మా అబ్బాయి కూడా బయలుదేరారు.
 
వెల్‌కమ్ టు ఆఫ్రికా...
హైదరాబాద్ - బాంబే - నైరోబీ మీదుగా జోహన్స్‌బర్గ్ చేరుకున్నాం. ఎయిర్‌పోర్ట్ నుంచి బయటికి రాగానే అక్కడి తెలుగు అసోసియేషన్ వారు స్వాగతం పలికారు. 17వ తేదీ సాయంత్రం నాతో ముఖాముఖి కార్యక్రమం, 18న అక్కడి లోకల్ థియేటర్లో ‘మిథునం’ ప్రదర్శన ఏర్పాటు చేశారు. దాని తర్వాత అరికల్ అనే ఫేమస్ థియేటర్‌కు వెళ్తున్నామని, అక్కడే పెద్ద సభ ఏర్పాటు చేశామని చెప్పారు వాళ్లు.
 
అరికల్ థియేటర్ ... అన్‌బిలీవబుల్!

పాతకాలం నాటి బిల్డింగులాంటి  కాంప్లెక్స్‌కు చేరుకున్నాం. అక్కడ లాస్‌వెగాస్‌లా పెద్ద జూద గృహం, పేకాడేవాళ్ళు, స్లాట్‌మిషన్ బారు, డాన్సులు కనపడ్డాయి. వాటన్నిటినీ దాటుకుంటూ, పైకి వెళ్తే థియేటర్ కనిపించింది. అది మన రవీంధ్రభారతికి కనీసం రెండింతలైనా ఉంటుంది. ఎప్పుడయినా మన వాళ్ళు అలాంటిది కడతారా, అక్కడ మనం ఓ నాటకం వేస్తే ఎంత బాగుండు అనిపించేలా అద్భుతంగా ఉంది అది! కార్యక్రమం మొదట సౌతాఫ్రికా సాంస్కృతిక మంత్రి రెండు దేశాల సంబంధాల గురించి అద్భుతమైన ఉపన్యాసం ఇచ్చారు. దాని తర్వాత స్టేజీ బద్దలయిపోతుందా? అవి రబ్బర్‌తో చేసిన శరీరాలా? వాటికి ఎముకలుండవా? అనిపించేలా సౌతాఫ్రికా ‘రబ్బర్ బ్యాండ్’ గ్రూప్ వాళ్లు ఒళ్లు విరిచి చేసిన డ్యాన్సులు అబ్బురపరిచాయి! ఇక ఆ తర్వాత బాలు గారికి ‘జీవన సాఫల్య’ అవార్డు ఇవ్వడంతో ఆరోజు కార్యక్రమం ముగిసింది.
 
ఇండియన్ కల్చరల్ సెంటర్...

మర్నాటి పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్ చేసి ఒక ఇండియన్ కల్చరల్ సెంటర్‌కు వెళ్ళాం. అక్కడ మరాఠీ, కన్నడ తదితర ఆర్టిస్టులు, ముందురోజు ఫెస్టివల్‌కు వచ్చిన వాళ్లూ వచ్చారు. స్థానిక కళాకారులతో పాటు 50 మందితో ఇంటరాక్షన్ సెషన్‌తో మొదలై, మోహనకృష్ణ చిత్ర ప్రదర్శనతో ముగిసింది ఆరోజు కార్యక్రమం.
 
కీకారణ్యాన్ని తలపించే రిసార్టులు...

కీకారణ్యంలా ఉన్న ఓ రిసార్ట్‌కి వెళ్లాం. అది తమిళవాళ్లది. నేను పదేళ్ళ పాటు మద్రాసులో ఉండిన వాణ్ణి గనక వెంటనే నేను వారితో తమిళంలో మాట్లాడ్డం మొదలుపెట్టాను. వాళ్ళు - ‘సారీ సర్... వియ్ నో ద వోన్లీ వర్డ్ వణక్కం’ అన్నారు. ఎప్పుడో తమ పూర్వీకులు వచ్చి స్థిరపడ్డారట! రిసార్ట్స్‌లో కొన్ని కార్యక్రమాల అనంతరం విశ్రాంతి తీసుకున్నాక, అక్కడి నుంచి ఆఫ్రికన్ సఫారీకి వెళ్లాం.
 
వందల ఎకరాలలో సఫారీ...

ఆ అడవి స్థలం ఒక వెయ్యి ఎనిమిది వందల ఎకరాలు. పెద్ద చెట్లుండవు. కానీ సింహం జూలులా గడ్డి గుబురుగా ఉంటుంది. సింహాలు అందులో కలిసిపోవడానికి వీలుగా కావచ్చు! ఒక్క సింహాలే కాదు, చిరుత పులులు, హైనాలు... అయ్య బాబోయ్! చెప్పడానికి వీల్లేదు! మనవూర్లో కుక్కల్ని చూసినట్లు దగ్గర్నించీ సింహాల్ని చూడ్డం అంటే తెలియని గగుర్పాటు కలిగింది!

ప్రకృతి ప్రసాదం వండర్ కేవ్స్...

అక్కడ పది కిలోమీటర్ల దూరంలో భూగృహంలో మన బొర్రాగుహలు లాంటిది ఒకటుంది. పేరు వండర్స్ కేవ్స్! అది యాభై లక్షల లేదా కోటి సంవత్సరాల క్రితం ఏర్పడి ఉండవచ్చు అని తెలుసుకోగానే ఆశ్చర్యపోయాను! పైనించీ పెద్ద కాల్షియం సున్నపు రాళ్ళ రకరకాల ఆకృతులు వేళ్లాడుతున్నాయి. ఆఫ్రికాలో వజ్రాలగనులు, బంగారు, వెండి..వీటి తవ్వకాల్లో బయట పడ్డ గుహలన్న మాట ఇవి! నిజంగా ఆ గుహ నాకు దివ్యమైన అనుభూతిని మిగిల్చింది.
 
కేప్‌టౌన్...

కేఫ్‌టౌన్ మౌంటెయిన్ పైభాగమంతా బల్లపరుపుగా ఉంటుంది. కోణాకారం పక్కనే శివలింగాకారంలో పెద్దకొండ! అది కేప్‌టౌన్‌లో ఉంది కాబట్టి దాన్ని ‘కేపేశ్వర స్వామి’ అన్నాను సరదాగా! అక్కడ నిప్పు కోడి ఆకృతులు, వాటిలో బల్బులు పెట్టి వెలిగించడం, ఎన్నో రకాల జంతువుల చర్మ ప్రదర్శన చూశాం. నిప్పుకోడి గుడ్డు పై మనం నిల్చున్నా అది పగలదు. అక్కడి నుంచి కేబుల్ కారులో ప్రయాణం! పైన రెండువేల జాతుల వృక్షాలున్నాయట. వృక్షశాస్త్రం పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళు రోజుల తరబడి అక్కడ పరిశోధనలు చేస్తుంటారు. మొత్తం అక్కడినించి కేప్‌టౌన్ అంతా పరిశీలించాం.
 
అపార్థైడ్ మ్యూజియం....

తరువాత రోజు‘అపార్డైడ్ మ్యూజియం’కి వెళ్ళాం. వర్ణవివక్ష మీద ఆఫ్రికన్లని ఆంగ్లేయులు వేరు చేశారు. ఇక్కడ ఇంగ్లీషు వాళ్ళకు వేరు హోటళ్లు, మిగతావారికి వేరు. వాళ్ళ స్థలాల్లోనికి వీళ్ళు వెళ్ళకూడదు. డర్బన్‌లోనే కదా గాంధీగారిని ట్రెయిన్ నించి దింపేసింది! ప్రపంచ దేశాలన్నీ సౌతాఫ్రికా శ్వేత దురహంకారాన్ని వెలివేశాయి. దాని తాలుకా అణచివేత, తిరుగుబాటు, పదమూడేళ్ళ కుర్రాడు చనిపోవడం, సౌతాఫ్రికా అగ్నిగుండం కావడం, దాదాపు రెండు మూడు దశాబ్దాల పాటు మండేలాను జైల్లో పెట్టడం... వాటి విశేషాలతో నిండిన మ్యూజియం అది! అక్కడ రెండు గేట్లు ఉన్నాయి. ఒకటి తెల్లవాళ్ళకి, ఒకటి నల్లవాళ్ళకి. ఇప్పుడెందుకు ఇంకా అలా పెట్టారంటే వాళ్ళకి నాటి ఫీలింగ్ కలగడానికి అని చెప్పారు.
 
ఆ మ్యూజియంలో మండేలా బట్టలు, కారు, ఫోటోలు, జన్మవిశేషాలు, వీడియో క్లిప్పింగ్స్ వేస్తుంటారు. ఒక క్లిప్పింగ్ చూసి మటుకు షాక్ తిన్నా! 150 మంది ఉద్యమనాయకుల్ని ఉరి తీస్తే, ఆ ఉరితాళ్లనీ ఒక గదిలో వేలాడుతున్నాయి. ఆ దృశ్యాన్ని భరించలేకపోయాను!
 
బయటికొచ్చాక ఆఫ్రికన్ సంస్కృతికి గుర్తులుగా పూసలు, గాజులు కొన్నాం. అలా పదిరోజుల పాటు అక్కడి వారితో ఉండి, ఆ అనుబంధాన్ని తలుచుకుంటూ పదకొండోరోజు ఉదయాన్నే తిరిగి ఇండియాకు బయల్దేరాం.
 
 కేప్‌టౌన్... ఓ అద్భుత దృశ్యకావ్యం!


కేప్‌టౌన్ వెళ్లడానికి ఆన్‌లైన్‌లో బుక్ చేశాం. ఉదయం నాలుగుకల్లా నలుగురం సిద్ధమై, దగ్గర్లో ఉన్న డొమెస్టిక్ ఫ్లైట్ ఎక్కి ‘కేఫ్‌టౌన్’ వెళ్ళాం. అంటే కొలంబస్ వచ్చిననాటి ‘కేఫ్ ఆఫ్ గుడ్‌హోప్’ అన్నమాట! అట్లాంటిక్ సముద్రతీరం..... రెండు సముద్రాలు కలిసే స్థలం... అంతా నీలం... మాటలకందని అద్భుత దృశ్యకావ్యమది! అక్కడే మెక్‌డొనాల్డ్‌లో తినేసి, కాఫీ తాగి కార్లో ‘కేఫ్‌టౌన్’బీచ్‌లో సముద్రతీరం వెంబడే వెళుతోంటే మోహనకృష్ణ ఎంత ఎగ్జైటయిపోయాడంటే తను తరువాతి సినిమా పాటలు యిక్కడే కేఫ్‌టౌన్ బీచ్‌లో తియ్యడానికి నిర్ణయించుకున్నాడు!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement