
రాముడు గొప్పా? రామనామం గొప్పదా?
ఒకసారి శ్రీరాముని తల్లి, అగస్త్యుని తల్లి, ఆంజనేయుని తల్లి ఒక వివాహ వేడుకలో కలుసుకున్నారు. మాటల సందర్భంలో ఆంజనేయుని తల్లి ‘‘మహాసముద్రాన్ని అవలీలగా దాటిన నా కుమారుడు గొప్పవాడు’’ అంది. ఆ మాటలకు అగస్త్యుని తల్లికి అమితమైన కోపం వచ్చి, ‘‘ఆ.. అదేమంత గొప్ప? ఆ మహాసముద్రాన్ని మూడు పుడిసిళ్లుగా తాగివేశాడు నా కుమారుడు! కాబట్టి నా కొడుకే గొప్పవాడు’’ అంది. అలా వాళ్లిద్దరి మధ్య వాదన పెరిగి, శ్రీరాముడి తల్లిని తమ పుత్రుల్లో గొప్పవారెవరో చెప్పమన్నారు. ‘‘నేనేం చెప్పను? ఆంజనేయుడు, అగస్త్యుడు ఎల్లప్పుడూ శ్రీ రామనామగుణాలను గానం చేస్తూనే ఉంటారు. వాళ్లిద్దరిలో ఎవరు గొప్పో మా వాడినే అడిగి తెలుసుకుందాం పదండి!’’ అందామె. ముగ్గురూ శ్రీ రాముడి చెంతకు వచ్చారు. వివాదాన్ని కుమారుడికి వివరించింది శ్రీరాముని తల్లి.
అప్పుడు శ్రీ రాముడు చిరునవ్వుతో, ‘‘మీరు అనుకుంటున్నట్లు ఆంజనేయుడూ గొప్పవాడు కాదు. అగస్త్యుడూ గొప్పవాడు కాదు. ఆంజనేయుడు సముద్రాన్ని దాటినా, అగస్త్యుడు సముద్రాన్ని తాగినా- రామనామ స్మరణ చేతనే వారలా చేయగలిగారు. అంతేకాదు, అందరిచేతా నేను పూజింపబడుతున్నానంటే అది ‘రామ’ నామ ప్రభావం వల్లనే అని గ్రహించండి’’ అన్నాడు నవ్వుతూ. అంటే రామునికంటే రామనామమే గొప్ప అన్నమాట!
- చోడిశెట్టి శ్రీనివాసరావు