వింతైన భోజనంబు | When Food is Rich it Increases Human Friendships | Sakshi
Sakshi News home page

వింతైన భోజనంబు

Published Mon, May 6 2019 4:54 AM | Last Updated on Mon, May 6 2019 4:54 AM

When Food is Rich it Increases Human Friendships - Sakshi

‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అంటుంది భారతీయత. ఆహారాన్ని గౌరవించాలంటుంది పాశ్చాత్య నాగరకత. ‘ఆకలి..’ అన్న వాళ్లకు అన్నం పెట్టిన డొక్కా సీతమ్మను చదువుకున్నాం. అన్నం వడ్డించి ‘చుక్కలు చూపించే’ చైన్‌ హోటళ్లనూ చూస్తున్నాం.

ఇవేవీ కాదు.. మంచి భోజనం చేస్తే, ఆ జ్ఞాపకం మధురంగా ఎప్పటికీ నిలిచి ఉండాలంటున్నారు సుష్మ తోట. ‘ఆర్ట్‌ పీస్‌ని అల్మరాలో దాచుకుంటారు. విలువైన ఆభరణాన్ని బీరువాలో దాచుకుంటారు. మంచి భోజనం చేసిన అనుభూతిని మనసులో భద్రంగా దాచుకుంటారు’అన్నారామె.

‘తోట’లో పూచిన పువ్వు
తెలంగాణలో ప్రముఖ చిత్రకారుడు తోట వైకుంఠం. ఆయన కోడలే సుష్మ.  విభిన్నంగా, వైవిధ్యంగా ఏదైనా చేయాలనే ఆలోచన ఉన్న అమ్మాయి. అదే సమయంలో సమాజానికి తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉందని  నమ్మే అమ్మాయి కూడా. పుట్టపర్తి సత్యసాయి స్కూల్‌లో చదివిన పదేళ్ల చదువే తన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దిందని చెప్తారు సుష్మ. పెళ్లయి అత్తగారింట్లో అడుగు పెట్టిన తర్వాత ఒక చిత్రకారుడిగా మామగారు సమాజాన్ని చూసే దృష్టికోణం తనను చాలా ప్రభావితం చేసిందని, తన ఆలోచనలను విస్తరింప చేసిందని చెప్తూ.. ‘‘వాటన్నింటి కలబోతే.. ఇప్పుడు సమాజంలో ధైర్యంగా నిలబడిన సుష్మ’’ అని తన గురించి తను చెప్పారామె.

ఆహారం.. నా సబ్జెక్ట్‌
‘‘నాకు సైన్స్‌ ఇష్టం. డాక్టర్‌ కావాలనుకున్నాను. స్కూల్‌డేస్‌ నుంచి కూడా మ్యాథ్స్‌లో టాపర్‌ని. దాంతో ఇంజనీరింగ్‌లో చేరమన్నారు అమ్మానాన్న. వాళ్ల సలహాకు నా కోరికను కలగలిపి బయోటెక్నాలజీ ఇంజనీరింగ్‌ చేశాను. సైంటిస్ట్‌ అయ్యే అవకాశం వచ్చింది. అమ్మానాన్న నన్ను మిస్‌ అవుతారని యు.ఎస్‌. వెళ్లలేదు. పీజీలో సోషల్‌ ఎంటర్‌ ప్రెన్యూర్‌షిప్‌లో నా థీసీస్‌ టాపిక్‌ ‘ఆహార్‌’. ఆహారం సమృద్ధిగా ఉన్నప్పుడు అది మనుషుల స్నేహ సంబంధాలను పెంచుతుంది. అదే ఆహారం కొరతలో ఉన్నప్పుడు మనుషులలో స్వార్థ భావన కలుగుతుంది. మనుషుల మధ్య స్నేహాన్ని పెంచడానికి, అంతరాలను తుంచడానికి ఆహారాన్ని మించిన మాధ్యమం మరోటి ఉండదని నా ఉద్దేశం. నేను ఫుడ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారడానికి కారణం అదే.

అంతరాలు తొలగిపోతాయి
సమాజంలో అంతరాలను రూపుమాపడానికి సహపంక్తి భోజనాలు మనకు తెలిసినవే. కులాలు, మతాలతో వేరయి ఉన్న సమాజంలో ఆ గిరిగీతలను చాపకూడుతో చెరిపి వేశారు. ఉద్యమం ఊపందు కోవడానికి వంటావార్పుతో నాయకులు, అనుచ రులు మమేకం కావడాన్నీ చూశాం. ఇవి కాకుండా.. వీటికి అతీతంగా సమాజంలో కొత్త అంతరాల పొరలు ఏర్పడుతున్నాయి. అధికారులు– ఉద్యోగుల మధ్య కనిపించని లేయర్లు రాజ్యమేలుతుంటాయి. ఆ లేయర్‌లను తొలగించడానికి కుకింగ్‌ ఈవెంట్‌లు బాగా ఉపయోగపడుతున్నాయి. ఒక కంపెనీ సీఈవో, ఉద్యోగులు అంతా కలిసి వండుతారు, భోజనం చేస్తారు.

ఈ ప్రోగ్రామ్‌లో సీఈవోలు వంట తెలిసిన ఉద్యోగికి సహాయంగా పనిచేస్తారు. మొత్తం ప్రోగ్రామ్‌ని మా కలినరీ లాంజ్‌ ప్రొఫెషనల్‌ షెఫ్‌లు పర్యవేక్షిస్తుం టారు. అవసరమైన సలహాలతో పాటు సహాయం చేస్తారు కూడా. కలివిడితనాన్ని పెంచడానికి ఈ ప్రోగ్రామ్‌ బాగా పని చేస్తోంది కూడా. భోజనం... కనిపించని అంతస్థుల పొరలను సునాయా సంగా ఛేదిస్తుంది. ఫుడ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో ఎంటర్‌ౖ టెన్‌మెంట్‌ని జోడించాను. ఈ కాన్సెప్ట్‌ని విస్తృతం చేయడం ద్వారా సోషల్‌ జస్టిస్‌కి బాటలు వేయ గలననే నమ్మకం కూడా ఉంది.

వండే చేతులకు గౌరవం
అది ఇల్లయినా, హోటల్‌ అయినా సరే.. వండే వాళ్లె ప్పుడూ తెర వెనుకనే ఉండిపోతుంటారు. నేను ఫుడ్‌ ఎంటర్‌ ప్రెన్యూర్‌గా మారేటప్పుడు నా ప్రాజెక్ట్‌ హోమ్‌షెఫ్‌లకు వేదిక కావాలని అనుకున్నాను. మన సంస్కృతిలో తల్లిని అత్యుత్తమంగా గౌరవిస్తారు, అమ్మ చేతి వంట గురించి బయట గొప్పగా చెప్పుకుంటారు. కానీ రుచిగా తిన్నప్పుడు అమ్మకు ‘బాగా చేశావమ్మా’ అని ఒక్కమాట కూడా చెప్పరు. భార్య వంటయితే సరేసరి. బాగా లేకపోతే వంక పెట్టడంలో కనబరిచే జోరు... బాగా వండినప్పుడు ప్రశంసించడానికి రాదు. గృహిణికి గుర్తింపు రావాలి. అందరికీ అన్నీ బాగా చేయడం కుదరకపోవచ్చు. కానీ ప్రతి ఒక్కరిలో కనీసం ఒక్కటైనా అద్భుతంగా వండగలి గిన నైపుణ్యం తప్పకుండా ఉంటుంది. ఆ ఒక్క వంటనే చేయవచ్చు. మేము అరేంజ  చేసిన ఈవెంట్‌లో కస్టమర్‌కి వడ్డించేటప్పుడు ఈ వంటను ఫలానా వాళ్లు వండారని డిస్‌ప్లే చేస్తాం.

అలాగే ప్రతి వంటకీ వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంటుంది. ఆ కథ కూడా డిస్‌ప్లేలో ఉంటుంది. గృహిణులు వాళ్లింట్లో వండి పంపిస్తారు. మాతో ఇప్పటివరకు యాభైకి పైగా హోమ్‌షెఫ్‌లున్నారు. ఇక హోటల్‌ షెఫ్‌లు, నేషనల్, కాంటినెంటల్‌ షెఫ్‌లు అంతా కలిసి మూడు వందల మంది అనుసంధానమై ఉన్నారు. ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రధానంగా 75 థీమ్‌ లను రూపొందించాం. వంట చేయడం, వడ్డించడం, భోజనాన్ని ఆస్వాదించడం అన్నీ గొప్ప ఆర్ట్‌లే. కస్టమర్‌ కోరుకున్న మెనూలో అవథీ క్విజిన్‌ కోసం లక్నో బిరియానీ చేయాలంటే దినుసులను లక్నో నుంచి తెప్పించాలి. అలాగే మెనూలో తెలంగాణ వంట ఒకటి, రాయలసీమ రుచి, ఆంధ్ర పచ్చడి... ఇలా ఏది కోరితే అలా వడ్డించడానికి వీలుగా కస్టమైజ్‌డ్‌ మెనూ ప్లాన్‌ చేశాం’’ అని సుష్మ తాను వ్యాపారాన్ని డిజైన్‌ చేసిన విధానాన్ని చెప్పారు.

రండి... నేర్పిస్తాం
ఫుడ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌లు ‘రండి... వండి వడ్డిస్తాం’ అని ఆహ్వానించాలి కానీ సుష్మ మాత్రం ‘రండి నేర్పిస్తాం’ అని ఆహ్వానిస్తు న్నారు. ‘హండీ టాక్స్‌’ పేరుతో ప్రతి నెలా నాలుగో శనివారం ఔత్సాహిక ఫుడ్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి ఈ రంగం ఎంత విస్తారమైనదో వివరిస్తున్నారు. పరిశ్రమ స్థాపించడానికి మార్గ దర్శనం చేస్తున్నారు. ‘‘బిరియానీ హండీనే మా సదస్సుకు ప్రధాన వేదిక. అందుకే దీనికి హండీ టాక్స్‌ అని పేరు పెట్టాం. ఇప్పటికి నెలకు ముప్పై మంది చొప్పున తొమ్మిది నెలల్లో 270 మందికి గైడెన్స్‌ ఇచ్చాం. హోమ్‌షెఫ్‌లుగా మాతో అనుసం ధానమైన గృహిణులు కొంతమంది ఇప్పుడు సొంతంగా బేకరీ వంటి వాళ్లకు ఇష్టమైన ఫుడ్‌ ఇండస్ట్రీలు పెట్టుకున్నారు.

నా కాన్సెప్ట్‌లో పిల్లలకు ప్రత్యేకంగా ప్రాధాన్యం ఇచ్చాను. ఎందుకంటే పిల్లలకు వంటగదితో పరిచయం చేస్తే వాళ్లకు భోజనం మీద గౌరవం పెరుగుతుంది. వండడంలో శ్రమ తెలుస్తుంది కాబట్టి వృథాగా పారేయడానికి ఇష్టపడరు. పోషకాహారం మీద శ్రద్ధ పెరుగుతుంది, జంక్‌ తినడం మానేస్తారు. వాటితోపాటు పిల్లలు చేసిన మంచి వంటలతో ఒక బుక్‌ తెస్తున్నాం. అది ఎంత విస్తృతంగా ఉంటుందంటే... ఇందులో ఫేమస్‌ ఇటాలియన్‌ షెఫ్‌ నుంచి ఇండియాలో ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రధాన వంటకాల తయారీ, మన తెలుగిళ్లలో నోరూరించే వంటలతోపాటు మన పిల్లలు చేసిన మంచి వంట కూడా ఉంటుంది’’ అని ఆకలి తీర్చే పరిశ్రమ విస్తృతిని వివరించారామె.

ఇలా మొదలైంది..!
సుష్మ రెండేళ్ల కిందట న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ కోసం ఇరవై మంది ఫెండ్స్‌తో ఫిల్మ్‌నగర్‌లోని ‘కలినరీ లాంజ్‌’కి వచ్చారు. ఆ రావడమే ఆమెను ఫుడ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మార్చింది.‘‘వైవిధ్యంగా చేయాలనుకున్న అనేక థీమ్స్‌కి ఫుడ్‌ ఇండస్ట్రీని మించినది మరోటి లేదనిపించింది. ప్రతి పనిలో వైవిధ్యతను కోరుకుంటూ కొత్త థీమ్‌లు రూపొందించడంలో నా మీద మా మామ ప్రభావం చాలా ఎక్కువ.. ఆర్ట్‌ ఎగ్జిబిషన్స్‌ కోసం రూపొందించే థీమ్స్‌లో ఆయన పాటించిన సంస్కృతి మూలాలను నేను ఆహారంలో ఆచరిస్తున్నాను. ఈ థీమ్స్‌ అన్నీ లోకల్‌ టాలెంట్‌ను బయటకు తీసుకురావడానికి ఉపయోగపడతాయని కలినరీ లాంజ్‌ ఫౌండర్‌ గోపితో కబుర్ల మధ్య చెప్పాను. ఈ ఆలోచనలన్నీ మరెక్కడో కాదు ఇందులోనే ప్రవేశపెట్టమని నాకు గొప్ప ఆఫరిచ్చారు.

నా థీమ్స్‌ని విజయవంతంగా నాటగలి గాను. ఒక ఐడియాని సక్సెస్‌ఫుల్‌గా ప్లాంట్‌ చేసిన తర్వాత, ఆ ఐడియాని విస్తరింపచేయడమే ఎంటర్‌ ప్రెన్యూర్‌ లక్ష్యం. నా ముందున్న లక్ష్యమూ అదే. ట్వంటీ ట్వంటీకంతా ఐదు నగరాలకు విస్తరించాలనేది నా డ్రీమ్‌. నా కల నెరవేర్చు కుంటాననే నమ్మకం కూడా ఉంది’’ అంటున్నప్పుడు సుష్మ కళ్లలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడింది. వ్యాపార రంగంలో మహిళలు రాణిం చడం మొదలైంది. ఇంటిని చూసుకుంటూ వేళకు రుచిగా, ఆరోగ్యకరంగా వండిపెట్టే భార్యను ‘ఏముంది వండడమే కదా’ అని చులకన చేసే మగవాళ్లకు ఫుడ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ ఓ పెద్ద కనువిప్పు. చక్కటి భోజనం వడ్డించిన భార్య, భర్త చెయ్యి కడుక్కుని వచ్చే లోపు టేబుల్‌ మీద బిల్లు పెట్టిందంటే... ఆ భర్త జేబు.. సగం నెలకే చిల్లు పడుతుందేమో!
వాకా మంజులారెడ్డి

పిల్లల కోసం... ఇస్తూనే ఉంటాను
నేను పుట్టింది హైదరా బాద్‌లోనే. బీటెక్‌ జెఎన్‌టీయూలో చేశాను. ఆ తర్వాత రెండేళ్లు బెంగుళూరులో ఎమ్‌ఎన్‌సీలో ఉద్యోగం చేశాను. ఇది కాదు.. మరేదో చేయాలనిపించింది. ఉద్యోగం మానేసి హైదరాబాద్‌కొచ్చాను. నచికేత ఎన్‌జీవోతో ఆరేడేళ్లు జీతం తీసుకో కుండా పని చేశాను. పిల్లలకు పాఠాలు చెప్పాను. ఆ పిల్లల కోసం ఫండ్‌ రైజింగ్‌కి వెళ్లినప్పుడు కొన్నిసార్లు గిల్టీగా ఫీలయ్యాను. ‘ఇతరుల బాగు కోసం కొంత ఆర్థిక సహాయం చేయండి’ అని ఒకరిని అడిగే అర్హత నాకు లేదనిపించింది. నా వంతుగా కూడా స్వచ్ఛందంగా ఆర్థిక సహాయం చేసినప్పుడే మరొకరిని అడిగే యోగ్యత వస్తుందని పించింది. నేను చేసే సహాయం నా సంపాదనే అయి ఉండాలి తప్ప మా అమ్మానాన్నల డబ్బుతో కాదు కదా.

అందుకే మళ్లీ ఉద్యోగంలో చేరాను. పెళ్లి తర్వాత ఫ్యాషన్‌ డిజైనర్‌గా మారాను. నా బిజినెస్‌ బాగుంది. ఆదాయంలో ముప్పై శాతం డొనేట్‌ చేయగలుగుతున్నాను. ఏ పిల్లల్ని చూసినా నా పిల్లలే అనిపిస్తుంది. అందుకే ‘నచికేత’లో ఆశ్రయం పొందుతున్న పిల్లల కోసం డబ్బివ్వడం సంతోషాన్నిస్తోంది. నా కిడ్స్‌ ప్లానింగ్‌ సక్సెస్‌ అయ్యి, పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఆశ్రమంలోని పిల్లలకు ఇవ్వడం మానను. ఇప్పుడు ఫుడ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ కూడా నేను నమ్మే సర్వ్‌ ఆల్‌లో భాగమే. ఆహారం అరమరికలను తొలగిస్తుంది, అనుబంధాలను బలపరుస్తుంది, ఆత్మీయతలను పెంచుతుంది, పరస్పర గౌరవాలను పటిష్టం చేస్తుంది. అలాగే నేను వైవిధ్యంగా చేస్తున్న ఈ ప్రోగ్రామ్‌ నాకు ప్రత్యేకమైన గుర్తింపునిస్తోంది.
సుష్మ తోట,
ఫుడ్‌ ఎంటర్‌ప్రెన్యూర్, ఫ్యాషన్‌ డిజైనర్‌

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement