డెత్ సెన్స్ | When death it comes to... | Sakshi
Sakshi News home page

డెత్ సెన్స్

Published Mon, Jul 25 2016 11:38 PM | Last Updated on Mon, Sep 4 2017 6:14 AM

డెత్ సెన్స్

డెత్ సెన్స్

పదిశోధన
మరణం ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. కానీ ప్రపంచంలో కొందరు ప్రముఖ వ్యక్తులు మాత్రం మృత్యుజాడల్ని ముందే పసిగట్టారు. తమ మరణం ఎలా ఉండబోతుందో ప్రకటించారు. చివరికి అలాగే కన్నుమూశారు. వీరే వారు...


1.తన రచనలతో ప్రపంచం మొత్తాన్నీ అభిమానులుగా మార్చేసుకున్న మార్క్ ట్వెయిన్ ఓచోట ఇలా రాశారు -‘‘1835లో హేలీ తోకచుక్కతో పాటే నేనూ పుట్టాను. అది వచ్చే యేడు మళ్లీ వస్తోంది. బహుశా ఈసారి దానితో పాటే నేనూ పోతానేమో’’.  మార్క్ ట్వెయిన్ అన్నట్టుగానే అయ్యింది. ఆయన ఏప్రిల్ 21, 1910న గుండెపోటుతో కన్నుమూశారు. అంతకు కొద్ది గంటల ముందే హేలీ తోకచుక్క రావడం, పోవడం జరిగింది. - మార్క్ ట్వెయిన్

 

 2.అమెరికాను కొద్దికాలం ఊపేసిన గాయని, నటి, మోడల్... ఆలియా... 2001, జూలైలో ఓ ఇంటర్వ్యూలో తనకు వచ్చిన ఓ కలను చెప్పింది. ఎవరో తరుముతుంటే ఆమె చీకటిలో పరిగెడుతూ ఉంటుంది. ఉన్నట్టుండి గాల్లోకి లేస్తుంది. ఎక్క డికో ఎగిరిపోతుంది. ఇది చెప్పి ఆమె ఓ మాట అంది -‘దేని నుంచి పారిపోతున్నాను? ఈ వృత్తి నుంచా? కీర్తి నుంచా? లేక ఈ లోకం నుంచా?’. నెల తిరక్కుండానే విధి సమాధానం! విమాన ప్రమాదం కారణంగా ఇరవై రెండేళ్ల ఆలియా లోకం నుంచే వెళ్లిపోయింది.- ఆలియా

 

3. లింకన్‌కి ఓ కల వచ్చింది. ఆ కలలో ఆయన వైట్‌హౌస్‌లో తూర్పున ఉన్న గదికి వెళ్లారు. అక్కడో శవపేటిక ఉంది. చుట్టూ సైనికులు నిలబడి ఉన్నారు. ప్రజలు సందర్శిస్తున్నారు. చనిపోయింది ఎవరని అడిగారు లింకన్. ‘ప్రెసిడెంట్’ అని సమాధానమిచ్చాడో వ్యక్తి. ఎన్నో రోజులు గడవకముందే మరో కల వచ్చింది. విశాల జలాల మీద పడవలో ఒంటరిగా ప్రయాణిస్తున్నట్టు. ఉదయం లేచాక ఆ కల గురించి ఇంట్లోవాళ్లకు చెప్పారు లింకన్. తర్వాత కొద్ది గంటలకే హత్యకు గురయ్యారు. - అబ్రహాం లింకన్


4. జర్మనీకి చెందిన ప్రముఖ చిత్రకారుడు, సంగీతకారుడు ఆర్నాల్డ్ సోహన్‌బర్గ్‌కి 13వ నంబర్ అంటేనే వణుకు. ఆయన పుట్టింది సెప్టెంబర్ పదమూడున. దాంతో ఆ తేదీనే చనిపోతాను అని భయపడే వారాయన. జీవితాంతం ఆ సంఖ్య తన దరిదాపుల్లోకి రాకుండా జాగ్రత్తపడ్డారు. కానీ ఫలితం లేకపోయింది. ఆ తేదీ ఆయన్ను వెంటాడింది. 1951, జూలై 13న మరణించారు. ఇంకా విచిత్రం ఏంటంటే... ఆయన చనిపోయింది తన 76వ ఏట. 7, 6 కలిపినా పదమూడే అవుతుంది! - ఆర్నాల్డ్ సోహన్‌బర్గ్


5. పాప్ రారాజు మైఖేల్ జాక్సన్‌కి కూడా మరణం దగ్గర పడుతోన్న విషయం ముందే అర్థమయ్యిందట. ఓ కాన్సర్ట్ గురించి మాట్లాడినప్పుడల్లా అది వర్కవుటయ్యేలా లేదనేవాడట. చనిపోవడానికి రెండు గంటల ముందు కూడా ‘ఈ జీవితంతో విసిగిపోయాను’ అన్నాడట. ఇయాన్ హల్పెరిన్ రాసిన ‘అన్‌మాస్క్‌డ్- ద ఫైనల్ ఇయర్ ఆఫ్ మైఖేల్ జాక్సన్’లో దీని గురించి ఉందట. - మైఖేల్ జాక్సన్

 

6. అమెరికాకు చెందిన గొప్ప ఫుల్‌బాల్ క్రీడాకారుడు పీట్ మారవిచ్. అతని వేగాన్ని చూసి ‘పిస్టల్ పీట్’ అని పిలిచేవారతన్ని. ఓసారి అతను ఒక సందర్భంలో ఊహించని మాట అన్నాడు. ‘నేనేమీ మరో పదేళ్లు ఫుట్‌బాల్ ఆడకపోవచ్చు. ఆలోపే, అంటే నా నలభయ్యో యేట గుండె నొప్పితో చనిపోవచ్చు’ అన్నాడు. అదే జరిగింది. తొమ్మిదేళ్లు ఆడాక, ఓరోజు ఫుల్‌బాల్ ఆడుతూండగానే హార్ట్ అటాక్ వచ్చి కన్నుమూశాడు పీట్. అప్పుడతనికి నలభయ్యేళ్లు. - పీట్ మారవిచ్


7 . ‘ఫాదర్ ఆఫ్ ద మోడ్రన్ టాబ్లాయిడ్’ విలియమ్ థామస్ స్టెడ్ రాసిన మొదటి కథలో... అట్లాంటిక్ సముద్రంలో రెండు ఓడలు గుద్దుకుని, సరిపడా లైఫ్ బోట్స్ లేక వందల మంది చనిపోతారు. తర్వాతి కథలో ఓ పడవ ఐస్‌బర్గ్‌ను గుద్దుకుని ముక్కలవుతుంది. కెప్టెన్ ఎడ్వర్డ్ స్మిత్ కారణంగా కొందరు బతికినా, మిగతావాళ్లంతా చనిపోతారు. కొన్నాళ్లకి అమెరికాలో జరిగే పీస్ కాన్ఫరెన్స్‌కి వెళ్లడానికి టైటానిక్ ఓడ ఎక్కారు స్టెడ్. ఆ ప్రమాదంలో కన్నుమూశారు. విచిత్రం ఏమిటంటే, ఆ ఓడ కెప్టెన్ పేరు... ఎడ్వర్డ్ స్మిత్. - విలియమ్ స్టెడ్

 

8.  సుప్రసిద్ధ ఫ్రెంచ్ గణిత శాస్త్రవేత్త అబ్రహాం డి మోవ్‌రేకి ఓరోజు తన నిద్ర విషయంలో అనుమానం వచ్చింది. తను రోజూ అనుకున్నదానికంటే పదిహేను నిమిషాలు ఎక్కువసేపు నిద్రపోతున్నట్టు తెలుసు కున్నాడు. అప్పుడతను తన అసిస్టెంట్‌తో... ‘రోజుకో పదిహేను నిమిషాలు చొప్పున కలుపుకుంటూ పోతే, అవి 24 గంటలు అయిన రోజున నేను ఇక లేవను. పూర్తిగా నిద్రలోకి పోతాను’ అని. అలాగే అయ్యింది. సరిగ్గా తొంభై ఆరు రోజుల తర్వాత మోవ్‌రే శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు. -  అబ్రహాం డి మోవ్‌రే


9.  డబ్ల్యూడ బ్ల్యూఎఫ్ చూసిన వాళ్లకు జేమ్స్ హెల్విగ్ గురించి చెప్పక్కర్లేదు. అతడు తన లాస్ట్ అప్పియరెన్స్ రోజున ప్రసంగిస్తూ ఇలా అన్నాడు... ‘ఈ లోకంలో ఎవరూ శాశ్వతం కాదు. ప్రతి ఒక్కరి హృదయ స్పందనా ఎప్పుడో ఒకప్పుడు ఆగుతుంది. ప్రతివారి ఊపిరీ ఎప్పుడో ఒకప్పుడు స్తంభిస్తుంది. ప్రతి ఒక్కరి ఆటా ఏదో ఒకనాడు ముగుస్తుంది. ఈరోజు నాది ముగిసింది’. ఆ తర్వాత రోజు తన భార్యతో కలిసి నడుస్తుండగా గుండె నొప్పి వచ్చి, జేమ్స్ ఆట పూర్తిగా ముగిసిపోయింది.  జేమ్స్ హెల్విగ్

 

10. డయానాకి కూడా మృత్యువు తనను వెతుక్కుంటూ వస్తున్న విషయం ముందే తెలిసిందట. చనిపోవడానికి కొద్ది రోజుల ముందు నుంచీ  డిస్టర్బ్ అయ్యేదట. కారు ప్రమాదానికి గురై మరణిస్తున్నట్టు ఊహలు వచ్చేవట. సన్నిహితంగా ఉండే ఓ వ్యక్తికి వాటి గురించి ఉత్తరం కూడా రాసిందట. ఆమె ఊహ నిజమైంది. కారులో బయలుదేరి కానరాని లోకాలకు చేరుకుంది. డయానా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement