అమీబియాసిస్ అంటే...? | What is Amibiyasis ...? | Sakshi
Sakshi News home page

అమీబియాసిస్ అంటే...?

Published Thu, Oct 13 2016 10:43 PM | Last Updated on Mon, Sep 4 2017 5:05 PM

అమీబియాసిస్ అంటే...?

అమీబియాసిస్ అంటే...?

గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్


నా మనవడి వయసు తొమ్మిదేళ్లు. తరచూ కడుపునొప్పితో బాధపడుతున్నాడు. డాక్టర్‌కు చూపిస్తే అమీబియాసిస్ అన్నారు. మావాడి సమస్యకు తగిన సలహా ఇవ్వండి. - ఒక సోదరుడు, ఒంగోలు జిల్లా
మీ మనవడికి అమీబియాసిస్ అని చెబుతున్నారు. సాధారణంగా తరచూ ప్రయాణాలు చేసేవారు తమ ప్రయాణాల్లో పరిశుభ్రమైన ఆహారం, నీరు తీసుకోలేకపోవడం, కలుషితమైనవి తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతిని బాధపడుతుంటారు. దాంతో కడుపు ఉబ్బడం, బంకవిరేచనాలు, నెత్తుటి విరేచనాలు వంటివి కనిపిస్తుంటాయి. ఇలాంటి లక్షణాలుకు కారణం అమీబియాసిస్ అనే వ్యాధి.

 
అమీబియాసిస్ అంటే...  ప్రోటోజోవా అనే విభాగానికి చెందిన ఏకకణజీవివల్ల ఈ వ్యాధి వస్తుంది. దీనికి కారణమయ్యే ఆ ఏకకణజీవి పేరు ‘ఎంటమీబా హిస్టోలిటికా’. ఈ జీవి లేదా దాని గుడ్లు ఏదైనా ఆహారపదార్థాల మీద లేదా నీళ్లలో కలవడం వల్ల ఈ వ్యాధి సోకుతుంది. ఒక్కోసారి చేతులు మురికి అయి, వాటిని నోట్లోకి తీసుకున్నప్పుడు కూడా వ్యాధి సోకవచ్చు.  ఆరుబయట మల విసర్జన చేశాక, అది నీళ్లలో కలవడం అన్నది ఈ వ్యాధికి ప్రధాన కారణమవుతుంది. మన దేశంలోని పల్లెల్లో ఇంకా సరైన శానిటేషన్ సౌకర్యాలు అందరికీ అందుబాటులో లేకపోవడం వల్ల దీని వ్యాప్తి సర్వసాధారణం. ఇలా నోటి ద్వారా శరీరంలోకి చేరే ఈ జీవి జీర్ణవ్యవస్థలోని పెద్దపేగు వరకు వెళ్లి సమస్యలు సృష్టిస్తుంది. జీర్ణవ్యవస్థలోకి ప్రవేశించే ఈ జీవులు పేగుల లోపలి పొర (ఇంటస్టినల్ లైనింగ్)ను దెబ్బతీస్తాయి. దీన్నే అమీబిక్ కొలైటిస్ అంటారు. ఒక్కోసారి ఇవి రక్తప్రవాహంలోకి చేరి కొన్ని సందర్భాల్లో కాలేయంలోకి వ్యాపించవచ్చు. ఫలితంగా వచ్చే సమస్యను అమీబిక్ లివర్ యాబ్సెసెస్ అంటారు. కొన్నిసార్లు ఈ అమీబిక్ లివర్ యాబ్సెసెస్ అనే సమస్య నీళ్ల విరేచనాల వంటి లక్షణాలేమీ కనిపించకుండానే రావచ్చు. ఈ సందర్భంలో మరో విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నీళ్ల విరేచనాలు అమీబియాసిస్‌కు ఒక లక్షణమే అయినా... నీళ్ల విరేచనాలు అయిన ప్రతి సందర్భంలోనూ దానికి అమీబియాసిస్ మాత్రమే కారణం కాకపోవచ్చు. సాధారణంగా ప్రయాణాల్లో వచ్చే నీళ్ల విరేచనాల సమస్య ‘ట్రావెలర్స్ డయేరియా’ను అమీబియాసిస్‌గా పొరబడే అవకాశం ఉంటుంది.

 
అమీబియాసిస్ లక్షణాలు:  తీవ్రమైన కడుపునొప్పి  వికారం (నాసియా), ఒక్కోసారి వాంతులు  జ్వరం  నిస్సత్తువ, నీరసం (కొంతమందికి కడుపులో ఈ ఏకకణజీవి చేరినా ఎలాంటి లక్షణాలూ కనిపించవకపోవచ్చు).

 
అమీబియాసిస్‌కు కారణాలు:  సరైన శానిటేషన్ సౌకర్యాలు లేకపోవడం  వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం (అంటే మల విసర్జన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోకపోవడం  ఆహారాన్ని సరిగా ఉడికించక పోవడం వల్ల కూడా ఈ వ్యాధి వ్యాప్తి జరగవచ్చు.

 
నిర్ధారణ: మల పరీక్షల ద్వారా.

 
చికిత్స: రోగి లక్షణాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స అందించాల్సి ఉంటుంది. ట్రావెలర్స్ డయారియా వంటి అంశాలను మినహాయించి చికిత్స అందించాల్సి ఉంటుంది.

 

డాక్టర్ భవానీరాజు
సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్,  కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్  



బైపాస్ తర్వాత జాగ్రత్తలు...
కార్డియాలజీ కౌన్సెలింగ్
మా అమ్మకు బైపాస్ సర్జరీ అయ్యింది. ఆమె విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి. - రఘునాథ్, కందుకూరు
అన్ని కండరాలకు అందినట్టే గుండెకండరానికి కూడా రక్తం ద్వారా పోషకాలు, ఆక్సిజన్ అందాలి. కానీ గుండెకు వెళ్లే రక్తనాళాల్లో అడ్డంకి ఏర్పడిన వాళ్ల గుండె కండరానికి తగినంత రక్తం అందదు. దాంతో క్రమంగా గుండె కండరం చచ్చుబడిపోతుంది. గుండెలో అడ్డంకులు పెరిగి గుండెకు తగినంత రక్తం అందే పరిస్థితి లేనప్పుడు, గుండెకండరం చచ్చుపడే ప్రమాదాన్ని నివారిస్తారు. గుండెకు తగినంత రక్తం అందేలా చేయడం కోసం చేసే ఈ శస్త్రచికిత్సలో కాలినుంచి రక్తనాళాన్ని ముందుగా తీసుకుంటారు. దీనిద్వారా గుండెకండరానికి రక్తం అందేలా బైపాస్ మార్గాన్ని ఏర్పాటు చేస్తారు. దీనివల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు బాగా తగ్గుతాయి. ఈ సర్జరీ వాళ్లు మొదటి ఆరు వారాల్లో పాటించాల్సిన జాగ్రత్తలివి.

 
డాక్టర్లు సూచించిన ఆరోగ్యకరమైన వ్యాయామాలను రోజుకు రెండుసార్లు...  పదినిమిషాల పాటు చేయాలి   ఏమాత్రం భారం పడకుండా పది పదిహేను నిమిషాల పాటు రోజుకు రెండుసార్లు నడక (వాకింగ్)కు ఉపక్రమించాలి  అకస్మాత్తుగా ముందుకు, వెనక్కు, పక్కలకు ఒంగడం వంటివి చేయకూడదు  మూడు కిలోలకు మించిన బరువు కనీసం నెలరోజుల పాటు ఎత్తవదు  నేల మీద కూర్చోవడం, కాలుమీద కాలేసుకోవడం వంటివి చేయకండి  శస్త్రచికిత్స కోసం శరీరంపై గాటు పెట్టిన చోట ఎలాంటి ఒత్తిడీ పడకుండా చూసుకోండి  భారమైన పనులు చేయకండి  డాక్టర్లు సూచించిన మందులు క్రమం తప్పకుండా చేయండి.

 
శస్త్రచికిత్స అయిన ఆరు వారాల తర్వాత: దీర్ఘకాలంలో గుండెపై కలిగే దుష్ర్పభాలను నివారించడానికి కూడా ఈ జాగ్రత్తలు తోడ్పడతాయి. అవి...  కొలెస్ట్రాల్ పాళ్లను అదుపులో ఉంచుకోండి. అందుకు తగినట్లుగా డాక్టర్ల సూచన మేరకు ఆహార, వ్యాయామ నియమాలను పాటించండి   రక్తపోటును అదుపులో ఉంచుకోండి. ఇందుకోసం డాక్టర్లు ఇచ్చిన మందులు వాడుతూనే... రిలాక్సేషన్ ప్రక్రియలైన ధ్యానం, యోగా వంటివి చేయండి  రక్తంలో చక్కెర పాళ్లను తెలుసుకునే పరీక్షలను క్రమం తప్పకుండా చేయించుకుంటూ, మీ డాక్టర్‌కు తెలియజేస్తూ ఉండండి. అందులో వచ్చిన మార్పులను బట్టి వైద్యులు మీ మందులను మార్చడం వంటివి చేస్తారు  సిగరెట్ పొగకు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎక్స్‌పోజ్ కావద్దు. అది రక్తనాళాల మృదుత్వాన్ని దెబ్బతీయడంతో పాటు అవి రక్తనాళాలు సన్నబారేలా చేయవచ్చు. పైగా ఆ పొగ గుండె వేగాన్ని పెంచుతుంది. కాబట్టి పొగాకు ఏరూపంలోనైనా తగదు  మద్యంకూడా గుండెకు హానిచేసేదే  ఒత్తిడికి గురికావడం రక్తపోటును పెంచి, గుండెపోటుకు దారితీసేలా చేసే అంశం. కాబట్టి ఒత్తిడి లేకుండా చూసుకోండి  ఒకే చోట కూర్చొని ఉండకండి. చురుగ్గా ఉండే జీవనశైలి మార్పుతోనూ గుండెజబ్బును నివారించుకోండి.

 

డాక్టర్ హేమంత్ కౌకుంట్ల కార్డియోథొరాసిక్ సర్జన్, సెంచరీ హాస్పిటల్స్,
రోడ్ నెం.12, బంజారాహిల్స్, హైదరాబాద్.

 

 తలనొప్పి తగ్గేదెలా?
న్యూరాలజీ కౌన్సెలింగ్

నా వయసు 29 ఏళ్లు. తరచూ తలనొప్పి వస్తోంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు దీని తీవ్రత చాలా ఎక్కువగా ఉంటోంది. దీని నుంచి విముక్తి పొందడానికి తగిన మార్గాలు చెప్పండి.  - రాజేశ్వరరావు, కరీంనగర్
మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీరు మైగ్రేన్‌తో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. మీరు ఈ కింద పేర్కొన్న సూచనలు పాటించండి.  ఎక్కువ శబ్దం, కాంతి లేని చోట విశ్రాంతి తీసుకోండి. విపరీతమైన శబ్దం, శక్తిమంతమైన వెలుగు వంటి అంశాలు తలనొప్పిని మరింత ప్రేరేపిస్తాయి.   ఘాటైన వాసనలకు దూరంగా ఉండండి. సరిపడని పర్‌ఫ్యూమ్‌ల వల్ల తలనొప్పి ఎక్కువ కావచ్చు.

 
తలనొప్పి తగ్గుతుందనే అపోహతో టీ, కాఫీలను పరిమితికి మంచి తాగడం మంచిది కాదు. చాక్లెట్లు, కెఫిన్ ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవడం మానేయాలి. కెఫిన్ ఉండే శీతలపానీయాల నుంచి దూరంగా ఉండాలి. నిమ్మజాతి పండ్ల వల్ల కూడా రావచ్చు. ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలి. నీళ్లు, ద్రవాహారం ఎక్కువగా తీసుకోవాలి.   అల్లం, ఎర్రకాప్సికమ్, వండిన ఆకుకూరలు, పండిన పసుపుపచ్చ కూరగాయలు మైగ్రేన్ నివారించడానికి సహాయపడతాయి.

 
ఎక్కువ సమయం కంప్యూటర్ ముందు పనిచేయాల్సి వచ్చినప్పుడు యాంటీగ్లేర్ గ్లాసెస్ ధరించడం మంచిది. ప్రతి అరగంటకు ఒకసారి కనీసం ఐదు నిమిషాల పాటు రిలాక్స్ కావాలి. కనురెప్ప కొట్టకుండా అదేపనిగా కంప్యూటర్ స్క్రీన్‌ను చూడటం సరికాదు.   కంటికి ఒత్తిడి కలిగించే పనులు చేయకూడదు. కుట్లు, అల్లికలు వంటి పనులు చేసేవారు మధ్య మధ్య కాస్త విశ్రాంతి తీసుకుంటూ ఉండాలి.   తలనొప్పితో పాటు వాంతులు, తలతిరగడం వంటివి కనిపిస్తుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

 
తగినంత విశ్రాంతి, కంటినిండా నిద్ర, ధ్యానం, ప్రాణాయామం కూడా మైగ్రేన్‌ను నిరోధించడానికి సహాయపడతాయి. నెలకు మూడు లేదా అంతకంటే ఎక్కువసార్లు వస్తుంటే ఇప్పుడు అందుబాటులో ఉన్న చికిత్సతో నివారణా చికిత్స (ప్రొఫిలాక్టిక్ ట్రీట్‌మెంట్)తో దాదాపు 80 శాతం వరకు దీన్ని సమర్థంగా అదుపు చేయవచ్చు.

 

డాక్టర్ బి.చంద్రశేఖర్ రెడ్డి
సీనియర్ న్యూరాలజిస్ట్
సిటీ న్యూరో సెంటర్, రోడ్ నెం.12, బంజారాహిల్స్, హైదరాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement